సాక్షి, అమరావతి: గిరిజన బిడ్డలను విద్యావంతుల్ని చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. గిరిజనుల్లో అక్షరాస్యత శాతం పెంచాలనే పట్టుదలతో ముందడుగు వేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 27,39,920 మంది గిరిజనులు ఉన్నారు. వీరిలో అక్షరాస్యత శాతం 48.98 మాత్రమే. సగానికి పైగా గిరిజనులు విద్యకు దూరంగా ఉంటున్నారు.
2,678 గిరిజన విద్యాసంస్థలు
గిరిజన పల్లెల్లో ప్రత్యేకంగా 2,678 విద్యాసంస్థలున్నాయి. వీటిలో 2,05,887 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో 189 గురుకులాలను గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. వీటిలో పూర్తిగా సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు విద్యకు దూరం కాకుండా ప్రణాళికలు రూపొందించింది. ఒక్కొక్క విద్యార్థికి నాలుగు జతల చొప్పున స్కూల్ యూనిఫారాలు సమకూరుస్తోంది. ఒక సెట్ బెడ్డింగ్ మెటీరియల్ సరఫరా చేసింది. నోట్ పుస్తకాలను ఇప్పటికే అందజేసింది. ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు సైతం ఇచ్చింది. హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో ఉండే విద్యార్థులకు ప్రత్యేకంగా కాస్మొటిక్ చార్జీలు అందజేస్తోంది.
ప్రైవేట్ స్కూళ్లలోనూ చదివిస్తోంది
అత్యున్నతమైన ప్రైవేట్ స్కూళ్లను ఎంపిక చేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద విద్యార్థులను వాటిలో ప్రభుత్వం చేర్పించింది. ఆ పిల్లలకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వమే నిధులు ఇస్తోంది. ప్రతిభ చాటే గిరిజన విద్యార్థులకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రవేశాలు కల్పించింది. కార్పొరేట్ కాలేజీల పథకం కింద ఎంతోమంది గిరిజన విద్యార్థులను ఆయా కాలేజీల్లో చేర్పించింది. ఇందుకయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద గిరిజన విద్యార్థులను విద్యాభ్యాసం కోసం విదేశాలకు ప్రభుత్వ ఖర్చులతోనే పంపిస్తోంది. పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌లు ఇవ్వడం ద్వారా ఆయా విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
237పాఠశాలల్లో వృత్తి విద్యా కోర్సులు
184 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, 53 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు కలిపి 237 స్కూళ్లల్లో వృత్తి విద్యను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిలో 80,091 మంది గిరిజన విద్యార్థులు వృత్తి విద్య నేర్చుకుంటున్నారు. మెటీరియల్‌ను నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సమకూరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment