మధుమేహానికి నిరపాయకరంగా చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే బోలెడన్ని ప్రయత్నాలు చేశారు.. చేస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెటబాలిక్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు చేసిన తాజా ప్రయత్నం మాత్రం కొంచెం వినూత్నమైంది. కొవ్వులతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నా సరే.. అవి కాలేయంలో సక్రమంగా జీర్ణమయ్యేలా చేసి మధుమేహం రాకుండా చేయవచ్చునని వీరు అంటున్నారు. మన శరీరంలో కొవ్వులు అడిపోజ్ కణజాలంలో నిల్వ ఉంటాయని మనకు తెలుసు. దీర్ఘకాలంపాటు ఎక్కువగా తీసుకుంటే మాత్రం కొవ్వు కాలేయంలో కూడా పోగుబడుతుంది. ఇది కాస్తా ఫ్యాటీ లివర్ వ్యాధికి దారితీసి.. శరీరం ఇన్సులిన్‌కు స్పందించే వేగాన్ని తగ్గిస్తుంది.
దీంతో టైప్ –2 మధుమేహం వచ్చేస్తుంది. ఈ రకమైన జీవక్రియ సంబంధిత వ్యాధులకు.. సెరమైడ్ అనే కొవ్వు రకానికి మధ్య దగ్గరి సంబంధం ఉన్నట్లు గతంలోనే గుర్తించినా.. ప్రొటీన్ ఉత్పత్తిని నిరోధించడం ద్వారా వీటిని తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం అంతగా ఫలించలేదు. ఈ నేపథ్యంలో మ్యాక్స్ ప్లాంక్ శాస్త్రవేత్తలు ఈ సెరమైడ్ కొవ్వులలో ఇన్సులిన్ నిరోధాన్ని ప్రేరేపిస్తున్న వాటిని గుర్తించారు. వాటిని మాత్రమే అడ్డుకోగల ప్రొటీన్‌ను నియంత్రించడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాలేయంలో కొవ్వులు పేరుకుపోవడాన్ని తగ్గించగలిగారు. ఇదే క్రమంలో వాటి రక్తంలోని చక్కెర మోతాదులు కూడా తగ్గాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న హామెర్ అనే శాస్త్రవేత్త తెలిపారు. పరిశోధన వివరాలు సెల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment