మధుమేహుల్లో ‘మతి’మరుపు
రక్తప్రసరణపై ప్రభావం చూపుతున్న వైనం
అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు
నానాటికి పెరుగుతున్న మతిమరుపు బాధితులు
అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన జగదీశ్ అనే వ్యక్తి బెంగళూరులో కార్పొరేట్ కంపెనీలో ఉన్నతమైన హోదా ఉద్యోగం చేస్తున్నారు. మంచి జీతంతో జీవనం సాఫీగా గడిచిపోతోంది. అయితే ఇటీవల హెడ్ ఆఫీసుకు పంపాల్సిన ముఖ్యమైన మెయిల్స్, వివరాలు పంపకపోవడం , ముఖ్యమైన సమావేశాల తేదీలను గుర్తుపెట్టుకోవడంలేదు. దీంతో ఆయన మీటింగ్‌లకు సైతం వెళ్లలేని పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తయితే తాను చెప్పిన మాటలు మరిచిపోయి, తోటి ఉద్యోగులతో గొడవలు పడుతుండటంతో సంస్థ నుంచి మోమోలు జారీ అయ్యాయి. దీంతో కంగుతిన్న ఆయన వెంటనే మానసిక వైద్యుడిని సంప్రదించారు. కొన్నేళ్లుగా ఆయన మధుమేహం మందులు సరిగా వాడకపోవడంతో వ్యాధి పూర్తిగా అదుపులేని కారణంగా మతిమరుపు వచ్చినట్లు డాక్టరు తెలిపారు.
జ్ఞాపకాలే మనిషి జీవనానికి ప్రాణం..మనల్ని నడిపించేవి ఆ జ్ఞాపకాలే.. అవే తుడిచిపెట్టుకుపోతే? అప్పుడే చేసిన పని గుర్తు లేకపోతే? కన్నబిడ్డల్ని సైతం పోల్చుకోకపోతే ? అసలు మనెవరో మనకే ఎరుకలేకపోతే? ఆ జీవితం ఎంత దుర్భరమో ఊహించుకోవడమే కష్టం. మతిమరుపు (డిమోన్నియా) రుగ్మతతో బాధపడే వారి పరిస్థితి ఇదే. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారి వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది.. – రాజంపేట
ఇలా ఒక్క జగదీశ్ మాత్రమే కాదు.. చాలామంది మధుమేహంతో బాధపడేవారు తాము మందులు వేసుకున్నా వేసుకోలేదని మళ్లీ వేసుకోవడం, లేకుంటే అసలే వేసుకోకపోవడం, వేసుకున్నట్లుగానే భావించడం వంటివి చేస్తున్నట్లు వైద్యుల తేలింది. ఇందుకు మతిమరుపే కారణమంటున్నారు. ఇప్పుడు మధుమేహుల్లో మతిమరుపు సమస్య ప్రధానంగా మారింది. ఇది జన్మతః వచ్చింది కాదు..కొన్నేళ్లుగా డయాబెటీస్ అదుపులో లేకపోవడంతో వచ్చిన సమస్య. ఈ ప్రభావం మందుల వాడకంపై చూపడంతో శరీరంలో షుగర్ లెవల్స్ పెరగడం, ఒక్కసారిగా తగ్గిపోవడం వంటివి చోటుచేసుకుంటూ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహం సోకి పదేళ్లు దాటితే..
మధుమేహం సోకి పదేళ్లు దాటిన వారిలో మతిమరుపు సమస్య ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో షుగర్ లెవల్స్ అదుపులో లేనివారికి ఐదేళ్లకి సమస్య వస్తున్నట్లు నిర్ధారించారు. మధుమేహులలో ఐదుశాతం మందిలో ఈ సమస్య ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది.
మధ్యవయసు్కల్లో లక్షణాలు పెనుముప్పు
ఒకప్పుడు 45 ఏళ్లు దాటిన వారిలో షుగర్ లక్షణాలు కనిపించేవి. ప్రస్తుతం ఇరవై..ముప్‌పై సంవత్సరాల వయస్సు వారు కూడా మధుమేహం బారిన పడుతున్నారు. దీంతో కొందరు సరిగ్గా మందులు వాడని పరిస్థితి నెలకొంది. అలాంటి వారిలో వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్యలో గుండెపోటు, మెదడుపోటుతోపాటు మతిమరుపు సమస్యలు వస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. పనిచేసే వయస్సులో ఇలాంటి సమస్యలు తలెత్తడం సమాజంపై పెనుముప్పుగా మారుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మతిమరుపు కారణంగానే..
మధుమేహం ఉన్న వారిలో మెదడుకు మళ్లీ మైక్రోవాస్క్యులర్ రక్తనాళాలు సన్నబడటంతో రక్తప్రసరణ తగ్గుతుంది. దీంతో మెదడుకు సరైన రక్తప్రసరణ జరగకపోవడటంతో మతిమరుపు వస్నున్నట్లు వైద్యులు అంటున్నారు. అంతేగాకుండా శరీరంలో షుగర్ లెవల్స్ అదుపులో లేని వారిలో ఈ ప్రభావం మెదడుపై చూపి జ్ఞాపకశక్తిని కూడా దెబ్బతీస్తుందంటున్నారు. ఇలా దీర్ఘకాలం పాటు మందులు వాడే వారిలో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటున్నట్లు చెబుతున్నారు.
ప్రమాదకరంగా మారుతుంది
దీర్ఘకాలంగా మధుమేహం ఉన్న వారిలో మెదడుకు వెళ్లే రక్తనాళాలు సన్నబడటంతో రక్తప్రసరణ తగ్గి మతిమరుపు వచ్చే అవకాశాలున్నాయి. శరీరంలో షుగర్ లెవల్స్ పెరగడం, తగ్గడం వల్ల మధుమేహ దుష్ఫలితాలు ఎక్కువ. కాబట్టి వారికి మందులు వేసే బాధ్యతను కుటుంబ సభ్యులే చూడాలి. – డాక్టర్ శివారెడ్డి, మధుమేహ వ్యాధి నిపుణులు, కడప
Comments
Please login to add a commentAdd a comment