నిండు జీవితానికి ‘నవ’ పరీక్షలు!
బీపి, షుగర్, కంటి సమస్యలు, లివర్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, గుండెజబ్బులు, స్థూలకాయం, ఎముకలు బలహీనపడటం, రక్తంలో ెహిమోగ్లోబిన్ తగ్గడం వంటి సమస్యలు చాలామందికి సర్వసాధారణంగా ఎదురయ్యేవే. కారణాలను గుర్తించి, వాటిని అదుపులోకి తెచ్చేందుకు ఉపకరించేవే ఈ నవపరీక్షలు...
1. రక్తపోటు పరీక్ష: ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి పెరగడంతో చిన్న వయసు వారిలో కూడా ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు కనిపిస్తోంది. ‘స్ఫిగ్మోమానోమీటర్’ అనే పరికరంతో బీపీని కొలుస్తారు. వైద్యుల సలహా మేరకు ఆహార విహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలా వరకు దీనిని అదుపు చేయవచ్చు. అప్పటికీ అదుపులోకి రాకుంటే, మందులు వాడాల్సి ఉంటుంది.
2. ఈసీజీ పరీక్ష: గుండె పనితీరును తెలుసుకోవడానికి ఎలక్ట్రో కార్డియోగ్రఫీ (ఈసీజీ) పరీక్ష అత్యవసరం. ఈసీజీ పరికరం సాయంతో గుండె కొట్టుకునే తీరును తెలుసుకుంటారు. దీనిద్వారా గుండె కండరాలకు తగినంతగా రక్త సరఫరా జరగకపోవడం, గుండె లయలో హెచ్చుతగ్గులు, తగినంత వేగంతో గుండె పంప్ చేయలేకపోవడం, గుండె కండరాల్లో ఏవైనా దళసరిగా మారడం లేదా వాటి పరిమాణం పెరగడం, గుండెలో పుట్టుకతో ఏర్పడే లోపాలు వంటివి కనుక్కోవచ్చు.
3. లివర్ ఫంక్షన్ టెస్ట్స్: లివర్ పనితీరును తెలుసుకునేందుకు చేసే కొన్ని రకాల రక్తపరీక్షలనే లివర్ ఫంక్షన్ టెస్ట్స్ అంటారు. వీటిలో ఆల్బుమిన్, టోటల్ బైలురుబిన్, డెరైక్ట్ బైలురుబిన్, ట్రాన్సామినాసెస్, ఆల్కలైన్ ఫాస్ఫేట్స్ వంటి పదార్థాల స్థాయిని కనుగొనేందుకు చేసే పరీక్షలు ఉంటాయి. వీటి ద్వారా హెపటైటిస్, హైపర్ పారాథైరాయిడిజం, పచ్చకామెర్లు (జాండిస్) వంటి జబ్బులను తెలుసుకోవచ్చు. వీటితో పాటు అల్ట్రాసౌండ్ హోల్ అబ్డామిన్ పరీక్ష చేయడం ద్వారా లివర్ సిరోసిస్, ఫ్యాటీలివర్ కూడా ఉందేమో తెలుసుకోవచ్చు. లివర్‌లోని లోపాల వల్ల తలెత్తే జబ్బుల లక్షణాలు అంత తొందరగా బయటపడవు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే, చికిత్స చేయడం తేలిక.
4. కంటి పరీక్ష: సాధారణంగా కంటిచూపు 6/6 ఉంటుంది. చిన్నారులు ఎక్కువగా హ్రస్వదృష్టి బారిన పడుతుంటారు. నలభై ఏళ్లు దాటాక చత్వారం వచ్చేస్తుంది. అంటే, దూరదృష్టి పెరుగుతుందన్నమాట. ఇవే కాకుండా, వయసు మళ్లిన వారికి గ్లకోమా, క్యాటరాక్ట్ వంటి ఇబ్బందులూ తలెత్తుతాయి. ఎప్పటికప్పుడు కంటి పరీక్ష జరిపించుకుంటూ, తగిన చికిత్స పొందాలి.
