Fats
-
ఈ మొక్క కొవ్వుని ఈజీగా కరిగించేస్తుంది! ఒబెసిటీకి చక్కటి ఔషధం!
ఈ మొక్క కొవ్వుని కరిగించేసి అధిక బరువు సమస్య నుంచి బయటపడలే చేస్తుంది. అంతేగాదు ఒబెసిటీ, ఫ్యాటీ లివర్ సమస్యలకు చెక్పెడుతుందట. ఎలాంటి వ్యాయామాలు, ఎక్సర్సైజ్లు చేస్తే ఎలాగైతే బరువు అదుపులో ఉంటుందో అలానే ఈ మొక్క కూడా చేస్తుందట. దీని ఆకుల్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా ఈజీగా బరువు తగ్గిపోతాం అంటున్నారు చైనా శాస్త్రవేత్తలు. తమ పూర్వీకులు ఈ మొక్క నుంచి తయారు చేసిన షాన్ కుచా అనే పానీయాన్ని వైద్యంలో ఔషధంగా ఉపయోగించేవారని చెబుతున్నారు. ఇది పిత్తాశయానికి సంబంధించిన సమస్యలను నివారిస్తుందని వారు బలంగా నమ్మేవారని తెలిపారు. అయితే తాము ఈ మొక్కపై జరిపిన పరిశోధనల్లో మరన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని వెన్నలా కరిగించడం గుర్తించినట్లు చెప్పారు. రక్తంలోని ప్రోటీన్లు, కొవ్వుల స్థాయిని మెరుగుపరుస్తుందని, అల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ని సైతం తగ్గిస్తుందని అన్నారు. ఒబెసిటీకి ఇది చక్కటి ఔషధం అని అంటున్నారు. సుమారు 36 ఎలుకలపై ఈ మొక్క ఆకులను వాటి ఆహారంలో భాగం చేయగా ఇవి మంచి ఆరోగ్యంతో ఉండగా వాటి కొలస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉన్నట్లు తెలిపారు. ఈ మొక్కని మల్లోటస్ ఫ్యూరెటియానస్ అని పిలుస్తారు. ఇది కొవ్వు నిల్వలను నియంత్రించి బరువుని అత్యంత ఈజీగా తగ్గించడంలో దివ్యౌషధంలా పనిచేస్తుందని చెప్పారు. తమ పరిశోదన బృందం యాంటీ ఒబేసిటీ ఆహార పదార్థాల కోసం పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. ఆ క్రమంలోను ఈ మొక్కపై పరిశోధనలు చేసినట్లు తెలిపారు. అంతేగాదు యాంటీబెసిటీ డైట్లో ఇది చక్కటి ఆహారంగా ఈ మొక్కను సూచిస్తున్నారు. ఇది ప్రజలను ఆరోగ్యంగా ఉంచి వారి ఆయుః ప్రమాణాన్ని పెంచుతుందని ధీమాగా చెబుతున్నారు చైనా శాస్త్రవేత్తలు (చదవండి: బిపాసా కూతురికి గుండెల్లో రంధ్రాలు..పుట్టుకతో గుండె లోపం ఎందుకు వస్తుంది..?) -
మీకు తెలుసా
జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్,ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో వ్యాధులనుంచి రక్షిస్తాయి. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీడిపప్పును ఒక్కొక్కరు ఒక్కోలా తింటుంటారు. కొందరు పచ్చి జీడిపప్పును తింటే ఇంకొంతమంది వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తింటుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీడిపప్పును పాలలో నానబెట్టి తింటే వాటి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం ఏం చేయాలంటే..? రాత్రిపూట గ్లాసు పాలలో మూడు లేదా నాలుగు జీడిపప్పులను వేయండి. మరుసటి రోజు ఈ జీడిపప్పు తిని పాలను తాగండి. దాంతో మామూలుగా జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలకంటే అనేకరెట్లు అధిక ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యానికి మంచిదని మోతాదుకు మించి తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త. ఉదయం లేచిన తర్వాత వేడి వేడిగా టీ కానీ, కాఫీ కానీ తాగనిదే చాలా మంది రోజు మొదలవ్వదు. చాలా మంది సమయం సందర్భం లేకుండా టీ తాగుతూ ఉంటారు. లేవగానే ఒకసారి టీ తాగడం.. టిఫిన్ చేశాక టీ తాగడం, మళ్లీ సాయంత్రం, మధ్యాహ్నం భోజనం తర్వాత ఇలా.. ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తుంటారు. అయితే.. భోజనం తర్వాత టీ కానీ కాఫీ గానీ తాగడం వల్ల మనకు తెలీకుండానే సమస్యలు కొని తెచ్చుకున్నవాళ్లం అవుతామట. అదెలాగంటే... అన్నవాహిక అనేది ఒక పొడవాటి గొట్టం. ఇది మన నోటి నుంచి కడుపు వరకు ఉంటుంది. ఇది ద్రవాలు, లాలాజలం, నమిలిన ఆహారానికి వాహకంగా పనిచేస్తుంది. వేడి వేడి కాఫీ, టీలు ఎక్కువసార్లు తాగడం వల్ల అన్నవాహిక దెబ్బతిని క్యాన్సర్ల వంటివి వచ్చే ముప్పు ఉందట. అందువల్ల కాఫీ టీలు తాగేటప్పుడు అదీ మరీ వేడిగా తాగేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది. -
మధుమేహానికి చెక్.. కొత్త పద్ధతిలో!
మధుమేహానికి నిరపాయకరంగా చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే బోలెడన్ని ప్రయత్నాలు చేశారు.. చేస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెటబాలిక్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు చేసిన తాజా ప్రయత్నం మాత్రం కొంచెం వినూత్నమైంది. కొవ్వులతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నా సరే.. అవి కాలేయంలో సక్రమంగా జీర్ణమయ్యేలా చేసి మధుమేహం రాకుండా చేయవచ్చునని వీరు అంటున్నారు. మన శరీరంలో కొవ్వులు అడిపోజ్ కణజాలంలో నిల్వ ఉంటాయని మనకు తెలుసు. దీర్ఘకాలంపాటు ఎక్కువగా తీసుకుంటే మాత్రం కొవ్వు కాలేయంలో కూడా పోగుబడుతుంది. ఇది కాస్తా ఫ్యాటీ లివర్ వ్యాధికి దారితీసి.. శరీరం ఇన్సులిన్‌కు స్పందించే వేగాన్ని తగ్గిస్తుంది. దీంతో టైప్ –2 మధుమేహం వచ్చేస్తుంది. ఈ రకమైన జీవక్రియ సంబంధిత వ్యాధులకు.. సెరమైడ్ అనే కొవ్వు రకానికి మధ్య దగ్గరి సంబంధం ఉన్నట్లు గతంలోనే గుర్తించినా.. ప్రొటీన్ ఉత్పత్తిని నిరోధించడం ద్వారా వీటిని తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం అంతగా ఫలించలేదు. ఈ నేపథ్యంలో మ్యాక్స్ ప్లాంక్ శాస్త్రవేత్తలు ఈ సెరమైడ్ కొవ్వులలో ఇన్సులిన్ నిరోధాన్ని ప్రేరేపిస్తున్న వాటిని గుర్తించారు. వాటిని మాత్రమే అడ్డుకోగల ప్రొటీన్‌ను నియంత్రించడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాలేయంలో కొవ్వులు పేరుకుపోవడాన్ని తగ్గించగలిగారు. ఇదే క్రమంలో వాటి రక్తంలోని చక్కెర మోతాదులు కూడా తగ్గాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న హామెర్ అనే శాస్త్రవేత్త తెలిపారు. పరిశోధన వివరాలు సెల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
ఆ ప్రొటిన్‌తో కొవ్వు ఖాళీ!
ఊబకాయాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి ఓ శుభవార్త. సహజసిద్ధమైన ప్రొటిన్ సాయంతోనే శరీరంలోని కొవ్వులను మూడొంతుల వరకూ తగ్గించవచ్చునని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిరూపించడం దీనికి కారణం. ఎలుకలపై జరిగిన పరిశోధనల్లో బీపీ3 అని పిలిచే ఈ ప్రొటిన్ కేవలం 18 రోజుల్లో కొవ్వులను కరిగించినట్లు తెలిసింది. కొవ్వులను తగ్గించడంతోపాటు జీవక్రియలకు సంబంధించిన ఇతర జబ్బులకూ సహజసిద్ధమైన ప్రొటీన్ ద్వారా మెరుగైన చికిత్స కల్పించేందుకు ఈ పరిశోధన ఉపకరిస్తుందని అంచనా. బీపీ3 సహజమైన ప్రొటిన్ కావడం వల్ల దీనిపై నేరుగా పరిశోధనలు నిర్వహించేందుకు అవకాశముందని, తద్వారా ఈ ప్రొటిన్ ఆధారిత మందు వేగంగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆంటన్ వెల్స్టీన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. కేన్సర్‌పై పరిశోధనలు చేస్తూండగా తమకు ఈ ప్రొటీన్ కొవ్వులను కరిగించేందుకు ఉపయోగపడుతుందని తెలిసిందని ఆయన చెప్పారు. -
శాక రాజం – వంకాయ
వంకాయకు మన భారతదేశమే పుట్టినిల్లు. ప్రాచీన కాలంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ శాక రాజం, ఆధునిక యుగంలో కూడ అగ్రస్థానంలో నిలిచింది. తెలుగువారితో విడదీయరాని బంధం ఏర్పరచుకొంది. ‘వంకాయ వంటి కూరయు, లంకాపురి‡ వైరి వంటి రాజుంగలడే...’ అన్న ఒక చాటువులోని పద్య పాదాలు ఈ కూర ఔన్నత్యానికి ప్రతీకలు. ఆయుర్వేదంలో కూడా దీనికి విశిష్ట స్థానం ఉంది. సంస్కృతంలో పర్యాయపదాలు...వృంతాక, నీలఫలా, రక్తఫలా, శాకబిల్వ, రాజ కూష్మాండ, వంగణ, అంగణ, సింహీ మొదలైనవి. దీనినే వార్తాక అని కూడా అంటారు. అయితే ఆయుర్వేదంలో, వాకుడు (కంటకారీ) మొక్కని కూడా వార్తాకమంటారు. ఇది గుర్తుంచుకొని సందర్భోచితంగా అర్థం చేసుకోవాలి. ఇది లె లుపు, ముదురు + లేత నీలి రంగులలోనూ లభిస్తుంది. చిన్నవిగాను, పెద్దవిగాను, గుండ్రంగాను, కోలగా కూడా ఉంటాయి. వంకాయను అమెరికా, ఆస్ట్రేలియాలలో ‘ఎగ్ ఎలిఫెంట్’ అనీ, దక్షిణాఫ్రికా, ఆసియా ఖండాలలో ‘బ్రింజాల్’ అనీ పిలుస్తుంటారు. పోర్చుగీసు భాషలో దీనిని ‘బెరింగేల’ అంటారు. వీటి వ్యాపార సమయంలో వారు పలికే భాష రూపాంతరం చెంది ‘బ్రింజాల్’గా మారింది. వంకాయలోని పోషక ఔషధ విలువల్ని ఆయుర్వేద సంహితాకారులు ఈ విధంగా వివరించారు... వృంతాకం స్వాదు తీక్షో›్ణష్ణం కటుపాకమపిత్తలం జ్వరవాత బలాసఘ్నం దీపనం శుక్రలం లఘు... శ్వేత వృంతాకం కుక్కుటాండ సమం భవేత్ తత్ అర్శస్సు విశేషేణ హితం... వంకాయ రుచికరంగా ఉండి, ఉష్ణకరమై, ఆకలిని పుట్టించి వాత కఫ దోషాలను హరిస్తుంది. తేలికగా జీర్ణమౌతుంది. వీర్యవర్థకం. స్థూలకాయులలో బరువు తగ్గడానికి చక్కటి ఆహారం.నూ¯ð తో వేయించి ఉప్పు కలిపి సేవిస్తే మాత్రం శరీర బరువు పెరుగుతుంది. (ఉడికించిన కూర మంచిది).(తదేవహి గురు స్నిగ్ధం సతైలం లవణాన్వితం)తెల్ల వంకాయ: దీని పోషక విలువలు, కోడిగుడ్డుతో సరిసమానం. ఇది మూలవ్యాధి (అర్శస్సు – పైల్స్) తగ్గడానికి చాలా ఉపయుక్తం. దీనితో పోలిస్తే నీలం రంగు వంకాయలో పోషక విలువలు మరింత అధికం.ఆధునిక జీవరసాయన శాస్త్రం: వంకాయలో కొవ్వులు శూన్యం. మాంసకృత్తులు నామమాత్రంగాను, పిండి పదార్థాలు ఓ మోస్తరుగాను ఉంటాయి. 3.5 శాతం శర్కర, మూడు శాతం పీచుపదార్థాలు ఉంటాయి. బీ కాంప్లెక్సు, ఫోలేట్లు, సి, కె, ఎ విటమిన్లు చక్కగా లభిస్తాయి. ఒక శాతం ఐరన్, మూడు శాతం మెగ్నీషియం ఉంటాయి. సోడియం శూన్యం, క్యాల్షియం సమృద్ధిగాను, పొటాషియం అత్యధికంగాను లభిస్తాయి. కాబట్టి బలకరం, స్థౌల్యహరం, సుఖ విరేచనకారి. రక్తపోటుని అదుపు చేసి గుండెకు మేలు చేస్తుంది. వంకాయను ఎలా వండుకోవాలి... వేపడం అంత మంచిది కాదు. రుచికరంగా ఉన్నా, నూనెను వేడి చేయడం, ఉప్పు కలపడం ద్వారా మంచి గుణాలు మరుగున పడిపోతాయి. ఉడికించి వండటం శ్రేష్ఠం. దీనిలో కలిపే మసాలాల వైరుధ్యాన్ని బట్టి కూరను పిలిచే పేరు మారుతుంది. ఉదా: కొత్తిమీర, అల్లం కారం, జీలకర్ర కారం, మెంతి కారం, ఉల్లి కారం, వంకాయ + బంగాళ దుంప ముద్ద కూర మొదలైనవి. ఈ రోజుల్లో కనిపించే ‘బగారా బైంగన్’ కూరలో మసాలా ఎక్కువగా ఉంటుంది. వంకాయను వెతుక్కోవలసి వస్తుంది. దీనివలన ప్రయోజనం శూన్యం. వంకాయపై (పెద్ద సైజువి) కొంచెం నూనె పూసి, నిప్పులపై కాల్చి, అనంతరం తొక్కను తొలగించి, గుజ్జులా పిసికి, దానికి ‘చింతపండు రసం, ఉప్పు, పచ్చి మిర్చి తగుపాళ్లలో కలిపి, ఇంగువ పోపు, కొత్తిమీర చేర్చి పచ్చడి చేస్తారు. దీనిని ‘వంకాయ పులుసు పచ్చడి’ అంటారు. చింతపండు రసం కలపకుండా చేసే దానిని ‘చప్ప పచ్చడి’ అంటారు. దీంట్లోకి... వేయించిన అల్లం ముక్కలు, చిన్న సైజు గుమ్మడి లేక పిండి వడియాలు కూడా జోడిస్తారు. ఉత్తర భారతంలో ఈ చప్ప పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, టొమాటో వేయించి కలుపుతారు. దీనిని ‘భడ్తా’ అంటారు. వంకాయతో చుక్కకూర కలిపి వండిన కూర చాలా రుచికరం. తేలికగా జీర్ణమై వాతహరంగా పని చేసి ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద భావప్రకాశ సంహితాకారుడు ఉటంకించాడు. ‘‘చుక్రికా స్యాత్తు పత్రామ్లా రోచనీ శతవేధినీ ... స్వాద్వీ వాతఘ్నీ కఫ పిత్తకృత్ రుచ్యా లఘుతరా పాకే వృంతాకేన అతి రోచనీ’ అపోహలు: చాలామంది వంకాయను ఆరోగ్యానికి శత్రువుగా పరిగణిస్తారు, తినరు కూడా. ఎలర్జీ కలుగుతుందంటారు. ఆయుర్వేద మందులు వాడుతుంటే, ‘వంకాయ, గోంగూర (పుంటి కూర)’ తినకూడదని భావిస్తుంటారు. ఇవన్నీ అపోహలు మాత్రమే. సత్య దూరం, అశాస్త్రీయం. గమనిక: ఏ కూరలకైనా పండించిన ప్రదేశం, పోసిన నీరు, వేసిన ఎరువు, ఇతర వాతావరణ పరిస్థితుల్ని బట్టి పోషక విలువలు పోయి, అనారోగ్య కారకమవుతుంది, చేదుగా కూడా ఉంటుంది. ఆరగించుyì ! వంకాయననుదినంబు శాకరాజంబు బల్యంబు లోకమందు తెల్ల వంకాయ గుణముల తీరు జూడ అర్శ మొలలను పూర్తిగ నణచి వేయు ఇక అపోహ వలదు సుమ్మి, హృద్యమదియ పులుసు పచ్చడి రుచి చూడ ముదము గాదె కూర నుడికించి చేయుము కూర్మి మీర సమ్మతంబిది! శ్రీరామచంద్ర సమము. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి,ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
ఫ్యాట్కిన్స్ డైట్
1972లో ఒక పుస్తకం సంచలనం రేపింది.డాక్టర్ ఆట్కిన్ అనే ఆయన ‘ఆట్కిన్స్ డైట్’ పేరుతో ఆ పుస్తకం రాసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. బరువు తగ్గడానికి ఇది శ్రేష్టమైన మార్గమనిసూచించాడు.ఆచరించినవాళ్లు అవునని అన్నారు.మీరూ ఆచరించి చూడండి... ఫ్యాట్‌తో ఫ్యాట్‌ని కిల్ చేసే ఈ డైట్‌ని పరిశీలించి చూడండి. బరువు తగ్గడానికి సమర్థంగా సహకరించే డైట్ ప్రక్రియల్లో ఆట్కిన్స్ డైట్ ఒకటి. ఇది తక్కువ పిండిపదార్థాలు ఎక్కువ ప్రొటీన్లు, కొవ్వులు ఉన్న డైట్ ప్రక్రియ. డాక్టర్ రాబర్ట్ సి. ఆట్కిన్ అనే ఫిజీషియన్ 1972లో రాసిన ఒక పుస్తకంలో దీన్ని పొందుపరచాడు. ఆ పుస్తకం ఆనాటి బెస్ట్ సెల్లర్‌గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఈ ఆహార ప్రక్రియలను అంతో ఇంతో తమ తమ ప్రాంతాలకు అనుగుణంగా, అనువుగా మార్చుకుని ప్రయోజనం పొందారు. ఈ ఆహార ప్రక్రియలోని ప్రధాన ప్రిన్సిపుల్ స్వాభావికమైన కొవ్వులైన నెయ్యి వంటి శాచ్యురేటెడ్ ఫ్యాట్స్‌ను ఎంతైనా తీసుకోమని చెప్పడం. ఎందుకంటే అవి అంత హానికరం కాదు. మార్కెట్ లో దొరికే లో–ఫ్యాట్ డైట్స్ కంటే ఇలాంటి శాచ్యురేటెడ్ కొవ్వులే రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం, చెడు కొలెస్ట్రాల్‌ను పరిమితం చేయడం ద్వారా గుండెజబ్బులను నివారిస్తాయి. బరువును తగ్గిస్తాయి. ఈ ఆహార విధానంలోని మరో ముఖ్యాంశం పిండిపదార్థాలను తగ్గించడం. దీని వల్ల బరువు తగ్గుతారు. ఎందుకంటే పిండిపదార్థా లతో ఎంతోసేపటికి గానీ తృప్తి కలగదు. అదే ప్రొటీన్లు తినడం వల్ల త్వరగా తృప్తి కలుగుతుంది. దాంతో కార్బోహైడ్రేట్లను తగ్గించడం వల్ల ప్రొటీన్లను ఒంటికి అవసరమైనంతే తినడంతో ఆటోమేటిగ్గా బరువు తగ్గుతారు. ఆట్కిన్స్ ౖడైట్ అనుసరించేవారు నాలుగు దశల్లో దీన్ని అమలు పరచవచ్చు. అవి... ►మొదటి దశలో (దీన్ని ఇండక్షన్ దశ అంటారు): రోజుకు కేవలం 20 గ్రాముల కంటే తక్కువ పిండిపదార్థాలను (అంటే ఆకుకూరలు, కాయ గూరలను) మాత్రమే తీసుకుంటూ రెండు వారాలు కొనసాగించాలి. ఈ సమయంలో ఎక్కువ ప్రొటీన్, ఎక్కువ కొవ్వులు ఉండే మాంసాహారాలు రోజుకు మూడుపూటలా తీసు కోవచ్చు. ►రెండో దశలో (దీన్ని బ్యాలెన్సింగ్ దశ అంటారు) : ఇప్పుడు రెండువారాలుగా తీసుకునే ఆహారానికి మెల్లగా నట్స్, డ్రైఫ్రూట్స్, పండ్లు వంటి వాటిని జతచేయవచ్చు. ఇలా మరో రెండు వారాలు కొనసాగించాలి. ►మూడో దశలో (దీన్ని ఫైన్–ట్యూనింగ్ దశ అంటారు) : ఇందులో మీరు కోరుకున్న లక్ష్యానికి చేరువ అవుతూ చాలావరకు బరువు తగ్గుతారు. అప్పుడు మీ ఆహారానికి మరికొన్ని కార్బో హైడ్రేట్లను చేర్చవచ్చు. ►నాలుగో దశలో (దీన్ని నిర్వహణ దశ లేదా మెయింటెనెన్స్ దశ అంటారు): ఇక ఇప్పటి నుంచి మీరు ఆరోగ్యకరమైన పిండిపదార్థాలను మాత్రమే తీసుకుంటూ ఉన్నప్పటికీ ఎలాంటి పైన పేర్కొన్న మూడు దశల్లోని హై–ప్రొటీన్లు, ఎక్కువ కొవ్వులు తీసుకుంటున్నా బరువు పెరగకుండా స్థిరంగా ఉంటారు. ఒక సూచన : ఇక్కడ పేర్కొన్న దశలు పాటించడానికి కాస్త సంక్లిష్టంగానే ఉంటాయి. అందుకే కొంతమంది ఇండక్షన్ దశలోకి వెళ్లకుండానే నేరుగా రెండో దశ నుంచి ప్రారంభిస్తారు. అయితే కొంతమంది మాత్రం ఎంతకూ ఇండక్షన్ దశలోనే ఉండిపోతారు. ఈ ఆట్కిన్స్ డైట్ ప్రభావవంతంగా పనిచేసే ప్రక్రియే. ఇది ఇంచుమించూ కాస్త కీటోజెనిక్ డైట్ ప్రక్రియకు దగ్గరగా ఉంటుంది. ఆట్కిన్స్ ప్రక్రియలో దూరంగా ఉండాల్సిన ఆహారాలు : ►చక్కెరలు : శీతల పానీయాలు, పళ్లరసాలు, కేకులు, క్యాండీలు, ఐస్‌క్రీములు. ► ధాన్యాలు : గోధుమలు, రే, బార్లీ, వరి. ► వెజిటెబుల్ ఆయిల్స్ : సోయా నూనె, మొక్కజొన్న నూనె, పత్తిగింజల నుంచి తీసిన నూనె (కాటన్ సీడ్ ఆయిల్)... ఇలాంటివే మరికొన్ని. ► కొవ్వులు / ట్రాన్స్‌ఫ్యాట్స్ : హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ అని పిలిచే ప్రాసెస్ చేసిన నూనెల నుంచి దూరంగా ఉండాలి. ► కార్బ్ డైట్ : ఎక్కువ చక్కెరలు ఉండే కార్బోహైడ్రేట్ డైట్. ► హై–కార్బ్ వెజిటెబుల్స్ : క్యారెట్లు, టర్నిప్లకు దూరంగా ఉండాలి. ► హై–కార్బ్ పండ్లు : అరటిపండ్లు, ఆపిల్స్, నారింజ, పియర్స్, ద్రాక్ష పండ్లకు దూరంగా ఉండాలి. ► పిండి పదార్థాలు (స్టార్చ్) : బంగాళదుంప (ఆలూ), చిలగడదుంపలకు దూరంగా ఉండాలి. (వీటిని ఇండక్షన్ దశలో మాత్రమే తీసుకోవచ్చు) ► లెగ్యూమ్‌లు : చిక్కుళ్లు, బీన్స్, చిక్పీస్ వంటివాటికి దూరంగా ఉండాలి. (వీటిని ఇండక్షన్ దశలో మాత్రమే తీసుకోవచ్చు) తీసుకోదగిన ఆహారాలు : ఆట్కిన్స్ డైట్లో భాగంగా ఈ కింద పేర్కొన్న ఆహారాలను తీసుకోవచ్చు. ►మాంసాహారాలు : వేట మాంసం, చికెన్ ►చేపలు / సీఫుడ్ : సాల్మన్, సార్డిన్ చేపలు. ► గుడ్లు : ఒమెగా 3– ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న అన్ని ఆరోగ్యకరమైన గుడ్లు. ►తక్కువ పిండిపదార్థాలు ఉండే కూరగాయలు / ఆకుకూరలు : పాలకూర, బ్రాకలీ, అస్పారగాస్ వంటివి. ► కొవ్వులు ఎక్కువగా ఉండేవి: వెన్న, చీజ్, మీగడ, కొవ్వులు తీయని పెరుగు. ►ఎండుఫలాలు / నట్స్ : బాదం, మాకడామియా నట్స్, వాల్నట్, పొద్దుతిరుగుడు గింజలు... మొదలైనవి. ►ఆరోగ్యకరమైన నూనెలు : ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె, అవకాడో నూనె. మీ ఆహారంలో పిండిపదార్థాలు తక్కువగానూ, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, నట్స్ ఎక్కువ గానూ ఉన్నంతకాలం మీరు బరువు పెరిగేందుకు అవకాశం ఉండదు. తీసుకోదగిన పానీయాలు : ఆట్కిన్స్ డైట్ తీసుకుంటున్నప్పుడు తీసుకో దగిన పానీయాలు ఇవి. ►నీళ్లు: మీరు ఎప్పుడు తాగినట్టుగానే నీళ్లు తాగవచ్చు. ►కాఫీ : కొన్ని అధ్యయనాల ప్రకారం కాఫీలో ఆరోగ్యాన్నిచ్చే కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందువల్ల పరిమితంగా కాఫీ తీసుకోవచ్చు. ►గ్రీన్ టీ : ఇది ఎంతో ఆరోగ్యకరమైన పానీయం. మొత్తం మీద ఇలా ఆట్కిన్స్ డైట్ అన్నది బరువు తగ్గడానికి ఒక నమ్మకమైన ప్రక్రియ అనీ, అది చాలావరకు నిరాశ పరచదన్నది నిపుణుల మాట. ఆట్కిన్స్ డైట్లో తీసుకోదగ్గ కూరలతో తమకు ఇష్టమైన రీతిలోనూ తమ సౌలభ్యాన్నీ, తినుబండారాల లభ్యతను బట్టి ఆయా వ్యక్తులు తమ డైట్ తీసుకోవచ్చు. లేదా నిపుణులతో చర్చించి తమకు అనువైన వ్యక్తిగతమైన డైట్‌ను రూపొందించుకోవచ్చు. అలా చేయలేనప్పుడు ఈ కింద పేర్కొన్న సాధారణ డైట్ ప్లాన్‌ను అనుసరించవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా వారం రోజుల పాటు తీసుకోవాల్సిన డైట్ ఇలా... శాకాహారులకు డైట్ – డైట్ ప్లాన్ ఇక శాకాహారులైతే ఈ కింద పేర్కొన్న ఆహారా లను తమ డైట్ ప్లాన్‌గా చేసుకోవచ్చు. వీటిని లంచ్ / డిన్నర్ ఆప్షన్‌గా లేదా ఏ కాంబినేషన్లతో నైనా, ఎలాగైనా ఎంచుకొని మార్చుకుంటూ తీసుకోవచ్చు. అవి... ► రాజ్మా టొమాటో కర్రీ/దీనికి చాలా రకాల ఆకు కూరలు కలుపుకొని సలాడ్‌గా తీసుకో వచ్చు. ► ఉడికించిన శనగలు / చిక్ పీస్‌ను రాగి రొట్టెలు లేదా రాగి జావతో తీసుకోవచ్చు. ► ఆలివ్‌నూనెలో టొమాటోలతో పాటు కాస్తంత వేపిన మొలకెత్తిన పెసర్లు ►అన్ని రకాల గింజల మొలకలను రుబ్బుకొని దోశలా వేసుకోవచ్చు. ఈ దోశను కొబ్బరినూనె లేదా వెన్నలో వేసుకోవచ్చు. ► శనగపిండిలో పాలకూర కలుపుకొని వెన్నలో తేలిగ్గా వేపుకోవచ్చు. ► సజ్జరొట్టె / జొన్నరొట్టెలను సోయాబీన్ టొమాటో కర్రీతో పాటు తీసుకోవచ్చు. ► పనీర్ బుర్జీ ► పాలకూరతో పాటు పెసరతో చేసిన చట్నీ లేదా పెసర పప్పు ► శనగపప్పు + పాలకూర ► పనీర్ టిక్కా (ఇంట్లో చేసుకున్నది) డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఆ నూనెలు గుండెకు ఎందుకు మేలు చేస్తాయంటే..
ఈ రోజుల్లో ఎక్కడ చూసిన గుండె జబ్బులకు సంబంధించిన వార్తలే. కారణాలేవైనా కావచ్చుగానీ.. అసంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే నూనెలు వాడటం, బాగా నిద్రపోవడం అనే రెండు చర్యలతో గుండెజబ్బులతో పాటు గుండెపోటు సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చు అంటున్నారు కీనన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బయో మెడికల్ శాస్త్రవేత్తలు. అసంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే నూనెలు (కుసుమ, సోయా, సూర్యకాంతి, ఆలివ్) ఉన్న ఆహారం జీర్ణమైన తరువాత మన శరీరంలో అపోలిపో ప్రొటీన్ (అపో ఏ –4) మోతాదు ఎక్కువ అవుతుందని, రక్తంలో ఈ ప్రొటీన్ ఎక్కువగా ఉన్న వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువని ఇప్పటికే పరిశోధనల్లో రుజువైందని డాక్టర్ హూ నీ అనే శాస్త్రవేత్త తెలిపారు. అంతేకాకుండా ఈ అపోలిపో ప్రొటీన్ ఇతర వ్యాధుల విషయంలోను మేలు చేస్తుంది. రక్తంలోని ప్లేట్లెట్లపై ఉండే గ్లైకో ప్రొటీన్‌ను అడ్డుకోవడం ద్వారా ఇది అవి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చూస్తాయని, ఫలితంగా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవని వివరించారు. అంతే కాకుండా అపో ఏ –4 ప్రొటీన్ రక్తనాళాల్లో గార పేరుకు పోవడాన్ని తగ్గిస్తుందని, ఈ నూనెలతో కూడిన ఆహారాన్ని తీసుకున్న వెంటనే పనిచేయడం మొదలుపెట్టి ప్లేట్లెట్ల చురుకుదనాన్ని, ఒకదానితో ఒకటి అతుక్కుపోవడాన్ని తగ్గిస్తుందని వివరించారు. -
శాకచక్యంగా తగ్గండి
ఫుడ్డు విషయంలో ప్రపంచంబాగా ఫాస్ట్ అయిపోయింది!అదృష్టం.. మనిమింకా స్లోగా మూవ్ అవుతున్నాం.ఫాస్ట్ అంటే యన్వీ. స్లో అంటే వెజ్. వెజ్ మన ఆరోగ్యానికే కాదు..బరువు తగ్గడానికీ పనికొస్తుంది.ఎలాగంటారా?! శాకల్ని కాస్త చాకచక్యంగా తినాలంతే. బరువు తగ్గడానికి ఉపయోగపడే ఆహారాల్లో ‘వెజిటేరియన్ డైట్’ ఒకటి. మాంసాహారంలో ప్రొటీన్లు ఉన్నా దానివల్ల కొవ్వులు పేరుకుంటాయని రెడ్‌మీట్ వంటి వాటివల్ల బరువు పెరుగుతుందని, అందుకే శాకాహారమే మంచిదని, దాని వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యమూ సమకూరుతుందని నిపుణులు చెబుతుంటారు. ఇక ప్రస్తుతం శాకాహారం తినడం సాంస్కృతిక జీవనశైలిగా మారింది. సాటి జీవులను చంపే అధికారం, హింసించే హక్కు లేదంటూ చాలామంది పూర్తిగా శాకాహారానికి మారిపోతున్నారు. మాంసాహరం తామస గుణాన్ని పెంపొందిస్తుందనీ, అదే శాకాహారం అమృతాహారమని చాలామంది పేర్కొంటుంటారు. ‘వెజిటేరియనిజమ్’ను పాటించే మరికొందరైతే జంతువుల నుంచి వచ్చే ఉత్పాదనలైన పాలు, పెరుగులను కూడా నిరసిస్తూ ఉంటారు. ఇలాంటి వారినే ‘వేగన్స్’ అని, వారు ఆచరించే శాకాహార ప్రియత్వాన్ని వేగనిజమ్ అని వ్యవహరిస్తుంటారు. ఈ ధోరణి ఎలా ఉన్నా బరువు తగ్గించడానికి శాకాహారం బాగా ఉపయోగపడుతుందని మాత్రం నిపుణులు చెబుతున్నారు. శాకాహారులలో రకాలు శాకాహారం తినేవాళ్లలో కూడా కొన్ని గ్రూపులు ఉన్నాయి. వీళ్ల ధోరణిని బట్టి వీళ్లకు పేర్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు... లాక్టో–వెజిటేరియన్స్: వీరు మాంసం, చేపలు, చికెన్, గుడ్లు వంటి వాటిని మాత్రమే మాంసాహారంగా పరిగణిస్తుంటారు. జంతువుల నుంచి వచ్చే ఉత్పాదనలైన పాలు, వెన్న, పెరుగు వంటి వాటిని శాకాహారంగా పరిగణిస్తుంటారు. లాక్టో–ఓవో వెజిటేరియన్స్: వీరు పాలను శాకాహారంగా పరిగణిస్తారు. ఓవో–వెజిటేరియన్స్: వీరు గుడ్లను శాకాహారంగా పేర్కొంటారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న గుడ్లలో పిండం ఉండదు కాబట్టి వాటిని శాకాహారంగానే పరిగణిస్తారు. గుడ్లలోని ల్యూటిన్తోబరువు తగ్గుతుందన్నది తెలిసిందే. వేగన్స్: వీరు జంతువుల నుంచి లభించే ఎలాంటి ఉత్పాదననైనా మాంసాహారంగానే పరిగణిస్తారు. మాంసం, చేపలు, గుడ్లను మాత్రమేగాక పాలు, పెరుగు వంటి వాటిని కూడా మాంసాహారంగానే చూస్తారు. వాటిని ముట్టుకోరు. ఫ్లెక్సిటేరియన్స్: వీరు వీలైనంత వరకు జంతువులను చంపకుండా, హింసించకుండా లభ్యమయ్యే జంతు ఉత్పాదనలను మాత్రం తీసుకుంటూ, వాటికి హాని చేకూర్చడం వల్ల లభ్యమయ్యే ఆహారాన్ని పూర్తిగా పరిహరిస్తున్నారు. వీరికి శాకాహార ప్రియత్వం ఉన్నా వీలును బట్టి జంతువుల నుంచి లభ్యమయ్యే ఉత్పాదనలను తింటారు కాబట్టి తమను తాము ఫ్లెక్సిటేరియన్స్గా పేర్కొంటున్నారు. వీరిలో కొందరు చేపలను శాకాహారంగానే పరిగణిస్తారు. చేపల్లో ఉండే తక్కువ కొవ్వుతో పాటు ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ బరువు పెరగకుండా తోడ్పడతాయి. శాకాహారం బరువును ఎలా తగ్గిస్తుందంటే... కాయగూరల్లో (ఉదాహరణకు సొరకాయ, బీరకాయ వంటివి) నీటిశాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరల్లో పీచు పాళ్లు ఎక్కువ. మాంసాహారంతో పోలిస్తే శాకాహారం త్వరగా కడుపు నిండిపోతుంది. నీరు ఎక్కువగా ఉండటం వల్ల, తక్కువ క్యాలరీలను కలిగి ఉండటం వల్ల చాలా ఎక్కువగా తిన్నా కొద్ది క్యాలరీలు మాత్రమే ఒంటిలోకి చేరతాయి. మాంసాహారాన్ని తినాలంటే ఎంతో కొద్దిపాళ్లలో మసాలాలు (స్పైసెస్) వాడాల్సిందే. మసాలాల కారణంగా కడుపు నిండాక కూడా ఇంకాస్త తినాలని అనిపిస్తుంటుంది. శాకాహారం అలా కాదు. తిన్న వెంటనే సంతృప్తభావన వచ్చేస్తుంది. ఇలా పీచు, నీటి పాళ్లతో పాటు, మసాలాలు తక్కువ అనే అంశాల కారణంగా శాకాహారాన్ని తక్కువే తింటాం. పైగా మాంసాహారంలోలా శాకాహారంలో కొవ్వులు ఉండనే ఉండవు. ఫలితంగా తిన్న క్యాలరీలను ఖర్చు చేయగలిగితే శాకాహారంతో అసలు స్థూలకాయం వచ్చే అవకాశమే దాదాపుగా ఉండదు. ఖనిజాలూ బరువు తగ్గిస్తాయి: మాంసాహారాలతో పోలిస్తే శాకాహారంలో ఖనిజాలు, లవణాలు ఎక్కువ. ఈ ఖనిజ లవణాలూ బరువు తగ్గించడానికి తోడ్పడతాయి. ఎలాగంటే...శాకాహారంలోని ఖనిజాలు, లవణాలు, విటమిన్లు సమతులంగా అందడం వల్ల జీవక్రియలు మెరుగుపడతాయి. చురుకైన జీవక్రియల వల్ల బరువు పెరగడానికి ఆస్కారం ఉండదు. శాకాహరంలోని ఖనిజాలన్నింటిలోనూ బరువు తగ్గించడంలో క్రోమియం భూమిక అగ్రస్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. అది రక్తంలోని చక్కెరలను సమతౌల్యం చేస్తుంది. ఇన్సులిన్‌ను తగిన పాళ్లలో విడుదలయ్యేలా చేస్తుంది. ఈ ఆరోగ్య అంశాల ద్వారా అది బరువు తగ్గించడంలో తోడ్పడుతుంది. నట్స్, గింజలు, అన్ని ఆకుకూరలు, కాయగూరల్లో క్రోమియం పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గించడంలో ఉపయోగపడే ఖనిజాల్లో క్రోమియం తర్వాతి స్థానం మెగ్నీషియమ్ది. ఇది నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరచడం, రక్తంలోని చక్కెర సమతౌల్యంగా ఉండేలా చూడటం, ఎముకలను పటిష్టపరచడం, వాటి ఆరోగ్యం బాగుండేలా చూడటంతో పాటు జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేసేలా, జీర్ణక్రియ వేగవంతమయ్యేలా చూస్తూ క్యాలరీలను త్వరగా దహనమయ్యేలా చేస్తుంది. ఈ మెగ్నీషియమ్ ముదురాకుపచ్చ ఆకుకూరలు, కాయగూరలు, నట్స్, పెరుగు, ఇతర పాల ఉత్పాదనల్లో ఎక్కువగా ఉంటుంది. జింక్ హార్మోన్ల సమతౌల్యతకు తోడ్పడటంలో భాగంగా బరువును నియంత్రిస్తుంది. జింక్ కూడా ఆకుకూరలు, కాయగూరలు, నట్స్‌తో పాటు పుట్టగొడుగులు, చిక్కుళ్లలో ఎక్కువ. ఐరన్ రక్తప్రవాహాన్ని సాఫీగా జరపడం, జీవక్రియలను మెరుగుపరచడం ద్వారా బరువును నియంత్రిస్తుంది. ఇది నట్స్, పాలకూర, డార్క్ చాకొలేట్స్, సబ్జా గింజలు (చియా సీడ్స్),, స్పిరులినాలో ఎక్కువ. లవణాల విషయానికి వస్తే పొటాషియమ్ అనేక జీవక్రియలను వేగవంతం చేయడం ద్వారా బరువును నియంత్రిస్తుంది. ఇది ఆకుకూరలు, కాయగూరలతో పాటు పెరుగు, సబ్జాగింజలు, పొట్టుధాన్యాలు, కొబ్బరినీళ్లు, బాదాం వంటి నట్స్‌లో ఎక్కువ. క్యాల్షియమ్ కూడా జీవక్రియలను మెరుగుపరుస్తూ బరువును నియంత్రిస్తుంది. ఇది పాలు, పాల ఉత్పాదనలతో పాటు బాదాం, సబ్జాగింజలలో ఉంటుంది. ఇవే గాక సల్ఫర్, సెలీనియమ్, చాలా కొద్ది పరిమితిలో సోడియమ్ కూడా అవసరమవుతాయి. బరువు తగ్గడానికి థెర్మోజెనిక్ శాకాహారాలు: ఒంట్లో వేడిని మరింత పెంచే శాకాహారాలను థెర్మోజెనిక్ శాకాహారాలు అనవచ్చు. థెర్మోజెనిక్ శాకాహారాలతో బరువు తగ్గడం మరింత సులువు. ఇవి తీసుకోవడం వల్ల మన ఆహారాల్లోని క్యాలరీలు మరింత వేగంగా దహనం అవుతాయి. ఆ వివరాలు:మిరియాలు (రెడ్ హాట్ పెప్పర్స్ / బ్లాక్ పెప్పర్) ఒంట్లో వేడిని పెంచి (థెర్మోజెనెసిస్ ద్వారా) క్యాలరీలను త్వరగా దహనం చేస్తాయి. గ్రీన్ టీలోని క్యాటెచిన్, పాలీఫీనాల్స్లో థెర్మోజెనిక్ గుణాలు ఉన్నాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్–టీ ఒక వరప్రదాయిని. పసుపులోని కార్క్యుమిన్ స్థూలకాయం నివారించడమే కాదు... స్థూలకాయ సంబంధిత అనేక వ్యాధులను నివారిస్తుంది. కాలీఫ్లవర్, బ్రాకోలీ, క్యారెట్లు, దోస వంటి వెజిటబుల్స్ కూడా తమ థెర్మిక్ గుణంతో బరువును నియంత్రిస్తాయి. శాకాహారంతో ఇతర ప్రయోజనాలివే... ఇటీవలి పరిశోధనలు మాంసాహారం కంటే శాకాహారం ఎన్నో రకాల ప్రయోజనకారి అని తెలుపుతున్నాయి. ఉదాహరణకు... శాకాహారంలో ఎలాంటి కొవ్వులూ ఉండవు. ముదురు ఆకుపచ్చ ఆకుకూరలలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. పొట్టు తీయని ధాన్యాల్లోనూ అంతే. ఇవి బరువు తగ్గడానికి గణనీయంగా తోడ్పడతాయి. మాంసాహారం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండెజబ్బులు, పక్షవాతం, కంటి జబ్బులు, హైబీపీకి దారితీస్తున్నాయి. మాంసాహారం తిన్నప్పుడు చాలాసేపు మనిషి మందకొడిగా మారతాడు. శాకాహారంలో కొవ్వులు లేకపోవడం అన్న ప్రయోజనం బరువు పెరగకుండా ఉండటానికి, బరువును నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. శాకాహారం మనలో పేరుకున్న చాలా విష పదార్థాలను స్వాభావికంగా తొలగిస్తుంది. అందుకే దీన్ని స్వాభావికమైన డిటాక్స్ (విష–హరిణి)గా చెప్పవచ్చు. వెజిటేరియన్ డైట్లో పీచు ఎక్కువగా ఉంటుంది, విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభ్యమవుతాయి. ఈ డీటాక్సిఫైయింగ్ కూడా బరువు తగ్గడానికి చాలావరకు తోడ్పడుతుంది. రంగుల మిలమిలలు: మాంసాహారం సాధారణంగా ఒకేరంగుతో కంటికి అంత ఇంపుగా ఉండకపోవచ్చు. శాకాహారంలోని రకరకాల పదార్థాలు అనేక రకాల రంగులీనుతూ ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ స్వాభావికమైన అనేక రంగుల ఆహారపదార్థాలతో ఆరోగ్యం బాగుంటుంది. చాలా రకాల పోషకాలు సమకూరడం కూడా మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. తేలిగ్గా జీర్ణం: శాకాహారంలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మొలలు, స్థూలకాయం, డయాబెటిస్, మలబద్ధకం, హయటస్ హెర్నియా, డైవర్టిక్యులైటిస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, పిప్పి పళ్లు (డెంటల్ కేరిస్), పిత్తాశయంలో రాళ్లు వంటి అనేక వ్యాధుల నివారణ స్వాభావికంగానే జరుగుతుంది. ఆకుకూరలతో మేలు అంతా ఇంతా కాదు: ఆకుకూరలతో ఆరోగ్యానికి ఒనగూరే మేలు అంతా ఇంతా కాదు. ఇందులోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల బరువు నియంత్రణలో ఉండటం, బీపీ నియంత్రణలో ఉండటం, గుండెజబ్బులకు ఆస్కారం లేకపోవడం వంటివి జరుగుతాయి. ఆకుకూరలు, పండ్లలో కాపర్, మెగ్నీషియమ్ వంటి ఖనిజాలు, లవణాలు ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి. కొవ్వుల్లోనూ ఒమెగా 3, మ్యూఫా, ప్యూఫా వంటి ఆరోగ్యవంతమైన కొవ్వులు లభ్యమవుతాయి. మాంసాహారం తినేవారితో పోలిస్తే శాకాహారం తినేవాళ్లలో టైప్–2 డయాబెటిస్ (మధుమేహం) వచ్చేందుకు అవకాశాలు తక్కువ. అదే మాంసాహారం ఎక్కువ తినేవారిలో స్థూలకాయం వస్తుంది. ఈ స్థూలకాయం మళ్లీ మధుమేహం, రక్తపోటు వంటి అనేక వ్యాధులకు ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇక శాకాహార ఆకుకూరలు తినేవాళ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మానికి ఎప్పటికప్పుడు మంచి పోషణ, విటమిన్స్ లభిస్తాయి కాబట్టి వాళ్లలో మేని మెరుపు చాలా బాగుంటుంది. శాకాహారం పరిమితులు: బరువు తగ్గించుకోడానికి శాకాహారాన్ని ఒక మార్గంగా అనుసరించే వారు కొన్ని పరిమితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. శాకాహారం ఆరోగ్యానికి మంచిదే అయినా కేవలం అది మాత్రమే పూర్తి పోషకాలను అందించలేదు. ఉదాహరణకు ప్రొటీన్ల లభ్యత. ప్రొటీన్లు కావాలంటే: ప్రొటీన్లు శాకాహారం కంటే మాంసాహారంలోనే ఎక్కువ. అయితే శాకాహారంతోనే ప్రొటీన్లు లభ్యం కావాలంటే పప్పులు, చిక్కుళ్లు, సోయా ఉత్పాదనలైన... సోయా బీన్స్, సోయా చీజ్, సోయా మిల్క్, టోఫూ వంటి ఆహార పదార్థాలపై ఆధారపడాలి. క్యాల్షియం కోసం: యుక్తవయసు వచ్చిన నాటి నుంచి అంటే... 