ప్రభుత్వాన్ని కోరిన ఎఫ్‌ఆర్‌ఏఐ
క్విక్ కామర్స్(quick commerce) సంస్థల మాదిరిగానే కిరాణా దుకాణాలకు ప్రత్యేకంగా ఆన్‌లైన్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి తీసుకురావాలని ది ఫెడరేషన్ ఆఫ్ రిటెయిలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FRAI) ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే క్విక్ కామర్స్ సంస్థల ద్వారా వస్తున్న పోటీని తట్టుకోలేక కిరాణా దుకాణాలు కుదేలవుతున్నాయని చెప్పింది. వీటికితోడు రిటైల్(Retail) అవుట్‌లెట్లు పెరుగుతున్నాయని పేర్కొంది. కొత్త కంపెనీలు రిటైల్ స్టోర్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాయని, ఇప్పటికే ఆన్‌లైన్ షాపింగ్ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు క్విక్‌కామర్స్ సేవలు ప్రారంభిస్తున్నాయని వివరించింది.
ఈ నేపథ్యంలో కిరాణాదారులకు భారీగా నష్టం వాటిల్లుతుందని ఎఫ్‌ఆర్‌ఏఐ తెలిపింది. క్విక్ కామర్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు సంప్రదాయ కిరాణా దుకాణాలకు ప్రత్యేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వం కల్పించాలని చెప్పింది. ఇప్పటికే మార్కెట్‌లో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో(Zepto) వంటి క్విక్ కామర్స్ సంస్థల నుంచి పోటీ పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం కిరాణా దుకాణాలకు తోడ్పాటు అందించాలని తెలిపింది.
ఇదీ చదవండి: ఎకానమీపై ఆర్‌బీఐ బులెటిన్
ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌ఏఐ గౌరవ అధికార ప్రతినిధి అభయ్ రాజ్ మిశ్రా మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) వంటి కొత్త టెక్నాలజీలు, కిరాణా దుకాణాలకు క్విక్ కామర్స్ పోటీను తట్టుకునేలా పరిష్కారం అందిస్తాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎఫ్‌ఆర్‌ఏఐలో 42 రిటైల్ సంఘాలు ఉన్నాయి. 80 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి రిటైలర్లకు ఈ అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment