ఇంటింటికీ తాగునీరందిస్తాం
-
మంత్రి ఈటల రాజేందర్
ఇబ్రహీంపట్నం : మిషన్ భగీరథ ద్వారా 2017 డిసెంబర్ వరకు ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో మిషన్ భగీరథపై కోరుట్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరువులోనూ స్వచ్ఛమైన తాగునీరందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు వేగవంతం చేస్తున్నారని పేర్కొన్నారు. డబ్బా వద్ద మిషన్ భగీరథ పనులు చేపట్టేందుకు రూ.1300 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ఇది చేతల ప్రభుత్వమని, తాము చేసే పనులతో పదేళ్లపాటు కచ్చితంగా అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తంచేశారు.
భవిష్యత్‌తరాల కోసం హరితహారం కార్యక్రమం చేపట్టామని, వనంతోనే వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై మెుక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలుపెంచి కరువును పారద్రోలాలని కోరారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో హరితహారంలో 40 లక్షల మొక్కలు నాటుతామన్నారు. మిషన్ భగీరథతో కలిగే లాభాలు, పనులు తీరును మిషన్ భగీరథ ఎస్‌ఈ శ్రీనివాస్‌రావు వివరించారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ఇబ్రహీంపట్నం నుంచి మెట్‌పల్లికి Ðð ళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో శశికుమార్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.