19 ఏళ్ల యువకుడు మొదలుకొని 50 ఏళ్ల వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికీ 1000 ఎం.జీ. క్యాల్షియం అవసరం. ఇది డెయిరీ ఉత్పాదనల్లో పుష్కలంగా లభ్యమవుతుంది. అయితే వేగనిజమ్ అవలంబించే వారికి అదే మొత్తంలో క్యాల్షియం లభ్యం కావాలంటే వాళ్లు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు అంటే పాలకూర, బ్రకోలీ, పొద్దుతిరుగుడు గింజలు, సోయా మిల్స్ ఉత్పాదనల వంటి వాటిపై ఆధారపడాలి. వాటిని రోజూ తీసుకోవాలి. వెజిటేరియనిజమ్ పేరిట పాలను పరిహరించి, ప్రత్యామ్నాయాలను తగినంతగా తీసుకోలేకపోతే ఎముకలకు నష్టం వాటిల్లుతుంది. విటమిన్ డి: మన శరీరంలోకి క్యాల్షియం చక్కగా ఇంకిపోవాలంటే విటమిన్–డి అవసరం. ఇది పాల ఉత్పాదనలో, సూర్యకాంతిలో లభ్యమవుతుంది. సాధారణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ (ఐయూ) విటమిన్–డి అవసరం. జంతువుల నుంచి కాకుండా వెజిటేరియన్ ఉత్పాదనల ద్వారానే అది లభ్యం కావాలంటే సోయా మిల్క్ ఉత్పాదనలపై ఆధారపడాలి. ఐరన్: మనలో రక్తహీనత రాకుండా ఉండటానికి ఐరన్ చాలా అవసరం. ఇది మాంసాహారంలో తక్షణం లభిస్తుంది. అయితే శాకాహారం ద్వారానే ఇది లభ్యం కావాలంటే ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు (పాలకూర, బ్రకోలీ), డ్రైఫ్రూట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు, సోయాబీన్ నట్స్ వంటివి పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్–సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు టమాటాలు తినడం వల్ల కూడా ఐరన్ తేలిగ్గా శరీరంలోకి ఇంకుతుంది. విటమిన్ బి12: ఇది మాంసాహారంలోనే పుష్కలంగా లభిస్తుంది. ఆ తర్వాత పాలలో అధికంగా ఉంటుంది. శాకాహారం నుంచే దీన్ని తీసుకోవాలంటే సోయామిల్ వంటి వాటిపై ఆధారపడాలి. దీని లోపం వల్ల మెదడు నరాల నుంచి అవయవాలకు ఆదేశాలు అందడంలో ఆటంకాలు, స్పృహతప్పడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఎండలో తగినంతగా తిరగకుండా ఇన్‌డోర్స్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, కేవలం శాకాహారాన్ని మాత్రమే తీసుకునే వారిలో విటమిన్–డి, విటమిన్–బి12 లోపంతో వచ్చే నరాల సమస్యలు ఇటీవల చాలా పెరిగాయి. అందుకే కేవలం వెజిటేరియన్ ఆహారంపైనే ఆధారపడే వారు విటమిన్–డి, విటమిన్–బి12, ఐరన్ వంటి కీలకమైన పోషకాల కోసం ప్రత్యామ్నాయాలపై మరింత ఎక్కువ దృష్టిపెట్టాలి. పైన పేర్కొన్న ప్రత్యామ్నాయాలు ఆచరిస్తూ, శాకాహారం వైపు మళ్లితే అది బరువు తగ్గడానికి బాగా తోడ్పడటంతో పాటు... ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. శుభ్రం చేయడం చాలా ముఖ్యం ఆకుకూరలు /కాయగూరలపై రకరకాల పురుగుమందులు, మట్టి, బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉన్నందున వాటిని శుభ్రంగా కడగాలి. అన్ని కూరగాయలు / ఆకుకూరలను ధారగా పడే నీళ్లలో కడగాలి. పలుచటి చర్మం ఉన్న కూరగాయలను కాస్తంత వైట్ వెనిగర్ కలిపిన నీళ్లలో కడుక్కోవడం మంచిది. ఆకుకూరలను ముందుగా కోసి ఆ తర్వాత కడగటం కంటే బాగా శుభ్రంగా కడిగాక మాత్రమే కోయాలి. నేలనుంచి తీసే వెజిటబుల్స్‌ను మట్టి అంతా శుభ్రమయ్యేలా బాగా కడగాలి. సుజాతా స్టీఫెన్, చీఫ్ న్యూట్రిషనిస్ట్ యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్ -
ఈ ఆహారంతో అకాల మరణానికి చెక్
లండన్ : అవకాడో, ఆలివ్ ఆయిల్ వంటి మొక్కల నుంచి లభ్యమయ్యే నూనెలు, కొవ్వుల ద్వారా అకాల మృత్యువాతన పడే ముప్పు గణనీయంగా తగ్గుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ చేపట్టిన అథ్యయనం వెల్లడించింది. ఈ తరహా కొవ్వులతో కూడిన ఆహారం తీసుకునే వారికి ఈ పోషకాలు లభించని ఆహారం తీసుకునే వారితో పోల్చితే అకాల మరణం ముప్పు 16 శాతం తక్కువగా ఉంటుందని అథ్యయనం తేల్చింది. ప్రజలు తీసుకునే కొవ్వు పదార్థాల రకాలను బట్టి వారి జీవితకాలం ఎలా ఉంటుందనేది 22 ఏళ్ల పాటు జరిపిన ఈ పరిశోధన విశ్లేషించింది. 93,000 మంది పురుషులు, మహిళల నుంచి సేకురించిన గణాంకాల ఆధారంగా ఈ పరిశోధన చేపట్టారు. ప్రతి నాలుగేళ్లకోసారి వీరి ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా సమీకరించి విశ్లేషించారు. వీరిలో మాంసం, గుడ్లు, పూర్తికొవ్వుతో కూడిన పాల ఉత్పత్తులను తీసుకునే వారిని ఓ గ్రూపుగా, అవకాడోలు, నట్స్,ఆలివ్ ఆయిల్ వంటి మొక్కల ఆధారిత నూనెలు, కొవ్వులు తీసుకునే వారిని ఓ గ్రూపుగా విభజించి సమాచారాన్ని విశ్లేషించారు. ప్లాంట్ బేస్డ్ కొవ్వులు తీసుకున్న వారు ఎక్కువ కాలం జీవిస్తారని ఈ పరిశోధన తేల్చింది. ఈ తరహా ఆహారంతో 25 శాతం మేర జీవనకాలాన్ని పెంచుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు. అయితే ఈ రెండింటి మధ్య పోషకాల పరంగా ఎలాంటి వైరుధ్యాలున్నదీ వెల్లడిస్తూ వారు సాపేక్ష వివరాలు పేర్కొనలేదు. -
‘బొద్దింక’తో ప్రొటీన్ ఫుడ్!
బెంగళూరు : బొద్దింక ద్వారా ఆహారమా.. ఆ మాట వింటేనే ఏదోలా ఉంది కదూ..! వాటిని చూస్తేనే కొంతమంది భయపడతారు. అలాంటిది వాటిని తినడమా..? కానీ బొద్దింకలు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు పరిశోధకులు. బొద్దింకల కడుపులో మనకెంతో మేలు చేసే ప్రొటీన్లు ఉన్నాయని బెంగళూరులోని ఇన్‌స్టెమ్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. ఆ చిన్న బొద్దింకలోని ఒక్కో ప్రొటీన్ స్ఫటికాల్లో పాలలో ఉన్న శక్తి కన్నా మూడు రెట్లు ఎక్కువ ఉంటుందని శాస్త్రవేత్త సంచారీ బెనర్జీ పేర్కొంటున్నారు. అంతేకాదు ఈ స్ఫటికాల్లో ప్రొటీన్లతోపాటు కొంతమేర కొవ్వులు, చక్కెరలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ‘ప్రొటీన్లలో దాదాపు మనకు అవసరమైన అన్ని అమైనోయాసిడ్స్ ఉంటాయని తెలిసిందే. ఎలాగూ ఈ స్ఫటికాల జన్యుక్రమం మొత్తాన్ని తెలుసుకున్నాం కాబట్టి దాని ఆధారంగా సూపర్ ఆహారాన్ని ఈస్ట్ వంటి సూక్ష్మజీవుల ద్వారా పెద్ద ఎత్తున తయారు చేయొచ్చు’ అని సంచారీ వివరంచారు. పరిశోధన వివరాలు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టలోగ్రఫీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
పీచు తింటే పీస్ ఉంటుంది
మన డైట్లో పీచు పదార్థాలు ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. కొబ్బరి పీచు తీసుకుని గిన్నెల్లో జిడ్డు తోమేసినట్టు... పీచు పదార్థం కడుపు అనే గిన్నెని శుభ్రం చేసేస్తుంది. ఫన్నీ థింగ్ ఏంటంటే... పీచు పదార్థాల్లో పోషక విలువలు తక్కువ, పీచు ఎక్కువ ఉన్నా... శరీరాన్ని శుభ్రంగా ఉంచడానికి, అనారోగ్యాల నుంచి కాపాడటానికి... చాలా విలువలున్నాయి. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చెయ్యడానికి, డయాబెటిస్‌ని దూరంగా ఉంచడానికి బరువు తగ్గించడానికి... ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అంతేకాదు... మలబద్ధకం వల్ల వచ్చే బుద్ధి బద్ధకాన్నీ ఫ్లష్ చేసేస్తుంది. అందుకే... పీచు తినండి. పీస్ ఆఫ్ మైండ్ తెచ్చుకోండి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్... ఇలాంటి పోషకాలన్నీ శరీరానికి తప్పనిసరిగా తగిన మోతాదుల్లో అవసరమే. ఆహారంలో ఇవన్నీ ఉన్నా, పీచుపదార్థాలు తగినన్ని లేకుంటే మాత్రం ఆరోగ్యం వికటించి గుండె పీచు... పీచుమనడం ఖాయం. ఇంతకీ ఈ పీచుపదార్థాలేమిటి? ఇవేమైనా శక్తినిస్తాయా? కండబలాన్నిస్తాయా? గుండెబలాన్నిస్తాయా? ఎందుకు వీటిని తీసుకోవాలి... అనుకుంటున్నారా? నిజమే! ఇవి తక్షణమే శక్తినివ్వవు. కండబలాన్నీ, గుండెబలాన్నీ ఇవ్వవు. ఇతర పదార్థాల్లా కనీసం జీర్ణమైనా కావు. అయినా, మన ఆరోగ్యం సజావుగా ఉండాలంటే వీటిని తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. పీచుపదార్థాలే లేకుంటే, మనం తిన్న ఆహారంలో జీర్ణమైపోయినవి జీర్ణమైపోగా, మిగిలిన వ్యర్థాలు బయటకుపోయే వీలే ఉండదు. కడుపులో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపాలంటే పీచుపదార్థాలను తీసుకోక తప్పదు. కరిగేవీ... కరగనివీ... ఆహారంలోని పీచుపదార్థాలను నాన్-స్టార్చ్ పాలీశాచరైడ్స్ (ఎన్ఎస్పీ) అంటారు. ఇవి శాకాహార పదార్థాల్లో ఉంటాయి. వీటిలో సెల్యులోజ్, సెమీసెల్యులోజ్, పెక్టిన్స్, లిగ్నిన్స్, గమ్స్, మ్యూకిలేజెస్, బీటా-గ్లుకేన్స్ వంటి రకరకాల పీచుపదార్థాలు ఉంటాయి. అయితే, వీటిని స్థూలంగా నీటిలో కరిగే పీచుపదార్థాలు, నీటిలో కరగని పీచుపదార్థాలుగా విభజిస్తారు. నీటిలో కరిగే పీచుపదార్థాలు నీటిలో కలిసిన తర్వాత జెల్‌లాంటి మెత్తని పదార్థంగా మారుతాయి. ఇవి రక్తపోటును అదుపు చేయడంలోను, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలోను ఉపయోగపడతాయి. ఓట్స్, బీన్స్, వేరుశెనగలు, ఆపిల్స్, పుల్లని పండ్లు, క్యారట్లు, బార్లీ వంటి వాటిలో కరిగే పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇక నీటిలో కరగని పీచుపదార్థాలు మన జీర్ణకోశంలోని వ్యర్థాల కదలికకు దోహదపడతాయి. ఇవి మలవిసర్జన సాఫీగా జరిగేలా చేస్తాయి. మలబద్ధకంతో బాధపడేవారికి నీటిలో కరగని పీచుపదార్థాలు చాలా ఉపయోగపడతాయి. పొట్టుతో కూడిన ధాన్యాలు, గింజలు, బీన్స్, క్యాలీఫ్లవర్, బంగాళదుంపలు వంటి కూరగాయల్లో నీటిలో కరగని పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఓట్స్, బీన్స్ వంటి శాకాహార పదార్థాల్లో రెండురకాల పీచుపదార్థాలూ ఉంటాయి. శరీరానికి పీచుపదార్థాలు పుష్కలంగా అందాలంటే రకరకాల శాకాహార పదార్థాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. పులిసి మెలిసి... ఆహారంలో కలిసిమెలిసి పేగుల్లో ప్రయాణించే కొన్నిరకాల పీచుపదార్థాలు జీర్ణకోశంలోని బ్యాక్టీరియా ప్రభావంతో పులుస్తాయి. ఇలాంటి పులిసే పీచుపదార్థాలు ఎక్కువగా పళ్లు, కూరగాయలు, గింజలు, ఓట్స్ వంటి పదార్థాల్లో ఉంటాయి. పులిసే పీచుపదార్థాలు జీర్ణకోశంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను కాపాడతాయి. ఇవి ఆరోగ్యకరమైన కొలెస్టరాల్ స్థాయిని కాపాడటంతో పాటు రక్తంలో గ్లూకోజ్ పరిమాణం నిలకడగా ఉండేలా దోహదపడతాయి. వీటికి భిన్నంగా గోధుమలు, ఓట్స్, బార్లీ వంటి పొట్టుధాన్యాల్లో ఉండే పీచుపదార్థాలు పెద్దగా పులవవు. అయితే, ఇవి మలబద్ధకాన్ని నివారించడానికి గణనీయంగా దోహదపడతాయి. రెసిస్టెంట్ స్టార్చ్ రెసిస్టెంట్ స్టార్చ్... ఇది దాదాపు పిండిపదార్థం. దీనిని పూర్తిస్థాయి పీచుపదార్థంగా పరిగణించరు. అయినా, ఇది కూడా పీచుపదార్థం తరహాలోనే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు దోహదపడుతుంది. పొట్టుధాన్యాలు, గింజలు, అరటికాయలు, బంగాళదుంపలు, పప్పులలో రెసిస్టెంట్ స్టార్చ్ పుష్కలంగా ఉంటుంది. రెసిస్టెంట్ స్టార్చ్ జీర్ణకోశంలో ఉండే బ్యాక్టీరియా ప్రభావం వల్ల ఫ్యాటీయాసిడ్స్‌గా మారుతుంది. ఈ ఫ్యాటీయాసిడ్స్ రక్తంలో కలిసి, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఇదీ మేలు పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా కాపాడుకోవచ్చు. కొలోన్ కేన్సర్ వంటివి రాకుండా చూసుకోవచ్చు. పులిసేరకానికి చెందిన పీచుపదార్థాలు రక్తంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. వీటివల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నీటిలో కరగని పీచుపదార్థాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని అదుపు చేస్తాయి. ఫలితంగా టైప్-2 డయాబెటిస్ సోకే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తాయి. పీచుపదార్థాలను పుష్కలంగా తీసుకుంటే, త్వరగా కడుపు నిండినట్లవుతుంది. చాలాసేపటి వరకు ఆకలి వేయదు. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటే, శరీరంలో అనవసరపు కొవ్వుచేరే అవకాశాలు దాదాపు ఉండవు. పీచు ప్రణాళిక చాలాకాలంగా పీచుపదార్థాలు దాదాపు లేని ఆహారం తినేవాళ్లు అకస్మాత్తుగా ఒకేసారి పుష్కలంగా పీచుపదార్థాలతో కూడిన ఆహారం తినడం ప్రారంభిస్తే, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అందువల్ల అలాంటి వాళ్లు తమ ఆహారంలో పీచుపదార్థాల మోతాదును పెంచుకుంటూ పోవాలి. రోజుకు ఐదుగ్రాముల పీచుపదార్థాలు అదనంగా అందేలా, ప్రతిరోజూ పెంచుకుంటూ పోతే, వారం రోజుల్లోగా తగినన్ని పీచుపదార్థాలు ఆహారం ద్వారా తీసుకోవడం అలవాటవుతుంది. పీచు పదార్థాలను సప్లిమెంట్ల ద్వారా తీసుకునే బదులు సహజసిద్ధమైన ఆహార పదార్థాల ద్వారానే తీసుకోవడం మంచిది. సగటున రోజుకు పాతిక గ్రాముల పీచుపదార్థాలు అందేలా చూసుకోవాలంటే, ఇలాంటి ఆహార ప్రణాళికను అనుసరిస్తే చాలు... ఉదయం చిరుధాన్యాలతో కూడిన అల్పాహారం, ఏదైనా ఒక పండు 5 గ్రాములు మధ్యాహ్నం మల్టీగ్రెయిన్ చపాతీ, బ్రౌన్‌రైస్,ఆకుకూరలు, కూరగాయలతో 5 గ్రాములు సాయంత్రం మొలకెత్తిన గింజలు, ఉడికించిన రాజ్మా, శనగలు వంటివి, వెజిటబుల్ సలాడ్ 5 గ్రాములు రాత్రి మల్టీగ్రెయిన్ చపాతీ, ఆకుకూరలు, కూరగాయలతో... 5 గ్రాములు ఏవైనా పళ్ల ముక్కలు ఒక కప్పు లేదా ఫ్రూట్సలాడ్ 5 గ్రాములు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజల్లో 7 గ్రాముల వరకు పీచు పదార్థాలు ఉంటాయి. రోజువారీ ఆహారంలో పీచుపదార్థాలు తగ్గినట్లయితే, అవిసెగింజలను తీసుకోవచ్చు. వీటిని నేరుగా లేదా మజ్జిగతో కలిపి తీసుకోవచ్చు. పీచు ఫ్యాక్ట్స్ మాంసాహారంతో పోల్చితే శాకాహారంలో పీచు ఎక్కువ. కొన్ని ప్రత్యేక చికిత్సలలో తప్పించి, పీచును ఆహారం ద్వారా మాత్రమే పొందాలి. ఆరోగ్యరక్షణకు తోడ్పడే గ్జెనో బయాటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లు, సైటో ఈస్ట్రోజన్లు పీచునుండి లభిస్తాయి. ఫైబర్ టిప్స్ భోజనం చేశాక ఏదైనా ఒక పండు తినండి. తొక్కతోపాటు తినగలిగే పండు ఏదైనా దానిని తొక్కతో పాటే తినండి. ఆహారంలో కూరగాయలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. ఒకే రకం ఆకుకూరలు, కాయగూరలు కాకుండా వేర్వేరు రకాలు, పండ్లు తీసుకోండి. హోల్‌మీల్, మల్టీగ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్ అలవాటు చేసుకోండి. - సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: సుజాతా స్టీఫెన్, సీనియర్ న్యూట్రిషనిస్ట్, మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్ -
ప్రొటీన్ కండరగండ
రొటీన్‌గా తింటే ఏమవుతది? ఒళ్లే ఒక గుదిబండ! ప్రొటీన్‌గా తింటే ఏమొస్తది? ఒంటికి నిండైన కండ! అసలు కండలేకుండా ఏమీ చేయలేం. అందుకే కండ రావాలంటే ఏం చేయాలో చెప్తున్నాం. ఎలాంటి ప్రొటీన్ తినాలి? ఆ ప్రొటీన్లు ఎక్కడ దొరుకుతాయి? ఏ వయసులో ఎంత తినాలి? ఎప్పుడు తినాలి? మగాళ్లకు ఎంత అవసరం? మా బంగారు తల్లులకు ఎంత సమకూరాలి? చిన్నారులు ఎంత మింగాలి? ప్రొటీన్ ఎలా వండితే మంచిది? ఎలా వండితే చెడిపోతుంది? ఇవీ... ఇంకెన్నో ప్రొటీన్ విషయాలు. చదవండి.. వండండి.. తినండి.. తరించండి.. పాడుకోండి.. ‘గండర గండా సొగ్గాడివంటా... కండలు తిరిగిన కండరగండవంటా...’ ప్రధాన పోషకాల్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్‌తో పాటు ముఖ్యమైన మూడోది.. ప్రొటీన్స్. శరీరం ఎదుగుదలకు కీలకమైనది. బాడీలో నీటి తర్వాత ఉండేవన్నీ ప్రొటీన్లే. ఇవి కండర నిర్మాణానికి తోడ్పడతాయి. వెంట్రుకలు, చర్మం, కళ్లు లాంటివి కూడా వీటితో తయారైనవే. అసలు శరీరంలోని ప్రతి కణమూ ఓ ప్రొటీన్‌ను కలిగి ఉంటుంది. ఒక భవన నిర్మాణంలో ఇటుకలు ఎంత కీలకమైనవో, శరీర నిర్మాణంలో ప్రొటీన్లు అంతే కీలకమైనవి. శరీరం తన జీవక్రియలను సమర్థంగా నిర్వహించేట్టు చేసే ఎంజైమ్, హర్మోన్ల రూపకల్పనలో ప్రధాన పాత్ర ప్రొటీన్లదే. రక్తకణాల ఉత్పత్తిలోను, యాంటీబాడీస్ తయారీలోనూ ఇవే కీలకం. ఇవి రోగనిరోధక శక్తి తగ్గిపోకుండా చూస్తాయి. మన ఆహారం ద్వారా ప్రొటీన్లు అందకపోతే శరీరం నుంచి గ్రహించడానికి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్లాగా ఇవి శరీరంలో నిల్వ ఉండవు. ఎప్పటికప్పుడు ఆహారం ద్వారా వీటిని తీసుకోవాల్సిందే. అమినో ఆసిడ్స్ ప్రొటీన్లు తయారయ్యేది అమినో ఆసిడ్స్ నుంచే. ఇవి ఇరవై రెండు రకాలు. వీటిలో కొన్ని మన శరీరంలోనే తయారవుతాయి. అయితే కనీసం ఎనిమిది నుంచి పది రకాల అమినో ఆసిడ్స్ కచ్చితంగా మనం ఆహారం ద్వారా తీసుకోవాల్సిందే. అన్ని రకాల అమినో ఆసిడ్స్ ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్‌ను కలిగి ఉంటాయి. కొన్ని అదనంగా సల్ఫర్నూ కలిగి ఉంటాయి. ప్రొటీన్లు కదిలే ప్రాణుల్లో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా జంతు మాంసంలో (చికెన్, రెడ్ మీట్ వగైరా). మొక్కల్లోనూ ఉంటాయి కానీ వీటిలో షుగర్స్, కార్బోహైడ్రేట్స్‌తో కలిసి ఉంటాయి. హై ప్రొటీన్ డైట్‌తో లాభాలు - శారీరక శ్రమ వల్ల కోల్పోయిన శక్తిని వెంటనే భర్తీ చేస్తాయి. - కండరాలు బలహీనమవకుండా కాపాడుతాయి. - బలహీనంగా ఉన్న కండరాలను శక్తిమంతం చేస్తాయి. - ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూస్తాయి. - ఆకలికి కళ్లెం వేస్తాయి. అంతేకాదు శాషియేషన్ (భోజనం చేశామన్న తృప్తిని) పెంచుతాయి. దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ప్రొటీన్ల పని శరీరంలో ఉండే ప్రొటీన్లు కొన్ని, ఆహారం ద్వారా తీసుకునే ప్రొటీన్లు కొన్ని అని చెప్పుకున్నాం కదా! శరీరంలో ఉండే ప్రొటీన్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. శరీరంలోని ఇన్సులిన్, ప్రొజెస్టిరాన్ వంటి హర్మోన్స్ అన్నీ ప్రొటీన్లే. హెమోగ్లోబిన్ అనే బ్లడ్ ప్రొటీన్ రక్తకణాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. శరీరం ఒత్తిడికి గురైతే కొన్ని కణాలు ధ్వంసమవుతాయి. వాటిని పునర్నిర్మించడంలో ‘హీట్ షాక్ ’ అనే ప్రొటీన్ దోహదపడుతుంది. అలాగే ట్రాన్స్ఫెర్రిన్, మెటల్లోథియోనైన్, సరులోప్లాస్మిన్ వంటి ప్రొటీన్స్... మినరల్స్ వంటి పోషకాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి వాటిని శరీరభాగాలన్నిటికీ చేరవేస్తాయి. ఇలా ప్రొటీన్స్ శరీరంలో ప్రధాన రవాణాదారుగా పనిచేస్తాయి. కదలికలకు.. కొన్ని ప్రొటీన్స్ రవాణా బాధ్యతను మోస్తున్నట్టే మయోగ్లోబిన్ అనే ప్రొటీన్ మన శరీర కదలికలకు దోహదపడుతుంది. జెనెటిక్ ఇన్ఫర్మేషన్... ఆర్ఎన్ఏ (రైబోన్యూక్లిక్ ఆసిడ్), డీఎన్ఏ (డై ఆక్సీ రైబోన్యూక్లిక్ ఆసిడ్) ప్రొటీన్లు ఎంత కీలకమైనవో చెప్పక్కర్లేదు. జీవ ప్రక్రియలు, శరీర నిర్మాణ తీరుతెన్నులన్నీ జీవ సాంకేతిక రూపంలో వీటిలోనే నిబిడీకృతమై ఉంటాయి. బాడీ స్ట్రక్చర్కి... ఎముకల్లో మేట్రిక్స్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది ఎముకలకు కావల్సిన కాల్షియం, మినరల్స్‌తో నిండి ఉంటుంది. ఇక కెరోటిన్, కొలాజెన్, కార్టిలేజ్, ఎలాస్టిన్ వంటి ప్రొటీన్లు చర్మం, ఇతర నిర్మాణాల్లో కీలకంగా ఉంటాయి. ముఖ్యంగా కెరోటిన్ - జుట్టుకు, గోళ్లకు చాలా మంచిది. కేసిన్,కొలాజిన్, గుడ్డులో దొరికే అల్బుమిన్, గ్లోబ్లిన్, గ్లైడిన్, గ్లుటెన్, బాదంపప్పులోని ప్రొటీన్లు చర్మసౌందర్యానికి ఉపయోగపడ్తాయి. పాలల్లోని ‘వే’ప్రొటీన్ కండర పటుత్వాన్నిస్తుంది. ఎంజైములు: ఎంజైములన్నీ ప్రొటీన్లే. శరీరంలో జరిగే ప్రతి రసాయన చర్యకు వేలరకాల ఎంజైమ్సే కారణం. ఇంధనంగా మార్చేది: మనకు కావల్సిన శక్తిని కార్బోహైడ్రేట్సే కాదు, ప్రొటీన్సూ ఇస్తాయి. శరీరంలోని షుగర్ లేదా ఫ్యాట్‌ని ఇవి శక్తిగా మారుస్తాయి. పూర్తి ప్రొటీన్ ఆహారం: మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు, చేపలు, గుడ్లు, చీజ్, పెరుగు, సోయా, వేరుశనగలు కలిసిన ఆహారాన్ని పూర్తి ప్రొటీన్ ఆహారంగా పరిగణిస్తారు. ప్రొటీన్ల ప్రాధాన్యం - కార్బోహైడ్రేట్స్‌తో పోల్చుకుంటే ప్రొటీన్స్ తర్వగా జీర్ణం కావు. చాలా సమయం తీసుకుంటాయి. దీనివల్ల త్వరగా ఆకలి వేయదు. దాంతో ఎక్కువ కాలరీలు తీసుకునే ఛాన్స్ ఉండదు. అధిక బరువు సమస్యా రాదు. ప్రొటీన్లు దొరికే ఆహారం.. - చేపలు... వీటిలో గుండెను కాపాడే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలం. - పౌల్ట్రీ.. స్కిన్లెస్ చికెన్ తినడం వల్ల ప్రొటీన్స్‌ని పొందడంతో పాటు సాచ్యురేటెడ్ ఫ్యాట్స్కీ దూరంగా ఉండొచ్చు. - బీన్స్... బీన్స్‌లో దొరికినన్ని ప్రొటీన్లు ఇంకే కూరగాయల్లోనూ దొరకవు. - నట్స్ .. ఒక ఔన్స్ బాదంపప్పు దాదాపు 6 గ్రాముల ప్రొటీన్స్ ఇస్తుంది. - పొట్టు ధాన్యాలు... పొట్టు గోధుమ పిండితో తయారైన ఒక్క బ్రెడ్ స్లయిస్ 3 గ్రాముల ప్రొటీన్స్ నిస్తుంది. దీంతో పాటు ఫైబర్ అదనం. ఆహారం ద్వారా దొరికే ప్రొటీన్లు... వివిధ ఆహారపదార్థాల్లో దొరికే ప్రొటీన్ల శాతాన్ని బట్టి వీటిని మూడు గ్రూపులుగా విభజించారు. - అధిక ప్రొటీన్లున్న ఆహారపదార్థాలు.. మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు, చేపలు, గుడ్లు, నట్స్, సీడ్స్, చీజ్, పెరుగు, బీన్స్, గోధుమ మొలకలు మొదలైనవి. వీటిల్లో 20 శాతం కంటే ఎక్కువ ప్రొటీన్లు లభ్యమవుతాయి. - పొటీన్లు మధ్యస్థంగా ఉండే ఆహారం.. బియ్యం, గోధుమలు, ఓట్స్, జొన్నలు, బార్లీ గింజలు మొదలైనవి. వీటిల్లో 6 నుంచి 14 శాతం ప్రొటీన్లు దొరుకుతాయి. వీటిని అసంపూర్ణ ప్రొటీన్లు (ఇన్‌కంప్లీట్ ప్రొటీన్లు) అంటారు. ఇవి మరో ప్రొటీన్ ఆహారంతో మిళితమై పూర్తి ప్రొటీన్లుగా శరీరానికి కావల్సిన పోషకాలను అందిస్తాయి. - తక్కువ ప్రొటీన్ ఆహారం.. పండ్లు, కూరగాయలు, జ్యూసుల్లో ఐదుశాతం కంటే తక్కువ ప్రొటీన్లు ఉంటాయి. అసంపూర్ణ ప్రొటీన్ ఆహారం... కుందేలు మాంసం, రకరకాల ధాన్యాలు, బీన్స్, నట్స్, గింజలు వంటివి అసంపూర్ణ ప్రొటీన్లు. పూర్తి ప్రొటీన్ ఫుడ్‌ని తీసుకోలేని వాళ్లు కనీసం తక్కువ ప్రొటీన్లు ఉన్న ఆహారమైనా తీసుకోవాలి. దీనివల్ల శరీరానికి కావల్సిన అమినో ఆసిడ్స్ అందుతాయి. లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. హయ్యర్ రేటింగ్ బయోలాజికల్ క్వాలిటీ ప్రొటీన్లు ఎగ్ ప్రొటీన్ .. హయ్యర్ రేటింగ్ బయోలాజికల్ క్వాలిటీ కలిగి ఉంటుంది. దీని తర్వాతి స్థానం మాంసంలోని ప్రొటీన్‌దే. శాకాహారంలో కినోవా, సోయా, హెంప్సీడ్స్లో ప్రొటీన్లు హయ్యర్ రేటింగ్ బయోలాజికల్ క్వాలిటీ కలిగి ఉంటాయి. హెంప్‌ను అమెరికన్లు ఎక్కువగా తింటారు. ఇందులో ఫ్యాట్ ఉండదు. శాకాహారులు సోయా, కినోవాతో యానిమల్ ప్రొటీన్లను రీప్లేస్ చేసుకోవాలి. ఇతర ధాన్యాలు, రాజ్మా, శనగల్లో కూడా ప్రొటీన్లు దొరుకుతాయి. ఇన్పుట్స్: సుజాతా స్టీఫెన్,చీఫ్ న్యూట్రీషనిస్ట్ మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్, మాదాపూర్ అపోహ: ఎక్కువ మోతాదులో ప్రొటీన్స్ తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి! వాస్తవం: మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు ఇన్‌కంప్లీట్ ప్రొటీన్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు విపరీతమైన శ్రమకు గురవుతాయి. కాబట్టి కంప్లీట్ ప్రొటీన్స్నే తీసుకోవాలి. కిడ్నీ ఫెయిల్యూర్ వివిధ దశల్లో ఉన్న పేషంట్లు డాక్టర్లు సూచించిన ప్రొటీన్ ఫుడ్‌నే తీసుకోవాలి. -
ఆ కొవ్వులు మంచివే..!
కొత్త పరిశోధన వయసు మళ్లిన వాళ్లకు శాకాహార నూనెలు, చేపనూనెల్లోని కొవ్వులు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. శాకాహార నూనెలు, చేప నూనెల్లోని మేలు చేసే కొవ్వు పదార్థాలు గుండెజబ్బులు, పక్షవాతం, అధిక రక్తపోటు బారి నుంచి కాపాడతాయని, ఫలితంగా ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించేందుకు దోహదపడతాయని స్వీడన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అరవయ్యేళ్లకు పైబడిన వయసు గల నాలుగువేల మందిపై జరిపిన పరిశోధనల్లో శాకాహార నూనెలు, చేప నూనెల్లోని పాలీ అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని తేలినట్లు స్వీడన్‌లోని ఉప్సలా వర్సిటీ నిపుణుడు డాక్టర్ అల్ఫ్ రైజరస్ చెబుతు న్నారు. సాధారణంగా వయసు మళ్లిన వారి ఆహారంలో 25-30 శాతం కంటే అధికంగా కొవ్వు పదార్థాలు ఉండవని, ఈ కొవ్వులు మేలైన పదార్థాల నుంచి వచ్చినవిగా చూసుకుంటే చాలని ఆయన అంటున్నారు. -
రసాయనికంగా సబ్బులు అనేవి..?
