సూపర్ ‘జాప్యం’
చొరవ చూపని రాష్ట్ర ప్రభుత్వం
ఏడాదిగా ప్రకటనలకే పరిమితం
నిధులిచ్చినా.. ఒక్క అడుగూ ముందుకు పడని వైనం
నేటికీ ఎక్కడ కడతారో తెలియని దుస్థితి
విజయవాడ : విజయవాడలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు కల ఎప్పటికి నెరవేరుతుందో అర్థం కాని అయోమయ స్థితి నెలకొంది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతుంది. గత ఏడాది జూన్‌లో కేంద్రం ప్రధాన మంత్రి స్వాస్త్ సురక్ష యోజన పథకం ద్వారా సిద్ధార్థ వైద్య కళాశాలకు రూ.150 కోట్లు కేటాయించింది. వాటిలో సూపర్ స్పెషాలిటీ విభాగాలకు ప్రత్యేకంగా భవన నిర్మాణం చేపట్టడంతో పాటు, అత్యాధునిక పరికరాలు సమకూర్చేందుకు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో సూపర్ ఆశ నెరవేరినట్లేనని అందరూ భావించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఏడాది గడిచినా నేటికీ అంచనాలు రూపొందించే దశలోనే ఉండటంతో ఎప్పటికి పూర్తవుతుందో తెలియని దుస్థితి నెలకొంది.
ఎక్కడ కట్టాలనేదే సమస్య...
ప్రధాన మంత్రి స్వాస్త్ సురక్ష యోజన పథకం ద్వారా రూ.150 కోట్లు కేటాయించగా, వాటిలో రూ.80 కోట్లు వెచ్చించి భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. మిగిలిన రూ.70 కోట్లతో అత్యాధునిక పరికరాలు సమకూర్చడంతో పాటు, ప్రస్తుతం ఉన్న విభాగాల్లో మరమ్మతులు చేపట్టాలని భావించారు. అయితే భవన నిర్మాణాలు ఎక్కడ చేపట్టాలనేది సమస్యగా మారింది. తొలుత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సందర్శించి ప్రస్తుతం ఉన్న వైద్యకళాశాల భవనాల్లో సగ భాగాన్ని తొలగించి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆర్యోగ శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌లు వైద్య కళాశాలను సంద ర్శించి క్రీడా ప్రాంగణంలోని కొంత భాగంలో సూపర్ స్ఫెషాలిటీ బ్లాక్ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఉన్నతాధికారులు ఒక ప్రాంతంలో, ప్రజాప్రతినిధులు మరో ప్రాంతంలో ప్రతిపాదనలు చేయడంతో వైద్య ఆరోగ్యశాఖ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఇంజనీర్లు రెండు ప్రాంతాల్లోనూ డిజైన్‌లు వేసి ప్రభుత్వానికి పంపారు. అక్కడ ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
గతం పునరావృతమయ్యేనా?
నాలుగేళ్ల కిందట వైద్య కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. తొలి విడతగా సిద్ధార్థ వైద్య కళాశాలకు రూ.9 కోట్లు విడుదల చేశారు. దానికి మ్యాచింగ్ గ్రాంటుగా రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు విడుదల చేయాల్సి ఉంది.
కానీ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయక పోవడంతో రెండో విడత నిధులను వైద్య కళాశాల కోల్పోవాల్సి వచ్చింది. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలు రెండు, మూడు విడ తలు నిధులు పొందగా మన రాష్ట్రంలో మాత్రం మొదటి విడతతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం కేటాయించిన రూ.150 కోట్లలో 20 శాతం అంటే రూ.30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఈ నిధులు కూడా సగంలోనే ఆగిపోయే పరిస్థితి తలెత్తుతుందని నిపుణులు చెపుతున్నారు.