పింఛన్ కోసం పాట్లు
పరిగి: ఓపక్క కొత్త పింఛన్లు వస్తున్నాయని ఊరిస్తుండగా.. మరో పక్క రెగ్యులర్‌గా ఇచ్చే పాత పింఛన్ కోసం వృద్ధులకు పాట్లు తప్పటం లేదు. ఐదారు నెలలుగా ఓ నెల ఇచ్చినట్లు, మరో నెల మరచినట్లు చేస్తూ వస్తున్న అధికారులు ఈనెల 17వ తేదీ దాటినా పింఛన్ ఇవ్వలేదు.
దీంతో శుక్రవారం ఉదయం పింఛన్ కోసం గ్రామ పంచాయతీకి వచ్చిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మధ్యాహ్నం వరకు వేచి చూశారు. పింఛన్ ఇచ్చే వారు ఎంతకూ రాకపోవటంతో పరిగి పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ కోసం వారం రోజులుగా తిరుగుతూనే ఉన్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం కూడా ఈ విషయం ఎంపీడీఓ విజయప్ప దృష్టికి తీసుకెళ్లామని, ఆయన పింఛన్ ఇచ్చే సీఎస్పీని అక్కడికి పిలిపించి మందలించారని తెలిపారు. అయినా శుక్రవారం మళ్లీ సీఎస్పీ రాలేదని తెలిపారు. పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన అనంతరం ఎంపీడీఓ కార్యాలయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తరువాత గ్రామ పంచాయతీ వద్దకు వెళ్లి సాయంత్రం వరకు పడిగాపులుగాశారు.
చిన్న పంచాయతీల్లాగే మేజర్ పంచాయతీ అయిన పరిగికి కూడా ఒక్కరే సీఎస్పీ ఉండటం వల్ల సమస్య తలెత్తుతోందని అధికారులు పేర్కొంటున్నారు. పరిగి లాంటి పెద్ద పంచాయతీకి కనీసం నలుగురు సీఎస్పీలు ఉంటే పింఛన్లు పంపిణీ సాధ్యమవుతుందని తెలిపారు.