పచ్చదనంతో నిండుగా కనిపిస్తున్న నాగిశెట్టిపల్లి గ్రామం
శామీర్‌పేట్: ఓ అక్షరం ఇంటికే కాదు.. ఊరంతా వెలుగినిచ్చింది.. అక్షర చైతన్యాన్ని పెంచింది. స్వాతంత్య్రం రాకపూర్వం నలుగురితో మొదలైన ఆ యజ్ఞం ఊరినే అగ్రభాగాన నిలిపింది. ఇప్పుడా పల్లెలో అంతా సరస్వతీ పుత్రులే. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని, నాగిశెట్టిపల్లి గ్రామం నూరు శాతం అక్షరాస్యతతో ఆదర్శ గ్రామంగా నిలిచింది. స్వాతంత్య్రం రాక(1947) పూర్వం గ్రామంలోని రామిడి ఆగంరెడ్డి, రామిడి సత్తిరెడ్డి, రామిడి యాదగిరిరెడ్డి, దాసరి గండారెడ్డిలు వ్యవసాయం చేస్తూ తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. వారు నేర్చుకున్న చదువును గ్రామస్తులకు పంచి ప్రోత్సహించారు. ఆనాడు వారిచ్చిన ప్రోత్సాహం నేడు గ్రామం చదువులో వంద శాతం అక్షరాస్యతకు చేరింది.
హైదరాబాద్– కరీంనగర్ జాతీయ రహదారికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం నాగిశెట్టిపల్లి. 92 గడపలు గల ఈ ఊళ్లో 600 మంది జనాభా. వారంతా చదువుకున్నవారే. పైగా మండలంలో ఆదర్శ గ్రామంగా పేరు గడించింది. గ్రామం అంతా పచ్చదనం.. ప్రశాంతంగా ఉంటుంది. ఇక్క డ చదువుకున్న వారిలో 55 మంది ప్రభుత్వ ఉపా« ద్యాయులు, మరో పది మంది బీఈడీ పూర్తి చేసిన విద్యార్థులు, 8 మంది బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ చదువుతున్నవారు ఉన్నారు. ఒకరు పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ ఒకరు ఉన్నారు. వీరే కాకుండా విదేశాలలో (యుఎస్) ఎమ్మెస్ పూర్తి చేసి అక్కడే స్థిర పడినవారూ ఉన్నారు. దాసరి యాదిరెడ్డి గ్రామంలోనే మొదటి ఉపాద్యాయుడు. ఆయన ఇప్పటికీ విశ్రాంత ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్నారు.
వేసవి సెలవుల్లో గ్రామంలో సందడే..
సహజంగా వేసవి సెలవులు వచ్చాయంటే చిన్నారులతో వారి తల్లిదండ్రులు వేరే ప్రాంతాలకు వెళుతుంటారు. కానీ ఈ గ్రామంలోని ప్రజలు వేసవిలో వేరే ప్రాంతాలకు వెళ్లరు. కానీ పట్టణాలు, బయటి దేశాల్లో ఉండే నాగిశెట్టిపల్లి గ్రామానికి చెందిన వారి బంధువులు ఈ గ్రామంలో వేసవి సెలవులు గడిపేందుకు ఇష్టపడతారు. కారణం.. ప్రతీ ఇంటా పచ్చని చెట్లు(కనీసం 10 చెట్లు) ఉంటాయి. అంతేకాకా ఇంటి చుట్టుపక్కల పచ్చని తోటలు, కూరగాయలు పండించే పోలాలే ఉంటాయి. దీంతో మండు వేసవిలోనూ గ్రామంలో చల్లని వాతావరణం ఉంటుంది.
పాలకవర్గం సైతం ఎకగ్రీవం
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల(పంచాయతీ) ఎన్నికల్లో నాగిశెట్టిపల్లి గ్రామం సర్పంచ్‌తో పాటు పాలకవర్గం సైతం గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకుని మండలానికే ఆదర్శంగా నిలిచారు. పంచాయతీ నిధులు లేకున్నా ప్రజల సొంత డబ్బులతో గ్రామంలోని సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. గ్రామ పాలవర్గాన్ని రాష్ట్ర మంత్రులు సైతం అభినందించారు.
మొదటి ఉపాధ్యాయుడిని నేనే..
ఆ రోజుల్లో చదువుపై ఎవరికీ అంతగా అవగాహన ఉండేది కాదు. మా తల్లిదండ్రులు నన్ను కేశవరంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. అక్కడ నాలుగో తరగతి వరకే ఉండేది. చదువుపై నా ఆసక్తితో బొల్లారంలో చేర్పించారు. ఐదు నుంచి 11వ తరగతి వరకు చదువుకుని ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అనంతరం టీచర్‌గా అపాయింట్ అయ్యాను. మండలంలో మొదటి ఉపాధ్యాయుడిని నేనే. చాలా ప్రాంతాల్లో పనిచేశాను. – దాసరి యాదిరెడ్డి, రిటైర్డ్ టీచర్
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపీహెచ్‌డీ చేశా..
మా తల్లిదండ్రులు చదువుకున్నారు. వారికున్న అవగాహనతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇంటర్ కేశవరం గ్రామంలో చదివా. తర్వాత రాజేంద్రనగర్‌లోని ఇండియన్ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్(ఐఐఎంఆర్)లో వ్యవసాయ వ్యర్థాల నుంచి విత్తనాల పరిశోధనలో పీహెచ్‌డీ పూర్తి చేశాను. ప్రస్తుతం సొంతంగా పాలిహౌజ్ నిర్మించి తక్కువ స్థలం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే పద్దతులతో వ్యవసాయం చేస్తున్నా. – రామిడి మధుకర్‌రెడ్డి, పీహెచ్‌డీ
Comments
Please login to add a commentAdd a comment