‘‘ముక్కుపచ్చలారని ఏ చిన్నారి కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడకూడదు. వ్యాధిబారిన పడ్డ నా బిడ్డను కాపాడుకోలేకపోయాననే వేదన ఏ ఒక్కరూ పడకూడదు. ఇందుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరించాలి. ఆ బాధ్యత నాది’’..
.. అంటూ చిన్నపిల్లల గుండె సంబంధిత చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి వివిధ ప్రముఖ ఆసుపత్రుల్లో వైద్య సహాయం అందించేలా దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషిచేశారు. 2003లో ఆయన చెప్పిన ఈ మాటలను కార్యరూపం దాల్చేలా 2004లో నిర్ణయం తీసుకుని పసిగుండెలకు సాంత్వన చేకూర్చారు. ఇప్పుడాయన వారసుడిగా సీఎం జగన్ మరో అడుగు ముందుకేసి చిన్నపిల్లల గుండె సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఓ ఆస్పత్రినే నిర్మించాలని సంకల్పించారు.
మరెక్కడా ఇలాంటి సమస్యల కోసం ప్రత్యేకంగా ఓ ఆసుపత్రి లేకపోవడంతో చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దీనికి బీజం వేశారు. అనుకున్నట్లుగానే అత్యాధునిక వైద్య సదుపాయాలతో శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి తిరుపతిలో విజయవంతంగా అంకురార్పణ చేశారు.
(వడ్డే బాలశేఖర్, శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం నుంచి సాక్షి ప్రతినిధి) వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చీరాగానే సీఎం వైఎస్ జగన్ ప్రజారోగ్య వ్యవస్థను పట్టాలెక్కించి పరుగులు పెట్టించారు. పిల్లలకు ప్రభుత్వరంగంలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవల బలోపేతంపైనా దృష్టిసారించారు. ఇందులో భాగంగా టీటీడీ సహకారంతో తిరుపతిలో చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా శ్రీపద్మావతి హృదయాలయాన్ని ప్రారంభించారు. ఇప్పుడు పిల్లల గుండె చికిత్స కోసం బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలకు వెళ్లే పనిలేకుండా పోయింది.
1,980 మంది చిన్నారులకు పునర్జన్మ
ఇక ఈ రెండేళ్లలో 14,800 ఓపీ సేవలు ఈ ఆస్పత్రిలో నమోదయ్యాయి. వీరిలో పుట్టుకతో వచ్చిన గుండె సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు ఓపెన్ హార్ట్, కీ హోల్, వంటి ఇతర సర్జరీలు పెద్దఎత్తున నిర్వహించారు. మరికొందరికి మెడికల్ మేనేజ్‌మెంట్ చేశారు. ఇలా 1,980 మందికి పైగా చిన్నారులకు పునర్జన్మను ప్రసాదించారు. వీరిలో మెజారిటీ శాతం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల వారే. ఆరోగ్యశ్రీ కింద వీరికి పూర్తి ఉచితంగా వైద్యసేవలన్నింటినీ అందించారు. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ కింద 2,052 ప్రొసీజర్లు రెండేళ్లలో నమోదయ్యాయి. చిన్నారులతో పాటు, పెద్దలకు సైతం గుండె మార్పిడి ఆపరేషన్లను చేపట్టారు.
ఇప్పటివరకూ ఏడు గుండె మార్పిడి ఆపరేషన్లు ఇక్కడ నిర్వహించారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ.10 లక్షల వరకూ ఖర్చుకాగా ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించింది. గుండె మార్పిడి, ఇతర చికిత్సల కోసం సీఎంఆర్‌ఎఫ్ కింద కూడా అదనంగా సహాయం అందింది. 75 పడకలున్న ఈ ఆస్పత్రిలో 15 మంది నిష్ణాతులైన వైద్యులు సేవలు అందిస్తున్నారు. అడ్వాన్స్ క్యాథ్‌ల్యాబ్, మెడికల్ ల్యాబ్, ఎక్స్‌రే, ఈసీజీ పరికరాలతో పాటు, ఆపరేషన్ థియేటర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆసుపత్రికి తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి సులభంగా ఆటోలో వెళ్లొచ్చు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఆధార్, ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే.. బాధితులతో వచ్చే అటెండర్లలో ఒకరు ఇక్కడ ఉండొచ్చు. ఇక ఈ ఆసుపత్రి ఇటీవలే ఉత్తమ పీడియాట్రిక్ కార్డియాక్ సెంటర్‌గా గుర్తింపు పొందింది. ఆసియా టుడే రీసెర్చ్ అండ్ మీడియా సంస్థ ప్రైడ్ ఆఫ్ నేషన్‌గా ఈ అవార్డును ప్రకటించగా తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం డైరెక్టర్ డా.శ్రీనాథరెడ్డి దానిని అందుకున్నారు.
త్వరలో మరో సూపర్ స్పెషాలిటీ..
మరోవైపు.. తిరుపతి జిల్లా అలిపిరి వద్ద శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మిస్తున్నారు. రూ.450 కోట్ల వ్యయంతో, అత్యాధునిక ప్రమాణాలతో దీనిని ఏర్పాటుచేస్తున్నారు. హెమటో ఆంకాలజి, మెడికల్ ఆంకాలజి, సర్జికల్ ఆంకాలజి, న్యూరాలజి, కార్డియాలజీ, నెఫ్రాలాజి, గ్యాస్ట్రో ఎంట్రాలజి లాంటి 15 రకాల సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో చిన్నారులకు వైద్యసేవలు, చికిత్సలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇదే తరహాలో విశాఖపట్నం, గుంటూరు, విజయవాడల్లోను పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల వైద్యశాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
ఈ ఫొటోలోని సుర్ల శివ, పార్వతి దంపతులది పార్వతిపురం మన్యం జిల్లా నర్సిపురం. ఎనిమిది నెలల క్రితం వీరికొక కొడుకు ప్రన్షు పుట్టాడు. చిన్నారికి ఆరోగ్యం బాగోకపోవడంతో విశాఖలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారి గుండెలో రంధ్రంతో పాటు.. చెడు, మంచి రక్తం కలుస్తున్నాయని వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. ఆపరేషన్‌కు రూ.25 లక్షలు ఖర్చవుతుందన్నారు. అంత స్థోమత ఆ దంపతులకు లేదు. అదే సమయంలో తిరుపతిలో శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో చికిత్స గురించి తెలిసిన వాళ్లు చెప్పారు.
వెంటనే అక్కడ తీసుకెళ్లగా చిన్నారికి పరీక్షలు చేసి ఒక్కరూపాయి కూడా ఖర్చుకాకుండా ఆరోగ్యశ్రీ కింద స్టెంట్లు వేశారు. చిన్నారి కోలుకుని బరువు పెరిగాక గుండె రంధ్రానికి కూడా ఇక్కడే ఉచితంగా ఆపరేషన్ చేయనున్నారు. ‘ఇక నాకు పిల్లలు పుట్టే అవకాశంలేదు. బాబుకు ఏదైనా జరిగితే ఎలా అని నేను ఏడవని రోజులేదు. ఈ రోజు నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడంటే అది ఒక్క సీఎం జగన్ వల్లే’.. అంటూ పార్వతి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంది.
ఈ ఫొటోలోని అన్నమయ్య జిల్లా మంగపట్నంకు చెందిన గంగాదేవి వ్యవసాయ కూలీ. మంచం మీద నిద్రపోతున్న చిన్నారి ఈమె కుమారుడు.. పేరు దేవాన్‡్ష. ముగ్గురు ఆడపిల్లల అనంతరం కలిగిన మగ సంతానం. అయితే, పుట్టుకతోనే గుండె సమస్య వచ్చిపడింది. రెక్కాడితే కానీ డొక్కాడని వీరికి ఆపరేషన్ చేయించే స్థోమతలేదు. గంగాదేవి కుమారుడి ప్రాణాలను ఆరోగ్యశ్రీ, హృదయాలయం రూపంలో ప్రభుత్వం ఆదుకుంది.
తాముంటున్న ప్రాంతానికి కొద్దిదూరంలోని తిరుపతిలో ఆపరేషన్ చేస్తున్నారని తెలిసి బాబును ఇక్కడికి తీసుకొచ్చింది. ఏ సిఫార్సు, చేతి నుంచి ఒక్క రూపాయి ఖర్చులేకుండా చిన్నారికి ఆపరేషన్ పూర్తయింది. ‘కుటుంబ పోషణే భారమైన మాకు కొడుకు ఆరోగ్య సమస్యతో పెద్ద చిక్కొచ్చి పడింది. కానీ, కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం నా బిడ్డకు ఉచితంగా ఆపరేషన్ చేయించింది’.. అని అంటున్న గంగాదేవి ముఖంలో సంతోషం వెల్లివిరిసింది.
..ఈ ఇద్దరు చిన్నారుల తరహాలోనే పుట్టుకతో తీవ్రమైన గుండె సమస్యలున్న వందల మంది చిన్నారులకు శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలయం అక్కున చేర్చుకుని పునర్జన్మను ప్రసాదించింది. 11 అక్టోబరు 2021 అక్టోబరు 11న సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన మానసపుత్రికను ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చే నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక్క రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తోంది. విజయవంతంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తూ అభాగ్యుల పాలిట వరంగా నిలుస్తున్న హృదయాలయాన్ని ‘సాక్షి’ పరిశీలించి రోగుల కుటుంబాలను పలకరిస్తే.. ఒకొక్కరిదీ ఓ కన్నీటి గాధ ఆవిష్కృతమైంది.
సీఎం జగన్ నాకు పునర్జన్మనిచ్చారు
గుంటూరులో ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుంటాను. నాకు గుండె సంబంధిత సమస్యలుండటంతో హైదరాబాద్, గుంటూరు ఇలా చాలాచోట్ల చూపించుకున్నా. గుండె మార్పిడి చేయాలన్నారు. గతనెల 24న గుండె మార్పిడి చేశారు. ఈ ఆపరేషన్‌కు రూ.10 లక్షల పైనే ఖర్చవుతుందన్నారు. అయితే, నాకు ఒక్క రూపాయి కూడా ఖర్చుకాలేదు. మొత్తం ప్రభుత్వమే భరించింది. సీఎం జగన్ నాకు పునర్జన్మ ప్రసాదించారు. – ఎస్. సుమతి, వెల్దుర్తి, పల్నాడు జిల్లా
నెలకు 120 సర్జరీలు..మొదట్లో ఇక్కడ నెలకు
30 ఆపరేషన్ల వరకూ చేసేవాళ్లం. ప్రస్తుతం నెలకు 100 నుంచి 120 చేస్తున్నాం. పెద్దల్లో కూడా పుట్టుకతో వచ్చిన స్ట్రక్చరల్ గుండె సమస్యలతో పాటు, గుండె మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నాం. 15 మంది నిపుణులైన వైద్యులు, ఇతర సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలున్న ఈ తరహా ఆస్పత్రి ప్రైవేట్‌లో కూడా ఎక్కడా ఉండదు. ఆస్పత్రి నిర్వహణ కోసం టీటీడీ పుష్కలంగా నిధులు అందిస్తోంది. ఇక పేద ప్రజలకు ఉచితంగా చికిత్సలు చేయడానికి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ రూపంలో పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోంది. త్వరలో అలిపిరిలో పీడియాట్రిక్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి కూడా అందుబాటులోకి వస్తుంది.
– డాక్టర్ శ్రీనాథరెడ్డి, డైరెక్టర్, శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలయం
Comments
Please login to add a commentAdd a comment