జన్నారం : అర్హుల పింఛన్లు కూడా తొలగించారని మండలంలోని చింతగూడ, రోటిగూడ గ్రామాలకు చెందిన సుమారు 300 మంది వృద్ధులు, వితంతులు, వికలాంగులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. చింతగూడ గ్రామ ప్రధాన రహదారిపై రెండు గంటలకుపైగా బైటాయించి ఆందోళన చేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
సమాచారం తెలుసుకున్న ఎస్సై స్వామి సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన కారులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంపీడీవో, తహశీల్దార్‌లు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పే వరకు వెళ్లేది లేదని వారు భీష్మించుకు కూర్చున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాదవత్ సుధాకర్‌నాయక్ మాట్లాడుతూ పేదల పొట్టలు కొట్టి పెద్దలకు ఈ ప్రభుత్వం దోచి పెడుతుందని విమర్శించారు.
గతంలో ఇచ్చిన పింఛన్లను తొలగించి వృద్ధుల ఉసురుపోసుకుంటుందన్నారు. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలువదని పేర్కొన్నారు. ఎస్సై కలుగజేసుకుని ఆందోళనకారులను పక్కకు పంపించారు. తహశీల్దార్ రవీందర్ అక్కడికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బద్రినాయక్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీవో కార్యాలయం ఎదుట..
మండలంలోని కవ్వాల్, ఇందన్‌పల్లి, కామన్‌పల్లి, దేవునిగూడ గ్రామాలకు చెందిన వృద్ధులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైటాయించారు. అరగంటపాటు ఆందోళన చేశారు. వీరికి కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం పార్టీలు మద్దతు తెలిపాయి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కనికరం రాజన్న మాట్లాడుతూ పింఛన్ తొలగించి ప్రభుత్వం పేదల ఉసురుపోసుకుంటుందన్నారు. పింఛన్లు తొలగించి ముసలి వాళ్లకు ఆసర లేకుండా చేసిందన్నారు.
అధికారుల నుండి స్పందన రాకపోవడంతో అంగడీబజార్ రహదారిపై రాస్తారోకోకు దిగారు. గంటపాటు రాస్తారోకో చేశారు. ఎస్సై స్వామి కలగజేసుకొని అధికారులతో మాట్లాడిస్తామని నచ్చజెప్పి వారిని తిరిగి కార్యాలయాలకు తీసుకెళ్లారు. ఎంపీడీవో శేషాద్రి ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు అంజన్న, నాయకులు గోపాల్, కొండగొర్ల లింగన్న , కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌నాయక్, టీడీపీ నాయకుడు ప్రభాకర్, సర్పంచ్ వెంకటరాజం పాల్గొన్నారు.
కాగజ్‌నగర్ కమిషనర్‌ను నిర ్బంధించిన కౌన్సిలర్లు
కాగజ్‌నగర్ రూరల్ : పింఛన్ల పంపిణీపై నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ కంచె కుమారస్వామిని కౌన్సిలర్లు ఆయన కార్యాలయంలో నిర్భంధించారు. ఈ నెల 8న ప్రభుత్వం ఆసరా పథకం పేరుతో నూతన పింఛన్లు మంజూరు చేయగా కొంత మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని కౌన్సిలర్లు కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు.
ఆసరా పేరుతో అందరికీ పింఛన్లు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం మంజూరులో ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. అట్టహాసంగా పథకాన్ని ప్రారంభించి కొంత మంది లబ్ధిదారులకు ఎందుకు విస్మరించారన్నారు. తమ వార్డుల్లో అర్హులైన నిరుపేదలు ఉన్నా వారికి పింఛన్లు మంజూరు చేయకపోవడంతో అర్హులు నిరాశకు గురవుతున్నారన్నారు. కొంత మందికి మాత్రమే పింఛన్లు మంజూరు చేయడంతో తామూ సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. ప్రభుత్వం ఏ ప్రాతిపాదికన పింఛన్లు మంజూరు చేస్తోందో ప్రజలకు స్పష్టం చెప్పాలని డిమాండ్ చేశారు.
అనంతరం కమిషనర్‌ను కార్యాలయంలో నిర్బంధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీవో నెంబర్ 17 ప్రకారం అర్హులైన వారందికీ పింఛన్లు మంజూరు చే స్తామని చెప్పడంతో కౌన్సిలర్లు శాంతించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సిందం శ్రీనివాస్, దేశ్‌ముఖ్ శ్రీనివాస్, కనుకుంట్ల శివప్రసాద్, రాజేందర్, నియాజుద్దిన్, జానిమియా, నాయకులు షబ్బీర్‌హుస్సేన్, పంజాల మురళీగౌడ్, శ్రీరాం, మహేశ్, దెబ్బటి శ్రీనివాస్, సలీం పాల్గొన్నారు.
మండిపడ్డ పండుటాకులు
Published Wed, Nov 12 2014 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
Advertisement
Advertisement