1. కార్బోహైడ్రేట్లు అనేవి? 1) మాంసకృత్తులు 2) పిండి పదార్థాలు 3) కొవ్వులు 4) విటమిన్లు 2. మానవ శరీరంలో ఉండే మాంసకృత్తులు? 1) కార్బోహైడ్రేట్లు 2) లిపిడ్లు 3) ప్రోటీన్లు 4) విటమిన్లు 3. సాధారణ కార్బొహైడ్రేట్ల నిర్మాణంలో ఉండని మూలకమేది? 1) హైడ్రోజన్ 2) కార్బన్ 3) ఆక్సిజన్ 4) నైట్రోజన్ 4. {పోటీన్ల నిర్మాణంలో అవసరమైన మూలకాలేవి? 1) హైడ్రోజన్, కార్బన్ మాత్రమే 2) కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మాత్రమే 3) కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ మాత్రమే 4) కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ 5. కిందివాటిలో ప్రోటీన్లు ప్రధానంగా లేని పదార్థం ఏది? 1) గోళ్లు 2) వెంట్రుకలు 3) మాంసం 4) బియ్యం 6. టేబుల్ షుగర్ రసాయన నామం? 1) సుక్రోజ్ 2) గ్లూకోజ్ 3) ఫ్రక్టోజ్ 4) మాల్టోజ్ 7. పాలలోని చక్కెర ఏది? 1) గ్లూకోజ్ 2) సుక్రోజ్ 3) ఫ్రక్టోజ్ 4) లాక్టోజ్ 8. తేనెలో ఉండే కార్బొహైడ్రేట్? 1) ఫ్రక్టోజ్ 2) గ్లూకోజ్ 3) లాక్టోజ్ 4) మాల్టోజ్ 9. మొలాసిస్ నుంచి ఆల్కహాల్ తయారు చేసే ప్రక్రియ? 1) డయాలసిస్ 2) కిణ్వప్రక్రియ (ఫెర్మెంటేషన్) 3) కిరణజన్యసంయోగక్రియ (ఫొటోసింథసిస్) 4) లాక్టైజేషన్ 10. {పోటీన్లలో ఉండే ప్రత్యేక బంధం ’–CO–NH–’ ను ఏమంటారు? 1) ఎస్టర్ బంధం 2) ఈథర్ బంధం 3) ఎమైడ్ బంధం 4) పాలిఎమైడ్ 11. పాలిఎమైడ్‌లు అనేవి? 1) లిపిడ్లు 2) ప్రోటీన్లు 3) కార్బోహైడ్రేట్లు 4) విటమిన్లు 12. హీమోగ్లోబిన్‌లో ప్రధానంగా ఉండేవి? 1) లిపిడ్ కణాలు 2) ప్రోటీన్ కణాలు 3) కార్బోహైడ్రేట్లు 4) విటమిన్లు 13. గుండెజబ్బులకు ప్రధాన కారణమైన కొలె స్టిరాల్ అనేది ఒక? 1) లిపిడ్ 2) విటమిన్ 3) చక్కెర 4) ప్రోటీన్ 14. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వ్యాధిగ్రస్థుల చికిత్సకు సంబంధించిన ప్రక్రియ? 1) ఫెర్మెంటేషన్ 2) లాక్టేషన్ 3) డయాలసిస్ 4) ఆస్మాసిస్ 15. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్ల ఆహా రంలో ఏవి తక్కువ మోతాదులో ఉండాలి? 1) ప్రోటీన్లు 2) లిపిడ్లు 3) విటమిన్లు 4) కొర్బోహైడ్రేట్లు 16. నూనెలను ‘డాల్డా’ లాంటి కొవ్వులుగా మా ర్చే ప్రక్రియ? 1) హైడ్రోజనీకరణం 2) హైడ్రాలిసిస్ 3) ఎస్టరిఫికేషన్ 4) ఫెర్మెంటేషన్ 17. సబ్బుల పరిశ్రమల్లో సహ ఉత్పన్నం ఏది? 1) గ్లిజరాల్ 2) గ్లైకాల్ 3) ఇథైల్ ఆల్కహాల్ 4) అసిటోన్ 18. సోడియం హైడ్రాక్సైడ్ లాంటి క్షారంతో వేటిని మరిగిస్తే సపోనిఫికేషన్ జరిగి సబ్బు ఏర్పడుతుంది? 1) నూనెలు (లిపిడ్లు) 2) కార్బోహైడ్రేట్లు 3) ప్రోటీన్లు 4) ఆల్కహాల్‌లు 19. మాయిశ్చరైజింగ్ సోప్‌లలో ఉండేది? 1) ఇథైల్ ఆల్కహాల్ 2) గ్లిజరాల్ 3) మిథైల్ ఆల్కహాల్ 4) ఆస్కార్బికామ్లం 20. నిమ్మజాతి పండ్లలో ఉండే విటమిన్-సికి మరో పేరు? 1) ఎ 2) బి 3) సి 4) డి 21. మొలకెత్తిన ధాన్యాల్లో అభివృద్ధి చెందే ప్రధాన విటమిన్ ఏది? 1) ఎ 2) బి 3) సి 4) ఇ 22. నీటిలో కరిగే విటమిన్లేవి? 1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే 3) సి, డి మాత్రమే 4) అన్ని విటమిన్లు నీటిలో కరుగుతాయి 23. ఆవుపాలు పసుపురంగులో ఉండటానికి కారణమైన విటమిన్? 1) పిరిడాక్సిన్ (B6) 2) రైబోఫ్లోవిన్ (B2) 3) థయమిన్ (B1) 4)సైనకోబాలమిన్ (B12) 24. ఏ విటమిన్ లోపిస్తే వ్యంధ్యత్వం వస్తుంది? 1) ఎ 2) బి 3) సి 4) ఇ 25. కోబాల్ట్ లోహ అయాన్ ఉండే విటమిన్ ఏది? 1) B1 2) B2 3) B12 4) B6 26. జతపరచండి. విటమిన్ లోపిస్తే వచ్చే వ్యాధి ఎ) B1 1) రికెట్స్ బి) B12 2) స్కర్వీ సి) C 3) రేచీకటి డి) D 4) బెరిబెరి 5) రక్తహీనత ఎ బి సి డి 1) 1 2 3 4 2) 2 3 4 5 3) 4 5 2 1 4) 5 4 1 2 27. గర్భిణీలకు ఇచ్చే విటమిన్ ఏది? 1) థయమిన్ 2) పిరిడాక్సిన్ 3) ఫోలికామ్లం 4) రైబోఫ్లోవిన్ 28. బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేస్తే ఏ విటమిన్ లోపిస్తుంది? 1) బి 2) సి 3) ఎ 4) డి 29. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏది? 1) ఇన్సులిన్ 2) ఈస్ట్రోజన్ 3) ప్రొజెస్టిరాన్ 4) ఏదీకాదు 30. ఎదుగుదలకు దోహదం చేసే హార్మోన్ ఏది? 1) ఇన్సులిన్ 2) థైరాక్సిన్ 3) ఈస్ట్రోజన్ 4) ప్రొజెస్టిరాన్ 31. అత్యల్ప ఆల్కహాల్ ఉండేది? 1) వైన్ 2) బీర్ 3) వోడ్కా 4) విస్కీ 32. వాహనాలు నడవడానికి పెట్రోల్‌తో పాటు దేన్ని కలుపుతున్నారు? 1) ఇథనాల్ 2) మిథనాల్ 3) గ్లిజరాల్ 4) గ్లైకాల్ 33. రసాయనికంగా సబ్బులు అనేవి? 1) ఫాటీ ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణాలు 2) ఫాటీ ఆమ్లాల సల్ఫోనేట్ లవణాలు 3) గ్లిజరాల్, బై కార్బొనేట్ల మిశ్రమాలు 4) ఏదీకాదు 34. కిందివాటిలో ఏవి డిటర్జెంట్లు? ఎ. ఆల్కైల్ బెంజీన్ సల్ఫొనేట్లు బి. భార ఆల్కహాల్‌ల సల్ఫోనేట్ లవణాలు సి. భార ఫాటీ ఆమ్లాల సోడియం లవణాలు 1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే 3) ఎ, సి మాత్రమే 4) ఎ, బి, సి 35. కార్ రేడియేటర్లలో శీతలీకారిణి (యాంటీ- ఫ్రీజ్)గా దేన్ని ఉపయోగిస్తారు? 1) టెట్రాఇథైల్ లెడ్ 2) ఇథిలీన్ గ్లైకాల్ 3) గ్లిజరాల్ 4) ఇథైల్ ఆల్కహాల్ 36. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే ఇథనాల్‌కు తాగడానికి పనికిరాకుండా ఉండటానికి కలిపే పదార్థం? 1) మిథనాల్ 2) ఎసిటోన్ 3) బెంజీన్ 4) క్లోరోఫాం 37. గాయాలు త్వరగా మానడానికి అవసర మైన విటమిన్ ఏది? 1) ఎ 2) బి 3) సి 4) డి 38. కెఫీన్ అనే డ్రగ్ ఎందులో ఉంటుంది? 1) కాఫీ 2) టీ 3) కోలా శీతల పానీయాలు 4) పైవన్నీ 39. సిగరెట్లో ఉండే డ్రగ్ ఏది? 1) కెఫీన్ 2) టేనిన్ 3) నికోటిన్ 4) వెనిలా 40. సొరచేప కాలేయం నుంచి తీసే నూనె ద్వారా లభించే విటమిన్? 1) ఎ 2) బి 3) సి 4) ఇ 41. ఆల్కహాల్ అధికంగా సేవించే వారిలో ఏ అవయవం పాడవుతుంది? 1) ఊపిరితిత్తులు 2) కాలేయం 3) కిడ్నీ 4) మూత్రనాళం 42. నూనెల హైడ్రోజనీకరణం గురించి సరికాని వాక్యం ఏది? 1) నూనెల హైడ్రోజనీకరణంలో ూజీ లో హాన్ని ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు 2) నూనెలను హైడ్రోజనీకరణం చేస్తే కొవ్వులు లభిస్తాయి 3) ఈ ప్రక్రియ వల్ల రుచి, వాసన పెరు గుతాయి 4) నూనెల హైడ్రోజనీకరణం వల్ల వచ్చే కొ వ్వులు తక్కువ కాలం నిల్వ ఉంటాయి 43. కఠిన జలంలోనూ డిటర్జెంటులు బాగా ఉపయోగపడటానికి కారణమేమిటి? 1) అవి నీటిలోని అయాన్లను తొలగిస్తాయి 2) అవి కఠినజల అయాన్లతో చర్య నొందవు 3) అవి కఠినజల అయాన్లతో చర్య నొందినప్పటికీ అవక్షేపించవు 4) అవి కఠినజల అయాన్లతో చర్యనొంది అవక్షేపిస్తాయి 44. రక్తం త్వరగా గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్? 1) ఎ 2) బి 3) సి 4) కె 45. ఏ విటమిన్ లోపం వల్ల మగవారిలో బీజాభివృద్ధి సరిగా లేకపోవడం, స్త్రీలలో త రచూ గర్భస్రావం లాంటివి కలుగుతాయి? 1) ఇ 2) బి 3) సి 4) డి 46. సూర్యరశ్మి సమక్షంలో శరీరంలో తయా రయ్యే విటమిన్? 1) ఎ 2) బి 3) ఇ 4) డి 47. కిందివాటిలో సరికాని జత ఏది? 1) కార్బోహైడ్రేటులు - శక్తి 2) ప్రోటీన్లు - పెరుగుదల 3) విటమిన్లు - వ్యాధి నిరోధకత 4) కొవ్వులు - పెరుగుదల 48. మూత్రపిండాలు సరిగా పనిచేయనివారి మూత్రంలో ఎక్కువ పరిమాణంలో కని పించేది? 1) చక్కెర 2) క్రియాటినిన్ 3) ప్రోటీన్ 4) కొవ్వు 49. పండ్లలో చక్కెర ఏ రూపంలో ఉంటుంది? 1) సుక్రోస్ 2) గ్లూకోజ్ 3) ఫ్రక్టోజ్ 4) లాక్టోస్ 50. ముతక బియ్యం (పాలీష్ చేయని బియ్యం) ఉపయోగించి చేసే ఇడ్లీలో పుష్కలంగా లభించే విటమిన్ ఏది? 1) అ 2) ఆ12 3) ఇ 4) ఉ 51. డయాబెటీస్ వ్యాధిగ్రస్థుల మూత్రంలో ఎక్కువ పరిమాణంలో కనిపించే షుగర్ ఏది? 1) సుక్రోజ్ 2) ఫ్రక్టోజ్ 3) గ్లూకోజ్ 4) లాక్టోజ్ సమాధానాలు 1) 2 2) 3 3) 4 4) 4 5) 4 6) 1 7) 4 8) 1 9) 2 10) 3 11) 2 12) 2 13) 1 14) 3 15) 1 16) 1 17) 1 18) 1 19) 2 20) 3 21) 4 22) 2 23) 2 24) 4 25) 3 26) 3 27) 3 28) 1 29) 1 30) 2 31) 2 32) 1 33) 1 34) 1 35) 2 36) 1 37) 3 38) 4 39) 3 40) 1 41) 2 42) 4 43) 3 44) 4 45) 1 46) 4 47) 4 48) 2 49) 3 50) 2 51) 3