జిల్లాలో ప్రతి కుటుంబానికీ బ్యాంకు ఖాతా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ప్రతి కుటుంబానికి ఒక బ్యాంకు ఖాతా ఉండాలన్న ధ్యేయంతో పని చేసి ఆ లక్ష్యం సాధించామని కలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ తెలిపారు. మంగళవారం సీపీఓ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి కుటుంబానికీ కనీసం ఒక బ్యాంకు ఖాతా చొప్పున వంద శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలున్నట్లు తెలిపారు. జిల్లాలో 8,60,463 కుటుంబాలుండగా ఇప్పటి వరకు 6,63,000 మందికి బ్యాంకు ఖాతాలున్నట్లు తెలిపారు. గత సంవత్సరం మార్చి నెల నుంచి డిసెంబర్ వరకు 9 నెలల్లో 6.63 లక్షల బ్యాంకు ఖాతాలు ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద కొత్తగా తెరిపించామన్నారు. ఇంకా బ్యాంకు ఖాతా లేనివారుంటే, కొత్తగా తెరిపిస్తామని, ఈ ప్రక్రియ గణతంత్ర దినోత్సవం లోపుగా పూర్తి చేస్తామన్నారు.
పధానమంత్రి జన్‌ధన్‌యోజన పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి ఒక బ్యాంక్ ఖాతా, 5 కి.మీ. పరిధిలో బ్యాంకు సౌకర్యం లేనిచోట బిజినెస్ కరస్పాండెంట్ ఏజెంట్ ద్వారా బ్యాంకు సేవలందించే ఏర్పాటు చేస్తామన్నారు.పీఎంజెడివైకు సంబంధించి ప్రతి రూపేకార్డు (డెబిట్ కార్డు) ద్వారా లక్ష రూపాయలకు ప్రమాద బీమా కల్పించటం, ప్రతి డెబిట్ కార్డుపై కుటుంబానికి రూ.5 వేలు ఓవర్‌డ్రాప్ట్ కింద ఇచ్చే ఏర్పాటు, ఆర్థిక అంశాలపై అవగాహన పెంపొందించడం ధ్యేయం గా పెట్టుకున్నామని కలెక్టర్ వివరించారు. ఆర్థిక అంశాలను తెలుసుకునే విధంగా ప్రజలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఫైనాన్షియల్ లిటరసీ కేంద్రాలను ఏర్పాటు చేసి, వారిని ఆర్థిక విషయాలలో విజ్ఞానవంతులుగా చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
జిల్లాలో 418 బ్యాంక్ బ్రాంచీలున్నాయని, 277 మం ది బిజినెస్ కరస్పాండెంట్ ఏజెంట్లను నియమించామన్నారు. నూతనంగా 3,92,747 ఖాతాలను తెరిచామని, అందులో 2,15,366 రూపే కార్డులను పంపిణీ చేశామని, మిగిలిన వాటిని ఈ నెల 26వ తేదీలోపు అందిస్తామని చెప్పారు. సిండికేట్ బ్యాంక్ డిజిఎం సిబిఎల్ నరసింహారావు మాట్లాడుతూ రూపే డెబిట్ కార్డును వెంటనే తీసుకోవాలని, ప్రతి 45 రోజులకు ఒక సారైనా బ్యాంకు లావాదేవీలు జరపాలని, బ్యాంక్ లావాదేవీలు జరిగిన వారికి మాత్రమే ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని రకాల ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉందని వివరించారు. సిండికేట్ బ్యాంక్‌లకు సంబంధించి ఏటీఎంల కనెక్టివిటీ సమస్యలను అధిగమించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని వివరించారు. సిండికేట్ బ్యాంకు ఎల్‌డిఎం ఎం.నరసింహారావు మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం ఆవశ్యకతను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషాఖాశీం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ ఎంఎస్ మురళి, మెప్మా పీడీ కమలకుమారి, ఆయా బ్యాంకుల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.