సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాల్లో కిడ్నీ సమస్య బాధితులపై ప్రత్యేక దృష్టి సారించింది. వీరికి ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయనుంది. ఇందులో భాగంగా మార్కాపురంలో నూతనంగా ప్రారంభించబోతున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన బోధనాస్పత్రిలో నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలను ఏర్పాటు చేస్తోంది.
ఇప్పటికే నెఫ్రాలజీ విభాగం ఏర్పాటు కోసం 21 పోస్టులను కొత్తగా మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూరాలజీ విభాగం ఏర్పాటుకు పోస్టులు మంజూరు చేస్తూ శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024–25 విద్యా సంవత్సరంలో మార్కాపురం వైద్య కళాశాల ప్రారంభం కానుంది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) నిబంధనల ప్రకారం.. ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు ప్రారంభించడానికి నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల ఏర్పాటు తప్పనిసరి కాదు. అయినప్పటికీ మార్కాపురం ప్రాంత కిడ్నీ సమస్యల బాధితులకు వైద్య సేవలను చేరువ చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది.
ఇందులో భాగంగానే ఆ రెండు విభాగాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే గత నాలుగు దశాబ్దాల ఉద్దానం కిడ్నీ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూ.700 కోట్లతో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్‌ను చేపట్టి కిడ్నీ సమస్యల ప్రభావిత గ్రామాలకు మంచినీటి సరఫరాను చేపట్టింది. అదే విధంగా రూ.85 కోట్లతో శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని, 200 పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. వీటిని కొద్ది రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment