కన్నీటి "రోజా" | Man Illness With Road Accident in Anantapur | Sakshi
Sakshi News home page

కన్నీటి "రోజా"

Published Sat, Jul 27 2019 7:01 AM | Last Updated on Sat, Jul 27 2019 7:01 AM

Man Illness With Road Accident in Anantapur - Sakshi

అనిల్‌కు సేవలు చేస్తున్న తల్లి లక్ష్మీదేవి, భార్య రోజా

మనసెరిగిన భర్త.. ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు.. ప్రేమగా చూసుకునే అత్తామామ.. అందమైన జీవితం ఆమెది. భర్త రెక్కల కష్టంతో ఉన్నంతలో ఇల్లు సాఫీగా నడిచేది. సజావుగా సాగుతున్న ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. రోడ్డు ప్రమాదం రూపంలో భర్త మంచంపట్టగా.. చికిత్స కోసం ఆస్తులన్నీ కరిగిపోయాయి. కూలీగా మారి కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆమె.. పసుపుకుంకుమ కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది. ఏ దేవుడైనా సాయం చేయకపోతాడా.. తన భర్త ప్రాణాలు నిలుపకపోతాడా అని ఆశగా ఎదురుచూస్తోంది.

అనంతపురం ,గుంతకల్లు:  బోమ్మనహాళ్‌ మండలం దేవగిరి గ్రామానికి చెందిన రోజాకు విడపనకల్లు మండలం కరకముక్కల గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌(30)తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు కూతురు నిదర్శిని(5), కుమారుడు యశ్వంత్‌ (2) సంతానం. అనిల్‌కుమార్‌కు సొంత ట్రాక్టర్, కొంత వ్యవసాయ భూమి ఉంది. రోజా కూడా భర్త మనసెరిగిన ఇల్లాలుగా అత్తామామలు కిష్టప్ప, లక్ష్మీదేవిలతో కలిసి ఆనందంగా కాలం గడుపుతోంది. కానీ ఆ కుటుంబంపై విధి పగబట్టింది. 2018 సెప్టెంబర్‌ 10న సొంత పనిమీద ద్విచక్ర వాహనంపై రాయదుర్గానికి వె?ళ్లిన అనిల్‌కుమార్‌.. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గుర్తుతెలియని వాహనం అనిల్‌కుమార్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో అతను తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పోలీసులు వెంటనే రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు చెప్పారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు అనిల్‌కుమార్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఇక్కడ దాదాపు 3 నెలల పాటు ఉంచి చికిత్స చేయించారు. ఇందుకోసం రూ.25 లక్షల దాకా ఖర్చు చేశారు. ఈ క్రమంలో జీవనాధారమైన ట్రాక్టర్‌ను అమ్మేశారు. ఉన్న కాస్త పొలం తనఖా పెట్టారు. ఒంటిపై ఉన్న బంగారం మొత్తాన్ని అమ్మేశారు. బయటి వ్యక్తుల నుంచి సుమారు రూ.12 లక్షల దాకా అప్పు చేశారు. ఇలా రూ.25 లక్షలు ఖర్చు చేసిన తర్వాత అనిల్‌కుమార్‌ కోమా నుంచి బయటపడ్డాడు. అయితే వెన్నెముక బాగా దెబ్బతినడంతో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో రోజా జీవితం తలకిందులైంది. 

తలలోని రక్తనాళాల్లో గడ్డలు
అనిల్‌కుమార్‌ తలలోని రక్తనాళాల్లో దాదాపు 25 చోట్ల చిన్నపాటి రక్తపు గడ్డలున్నట్లు వైద్యులు తేల్చారు. ప్రస్తుతం అనిల్‌కుమార్‌ కళ్లు తెరిచి చూడటం తప్ప.. ఎవరితో మాట్లాడలేడు. ఆహారం తీసుకోలేడు. దీంతో కడుపు వద్ద రంధ్రం చేసి గొట్టం ద్వారా ద్రవాహారాన్ని అందిస్తున్నారు. 10 నెలలకు పైగా మంచానికే పరిమితం కావడంతో ఒళ్లంతా పుండ్లు పడ్డాయి. రోజూ వైద్య చికిత్స, ఫిజియోథెరపీ చేయించడంతో పాటు ఖరీదైన మందులు వాడాల్సి ఉంది. ఇప్పటికే ఉన్నదంతా ఊడ్చిపెట్టిన అనిల్‌కుమార్‌ కుటుంబం వద్ద ఇప్పుడు చిల్లిగవ్వ లేదు. కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు.

రోజా రెక్కల కష్టంతోనే...
బెంగళూరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన అనిల్‌కుమార్‌ను కుటుంబీకులు స్వస్థలం కరకముక్కలకు తీసుకువచ్చారు. అయితే  రోజూ వారి వైద్య పరీక్షల్లో భాగమైన డ్రస్సింగ్, ఫిజియోథెరపీ కోసం గుంతకల్లు నుంచి వైద్యులను పిలిపించుకోవడం తలకు మించిన భారమైంది. రోజు వారీ ఖర్చులు అధికం కావడంతో దిక్కు తోచక గుంతకల్లు పట్టణంలోని మహబూబ్‌నగర్‌లో నివాసముంటున్న అనిల్‌కుమార్‌ అక్క మనోజ్ఞ ఇంటికి చేరారు. అనిల్‌కుమార్‌ భార్య రోజా స్థానికంగా ఉన్న ఓపైపుల పరిశ్రమలో కూలీపనులకు వెళ్తూ...వచ్చిన ఆ కొద్దిపాటి మొత్తంతోనే భర్తకు డ్రస్సింగ్, ఫిజియోథెరపీ చేయిస్తోంది. ఉదయం కూలీకి వెళ్లడం రాత్రి భర్తకు సపర్యలు చేస్తోంది. రోజా పనికి వెళ్లిన సమయంలో అనిల్‌కుమార్‌ తల్లి లక్ష్మీదేవి సేవలు చేస్తుంది. ఈ స్థితిలో కుటుంబ పోషణ భారం కాగా.. రోజా తన రెండేళ్ల కుమారుడు యశ్వంత్‌ను పుట్టింట్లో వదిలింది. ఐదేళ్ల కూతురు నిదర్శిని తన వద్దే ఉంచుకుని పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి చదివిస్తోంది.  

మందులకు డబ్బుల్లేక
రోజా కూలి డబ్బులతో కుటుంబం గడవడే కష్టం కాగా...రెండు నెలలుగా అనిల్‌కుమార్‌కు అందించాల్సిన రోజువారీ మందులు ఆపేశారు. డ్రస్సింగ్, ఫిజియోథెరపీ సేవలు నిలిచిపోయాయి. మంచంపై ఎముకల గూడులా కనిపిస్తున్న అనిల్‌ వైపు దీనంగా చూడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రోజా మిగిలిపోయారు. తనకొచ్చిన కష్టాన్ని తలచుకుని లోలోనే కుమిలిపోతున్నారు. ఏ దేవుడైనా సాయం చేసి తన భర్త ప్రాణాలు కాపాడకపోతాడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.

నా కొడుకును బతికించండి
నా కుమారుడికి తలలో గడ్డ కట్టుకుపోయిన రక్తపు పొరలు తొలగించడానికి మరొక ఆపరేషన్‌ చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇందుకు రూ.5 లక్షలు దాకా ఖర్చు అవుతుందనీ, ఆపరేషన్‌ చేయిస్తే నా కొడుకు బతుకుతాడని చెబుతున్నారు. దాతలు గొప్ప మనస్సుతో ఆపన్న హస్తం అందిస్తే నా బిడ్డను బతికించుకుంటాను.      – లక్ష్మీదేవి, అనిల్‌ అమ్మ

పసుపుకుంకుమ నిలబెట్టండి
మా చేతిలో చిల్లిగవ్వ లేదు. నా భర్తను బెంగళూరుకు తీసుకువెళ్లి ఆపరేషన్‌ చేయించలేకపోతున్నాం. కనీసం రోజూ వారి మందులు ఇప్పించలేని దుస్థితిలో ఉన్నా. పుస్తెల తాళ్లమ్ముకున్నా..డబ్బు సరిపోక పస్తులుంటున్నాం. మా ఆయనకు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఒక్కపూట కూడా సంతృప్తిగా భోజనం చేసింది లేదు. దాతలు, ప్రభుత్వం ముందుకు వచ్చి సాయం చేస్తే నా పసుపు కుంకుమ నిలబెట్టుకుంటా. – రోజా, అనిల్‌కుమార్‌ భార్య

కరుణ చూపని టీడీపీ సర్కార్‌
తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనిల్‌కుమార్‌ కుటుంబం సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నా.. అప్పటి ప్రభుత్వం కరుణ చూపలేదు. ప్రమాదంలో మెదడు, వెన్నెముక దెబ్బ తిన్న తన భర్తను ఆదుకోవాలని అనిల్‌ భార్య రోజా పూర్తి ఆధారాలతో అప్పటి టీడీపీ ప్రభుత్వానికి ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నా.. ఒక్కరూ స్పందించలేదు.  

సాయం చేయాలనుకునే వారు
పేరు: బాలప్పగారి రోజా
అకౌంట్‌ నం: 31292200103546
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: SYNB0003129
సిండికేట్‌ బ్యాంకు,విడపనకల్లు.సెల్‌: 8186018112

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement