
బాబూ మా గోడు తగులుతుంది
- పింఛన్‌దారుల శాపనార్థాలు
- మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రారంభంగాని పరిశీలన
- సొమ్మసిల్లిన వృద్ధులు
- ఆత్మకూరులో పింఛన్‌దారుల ఆగ్రహం
ఆత్మకూరు: ‘బాబూ మా గోడు తగులుతుంది’ అని పింఛన్‌దారులు శాపనార్థాలు పెట్టారు. పట్టణంలోని 3,5,20,21,14,15,19 వార్డులకు సంబంధించిన పింఛన్ల పరిశీలనకు ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను వేదిక చేశారు. ఈ కేంద్రం వద్ద శనివారం ఉదయాన్నే 9 గంటలకు వృద్ధులు, వితంతువులు, వికలాంగులైన పింఛన్‌దారులు బా రులుదీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సంబంధిత అ ధికారులు పరిశీలనకు రాకపోవడంతో పింఛన్‌దారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కనీసం తాగునీటి వసతి కూడా కల్పించలేకపోవడంతో వృద్ధ మహిళలు సొమ్మసిల్లారు.
వారి వెంట వచ్చిన మహిళలు ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రక్రియకు కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై శాపనార్థాలు కురిపించారు. ‘రూ.200 పింఛన్‌ను రూ.1000 చేస్తామన్నారు. ఏవేవో కాగితాలు తెమ్మన్నారు. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగి ఈ కాగితాలను సంపాదించుకున్నాం. వాటిని చూపించుకుందామంటే ఒక్క అధికారీ లేరు. పింఛన్లు ఇచ్చేందుకా, వాటిని తొలగించేందుకా అర్థం అవటంలేదు. ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలలేవీ అమలు చేసే తీరుగా కనబడటంలేదు. డ్వాక్రా సభ్యులందరికీ లోన్లు రద్దు చేస్తామన్నారు. రైతులకు రుణమాఫీ అదిగో ఇదిగో అంటూనే ఉన్నారుగానీ ఇంత వరకు అమలైన దాఖలాలు లేవు. ఈ ఐదేళ్లు ఇట్లాంటి అవస్థలే పడితే అప్పుడు చెబుతాం మహిళలుగా మేము ఏమి చేస్తామో’ అని పలువురు వృద్ధులు ఆగ్రహావేశాలతో బాబు తీరును తూర్పారబట్టారు.
తీరిగ్గా వచ్చిన అధికారులు
పింఛన్‌దారుల అగచాట్లను పత్రికా విలేకర్లు మధ్యాహ్నం ఒంటి గంటకు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ అధికారులు స్పందించి సిబ్బందిని పంపడంతో పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం నుంచి మండుటెండలో నిరీక్షించిన వృద్ధ మహిళలు, కాలే కడుపుతో కొందరు చంటి బిడ్డలను చంకనేసుకొని అవస్థలు పడటం కనిపించింది. ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించి 1,2 వార్డులు వెంకట్రావుపల్లిలోనూ, 22,23 వార్డులు పేరారెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలోనూ పరిశీలన కోసం ఏర్పాటు చేశారు. 6,7,12,13 వార్డులను ఆదిఆంధ్ర ప్రాథమిక పాఠశాలలోనూ, 8 నుంచి 11 వరకు, 16 నుంచి 18 వరకు వార్డులను మేదరవీధిలోని వెస్ట్ ప్రాథమిక పాఠశాలలోనూ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో దాదాపుగా అన్ని చోట్ల కనీస వసతులు కూడా లేకపోవడంతో వృద్ధులు తీవ్రంగానే ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పింఛన్లు వస్తాయి కదా:
పింఛన్లు వస్తాయి కదా? మళ్లీ ఈ కాగితాలన్నీ ఎందుకు? ఇవన్నీ చూస్తుంటే వస్తాయో, రావోనని అనుమానంగా ఉంది. పింఛన్ల పంపిణీకి ఎగనామం పెడితే మా బాధలు దేవుడికెరుక. - అవినాభి
విధానాలు లోపభూయిష్టం :
ఆత్మకూరులో కమిటీల ఏర్పాటు విధివిధానాలే సక్రమంగా లేవు. పలు కమిటీల్లో ఎస్సీ,ఎస్టీ సభ్యులే లేరు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లమైన మమ్మల్ని ఈ కమిటీల్లో వేశారు. అయినా దూరంగానే ఉన్నాం. అర్హులైన వారికి పింఛన్లు తొలగిస్తే మా దగ్గరకు రమ్మన్నాం. అన్యాయం జరిగితే ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
- అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, 1వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్