ఆమె క్లాస్‌లో ఆమె అమ్మ, అమ్మమ్మ విద్యార్థుల్లా పాఠాలు విన్నారు. అమ్మమ్మ తన మనవరాలిని ‘టీచర్’ అంటూ పిలిచేది. ఆ పల్లెటూళ్లో చదువురాని గృహిణులందరూ ఆమె స్కూల్లో బుద్ధిగా చదువుకునేవారు. కేరళ ప్రభుత్వం అక్షరాస్యత ఉద్యమం చేపట్టడానికి ఆమె కూడా స్ఫూర్తి. జీవితం ఆమెను చిన్నప్పుడే చక్రాల కుర్చీకి పరిమితం చేసింది. కాని చదువే మనిషికి చలనం ఇస్తుందని అందరికీ చదువు అందే పనిని చూసింది. కె.వి.రాబియా కేరళలో ఎందరికో స్ఫూర్తి. నేడు పద్మశ్రీ ప్రకటనతో దేశానికి కూడా స్ఫూర్తిగా నిలిచింది.
56 ఏళ్ల రాబియా జీవితం కేరళలో స్కూలు పిల్లల టెక్ట్స్‌బుక్స్‌లో పాఠ్యాంశంగా ఉంది. కేరళ అనే ఏముంది... దేశంలో ఏ భాషలోని పిల్లలలైనా ఆమె జీవితాన్ని పాఠంగా చదువుకోవాలి. స్ఫూర్తి పొందాలి. ఎందుకంటే అలాంటి పోరాటం చేసిన వారు చాలా తక్కువ ఉంటారు. స్త్రీలలో మరీ తక్కువగా ఉంటారు. అందుకే ప్రతి చిన్నారి, యువతి, గృహిణి, ఉద్యోగిని రాబియాను చూసి జీవితంలో అలుపెరగని పోరాటం ఎలా చేయవచ్చో నేర్చుకోవచ్చు.
ఎందుచేత ఆమె స్ఫూర్తి?
ఆమె మలప్పురం జిల్లాలోని తిరురంగడి అనే ఊరికి దగ్గరలోని ‘వెల్లిలక్కడు’ అనే ఊరిలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రికి రేషన్‌షాప్ ఉండేది. రాబియాకు చదువుకోవాలని బాగా కోరిక. కాని 9వ క్లాసుకు రాగానే ఆమెకు రెండు కాళ్లకూ పోలియో వచ్చింది. అయినా సరే ఇంటర్ వరకూ మేనమామ సహాయంతో కాలేజీకి వెళ్లింది. కాని ఇంటర్‌లో నడుము కింద నుంచి పూర్తిగా చచ్చుబడి వీల్‌చైర్‌కు పరిమితం అవ్వాల్సి వచ్చేసరికి ఇక కాలేజీ మానుకుంది. కాని చదువంటే ఇష్టం. ఎలా? ఇంట్లోనే ఉంటూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ ఆ తర్వాత పిజి చదవడం మొదలెట్టింది. ఆ మాత్రం ఎవరైనా చేస్తారు? రాబియా వేరే పని కూడా చేసింది.
ఆడవాళ్ల స్కూలు
రాబియా ఉన్న పల్లెటూళ్లో అందరూ పేదవాళ్లు. చిన్న చిన్న పనులు చేసుకునేవారు. ఆ ఇళ్ల ఆడవాళ్లకు అక్షరం ముక్క చదువు లేదు. నేను ఇంటి దగ్గరే ఉన్నా కదా వీరికి ఎందుకు చదువు చెప్పకూడదు అని డిగ్రీలోనే రాబియాకు అనిపించింది. వెంటనే ఆమె తన ఇంటిలోనే స్కూల్ ప్రారంభించింది. కేవలం ఆడవాళ్లకే ఆ స్కూలు. ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ఆమె ఇల్లు ‘కడలుండి’ అనే నది ఒడ్డున ఉంటుంది. మెల్లగా అదొక గురుకులంలాగా తయారైంది. రాబియా టీచర్ అసలు ఏమాత్రం రాజీ పడకుండా ఆడవాళ్లకు చదువు చెప్పడం, వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉపాధి అవకాశాలు అందుతాయో తెలియచేసి, ప్రతి ఇంటికి ఏదో ఒక దారి చూపడం మొదలెట్టింది.
రాబియా తల్లి, అమ్మమ్మ ఇది గమనించి ఆఖరుకు వారు కూడా ఆమె స్టూడెంట్స్‌గా మారక తప్పలేదు. తనను ఎత్తుకుని ఆడించినవారు తన దగ్గర బుద్ధిగా పాఠాలు వినడం రాబియాకు చాలా సంతోషం కలిగించింది. ఈ వార్త అటూ ఇటూ వెళ్లి ప్రభుత్వానికి చేరింది. ఒకరోజు అధికారులు వచ్చేసరికి రాబియా క్లాసులో 80 ఏళ్ల పెద్దామె నుంచి 8 ఏళ్ల పాపాయి వరకూ చదువుకుంటూ కనిపించారు. అధికారులు చాలా సంతోషించి ఏం కావాలి అని అడిగితే మా ఊరికి రోడ్ వేయండి అంది రాబియా. వెంటనే రోడ్ వేసిన అధికారులు దానికి ‘అక్షర రోడ్’ అని పేరు పెట్టారు. అంతే కాదు లైట్లు, నీటి వసతి ఇలాంటివన్నీ రాబియా వల్ల ఆ ఊరికి వచ్చాయి.
‘చలనం’ సంస్థ
రాబియాకు తెలుసు... తాను తన కాళ్ల మీద నడవలేనని. కాని తన చదువు సమాజాన్ని నడిపించగలదు... తాను చెప్పే చదువు నలుగురికీ చలనం ఇవ్వగలదు... అందుకే ఆమె ‘చలనం’ అనే సంస్థను స్థాపించి ముఖ్యంగా దివ్యాంగులకు, మానసిక అవస్థలు ఉన్న పిల్లలకు స్కూళ్లు తెరిచింది. అంతే కాదు... తన ఇంటిని ఒక నాలెడ్జ్ సెంటర్‌గా మార్చింది. లైబ్రరీ, కౌన్సెలింగ్... అన్నీ అక్కడే. తన్నుకొని తనదగ్గరకు వచ్చిన భార్యాభర్తలకు ఆమె కౌన్సెలింగ్ ఇచ్చేది. అయితే ఆమె జీవితానికి ఇంకా పరీక్షలు ఎదురయ్యాయి.
కేన్సర్ సర్వయివర్
32 ఏళ్ల వయసులో ఆమెకు కేన్సర్ వచ్చింది. దానిని ఆమె విజయవంతంగా ఎదుర్కొంది. శరీర బలం కంటే మనోబలంతోనే ఆమె దానిని జయించింది. ఆ తర్వాత 40 ఏళ్ల వయసులో ఆమె బాత్‌రూమ్‌లో పడటంతో వెన్నుపూస ఆమె శరీరాన్ని మరింత చలనం లేకుండా చేసింది. ఆ సమయంలో ఆమె పూర్తిగా మంచం మీద ఉండి ‘మౌన రోంబనంగల్’ (నిశ్శబ్ద కన్నీరు) అనే తన జ్ఞాపకాల గ్రంథాన్ని రాసింది. అది హిట్ అయ్యి వచ్చిన డబ్బుతో ఆమె వైద్యం చేయించుకుంది. ఆ తర్వాత ‘స్వప్నాలకు రెక్కలుంటాయి’ అనే పేరుతో ఆత్మకథను రాసింది. మనిషి ఎంత వీలుంటే అంత చదువుకోవాలని జ్ఞానమే సమాజాన్ని మరింత వికాసంలోకి తీసుకెళుతుందని రాబియా గట్టిగా నమ్ముతుంది. ప్రచారం చేస్తుంది.
ఆమె కృషి వల్ల ఆమె ఊరి చుట్టుపక్కల 8 గ్రామాలు పూర్తిగా అక్షరాస్యతలోకి ప్రయాణించాయి. ప్రజలు రాబియాను ఎంతో అభిమానిస్తారు. ఏ కృషీ వృధా పోదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆమెను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. గొప్పవాళ్లు కొందరు చక్రాల కుర్చీకి పరిమితం కావచ్చు. కాని వారి సంకల్పం ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంటుంది. ఆ సంకల్పం అందరికీ దక్కాలి.
రాబియాను అభినందిస్తున్న పలువురు ప్రముఖులు
Comments
Please login to add a commentAdd a comment