కేతు విశ్వనాథ రెడ్డికి 80 ఏళ్లు. తెలుగు కథా సాహిత్యంలో భీష్మ పితామహుడి వంటి ఆయనకు ఇప్పుడు సాహిత్య జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడం విశేషం కాదు. కాని ఆయనను సత్కరించుకోకుండా ఎవరిని సత్కరించుకోగలం? తెలుగు కథను, రాయలసీమ కథను సగర్వంగా, సమున్నతంగా గౌరవించుకోవాలని అనుకున్న ప్రతిసారీ ఆ పూలహారం వెళ్లి పడేది కేతు విశ్వనాథరెడ్డి మెడలోనే. సీమ కథకు చేవ ఆయనది. చేర్పు ఆయనది.
నేల మీద గట్టిగా నిలబడి చెప్పిన సాహిత్యమంతా నిలిచింది. కేతు విశ్వనాథరెడ్డి తన చూపును నేలన గుచ్చి కథలు రాశారు. నేల మీద తిరుగాడే మట్టి పాదాలు, రైతు పాదాలు, స్త్రీల పాదాలు, తెలియకనే బానిసలుగా బతుకుతున్నవారి పాదాలు... ఇవి ఆయన కథా వస్తువులు. రాయలసీమ కథలో మధురాంతకం రాజారాం గారిది ఒక కథాధోరణి అయితే కేతు విశ్వనాథ రెడ్డిది మరో కథాధోరణి. మధురాంతకం రాజారాం పాఠకుణ్ణి ఒప్పించడం కూడా అవసరమే అనుకుంటారు. కేతు విశ్వనాథ రెడ్డి ‘నేను జీవితాన్ని చూపుతాను... చూడగలిగిన వారంతా చూడండి’ అని ములాజా లేని ధోరణి పాటించారు. కఠిన సత్యాలను, నిష్టూర సత్యాలను సీమ ప్రజల తరఫున పాఠకుల ముందు పెట్టారు.
రైతుకు, నేలకు ముడి తెగితే ఆ రైతు ఎలా గాలికి కొట్టుకుపోయి పతనమవుతాడో కేతు తన ‘నమ్ముకున్న నేల’ కథలో చూపుతారు. ఆ కథ రాసే సమయానికీ ఇప్పటికీ పరిస్థితి మారి ఉండొచ్చు. కాని ఆ సమయంలో ఆ కథ మొత్తం రాయలసీమ నేల పెట్టిన వెర్రికేక. కరువు నేలలో మనిషిలో జడలు విప్పే స్వార్థం పశుస్థాయి కన్నా ఘోరమైనది అని ‘గడ్డి’ కథలో ఆయన చూపుతారు. ప్రజలకు అందాల్సిన ఫలాలు ప్రజల వరకూ చేరడం లో, ఆఖరుకు గడ్డి పంపకంలో కూడా భాగాలుంటాయని కేతు చెప్తే పాఠకునికి కడుపు తరుక్కుపోతుంది.
రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలపై కేతు నిశితమైన వ్యాఖ్యానం వంటి కథలు రాశారు. ‘కూలిన బురుజు’ అందువల్లే గొప్ప కథగా నిలిచిపోయింది. ఆ కథలో ఒక డాక్టరు చేత ‘జబ్బు ఉంది అని కనిపెట్టడం గొప్ప కాదు. ఆ జబ్బుకు మందు కనిపెట్టడం గొప్ప’ అనిపిస్తారు. ఆ కథలో చాలా రోజుల తర్వాత తన ఊరికి వచ్చిన డాక్టరు పాత్ర ఊరిని చూసి దిగ్భ్రమ చెందుతుంది. ఊళ్లో ఎక్కడ చూడు కొట్లాటలూ కార్పణ్యాలే. తలాన్ని మార్చి చూస్తే సమస్య సరిగ్గా అర్థమవుతుంది. ఊరిలో ఉన్న వాళ్లకు తాము అలా ఎందుకున్నామో తెలియదు. ఊరు వదిలి వెళ్లిన డాక్టరుకు అర్థమవుతుంది. మగవాళ్ల పంతాలలో నలిగిపోయే స్త్రీలను ఈ కథలో కేతు గొప్పగా చూపుతారు.
కేతు విశ్వనాథరెడ్డి రాయలసీమలోని ఆత్మీయ జీవనాన్ని మతాల మధ్య ఉండే సహనపూర్వకమైన జీవనాన్ని కథల్లో చూపారు. ‘పీర్లసావిడి’, ‘అమ్మవారి నవ్వు’ ఆ విషయాన్ని నిరూపిస్తాయి. ఆయన స్త్రీవాద దష్టితో రాసిన కథలూ విలువైనవి. స్త్రీలు చదువులో, ఉపాధిలో వివక్ష అవసరంలేని, లైంగిక వేధింపులకు తావు లేని జీవనం పొందాలని బలంగా కోరుకున్నారు. ‘రెక్కలు’ కథ అందుకు ఉదాహరణ. ‘సతి’, ‘ఇచ్ఛాగ్ని’... ఆ వరుసలో ఎన్నో. రాయలసీమ వాసికి వాన ఎంత ముఖ్యమో వాన కోసం ఎన్ని అగచాట్లు పడతాడో ‘వాన కురిస్తే’ కథలో దుఃఖం కలిగేలా చెబుతాడాయన.
కేతు విశ్వనాథ రెడ్డి కేవలం కథకుడు కావడం వల్ల మాత్రమే తన సాహితీ జీవనాన్ని సాఫల్యం చేసుకోలేదు. అరసంలో పని చేశారు. కొ.కు. సంపుటాలకు సంపాదకత్వం వహించారు. వత్తి రీత్యా అధ్యాపకుడైనందున కథకునిగా కూడా శిష్యులను ప్రశిష్యులను తయారు చేశారు. కేతు ప్రోత్సాహంతో కథా సాహిత్యంలో కషి చేసిన, చేస్తున్న మేలిమి కథకులు ఇవాళ ఉన్నారు.
హైదరాబాద్‌లో సుదీర్ఘకాలం నివసించి, తన నేల– కడపలో విశ్రాంత జీవనం గడుపుతున్న కేతు విశ్వనాథ రెడ్డి కథాలోకానికి ఒక పెద్ద దిక్కు. నేడు ఆయనకు జరుగుతున్న సత్కారం తెలుగు కథకు జరుగుతున్న సత్కారం. ఆ సభకు ఆయన కథలూ బారులు తీరుతాయేమో. పాఠకులమైన మనం ఆ సమూహంలో మెడ నిక్కించకుండా ఎలా ఉండగలం? కేతుగారికి హదయపూర్వక శుభాకాంక్షలు.
డాక్టర్ తుమ్మల రామకృష్ణ
వ్యాసకర్త, వైస్ చాన్సలర్, కుప్పం యూనివర్సిటీ
(కేతు విశ్వనాథరెడ్డికి నేడు అనంతపురంలో ‘విమల సాహిత్య జీవిత పురస్కారం’ బహూకరిస్తున్న సందర్భంగా...)
Comments
Please login to add a commentAdd a comment