పెన్షన్ల కోతే..
- 10,600 మంది పెన్షన్ల తొలగింపు
- నేడుమరో 15 వేలు కట్!
కోతే లక్ష్యంగా పెన్షన్ తనిఖీలు జిల్లాలో సాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘పచ్చ’ కమిటీలు లబ్ధిదారులను కుదించే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నాయి. రెండు రోజులుగా జరుగుతున్న సర్వేలో అప్పుడే 10,600 మందిని అనర్హులుగా గుర్తించి నిర్దాక్షిణ్యంగా పెన్షన్ రాకుండా చేశారు. మంగళవారం కూడా ఇంటింటా తనిఖీలతో 15 వేల మందికి పైగా లబ్ధిదారులను తొలగించాలని కంకణం కట్టుకున్నట్లు తెలిసింది.
విశాఖ రూరల్: జిల్లాలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పెన్షన్ల సర్వేపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1,500 చొప్పున పెన్షన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈలోగా లబ్ధిదారుల సంఖ్యను వీలైనంత తగ్గించాలని ప్రభుత్వం ఇంటింటా సర్వేకు ఆదేశించింది. కొన్ని చోట్ల ఇంటింటా సర్వే నిర్వహించకుండా పంచాయతీ కార్యాలయాల్లోను, చెట్ల కింద కూర్చొని లబ్ధిదారుల
వడపోతను చేపడుతుండడంతో పెన్షన్‌దారుల్లో ఆందోళన నెలకొంది.
మాకవరపాలెం మండలం రాచపల్లిల్లో పంచాయతీ కార్యాలయంలో కూర్చుని పెన్షన్లు తనిఖీ చేస్తున్న కమిటీ సభ్యులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీల్లో టీడీపీ నేతలు,కార్యకర్తలు అధికంగా ఉండడంతో వారికి అనుకూలమైన వారిని చూసీచూడనట్లు వదిలేసి, ఇతర పార్టీల వారిని అనర్హులుగా గుర్తిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత శుక్రవారం నుంచి ఈ సర్వే ప్రారంభం కాగా, తొలి రెండు రోజులు సర్వే నామమాత్రంగా జరిగింది. దీంతో మరో రెండు గడువు పొడిగించారు. జిల్లాలో మొత్తం 3,20,895 మంది పెన్షన్‌దారులు ఉండగా ఇంటింటా సర్వేలో ఇప్పటి వరకు 2,14,736 మంది వివరాలను పరిశీలించారు.
ఇందులో 10,600 మందిని అనర్హులుగా గుర్తించినట్లు తెలిసింది. ఇంకా 1,06,159 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పరిశీలన చేయాల్సి ఉంది. ఒక్కరోజులో ఇంత మంది ఇళ్లకు వెళ్లడం కష్టం. అయినప్పటికీ మంగళవారం సాయంత్రంతో సర్వేను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో చివరి నిమిషంలో ఇష్టానుసారంగా లబ్ధిదారులను గుర్తింపును చేపట్టే అవకాశాలు లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
25 రాత్రికి అప్‌లోడ్
లబ్ధిదారుల వివరాలతో పాటు అనర్హుల జాబితాను ఈ నెల 25వ తేదీ రాత్రికి అధికారులు అప్‌లోడ్ చేయనున్నారు. అలాగే పెన్షన్ల కోసం కొత్త దరఖాస్తులను మంగళవారం మాత్రమే స్వీకరించనున్నారు. ఇప్పటికే ఇంటింటా సర్వేలోనే సిబ్బంది కొత్త దరఖాస్తులు స్వీకరించారు. వారిలో అర్హులను కూడా అక్కడే నిర్ధారిస్తున్నారు. మంగళవారం కొత్త దరఖాస్తులు స్వీకరించిన వెంటనే వాటిని పరిశీలించనున్నారు. కొత్త దరఖాస్తులను కూడా 25వ తేదీ రాత్రిలోగా అప్‌లోడ్ చేయనున్నారు. అయితే కొత్త వారికి పెన్షన్ల మంజూరు అక్టోబర్ 2 నుంచి జరుగుతుందా లేదా అన్ని విషయంపై అధికారులకు స్పష్టమైన సమాచారం లేదు.
రద్దు సరికాదు
నాది పెదబయలు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు 2006లో వికలాంగుల కోటాలో పెన్షన్ మంజూరయింది. నాటి నుంచి నెలకు రూ. 500లు ఇస్తున్నారు. అది చాలక ఇటీవల పాఠశాలలో పార్టుటైం ఉద్యోగం చేస్తున్నాను. ప్రస్తుతం రద్దు చేస్తామనడం సరికాదు. వికలాంగుడినా కాదా అన్నది చూడాలి తప్ప.. ఇలాంటి చర్యలు సరికాదు.
- విద్యాకుమార్ పట్నాయక్