పింఛను మంటలు
- పెన్షన్ల లబ్ధిదారుల ‘సర్వే’లో నిబంధనలను తుంగలో తొక్కిన ప్రభుత్వం
- అర్హతలున్నా 84,617 మందినిఅనర్హులుగా చిత్రీకరించిన వైనం
- నోటికాడ ముద్దను లాగేయడంతో వృద్ధులు, వికలాంగుల ఆకలికేకలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఖజానాపై భారాన్ని తగ్గించుకోవడం కోసం కాటికి కాలు చాపిన పండుటాకులు.. ఊతం లేని వికలాంగులు.. దిక్కులేని వితంతువుల నోళ్లను ప్రభుత్వం కొట్టింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు సామాజిక భద్రత కల్పించడం కోసం ఇస్తోన్న పింఛన్లలో కోత విధించింది. అనర్హుల ఏరివేత కోసం చేపట్టిన సర్వేలో నిబంధనలను యథేచ్ఛగా తుంగలోతొక్కింది.
నిబంధనలను వక్రీకరించి అర్హులను అనర్హులుగా చిత్రీకరించి.. అధికార టీడీపీ నేతల కనుసన్నల్లో పింఛన్ల లబ్ధిదారుల జాబితా నుంచి 84,617 మందిని తొలగించేసింది. జిల్లాలో అనర్హులను జాబితా నుంచి తొలగించడం వల్ల ఖజానాకు నెలకు రూ.8.61 కోట్లు.. ఏడాదికి రూ.103.32 కోట్లు మిగులుబాటు అవుతుందని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు జబ్బలు చరుచుకుంటుండడంపై సామాజికవేత్తలు విస్తుపోతున్నారు.
వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత. సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెబుతోన్న టీడీపీ అధినేత చంద్రబాబు గద్దెనెక్కగానే కోతలకు తెరతీశారు. ఇదే క్రమంలో పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడానికి ఎత్తు వేశారు. అనుకున్నదే తడవుగా అధికారులు, సామాజిక కార్యకర్తల ముసుగులో టీడీపీ కార్యకర్తలతో కమిటీ వేసి.. తస్మదీయులు అర్హులైనా అనర్హులుగా చిత్రీకరించి పెన్షన్ల లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాలని కనుసైగలు చేశారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి..
పింఛనుదారుల్లో అనర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. రెండున్నర ఎకరాల మాగాణి, ఐదెకరాల మెట్ట భూమి ఉన్న వారు పింఛను పొందడానికి అనర్హులు. మూడు గదులకు మించి శ్లాబ్ ఇల్లు.. కారు ఉన్న వారు కూడా అనర్హులే. ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగంతో సహా ఎలాంటి ఉద్యోగం చేస్తూ జీతం లేదా ఉద్యోగానికి సంబంధించి పింఛను పొందుతున్న వారు కూడా అనర్హులే.. నెలవారీ జీతం పొందుతున్న ప్రైవేట్ ఉద్యోగం చేసే వారు సైతం అనర్హులే.
వృద్ధాప్య పెన్షన్‌దారులకు కనీస వయస్సు 65 సంవత్సరాలు.. వితంతువులకు కనీస వయస్సు 16 ఏళ్లు. వికలాంగులకు కనీస అంగవైకల్యం 40 శాతం కలిగి ఉన్న వాళ్లే అర్హులు. ఆధార్ సీడింగ్ చేసుకోని వారూ అనర్హులే. కానీ.. ఈ నిబంధనలను సర్వేకమిటీ తుంగలో తొక్కిం ది. అన్ని అర్హతలున్నా అనర్హులుగా చిత్రీకరిస్తూ 54,254 మంది వృద్ధులు, 22,108 మంది వితంతువులు, 3,330 వికలాంగులు, 1,673 మంది చేనేత కార్మికులు, 2,786 మంది అభయహస్తం, 16 మంది గీత కార్మికులను పెన్షన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడం గమన్హాం.
తప్పులతడకగా లబ్ధిదారుల సర్వే!
పింఛను లబ్ధిదారులపై నిర్వహించిన సర్వే తప్పులతడకగా అధికారవర్గాలే అభివర్ణిస్తుండడం గమనార్హం. కమిటీలో టీడీపీ కార్యకర్తలు ఉండడం.. ఆ పార్టీ అగ్రనేతలు ఒత్తిడి తేవడంతో సర్వే మొత్తం వారి కనుసన్నల్లోనే సాగిందని రెవెన్యూశాఖకు చెందిన ఓ కీలకాధికారి ఇటీవల బాహాటంగా వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోం ది. తిరుపతి మండలం ఎమ్మార్‌పల్లెకు చెందిన వికలాం గుడు బాలకృష్ణను సకలాంగుడుగా తేల్చడమే అందుకు తార్కాణం.
భూమి లేకున్నా ఉన్నట్లు.. ఇళ్లు లేకున్నా ఉన్నట్లు తిమ్మిని బిమ్మిని చేసి అనర్హులుగా చిత్రీకరించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పింఛను లబ్ధిదారుల జాబితాలో ఉంటే.. ఒకరి పేరును నిర్ధాక్షిణ్యంగా తొలగిం చారు. ఇదే పద్ధతిలో 84,617 మందిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. నెలనెలా వృద్ధాప్య, వితం తు, గీత, నేత కార్మికులు రూ.వెయ్యి.. వికలాంగులు రూ.1500 పింఛను వస్తుందని ఆశించారు. కానీ.. ఉన్న పింఛనే పీకేయడంతో తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు రోడ్డెక్కుతున్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా పింఛను జాబితా నుంచి తొలగించిన వృద్ధులు, వికలాం గులు, వితంతువులు ఆందోళనలు చేయడమే అందుకు తార్కాణం.