సంస్కరణల్లో ‘విద్యా’ భారతం! | Versions of the 'Educational' India! | Sakshi
Sakshi News home page

సంస్కరణల్లో ‘విద్యా’ భారతం!

Published Mon, Aug 15 2016 3:21 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM

సంస్కరణల్లో ‘విద్యా’ భారతం! - Sakshi

సంస్కరణల్లో ‘విద్యా’ భారతం!

చింతకింది గణేష్ - సాక్షి, హైదరాబాద్ : దేశానికి స్వాతంత్య్రం వచ్చాక విద్యా రంగంలో అనేక మార్పులు వచ్చాయి.. అనేక సంస్కరణలు అమల్లోకి తెచ్చారు. ప్రధానంగా 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య, అందరికి సమాన అవకాశాలు లక్ష్యంగా ఎన్నెన్నో మార్పులకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. స్వాతంత్య్రం నాటికి దేశంలో అక్షరాస్యత 12.2 శాతమే.. ప్రస్తుతం అక్షరాస్యత 74.04 శాతంగా ఉంది.
 
తొలుత సంపన్నుల కోసమే..
బ్రిటిష్ కాలంలో పాఠశాలలను గురుకులాలని పిలిచేవారు. అప్పట్లో అవి సంపన్నులకు, ఉన్నత సామాజిక వర్గాల వారి కోసమే పనిచేసేవి. తర్వాత బ్రిటిష్ వారు ఇంగ్లిషు మీడియం ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించారు. అలా 1947 నాటికి దేశవ్యాప్తంగా 1,34,866 స్కూళ్లను ప్రారంభించగా.. 1,05,25,943 మంది వరకు చదువుకున్నట్లు అంచనా. స్వాతంత్య్రానంతరం 6 నుంచి 16 ఏళ్ల వారికి ఉచిత విద్య అందించేలా చర్యలు చేపట్టారు. తర్వాత ప్రభుత్వాలు కూడా స్వల్ప మార్పులతో ఆ విధానాలను కొనసాగించాయి. అందులో భాగంగా వచ్చినవే డిపెప్, ఆపరేషన్ బ్లాక్ బోర్డు, సర్వ శిక్షా అభియాన్ వంటి ప్రతిష్టాత్మక పథకాలు. ప్రస్తుతం దేశంలో 14,25,564 పాఠశాలలు ఉన్నాయి.

దేశంలోని అన్ని రకాల విద్యా సంస్థల్లో కలిపి 31.50 కోట్ల మంది చదువుతుండగా.. పాఠశాలల్లోనే 25,48,83,400 మంది అభ్యసిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశంలో 21 విశ్వవిద్యాలయాలు, 496 కాలేజీలు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యూనివర్సిటీల సంఖ్య ఏకంగా 761కి పెరిగింది. వాటి పరిధిలో 36,671 కాలేజీలు, 11,445 ప్రత్యేక విద్యా సంస్థలు కొనసాగుతున్నాయి. దేశంలో 1947కు ముందు 38 ఇంజనీరింగ్ కాలేజీలు, 53 పాలిటెక్నిక్ డిప్లొమా కాలేజీలు ఉండేవి. ప్రస్తుతం దేశంలో 3,345 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి.
 
అవసరమైనా పెరగని వైద్య విద్య
స్వాతంత్య్రం సమయంలో దేశవ్యాప్తంగా కేవలం 19 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆ తర్వాత దేశ జనాభా భారీగా పెరిగినా.. అవసరానికి తగినట్లుగా వైద్య విద్య కాలేజీలు పెరగలేదు. ప్రస్తుతం దేశంలో 381 వైద్య విద్యా కాలేజీలు ఉన్నాయి. వాటి నుంచి ఏటా 30 వేల ఎంబీబీఎస్ విద్యార్థులు, 18 వేల మంది స్పెషలిస్టులు, మరో 30 వేల మంది ఆయుష్ కోర్సులు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తంగా 9.36 లక్షల మంది వైద్యులు ఉన్నట్లు అంచనా.
 
70 ఏళ్లలో కీలక మార్పులు
దేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా ఆజాద్.. ప్రాథమిక విద్యలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఉన్నత విద్యా విధానంలో మార్పులు తెచ్చేందుకు 1948-1949లో కేంద్రం యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్, 1952-1953లో సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్లను ఏర్పాటు చేసింది. అత్యున్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు నెహ్రూ ప్రభుత్వం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లను  నెలకొల్పింది. విద్యా విధానాల మెరుగుదల, అమలు కోసం జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలిని ఏర్పాటు చేశారు.

1968లో మొదటిసారిగా జాతీయ విద్యా విధానాన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టారు. 14 ఏళ్లలోపున్న పిల్లలందరికీ తప్పనిసరిగా విద్యను అందించడం ప్రధాన లక్ష్యంగా దీనిని ప్రకటించారు. 1986లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ అందరికి సమాన విద్యా అవకాశాలు కల్పించడం లక్ష్యంగా మరో నూతన విద్యా విధానాన్ని అమల్లోకి తెచ్చారు.  ప్రాథమిక విద్యను నిరుపేదలకు మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకాన్ని చేపట్టారు. 1985లో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఓపెన్ యూనివర్సిటీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వం 1986 జాతీయ విద్యా విధానంలో పలు సవరణలు చేసింది.

1994లో జిల్లా ప్రాథమిక విద్యా పథకం (డిపెప్) అమల్లోకి వచ్చింది. పాఠశాలల్లో విద్యార్థుల హాజరును పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమల్లోకి తెచ్చారు.  2000 సంవత్సరంలో సర్వ శిక్షా అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. 2005లో నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్-2005 పేరుతో విద్యా బోధన, ఇతర విధానాల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement