సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ప్రకాశం అక్షర విజయం పేరుతో అక్షరాస్యత పెంపొందించేందుకు కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ చేపట్టిన కార్యక్రమం మంచి ఫలితాలు ఇచ్చింది. ఆరు నెలల కాలంలో 4.5 లక్షల మందిని అక్షరాస్యులను చేశారు.
దీంతో 63 శాతం ఉన్న జిల్లా అక్షరాస్యత ఒక్కసారిగా 78 శాతానికి పెరిగింది. ఈ విజయాన్ని పరిశీలించి మిగిలిన ప్రాంతాలకు వర్తింపజేసేందుకు సాక్షర భారత్ బృందం త్వరలో జిల్లాకు రానుంది. మొదటి నుంచీ ప్రకాశం జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. అక్షరాస్యతలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో 17వ స్థానంలో ఉండగా రాష్ట్ర విభజన తర్వాత 10వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రకాశం అక్షర విజయం
అక్షరాస్యత పెంపును ఒక ఉద్యమంగా చేపట్టాలని కలెక్టర్ విజయకుమార్ నిర్ణయించారు. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 33.97 లక్షలు. అందులో 3.78 లక్షల మంది ఆరేళ్లలోపు పిల్లలు కాగా మిగిలిన 30 లక్షల మంది జనాభాలో 19 లక్షల మంది అక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించారు. ఇది 63 శాతంగా ఉంది. మొత్తం నిరక్షరాస్యులు 11 లక్షల మంది ఉండగా అందులో 60 ఏళ్లు దాటి చదవడానికి అవకాశం లేనివారిని పక్కన పెట్టి 5.64 లక్షలమందిని అక్షరాస్యులను చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరికి రెండు దశల్లో శిక్షణ ఇచ్చారు.
మొదటి దశలో మూడు లక్షల 1802 మంది పరీక్షకు హాజరుకాగా 2,56,452 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో దశలో నిర్వహించిన పరీక్షకు 2, 11,213 మంది హాజరు కాగా 1,93,570 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఆరేడు నెలల కాలంలో ప్రకాశం జిల్లాలో 4,50,022 మంది అక్షరాస్యులుగా మారారు. ఈ విజయంతో జిల్లాలో అక్షరాశ్యత శాతం 78 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం కొత్త రాష్ట్రంలో ప్రకాశం జిల్లా అక్షరాశ్యతలో 10వ స్థానం నుంచి నాల్గవ స్థానానికి ఎగబాకింది.
ఆరు నెలల్లో జిల్లా సాధించిన విజయాన్ని సాక్షరత భారత్ గుర్తించింది. త్వరలో ముంబై నుంచి ఒక బృందం వచ్చి ఈ ఘనత ఏ విధంగా సాధ్యమైందన్న అంశంపై పరిశీలన చేయనుంది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉండేది. అధికారుల ప్రయత్నాల వల్ల ఈ ప్రాంతంలోనే ప్రజలు ఎక్కువమంది చదవడం, రాయడం నేర్చుకునేందుకు ముందుకొచ్చారు. పగలు పనులుకు వెళ్లినా రాత్రి సమయాల్లో గంట, రెండు గంటలు చదివేందుకు కేటాయించడంతో అక్షరాశ్యులుగా మారడానికి వారి నుంచి ఆసక్తి వ్యక్తంమైందని అధికాకారులు చెబుతున్నారు.
యజ్ఞంలా భావించాం : కలెక్టర్
ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద కార్యక్రమం దేశంలో మరెక్కడా జరగలేదని కలెక్టర్ విజయకుమార్ తెలిపారు. దీన్ని ఒక యజ్ఞంలా చేపట్టామని, మొత్తం నాలుగంచెల వ్యవస్థలో ముందుకు తీసుకువెళ్లామని ఆయన మీడియాకు తెలిపారు. గ్రామస్థాయిలో నిరక్షరాశ్యులకు చదువు చెప్పేందుకు 20, 876 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చారన్నారు.
వీటిని గ్రామస్థాయిలో 1027 మంది పర్యవేక్షించారని, మండలస్థాయిలో 56 మంది, జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు నిరంతర పర్యవేక్షణ కారణంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు. ప్రస్తుతం 4.50 లక్షల మంది చదవడం, రాయడం నేర్చుకున్నారని, వీరిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం కోరుతున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా ప్రజల సహకారం మరువలే నిదని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రకాశం అక్షర విజయం
Published Sat, Aug 16 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM
Advertisement
Advertisement