ఉద్దానం సమస్యకు ఇక శాశ్వత పరిష్కారం | Chief Minister YS Jagan will visit Srikakulam district today | Sakshi
Sakshi News home page

ఉద్దానం సమస్యకు ఇక శాశ్వత పరిష్కారం

Published Thu, Dec 14 2023 5:14 AM | Last Updated on Thu, Dec 14 2023 3:50 PM

Chief Minister YS Jagan will visit Srikakulam district today - Sakshi

సాక్షి, అమరావతి: ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది. దీంతో వారి కష్టాలు తీరనున్నాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ – 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

అలాగే రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్‌ సుజలధార ప్రాజె­క్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఉద్దానం ప్రాంతంలో కళ్లెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపడానికి కూడా సాహసించలేదు. ఇలాంటి పరిస్థితిలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.785 కోట్లు భారీ వ్యయం చేసి మరీ.. ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమ­స్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపింది.

వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌– 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌.. 
ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్‌ యూనిట్ల ఏర్పాటు.. మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్‌ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్‌ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్‌ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్‌ ల్యాబ్‌తో ప్రత్యేక వార్డులు.

సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్‌ కలర్‌ డాప్లర్, మొబైల్‌ ఎక్స్‌ రే (డిజిటల్‌), థూలి­యం లేజర్‌ యూరో డైనమిక్‌ మెషీన్‌ తదితర పరికరాలతో పాటు ఐసీయూ సౌకర్యాలు. జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్‌ పోస్టులు, 60 స్టాఫ్‌ నర్సు పోస్టులు, 60 ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ. 

వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్ట్‌.. 
ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు (క్రానిక్‌ కిడ్నీ డిసీజెస్‌) ప్రబలంగా ఉన్న ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలకు ‘వైఎస్సార్‌ సుజలధార‘ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన రక్షిత తాగునీరు. హిరమండలం రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా.

ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మాణం. ఇప్పటికే 613 గ్రామాలకు నీటి సరఫరా.. ఈ నెలాఖరుకు మిగిలిన గ్రామాలకు. 

ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు.. 
♦ గత ప్రభుత్వంలో డయాలసిస్‌ రోగులకు కేవలం రూ.2,500 చొప్పున పింఛన్‌ ఇస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచింది. ప్రతి నెలా 1న ఠంఛన్‌గా లబ్ధిదా­­రులకు వారి ఇళ్ల వద్దే వలంటీర్లతో అందజేస్తో­ం­ది.  

♦ ఇప్పటికే టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 74 మెషీన్లతో డయాలసిస్‌ సేవలు. ఇలా వరుసగా 2019–20లో 37,454 సెషన్లు, 2020– 21లో 46,162 సెషన్లు, 2021–­22లో 54,520 సెషన్లు, 2022–23లో 55,520 సెషన్లు, 2023–24లో (అక్టోబర్‌ నాటికి) 38,513 సెషన్ల చొప్పున కిడ్నీ బాధితులకు ప్రభుత్వం డయాలసిస్‌ సేవలు అందించింది. ఇప్పుడు దీనికి అదనంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌–సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌. 

♦వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, 6 సీహెచ్‌సీల్లో సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్‌ ఎనలైజర్స్, యూరిన్‌ ఎనలైజర్స్‌ ఏర్పాటు. గత టీడీపీ ప్రభుత్వంలో డయాలసిస్‌ రోగులకు 20 రకాల మందులు మాత్రమే.. అది కూడా అరకొరగా అందజేశారు. ప్రస్తుతం ఇక్కడ ప్రతి ఆస్పత్రిలో 37 ర­కా­ల మందులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

కొత్త కేసుల గుర్తింపునకు నిరంతరాయంగా స్క్రీనింగ్‌ కొనసాగుతోంది. స్క్రీనింగ్‌ అనంతరం అనుమానిత లక్షణాలు­న్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి సీర­మ్‌ క్రియాటినిన్‌ పరీక్షల కోసం సమీపంలోని పీహె­చ్‌­సీలకు తరలిస్తున్నారు. వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌లో పనిచేసే సీహెచ్‌వోలకు ప్రత్యేక యాప్‌. ఉద్దానం సమ­స్య­లకు సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా.. 
జగనన్నకు చెబుదాం 1902 టోల్‌ ఫ్రీ నంబర్‌

నేడు సీఎం పర్యటన ఇలా..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు కంచిలి మండలం మకరాంపురం గ్రామానికి హెలికాప్టర్‌లో వస్తారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.10 గంటలకు వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్టు పంప్‌హౌస్‌ స్విచ్‌ నొక్కి దాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పలాస వెళ్తారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.40 గంటలకు కిడ్నీ పరిశోధన కేంద్రానికి చేరుకుంటారు.

అక్కడ ఆస్పత్రిని ప్రారంభించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇండ్రస్టియల్‌ కారిడార్‌కు శంకుస్థాపన చేస్తారు. అలాగే ఎచ్చెర్లలోని బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన వసతి గృహ భవనాన్ని వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభిస్తారు. ఆ తర్వాత పాత జాతీయ రహదారి మీదుగా పలాస రైల్వే క్రీడా మైదానానికి చేరుకుంటారు. సభా ప్రాంగణంలో స్టాల్స్‌ను పరిశీలించి బహిరంగ సభలో మాట్లాడతారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరిగి హెలికాప్టర్‌లో విశాఖకు బయలుదేరతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement