దుకాణం: ఆన్‌లైన్ షాపింగ్ భయాలు !
భారత జనాభా 120 కోట్లు. సంఖ్యలో రెండో స్థానం. అక్షరాస్యత కూడా మరీ తక్కువేం కాదు. కానీ... ఇండియాలో జరిగే ఆన్‌లైన్ షాపింగ్ మాత్రం చాలా తక్కువ. ఎందుకు? కారణాలు అనేకం. భయాలు, అనుమానాలు, అపనమ్మకాలు...! అయితే వీటిల్లో వాస్తవం ఎంత?
ఆన్‌లైన్ షాపింగ్ మొదటి ఉపయోగం... కాలు బయటపెట్టాల్సిన అవసరం ఉండదు. పెరుగుతున్న పనివేళలు, ప్రయాణ సమయాలు, ట్రాఫిక్‌ల నుంచి తప్పించుకునే పెద్ద అవకాశం ఇది. షాపింగ్ చేయడం ఒక వినోదమే గానీ ప్రతి వస్తువు కొనుగోలులో అలాంటి ఆనందమే ఉండదు. మాల్‌కు వెళ్లి బట్టలు కొనడం ఆనందమే గాని, కొట్టుకు వెళ్లి నూనె కొనడం ఎవరికి ఆనందం చెప్పండి. అందుకే ఆన్‌లైన్ షాపింగ్‌కు ఆదరణ మొదలైంది. అయితే, ఏళ్లు గడుస్తున్నా ఇంకా చాలామందిలో ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించి కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిఉన్నాయి.
భయాలు
ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించడంపైన ఇండియాలో ఇప్పటికీ చాలామందికి భయాలున్నాయి. క్రెడిట్ కార్డు వివరాలు, బ్యాంకు వివరాలు అందులో నమోదు చేస్తాం కాబట్టి భవిష్యత్తులో మన కార్డుకు లేదా అకౌంట్‌కు భద్రత ఉంటుందా? డబ్బు కట్టాక వస్తువు మనకు రాకపోతే ఏం చేయాలి? ఎవరినడగాలి? ఒకవేళ అది వచ్చినా ఆ వివరాలతో మనకు సంబంధం లేనివి మన అకౌంట్‌లో డబ్బులు తీసుకుని అంటగట్టేస్తారా? వీటన్నింటికీ ఒకటే సమాధానం. నమ్మకమైన వెబ్‌సైట్లలో షాపింగ్ చేస్తే ఈ భయాలు ఏవీ ఉండవు. మీ ఆర్థిక లావాదేవీ సమాచారం వారి దగ్గర భద్రపరుచుకోరు. ట్రాన్షాక్ష న్స్ అన్నీ అకౌంట్ టు అకౌంట్ కాబట్టి మీ సొమ్ము ఎక్కడికీ పోదు. ట్రాన్షాక్షన్ ఫెయిలైనా కొన్ని రోజుల్లో మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది. ఈ విషయంలో మీకు సాయం చేయడానికి అటు వెబ్‌సైట్ కాల్‌సెంటర్/బ్యాంకు వాళ్లు పూర్తి సాయం చేస్తారు. మీ వస్తువు ఇంటికి చేరుకోవడంలో ఆలస్యం కావచ్చునేమో గాని బుకింగ్ మీకు చేరకపోవడం అంటూ ఉండదు. ఏ వస్తువు కొన్నా అది ఎపుడు, ఎలా వస్తుందన్న వివరాలన్నీ మీకు అందుబాటులో ఉంచుతారు.
అనుమానాలు
వస్తువుల నాణ్యత ఉత్పత్తి చేసే కంపెనీని బట్టి ఉంటుంది. ప్రముఖ కంపెనీ వస్తువులు ఉదా: ఫోన్లు, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు మీరు బయట దుకాణాల్లో కొంటే ఎంత నాణ్యతగా ఉంటాయో ఆన్‌లైన్ స్టోర్లలో కొన్నా అంతే నాణ్యతగా ఉంటాయి. కొన్ని లోకల్ ఉత్పత్తులు లేదా బ్రాండ్ లేని వస్తువులు కొనేటపుడు మాత్రం... బాగా పేరుమోసిన ఆన్‌లైన్ స్టోర్లలోనే కొనాలి. టీవీలో ప్రకటనల్లో వచ్చేవన్నీ ఫేమస్ అని, టీవీల్లో రానివి ఫేమస్ కాదని మీరు భావించొద్దు. నమ్మకమైన వెబ్‌సైట్స్‌ను తెలిసిన వారి ద్వారానో లేదా గూగుల్‌లో టాప్ 10, టాప్ 20 సైట్స్ అని వెతికి గాని తెలుసుకోవచ్చు.
అప నమ్మకాలు
ఆన్‌లైన్లో కొంటే ధర ఎక్కువనీ, వస్తువు పాడైనది వస్తే తిరిగి పంపలేమనీ, వస్తువు ఇంటికి రాదనే భయాలు వదిలేయండి. ఇపుడున్న టెక్నాలజీ నుంచి ఎవరూ తప్పు చేసి అంత సులువుగా తప్పించుకునే పరిస్థితి లేదు. అంతకంటే ముందు ఆన్‌లైన్లో కొంటే అసలు ధర తెలుస్తుంది. మీరు ఒకటీవీ కొనాలనుకుంటే ఆ టీవీ మోడల్ తెలుసుకుంటే అది బయట ఎంత ఉందో, ఏ సైట్లో ఎంత ధర ఉందో సులువుగా నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ప్రముఖ కంపెనీ టీవీ అయితే ఎక్కడ కొన్నా మీకు నాణ్యతలో తేడా ఉండదు. తక్కువ ధర ఉన్న వెబ్‌సైటు ఏదైనా కనపడితే మీరు కనుక్కున్న నమ్మకమైన సైట్ల జాబితాలో అది ఉంటే అక్కడ కొనేయడమే.
భారీ ఉపయోగాలు: ఆన్‌లైన్లో వినియోగదార్ల సంఖ్య పెంచుకోవడానికి ఆయా నిర్వహకులు లాభం కాస్త తగ్గించుకుని ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రతి వస్తువుపై ఇస్తున్నారు. ఉప్పు పప్పు మొదలుకొని బంగారం వరకు అన్నీ ఆన్‌లైన్లోనే దొరుకుతాయి. ఆన్‌లైన్ షాపింగ్‌లో అతి వేగంగా అమ్ముడవుతున్నవి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, స్త్రీల దుస్తులు, ఇమిటేట్ జువెలరీ ఉన్నాయి. బయట కొనడానికి మొహమాటపడే రొమాంటిక్ లో దుస్తులు, కండోమ్‌లు వంటివి ఆన్‌లైన్లో విపరీతమైన వృద్ధిని నమోదుచేస్తున్నాయి. బయటషాపింగ్‌కు, ఆన్‌లైన్ షాపింగ్‌కు ఒక పెద్ద తేడా ఉంది. ఎంత పెద్ద షాపింగ్ మాల్‌కు వెళ్లినా మీకు అక్కడ దొరికే మోడల్స్ కంటే ఎక్కువ మోడల్స్ ఆన్‌లైన్లో దొరుకుతాయి. ఇక్కడయితే ఒకదాన్నుంచి ఇంకో స్టోరుకు మధ్య దూరం ఒక్క క్లిక్. అదే మీరు ఒక షాపింగ్ మాల్‌లో నచ్చకపోతే ఇంకోదానికి వెళ్లాలంటే....గంటలు వృథా, ప్రయాస!