5. కిడ్నీ పరీక్ష: కిడ్నీల పనితీరును తెలుసుకోవడానికి సీరమ్ క్రియాటినిన్ పరీక్ష నిర్వహిస్తారు. కండరాల జీవక్రియలో వెలువడే రసాయనిక వ్యర్థమే క్రియాటినిన్. రక్తంలో క్రియాటినిన్ స్థాయిని సక్రమంగా ఉండేలా చూడటంలో కిడ్నీలదే కీలక పాత్ర. కిడ్నీల పనితీరులో తేడా వస్తే రక్తంలో క్రియాటినిన్ పరిమాణం పెరిగిపోతుంది. క్రియాటినిన్ పరిమాణం సాధారణంగా 0.8-1.2 ఎండీ/డీఎల్, పురుషుల్లో 0.8-1.3 ఎంజీ/డీఎల్ ఉంటుంది. మూత్రపరీక్ష ద్వారా కూడా దీని స్థాయిని తెలుసుకుంటారు. ఒక్కోసారి అవసరాన్ని బట్టి మూత్రపరీక్ష, రక్తపరీక్ష రెండింటి ద్వారా ఈ పరిమాణాన్ని తెలుసుకుని, కిడ్నీల పనితీరులో తేడాలు ఉన్నట్లు తేలితే తగిన చికిత్స చేస్తారు.
6. కొలెస్ట్రాల్ పరీక్ష: రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే గుండెజబ్బులు, పక్షవాతం వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. రక్తపరీక్ష ద్వారా కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తెలుసుకోవచ్చు. ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్ ఈ పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. ఎల్‌డీఎల్‌నే చెడు కొవ్వు అంటారు. ఇది ఎక్కువగా ఉంటే, ధమనుల్లో కొవ్వు చేరి గుండెపోటు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. అదే, హెచ్‌డీఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ రక్తనాళాల్లోకి చెడుకొవ్వు చేరకుండా అరికడుతుంది. 45 పైబడ్డ వాళ్లు ప్రతి ఏటా ఈ పరీక్ష చేయించుకోవాలి.
7. చక్కెర పరీక్ష: రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉంటే డయాబెటిస్ ఉన్నట్లే. చక్కెరను నియంత్రించే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే పాన్‌క్రియాస్ పనితీరు మందగించినా, కండరాలు, కాలేయం, కొవ్వుల్లో ఉండే జీవకణాలు ఇన్సులిన్‌కు తగిన రీతిలో ప్రతిస్పందించకపోయినా చక్కెరజబ్బు వస్తుంది. పాన్‌క్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయకపోతే టైప్-1 డయాబెటిస్ వస్తుంది. ఇది చిన్న వయసు నుంచే కనిపిస్తుంది. ఇన్సులిన్‌ను శరీరంలోని జీవకణాలు తగిన రీతిలో ఉపయోగించుకోనప్పుడు టైప్-2 డయాబెటిస్ వస్తుంది. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. ఎలాంటి లక్షణాలూ కనిపించకపోయినా 45 ఏళ్ల వారు తరచు రక్తపరీక్షలు జరిపించుకుని, రక్తంలో చక్కెర స్థాయిని తెలుసుకోవడం మంచిది.
8. కంప్లీట్ బ్లడ్ పిక్చర్: రక్తంలో ఉండే సూక్ష్మ పదార్థాలన్నింటి పరిమాణాన్ని సమగ్రంగా తెలుసుకునేందుకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్ష నిర్వహిస్తారు. రక్తహీనత వంటి లోపాలను కనుగొనేందుకు ఈ పరీక్ష ఎంతగానో దోహదపడుతుంది. రక్తంలో హెమోగ్లోబిన్ పరిమాణం 11ఎంజీ/డీఎల్ నుంచి 16 ఎంజీ/డీఎల్ వరకు ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే రక్తహీనతతో బాధపడుతున్నట్లే. డెంగ్యూ వంటి వ్యాధులు సోకినప్పుడు ప్లేట్‌లెట్స్ సంఖ్య గణనీయంగా పడిపోతుంది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ద్వారానే ఆ పరిస్థితిని తెలుసుకోవచ్చు.
9. బోన్ డెన్సిటీ టెస్ట్: మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గిపోవడంతో మహిళలు ఆస్టియో పొరాసిస్‌కు గురవుతుంటారు. మరీ సన్నగా ఉండే మహిళలు, వంశపారంపర్యంగా ఈ వ్యాధి కొనసాగుతున్న వాళ్లు ఈ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. బోన్ డెన్సిటీ పరీక్ష ద్వారా ఆస్టియో పొరాసిస్ వ్యాధిని తేలికగా గుర్తించవచ్చు. బోన్ డెన్సిటీ తక్కువగా ఉంటే క్యాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
డాక్టర్ ఎల్. సుదర్శన్ రెడ్డి
సీనియర్ జనరల్ ఫిజీషియన్ యశోద హాస్పిటల్స్
సికింద్రాబద్