కడప కార్పొరేషన్:
సమస్యల పరిష్కారానికే జన్మభూమి అంటూ ఊదరకొడుతున్న ప్రభుత్వం .. ఓ వృద్ధుడి ప్రాణం పోవడానికి పరోక్షంగా కారణమైంది. ఎన్టీఆర్ భరోసా పేరుతో పెంచిన పింఛన్లను అక్టోబర్ నెలలో పంపిణీ చేయకుండా వాయిదా వేస్తూ వచ్చారు.. పింఛన్లు పంపిణీ చేయడానికి జన్మభూమి కార్యక్రమాన్ని వేదికగా ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో కడప నగరంలోని మున్సిపల్ ఉర్దూ బాలుర పాఠశాలలో బుధవారం జన్మభూమి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
పెరిగిన పింఛన్‌ను తీసుకోవడానికి బాలాజీపేటకు చెందిన ఆదినారాయణ (75) అనే వృద్ధుడు ఎంతో ఆశగా వచ్చాడు.. కొద్దిసేపటికే ఆదినారాయణకు గుండెపోటు వచ్చింది.. జన్మభూమి శిబిరం వద్ద అలాగే కుప్పకూలిపోయాడు.. అక్కడున్న మున్సిపల్ అధికారులు 108కు సమాచారం అందించారు.. నిముషాలు గడిచినా 108 రాలేదు.. విషయాన్ని అక్కడే వైద్య శిబిరం నిర్వహిస్తున్న వైద్యుల దృష్టికి తీసుకెళ్లారు..
వృద్ధుడిని పరీక్షించేందుకు వైద్యశిబిరంలో బీపీ పరికరంతో పాటు ఎటువంటి మందులు లేవు.. వృద్ధుడి ఎదపై ఒత్తిడి తెచ్చి గుండె ఆడేలా విఫలయత్నం చేశారు. ఇంతలో ఓ మున్సిపల్ ఇంజినీర్ వాహనంలో వృద్ధుడిని రిమ్స్‌కు తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.. పెరిగిన పింఛన్‌ను ఒక్క నెలైనా తీసుకోకుండానే ఆదినారాయణ తుదిశ్వాస విడిచాడు.
వృద్ధుడి ప్రాణం తీసిన జన్మభూమి
Published Thu, Nov 6 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
Advertisement