పాల్వంచ మండలం తోగ్గూడెం వద్ద నీటిశుద్ధి కేంద్రం
పాల్వంచరూరల్/అశ్వాపురం: దీర్ఘకాలంగా వేధిస్తున్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికీ గోదావరి జలాలను అందిస్తోంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలతోపాటు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.2,250 కోట్ల వ్యయంతో అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద పనులు చేపట్టారు. 23 మండలాల పరిధిలోని 1,828 గ్రామాల్లో 9.97 లక్షల మందికి, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, సత్తుపల్లి(ఖమ్మం జిల్లా) పట్టణాల్లోని 2.98 లక్షల మందికి తాగునీరు అందిస్తున్నారు.
మిషన్ భగీరథ పథకం కింద జిల్లాలో 2016లో డబ్ల్యూటీపీ(వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)లు, అశ్వాపురం మండలం మిట్టగూడెం రథంగుట్ట వద్ద 40ఎంఎల్‌డీ, పాల్వంచ మండలం తోగ్గూడెం వద్ద 145 ఎంఎల్‌డీ, పర్ణశాల వద్ద 13.5 ఎంఎల్‌డీ, పూసూరు వద్ద 9ఎంఎల్‌డీ సామర్థ్యం గల ఇన్‌టేక్ వెల్‌లు నిర్మించారు. ప్రతిరోజూ 145 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల డబ్ల్యూటీపీలో ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంతో రాష్ట్రంలోనే తొగ్గూడెంలోని నీటిశుద్ధి కేంద్రం ద్వితీయ స్థానంలో ఉంది.
ఇంట్రా విలేజ్ స్కీమ్ ద్వారా..
మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ పర్యవేక్షణలో పైపులైన్, ట్యాంక్‌లు నిర్మించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.191.09 కోట్లు వెచ్చించింది. జిల్లా వ్యాప్తంగా 23 మండలాల పరిధిలో 818 ట్యాంక్‌లు, 2,234 కిలోమిటర్ల పొడవునా పైపులైన్ నిర్మించారు.
తాగునీటికి ఇబ్బంది లేదు
జిల్లాలో మిషన్ భగీరథ పథకం రాకముందు తాగునీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రధానంగా వేసవిలో సమస్య జఠిలంగా ఉండేది. మిషన్ భగీరథ స్కీం అమల్లోకి వచ్చాక తాగునీటి సమస్య పరిష్కారం అయింది. జిల్లాలోని అన్ని గ్రామాలకు దాదాపుగా తాగునీరు అందుతోంది. 85 గొత్తికోయల గ్రామాలకు గాను 75 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నాం.10 గ్రామాలకు అటవీశాఖ అనుమతి లేనందున పైపులైన్ నిర్మించలేకపోయాం.
–తిరుమలేశ్వరరావు, ఇంట్రా విలేజ్ ఈఈ
Comments
Please login to add a commentAdd a comment