చదువులో ముందున్న రాష్ట్రం.. చతికిలపడింది
ఇండియాలో అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన కేరళ ఇప్పుడు సంక్షోభంలో పడింది. అక్షరాస్యత ర్యాంకింగ్స్ లో త్రిపుర, మిజోరంతో పోటీ పడిన రాష్ట్రం ప్రస్తుతం వెనుకబడిపోతోంది. కొత్తగా చదువు నేర్చుకునే సుమారు మిలియన్ (పదిలక్షలలు) కు పైగా జనాభాను గుర్తించే విషయంలో వైఫల్యం చెందడంతో.. అక్షరాస్యతలో ముందున్న స్థానాన్ని కోల్పోతున్నట్లు స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అధ్యయనాల్లో వెల్లడైంది.
అకౌంటెంట్ జనరల్ అధ్యయనాల ప్రకారం ఐదు శాతం మంది విద్యార్థులు ఏడవతరగతిలోకొచ్చినా ఏబీసీడీలను కూడ గుర్తించలేకపోతున్నారు. 35 శాతం మంది కనీసం వారి మాతృభాషలో రాయడం, చదవడం చేయలేకపోతున్నారట. ఇక సైన్స్ లో 85 శాతం, గణితంలో 73 శాతం వెనుకబడ్డారని అధ్యయనాలు చెప్తున్నాయి. నాలుగో తరగతి పిల్లల్లో కూడ చదువులో ఎలాంటి ఎదుగుదల కనిపించడం లేదని, 47శాతంమంది మళయాళంలోనూ, 25శాతం మంది ఆంగ్లంలోనూ వెనుకబడి ఉన్నట్టు లెక్కలు తెలియజేస్తున్నాయి. సైన్సు, గణిత శాస్త్రాల్లో విద్యార్థులకు కనీస జ్ఞానం కనిపించడం లేదని అధ్యయనాలు చెప్తున్నాయి.
కేరళలోని కాసర్గోడ్, త్రిస్సూర్ , ఎర్నాకులం, పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో నాలుగు, ఏడు మధ్య తరగతులు చదువుతున్న 4,800 మంది విద్యార్థులపై అధ్యయనం నిర్వహించారు. విద్యార్థుల్లో భాష, ప్రాధమిక విజ్ఞానాన్ని పరీక్షించారు. 19 శాతం విద్యార్థుల్లో కనీస జ్జానం లేకపోవడాన్ని గమనించారు. నిరక్షరాస్యుల్లో కొందరు కనీసం పాఠశాలకు కూడ వెళ్ళడం లేదని, అయితే వారు కొన్ని నెలలపాటు అక్షరాస్యతా తరగతులకు వెళ్ళిన తర్వాత కాస్త మెరుగు పడ్డారని అధ్యయనాలు వెల్లడించాయి.
కేరళ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యాప్రమాణాలను పెంచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. విద్యకోసం పెట్టే ఖర్చుకూడ అత్యధికంగానే ఉంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో దాదాపు 37 శాతం విద్యకు వెచ్చిస్తున్నారు. దానిలో ఎనభై శాతం పాఠశాల విద్యకే ఖర్చు చేస్తున్నారు. అందుకే రాష్ట్రం లో ఇప్పుడు ప్రతి చదరపు కిలోమీటర్ కు ఓ ప్రాధమిక పాఠశాల, ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఓ ఉన్నత పాఠశాల కూడ ఉన్నాయి. ఎక్కడో కొన్ని తప్పించి.. దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలు... పక్కా భవనాలు, తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు కలిగి ఉన్నాయి. అంతేకాదు రాష్ట్రంలో ఉపాధ్యాయులు కూడ సమృద్ధిగానే ఉన్నారు. ఇటీవలి కాలంలో 3 వేల 5 వందల పాఠశాలల్లో విద్యాశాఖ ఓ సర్వే నిర్వహించింది. వీరి లెక్కల ప్రకారం మొత్తం 46 వేల 240 మంది టీచర్లు ఉన్నట్లు... ప్రతి ముఫ్ఫై మంది విద్యార్థులకు ఓ ఉపాధ్యాయుడు ఉన్నట్లు తేలింది.
ఇకపోతే రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ఏభై శాతానికిపైగా ఫెయిల్ అయినట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. ప్రైవేట్ వృత్తి కళాశాలల వైఫల్యాలవల్లేనే రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పతనం అవుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు కూడ ఇటువంటి కళాశాలలను మూసివేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. గడిచిన మూడు సంవత్సరాల్లో నలభై శాతం కన్నా తక్కువ ఉత్తీర్ణత ఉన్న కళాశాలలను రద్దు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు కూడ జారీ చేసింది. కోర్టు స్వయంగా ఓ కమిటిని ఏర్పాటు చేసి, అధ్యయనం చేసింది. ప్రైవేటు కాలేజీల్లో విద్యానాణ్యతా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక టెక్నలాజికల్ విశ్వ విద్యాలయాన్నికూడ ఏర్పాటు చేసింది. అయితే వర్శిటీ ఉప కులపతి పి. ఇజాక్ మాత్రం రాష్ట్రంలో సాంకేతిక విద్యను పూర్తిగా ప్రక్షాళన చేయడం తక్షణావసరమని, అయితే అది అంత సులభం కాదని అంటున్నారు. అందుకు ప్రాధమికంగా ఓ ప్రాజెక్ట్ ఆధారిత బోధనా ప్రక్రియను ముందుగా 154 కాలేజీల్లో ప్రారంభించారు.
అలాగే వైద్యరంగం పనితీరు కూడ ప్రోత్సాహకంగా లేదని, విద్యార్థుల తీరు మెరుగు పడాలంటే హెల్గ్ సైన్సెస్ అన్నింటినీ ఓ ప్రత్యేక విశ్వవిద్యాలయం కిందికి తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తమౌతోంది. కేరళ హెల్త్ యూనివర్శిటీ ప్రారంభమై నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడ చాలా కళాశాలల్లో ఫలితాలు దుర్భరంగా ఉన్నాయని, గతేడాది ఎంబిబిఎస్ నాలుగో సంవత్సరం ఉత్తీర్ణత కనీసం 30 శాతం దాటలేదని, కొన్ని కళాశాలల్లో ఏకంగా వైఫల్యం రేటు 90 శాతానికి దాటిపోయిందని అధ్యయనాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో వైద్య విద్యా రంగంలో ప్రవేశ పెట్టిన పలు పద్ధతుల వల్లనే ఫలితాలు పతనమౌతున్నాయని, కనీస అర్హతల విషయంలో నమూనాను పాటించనప్పుడు అద్భుతాలు సాధించడం కష్టమేనని వర్శిటీ మాజీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ ఇక్బాల్ అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా చదువులో ముందుండే కేరళ రాష్ట్రం వెనుకబడటానికి తగ్గ సరైన కారణాలను ఇప్పటికైనా గుర్తించి... తిరిగి అత్యున్నత స్థానానికి చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు విద్యారంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.