mission bagiratha
-
అగమ్యగోచరంగా ‘భగీరథ’ లైన్మెన్లు.. ఉద్యోగ భద్రత లేక ఆందోళన
కుల్కచర్ల: మిషన్ భగీరథ పథకం అమల్లో ముఖ్య భూమిక వాటర్ లైన్మెన్లదే.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రజలకు తాగునీటి సరఫరాలో నిమగ్నమవుతారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా తక్షణం స్పందిస్తారు. అయితే ఇలాంటి వారికి ఉద్యోగ భద్రత లేకపోవడం ఆందోళన కలిగించే అంశమే.. కనీస వేతనం అమలు కాక కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా గుర్తింపు లేదు కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో మిషన్ భగీరథ పథకం కింద 25మంది వాటర్ లైన్మెన్లు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 260మంది పనిచేస్తున్నారు. వీరు లేబర్ కాంట్రాక్టర్లకు అనుబంధంగా తాత్కాలిక పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. సంవత్సరాల తరబడి పని చేస్తున్నా సరైన గుర్తింపు లేదని ఆవేదనకు గురవుతున్నారు. ఉద్యోగ భద్రత లేక తమ పరిస్థితి గాలిలో దీపంలా మారిందని వాపోతున్నారు. విధి నిర్వహణలో తమకు ఒక సమయం అంటూ లేదని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు.. ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి పోవాల్సి వస్తోందని తెలిపారు. నామమాత్రపు జీతాలు మిషన్ భగీరథ లైన్మెన్లను లేబర్ కంపెనీల ఆధ్వర్యంలో నియమించారు. దీంతో వారికి ఎలాంటి అలవెన్స్ అందడం లేదు. విధి నిర్వహణకు ఒక సమయమంటూ లేకుండా పోయింది. సంబంధిత కాంట్రాక్టర్‌కు నచ్చితే ఉద్యోగం.. లేకుంటే మరో పని వెతుక్కోవాల్సిందేనని ఆవేదన చెందుతున్నారు. ఒక్కో లైన్మెన్కు నెలకు రూ. 9వేలు జీతం చెల్లిస్తున్నారు. ఈ డబ్బు తమ ఖర్చులు, ఇంటి అవసరాలకు మాత్రమే సరిపోతోందని, పిల్లల చదువులు, భవిష్యత్ అవసరాలకు ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని తెలిపారు. ఇక అనారోగ్య సమస్యలు ఎదురైతే అప్పులు చేయాల్సిందేనని చెప్పారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు తమ ఇబ్బందులను గుర్తించి ఉద్యోగ భద్రత తోపాటు కనీసవేతం, విధుల సమయం కేటాయించాలని వారు కోరుతున్నారు. -
సమస్యలపై దద్దరిల్లిన కౌన్సిల్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలపై అధికారులను కౌన్సిలర్లు నిలదీయడంతో కౌన్సిల్ దద్దరిల్లింది. సోమవారం మధ్యాహ్నం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అత్యవసర సమావేశం జరిగింది. చాలా వార్డుల్లో మిషన్ భగీరథ పథకం తాగునీరు సరిపోవడం లేదని, వీధిలైట్లు 24 గంటల పాటు వెలుగుతున్నాయని కౌన్సిలర్లు ఏకరువు పెట్టారు. వర్షాకాలం ఆరంభమైనందున పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎజెండాలోని వివిధ అంశాలపై వాడివేడీగా చర్చ సాగింది. ముందుగా 32వ వార్డు కౌన్సిలర్ సాదతుల్లా మాట్లాడుతూ చాలా గల్లీలలో వీధి దీపాలు, ముఖ్య కూడళ్లలో హైమాస్ట్ లైట్లు సరిగా పనిచేయడం లేదన్నారు. దోమల బెడద ఎక్కువగా ఉందని రసాయన మందులు పిచికారీ చేయించాలన్నారు. ఇవే విషయాలను 19వ వార్డు కౌన్సిలర్ షబ్బీర్ అహ్మద్ ప్రస్తావించారు. అంబేడ్కర్ చౌరస్తా సమీపంలోని ఎక్స్పో–ప్లాజా తొలగించినందున అక్కడి సామగ్రిని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవాలన్నారు. 24వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతం రామయ్యబౌలిలో వర్షపు నీరు నిల్వకుండా చూడాలన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ అంజయ్య మాట్లాడుతూ కాంట్రాక్టు పనులు అన్ని మహిళా సంఘాల గ్రూపులకు ఇవ్వాలన్నారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తికాకుండానే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అందరినీ ఆహ్వానించాలన్నారు. అప్పన్నపల్లిలో రెండో ఆర్ఓబీ ప్రారంభమైనందున కింది భాగంలో అటు, ఇటువైపు వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అంతర్గత రోడ్లు దెబ్బ తిన్నాయని 21, 37వ వార్డు కౌన్సిలర్లు అనంతరెడ్డి, స్వప్న సమావేశం దృష్టికి తెచ్చారు. కొందరు ఇంటి యజమానులు రోడ్డును ఆనుకొని ర్యాంపులు నిర్మించడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిని తొలగించాలని 13, 21వ వార్డు కౌన్సిలర్లు లక్ష్మీదేవి, అనంతరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దనాలాలలో మురుగును ఎప్పటికప్పుడు తొలగించాలని 33, 34వ వార్డు కౌన్సిలర్లు మునీరుద్దీన్, నర్సింహులు కోరారు. కొందరు వ్యక్తులు వాహనాల్లో కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డు సమీపంలో అర్ధరాత్రి చికెన్ వ్యర్థ పదార్థాలను పడేసిపోతున్నారని సభ దృష్టికి తెచ్చారు. వీరితో పాటు కౌన్సిలర్లు సంధ్య, శ్రీనివాసులు, ముస్కాన్ సుల్తానా, రామాంజనేయులు తమ వార్డుల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం.. – చైర్మన్, కమిషనర్ సభ్యులు ప్రస్తావించిన ఈ సమస్యలను వీలైనంతవరకు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కమిషనర్ డి.ప్రదీప్‌కుమార్ బదులిచ్చారు. పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, అందుకు అందరూ సహకరించాలన్నారు. ఇదిలా ఉండగా ఎజెండాలోని కొన్ని పద్దుల్లో తప్పులు దొర్లడంతో అధికారులపై చైర్మన్ మండిపడ్డారు. ఇక ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో వైస్‌చైర్మన్ తాటి గణేష్‌కుమార్, టీపీఓ లక్ష్మీపతి, డిప్యూటీ ఈఈ బెంజిమన్, శానిటరీ ఇన్స్పెక్టర్లు రవీందర్‌రెడ్డి, గురులింగం, ఏఓ ఉమాకాంత్, ఆర్ఓ నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ గోదావరి జలాలు
పాల్వంచరూరల్/అశ్వాపురం: దీర్ఘకాలంగా వేధిస్తున్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికీ గోదావరి జలాలను అందిస్తోంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలతోపాటు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.2,250 కోట్ల వ్యయంతో అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద పనులు చేపట్టారు. 23 మండలాల పరిధిలోని 1,828 గ్రామాల్లో 9.97 లక్షల మందికి, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, సత్తుపల్లి(ఖమ్మం జిల్లా) పట్టణాల్లోని 2.98 లక్షల మందికి తాగునీరు అందిస్తున్నారు. మిషన్ భగీరథ పథకం కింద జిల్లాలో 2016లో డబ్ల్యూటీపీ(వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్)లు, అశ్వాపురం మండలం మిట్టగూడెం రథంగుట్ట వద్ద 40ఎంఎల్డీ, పాల్వంచ మండలం తోగ్గూడెం వద్ద 145 ఎంఎల్డీ, పర్ణశాల వద్ద 13.5 ఎంఎల్డీ, పూసూరు వద్ద 9ఎంఎల్డీ సామర్థ్యం గల ఇన్‌టేక్ వెల్లు నిర్మించారు. ప్రతిరోజూ 145 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల డబ్ల్యూటీపీలో ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంతో రాష్ట్రంలోనే తొగ్గూడెంలోని నీటిశుద్ధి కేంద్రం ద్వితీయ స్థానంలో ఉంది. ఇంట్రా విలేజ్ స్కీమ్ ద్వారా.. మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ పర్యవేక్షణలో పైపులైన్, ట్యాంక్‌లు నిర్మించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.191.09 కోట్లు వెచ్చించింది. జిల్లా వ్యాప్తంగా 23 మండలాల పరిధిలో 818 ట్యాంక్‌లు, 2,234 కిలోమిటర్ల పొడవునా పైపులైన్ నిర్మించారు. తాగునీటికి ఇబ్బంది లేదు జిల్లాలో మిషన్ భగీరథ పథకం రాకముందు తాగునీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రధానంగా వేసవిలో సమస్య జఠిలంగా ఉండేది. మిషన్ భగీరథ స్కీం అమల్లోకి వచ్చాక తాగునీటి సమస్య పరిష్కారం అయింది. జిల్లాలోని అన్ని గ్రామాలకు దాదాపుగా తాగునీరు అందుతోంది. 85 గొత్తికోయల గ్రామాలకు గాను 75 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నాం.10 గ్రామాలకు అటవీశాఖ అనుమతి లేనందున పైపులైన్ నిర్మించలేకపోయాం. –తిరుమలేశ్వరరావు, ఇంట్రా విలేజ్ ఈఈ -
మిషన్ భగీరథ అవార్డుపై కేంద్రం వర్సెస్ తెలంగాణ
-
'కేంద్రం నుంచి ఒక్క పైసా రాలేదు'
సాక్షి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా రాలేదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. స్థానిక టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న విభజన సమస్యలు, కాళేశ్వరం జాతీయ హోదా తదితర విషయాలను ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తామని చెప్పారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటు, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. రాష్ట్రానికి మంజూరు చేసిన 3,155 కిలోమీటర్ల జాతీయ రహదారులకు వెంటనే నిధులు ఇవ్వాలని, మంజూరైన రైల్వే లైన్లకు తక్షణం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న హర్–గర్–జల్ కార్యక్రమం రాష్ట్రంలో అవసరం లేదని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, దానికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా సాయం అందలేదని, వెంటనే కాళేశ్వరానికి జాతీయ హోదా ప్రకటించాలని, అన్ని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్రంలో ప్రతీ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల, మెడికల్ కళాశాల మంజూరు చేయాలన్నారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దుకు టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. ఆయన వెంట రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, మేయర్ పాపాలాల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వర్రావు, నాయకులు తాళ్లూరి భ్రహ్మయ్య, స్వర్ణకుమారి ఉన్నారు. -
ప్రమాదకరంగా మిషన్ భగీరథ గుంతలు
వేములవాడఅర్బన్: వేములవాడ అర్బన్ మండలంలోని గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి నల్లా ఏర్పాటు చేసేందుకు పైప్ లైన్ కోసం తవ్విన గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయి. గుంతలు తీసి రోజులు గడుస్తున్నా, పూడ్చకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తిప్పాపూర్ గ్రామంలోని వేములవాడ కరీంనగర్ రహదారిలోని సౌరల కాలనీ వద్ద రోడ్డు పక్కన గుంతలు తీసి సరిగా పూడ్చకపోవడంతో రాత్రిపూట ప్రమాదకరంగా ఉందని వాహనాదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వారం రోజుల క్రితం రహదారి వెంట వెళ్తున్న లోడ్‌తో ఉన్న లారీ రాత్రివేళ ఆ గుంతలో దిగబడి ఎటు వెళ్లకుండా అక్కడే నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే క్రేన్ సహాయంతో బయటికి తీశారు. అధికారులు స్పందించి వెంటనే రహదారుల వెంట ఉన్న మిషన్ భగీరథ గుంతలను పూర్తిగా పూడ్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
నిర్మల్ జిల్లా మోడల్ కాలనీలో లీకైన పైప్ లైన్
-
భగీరథ యత్నం
కొల్లాపూర్ : ఇంటింటికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలో మిషన్‌భగీరథ కోసం కృష్ణానది నీటిని ఎత్తిపోసేందుకు నెలరోజులుగా అధికారులు పనులు నిర్వహిస్తున్నారు. కృష్ణానది బ్యాక్‌వాటర్ ఆధారంగా నిర్మించిన మిషన్ భగీరథ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లాలో 3 నియోజకవర్గాల్లోని మొత్తం 81మండలాలకు రక్షిత తాగునీరు అందించేందుకు ఎల్లూరులో మిషన్ భగీరథ పనులు చేపట్టారు. రూ.5,478 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఎల్లూరు వద్ద రూ.120కోట్ల వ్యయంతో పంప్‌హౌజ్, ఫిల్టర్‌బెడ్స్ నిర్మించారు. ప్రతి ఏడాది 10 టీఎంసీల కృష్ణానది నీటిని వినియోగించే విధంగా పనులు పూర్తిచేశారు. ప్రాజెక్టుకు మొదట్లో కోతిగుండు ప్రాంతం నుంచి కృష్ణానది నీటిని పంపింగ్ చేయాలని అధికారులు భావించారు. తర్వాత కేఎల్ఐ ప్రాజెక్టులోని ఎల్లూరు రిజర్వాయర్ నుంచి నీటిని వాడుకునే విధంగా ప్రణాళికలు తయారుచేశారు. రెండు నెలలుగా నీటి సరఫరా.. కేఎల్ఐ ప్రాజెక్టులో భాగమైన ఎల్లూరు రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం కేవలం 0.35టీఎంసీలు మాత్రమే. కేఎల్ఐ ప్రాజెక్టు మోటార్ల ద్వారా ఈ రిజర్వాయర్‌ను నింపి, అక్కడి నుంచి మిషన్ భగీరథ పరిధిలోని గ్రామాలకు నీటిని సరఫరా చేపడుతున్నారు. ఈ ఏడాది జనవరిలోనే నీటివిడుదల చేపట్టాలని ప్రభుత్వం భావించినప్పటికీ పనుల్లో జాప్యం, సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యమైంది. అయితే ఇటీవల కొల్లాపూర్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు అధికారులు తాగునీటి సరఫరా చేపట్టారు. కొల్లాపూర్ మున్సిపాలిటీతో పాటు కొన్ని గ్రామాలకు రెండు నెలలుగా మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయి. ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తికావడంతో ఈ నెలాఖరులోగా మిషన్ భగీరథ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు నీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. తగ్గిన నీటిమట్టం కారణంగా.. కృష్ణానదిలో నీటిమట్టం తగ్గిపోవడంతో కేఎల్ఐ అప్రోచ్ చానల్‌కు నీళ్లు అందడం లేదు. రెండు నెలల క్రితం వరకూ కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీటిని పంపింగ్ చేసి ఎల్లూరు రిజర్వాయర్‌ను నింపారు. ఈ నీళ్లనే కొల్లాపూర్ నియోజకవర్గానికి సరఫరా చేస్తున్నారు. నెల వ్యవధిలోనే సగం రిజర్వాయర్ ఖాళీ అయ్యింది. అప్రోచ్చానల్కు నీళ్లు అందేలా కిలోమీటర్ లోపల అధికారులు అడ్డుకట్టలు వేశారు. అయినా పంపింగ్‌కు సరిపోయినన్ని నీళ్లు రాకపోవడంతో కేఎల్ఐ ప్రాజెక్టుకు 2.3కి.మీ.దూరంలో కోతిగుండు వద్ద అడ్డుకట్ట నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నెలరోజులుగా పనులు కోతిగుండు ప్రాంతంలో నది బ్యాక్‌వాటర్‌లో ప్రస్తుతం అడ్డుకట్ట నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.6కోట్ల నిధులు కేటాయించారు. నెల రోజులుగా పనులు కొనసాగుతున్నాయి. నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఎప్పటికప్పుడు పనుల ప్రగతిని సమీక్షిస్తున్నారు. అడ్డుకట్ట వేసిన ప్రాంతం వరకు విద్యుత్ లైనింగ్ పనులు చేపట్టారు. కేఎల్ఐ ప్రాజెక్టు సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసున్నారు. 150స్తంభాలను పాతారు. వైరింగ్ పనులు జరుగుతున్నాయి. అడ్డుకట్టపై 100హెచ్‌పీ సామ ర్థ్యం కలిగిన 25 పంప్మోటార్లను బిగించి నీటిని కేఎల్ఐ అప్రోచ్చానల్లోకి ఎత్తిపోసే విధంగా పనులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అడ్డుకట్టపై రోలింగ్ పనులు సాగుతున్నాయి. త్వరలోనే మోటార్ల ఏర్పాటు కృష్ణానది నీటిమట్టం తగ్గిపోవడంతో కోతిగుండు నుంచి పంప్ మోటార్ల ద్వారా మిషన్‌భగీరథకు నీటిని పంపింగ్ చేసే విధంగా పను లు చేపట్టాం. నీటి మట్టం తగ్గినప్పుడు ఈ కట్టపై మోటార్లు ఏర్పాటుచేసి పంపింగ్ చేస్తాం. వరదలు వచ్చే సమయానికి మళ్లీ మోటార్లను ఒడ్డుకు చేర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం అడ్డుకట్టను పటిష్టంగా నిర్మించేందుకు రోలింగ్ పనులు జరుగుతున్నాయి. మూడు రోజుల్లో మోటార్లు ఎల్లూరుకు చేరుకుంటాయి. త్వరగా పనులు పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. నీటి ఎత్తిపోత ప్రారంభమైన వెంటనే ప్రాజెక్టు పరిధిలోని మిగతా నియోజకవర్గాలకు కూడా నీటి సరఫరా చేపడతాం. – రాజు, డీఈఈ -
ఇది దుర్మార్గ పాలన: భట్టి విక్రమార్క
సాక్షి, ఖమ్మం : మిషన్ భగీరథ పేరుతో రాష్ట్రంలో భారీ కుంభకోణాలకు టీఆర్ఎస్ సర్కార్ పాల్పడుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో ఈ పథకాలేవీ నడవనీయకుండా చేసి కృత్రిమంగా నీటి ఎద్దడి పరిస్థితులను సృష్టిస్తున్నాయని భట్టి నిప్పులు చెరిగారు. సీపీడబ్ల్యూడీ పథకాలను నిర్వీర్యం చేసి మిషన్ భగీరథ లేకపోతే.. రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు లేదనే పరిస్థితులను తయారు చేస్తున్నారని అన్నారు. గత మూడేళ్లుగా.. ఈ సీపీడబ్ల్యూడీ పథకాలకు నిధులు విడుదల చేయడం లేదని, విద్యుత్ బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలిపేసిందని భట్టి తెలిపారు. కొత్తగా ఏర్పడిన ఖమ్మం జిల్లాలోనే దాదాపు రూ.30 కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టి.. ఎవరినీ పనిచేయనీకుండా ప్రభుత్వం చేస్తోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.600 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. మిషన్ భగీరథ కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల నిధులు వెంటనే విడుదల చేస్తూ.. వీటికి మాత్రం రూపాయి విడుదల చేయడం లేదని భట్టి నిప్పులు చెరిగారు. ఖమ్మం జిల్లాలొనే ఇటువంటి పథకాల్లో 340 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి 9 నెలలుగా జీతాలు లేవని చెప్పారు. దీనికి జిల్లా కలెక్టర్, మంత్రి, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని భట్టి డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ పేరు చెప్పుకుని.. దానిమీద 56 వేల కోట్ల రూపాయల్లో, కొన్ని వేల కోట్లు దోపిడీ చేసి ఆ సొమ్ముతో రాష్ట్ర రాజకీయాలపై పెత్తనం చేయాలని టీఆర్ఎస్ పార్టీ చూస్తోందని భట్టి తెలిపారు. నేను అసెంబ్లీకే పోటీ చేస్తా..! లోక్ సభకు పోటీచేస్తారని వస్తున్న వార్తలపై భట్టి విక్రమార్క స్పష్టమైన సమాధానం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను అసెంబ్లీకి మాత్రమే పోటీచేస్తానని ప్రకటించారు. తన కుటుంబం నుంచి మరెవ్వరూ ఎన్నికల్లో పోటీచేయరని తెలిపారు. -
సబ్బండవర్ణాల సంక్షేమపథంలో..
సందర్భం అంపశయ్య మీదున్న అన్నదాతకు ఊపిర్లు ఊది మళ్లీ పొలం మీదకు పంపే మహా ప్రయోగశాలగా తెలంగాణ నేడు దేశం ముందు నిలబడింది. సంచలనాలకు కేంద్రమైన కాళేశ్వరం ప్రాజెక్టు, దూపగొన్న ప్రతి గొంతును తడిపేందుకు మిషన్ భగీరథ, కులవృత్తుల పునర్జీవనం కోసం వివిధ పథకాలు భవిష్యత్తు బంగారు తెలంగాణ ముఖ చిత్రాన్ని ఆవిష్కరిస్తాయని సబ్బండ జాతులు కాంక్షిస్తున్నాయి. సబ్బండ వర్ణాల సంక్షేమ పథంలో ఈ ప్లీనరీ ఒక మేలిమలుపు కాగలదని అందరూ ఆశిస్తున్నారు. 1946 నుంచి 1951 వరకు ఎగసిన తెలంగాణ సాయుధ పోరాటం ప్రభావంతో తెలంగాణ ప్రజల్లో స్వీయ సామాజిక– సాంస్కృతిక స్పృహలు పెరిగాయి. 1956–71 మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఒక వర్గంలో విద్య, కొద్ది మేర ఆర్థిక కార్యకలాపాలు, మధ్యతరగతి జీవన ప్రమాణాలు పెరుగుతూ వచ్చాయి. మరో వర్గం తెలంగాణ వనరుల దోపిడీ వ్యతిరేకత, ఉమ్మడి రాష్ట్రంలో స్థానికేతరుల పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ నక్సలిజం వైపు మళ్లింది. ఈ ఉద్యమంతో తెలంగాణ సమాజం స్వీయ అస్తిత్వం, స్వీయ ఆర్థిక, రాజకీయ స్పృహలు బలపడ్డాయి. పై రెండు∙ఉద్యమాల కారణంగానే భూస్వామ్య పెత్తందారి వర్గాలు గ్రామాలను వదిలిపెట్టి పట్టణాలకు వలస పోయి అక్కడి సురక్షితమైన వ్యాపారాల్లోకి ప్రవేశించారు. దొరల పలాయనం పల్లెల్లో చదువులను, చైతన్యాలను పెంచాయి. సామాజిక, రాజకీయ చైతన్యం పురివిప్పుకుంది. ఇవన్నీ కలగలిసి తెలంగాణ ప్రాంతంలో ఒక యువతరం ఉనికిలోకి వచ్చింది. తెలంగాణవాద సోయికి ఇదో పునాది. 1991– 2001 మధ్య కాలం వచ్చేసరికి అనేక కారణాలతో నక్సలిజం బలహీనపడుతూ ఆయుధం పట్టిన యువకుల వలసలు జనజీవన స్రవంతిలోకి మళ్లాయి. కానీ వారిలోని మానసిక అలజడి మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చింది. తొలి నాళ్లలో సాయుధ పోరాట చైతన్యం, ఉనికిలోకి వచ్చిన యువతరం,మాజీ నక్సల్ తరం, ఏళ్లకేళ్లుగా దోపిడీకి మగ్గిన తరం అందరూ కలిసి నీళ్లు, నిధులు, నియామకాలను ఒక అనువైన నినాదంగా తీసుకున్నారు. ఈ నినాదాన్ని అందుకొనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితికి పురుడు పోశారు. ఆ కాల్పులే మహోద్యమానికి నాంది 2001లో సిద్దిపేటలో జరిగిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకల వేదిక మీద తొలిసారి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన తీసుకు వచ్చారు. అంతకు ముందు బషీర్‌బాగ్ వద్ద విద్యుత్తు ధరల తగ్గింపు కోసం ఆందోళన చేస్తున్న రైతులపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఈ ఘటనతో తీవ్రంగా చలించిన కేసీఆర్ బూరుగుపల్లి సభా వేదిక నుంచే అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి ప్రత్యక్షంగా రాష్ట్ర సాధన ఉద్య మానికి అంకురార్పణ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర ధనికవర్గాల ఆధి పత్యంపై 1950 నుంచి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అటువంటి ఘర్షణలను దోపిడీ పట్ల వ్యతిరేకత అనే ముద్రతోనే చూశారు తప్ప తెలం గాణ జాతి స్పృహగా గుర్తించలేదు. 1956 నుంచి 2001 వరకు తెలంగాణ ప్రాంతం కోసం, ప్రజల కోసం నిలబడిన నేతలను వేళ్ల మీద లెక్కపెట్ట వచ్చు. అలా నిలబడిన వారు కూడా వ్యక్తులుగానే ఉన్నారు. ఆæక్రమంలో టీఆర్ఎస్ ఆరంభం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు జీవం పోసింది. అక్కడ మొదలైన రాష్ట్ర ఏర్పాటు పోరాట ప్రస్థానం 13 ఏండ్లకు సాకా రమైంది. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష సిద్ధించింది. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి మరోమారు పార్టీ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నది. గతంలో జరిగిన ప్లీన రీలు పార్టీగా స్వరాష్ట్ర ప్రజలకు ఏం చేయాలన్న దానిపై దిశానిర్దేశం చేసుకునేం దుకు జరిగినవి అయితే, ఇప్పుడు జరుగుతున్న ప్లీనరీలో ప్రజలకు ఏం చేశా మన్న దానిపై సమీక్ష జరుపుకోవాల్సి ఉన్నది.. రైతులకు సాగునీరు, విద్యుత్‌ను అందించేందుకు, వారికి ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు గత నాలుగేళ్లలో జరి గిన నిర్విరామ కృషి బంగారు తెలంగాణ నిర్మాణానికి ఎన గర్రలుగా నిలబ డ్డాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇదే వేగంతో కొనసాగితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని సబ్బండ వర్ణాలు భావిస్తున్నాయి. మన పాలన మన చేతికి వచ్చే నాటికే వ్యవసాయం, కుల వృత్తుల విధ్వంసం జరిగిపోయింది. తెలంగాణ పల్లెలో ఇప్పటికీ బోర్లు వేస్తే.. 1000 ఫీట్లు లోతుకు వెళ్లినా నీళ్లు రాని దుస్థితి. ఒక బోరు వేసినప్పుడు నీళ్లు రాక పోతే ఇంకో బోరు వేయటం.. ఇలా నీటి చెమ్మ కోసం ఐదు.. పది.. పదిహేను బోర్లు వేసి రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు. నల్లగొండ జిల్లా మూసంపల్లిలో బైరా రామిరెడ్డి అనే రైతు 54 బోర్లు వేసి బోర్ల రామిరెడ్డి అయ్యాడని సీఎం కేసీఆర్ 2015 సెప్టెంబర్ మాసంలో జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించి రైతు కన్నీటి నీటి గోస ఎలా ఉందో విడమరిచి చెప్పారు. కృష్ణా, గోదావరి నదులలో తెలంగాణకు 1257 టీఎంసీల వాటా ఉందని అధికారిక నివేదికలు చెప్తున్నాయి. ఇందులో 954 టీఎంసీలు గోదా వరి నుంచి, 299 టీఎంసీలు కృష్ణానది నుంచి. మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ కలిపి తెలంగాణకు 1071 టీఎంసీల జలాలు ఇచ్చినట్టు ఉమ్మడి రాష్ట్ర పాలకులు నివేదికల్లో పొందుపరిచారు. కాళేశ్వరం ఒక సంచలన ప్రయోగశాల అయితే తెలంగాణలో అందుబాటులో ఉన్న సాగు భూమికి రకరకాల లెక్కలు ఉన్నాయి. అడవులు, గ్రామ కంఠాలు పోను ఒక కోటీ 11లక్షల ఎకరాల వ్యవ సాయ భూమి ఉంది. మరి 1071 టీఎంసీల కేటాయింపులు చేస్తే కోటి ఎకరాల మాగాణి నీళ్లెందుకు పారలేదనేది బేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పుడు వాటా జలాలను సంపూర్ణంగా మన బీడు భూముల్లోకి మళ్లించు కునే ప్రయత్నం జరుగుతోంది. గోదావరి, కృష్ణా నదుల మీద 23 ప్రాజెక్టుల నిర్మాణానికి రూపకల్పన జరిగింది. ఇందుకోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు జరుగుతోంది. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాస ప్రాజెక్టు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల, దేవాదుల, ప్రాణహిత, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, జూరాల, కోయిల్ సాగర్, ఎస్సా రెస్పీ1,2, ఆర్డీఎస్, ఎస్సెల్బీసీ, ఎల్లంపల్లి, కంతనపల్లి ప్రాజెక్టులకు రూపం వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా రూపం దాల్చకముందే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది సందర్శించిన జల ప్రాజెక్టుగా రికార్డు కొట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 5,683 మెగావాట్ల విద్యుత్తు సామ ర్థ్యం ఉంది. అందులో అనేక సాంకేతిక కారణాలతో ఎప్పుడూ 2,500 మెగా వాట్లకు మించి వాడుకోలేని పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో వేసవిలోనైతే వ్యవ సాయానికి 1,000 మెగావాట్లు కూడా అందేది కాదు. నాలుగేళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే రూ. 5500 కోట్ల ఖర్చుతో 24 గంటల నాణ్యమైన నిరంతరాయ విద్యుత్తును రైతాంగానికి ప్రభుత్వం అందిస్తోంది. ఒకప్పుడు వ్యవసాయ కరెంటు కోసం రోడ్డెక్కిన రైతులు ఇప్పుడు 24 గంటల కరెంటు వద్దు అనే పరిస్థితిలోకి వచ్చారు. భూపాలపల్లి కేటీపీపీ నుంచి 600 మెగావాట్లు, జైపూర్ సింగరేణి పవర్ ప్రాజెక్టు నుంచి 1,200 మెగావాట్లు, థర్మల్ పవర్‌టెక్ ద్వారా 840 మెగావాట్లు, సెంట్రల్ జనరేటింగ్ సిస్టం ద్వారా 550 మెగావాట్లు, జూరాల హైడ్రోపవర్ ప్రాజెక్టు నుంచి 240 మెగావాట్లు, పులిచింతల ప్రాజెక్టు నుంచి 30 మెగావాట్లు, సోలార్ పవర్ నుంచి 1080 మెగావాట్లు, విండ్ పవర్ నుంచి 99 మెగావాట్లు మొత్తం కలిపి ఈ నాలుగేళ్లలో మరో 5,039 మెగావాట్ల విద్యుత్తు అదనంగా ప్రభుత్వం అందుబాటులోకి వచ్చింది. ఈలోగా రైతులను ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించే సూక్ష్మ ప్రణాళికలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయి.. కళ్యాణ లక్ష్మి పథకం అమలు ఇందులో భాగమే. పేదింటి ఆడబిడ్డ సగౌరవంతో అత్తవారింట అడుగు పెట్టేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ అమల్లోకి వచ్చాయి. మొదట దళిత, గిరిజను లకు మాత్రమే పరిమితమైన పథకాన్ని వెనుకబడిన అన్ని వర్గాలకు విస్తరిం చారు. రూ 50001 నుంచి రూ ఒక లక్షా నూట పదహార్లకు పెంచారు. పెళ్లితోనే అయిపోలేదు. తెలంగాణ పల్లెల్లో బిడ్డ మొదటి పురుడు తల్లిగారింట్లోనే జర గాలనే ఆచారం ఉంది. బిడ్డను ప్రయివేటు ఆసుపత్రికి తీసుకొని పోయి కాన్పు చేసుకొని తల్లీబిడ్డను ఇంటికి తీసుకొచ్చుకునేసరికి మరో రూ 40 వేలు ఖర్చు. రైతుకు ఈ బాధ తప్పించడానికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రయివేటుకు దీటుగా అధునాతన వైద్య, మిషనరీ సౌకర్యాలు కల్పించారు. తల్లీ బిడ్డలకు రూ 16 వేలను అందిస్తున్న కేసీఆర్ కిట్ పథకం మాతృ శిశు సంక్షేమం కోరుకుంటోంది. నా నియోజకవర్గం దుబ్బాకలో ఒకప్పుడు తొండలు గుడ్లు పెట్టిన ప్రభుత్వ ఆసు పత్రిలో ఈ రోజు నెలకు కనీసం 40కి పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన చూస్తే రైతుకు పెళ్లి భారం రూ ఒక లక్షా నూట పదహార్లు, పురుడు రూ 40 వేలు, దానికి వడ్డీ భారం తప్పి, ఇప్పుడు జన్మనిచ్చిన తల్లి చేతికే రూ. 14 వేలు అందుతున్నాయి. అన్నదాతలకు సరికొత్త ఊపిరి భగీరథ ఊట బావులు, చెరువులు, చెలిమెలు తప్ప మరో నీటి వనరు లేని ప్రాంతం తెలంగాణ. అయినా నేలను దున్ని బతకటం తప్ప మరో గత్యంతరం లేదు. అందుకే ముందుగా చెరువులు బాగు చేసే పనులు పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల చెరువులను, కుంటలను పునర్నిర్మాణం చేసే మహా యజ్ఞం చేపట్టారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో, భూగర్భ జలాలతో కలిపి 500 టీఎంసీల నీళ్లు నిల్వ చేసినట్టే అని జాతీయ పరిశోధక సంస్థలు వెల్ల డించాయి. భూస్వామి ఇంటి ముందే కాదు, దళిత, గిరిజనుల ఇళ్ల ముందూ ట్రాక్టర్లను నిలబెట్టింది. యంత్రలక్ష్మీ పథకం కింద వ్యవసాయ పరికరాలను రైతులకు ఇవ్వడం కోసం గత మూడేళ్ళలో రూ.1,109 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. రైతుబంధు పథకం ద్వారా రాష్ట్ర రైతులకు పెట్టుబడిగా ఎకరాకు రూ. 4000 ఇవ్వనుండటం అద్భుతం. వచ్చే వానాకాలం నుంచే ఈ పథకం అమలవుతోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి బడ్జెట్లో రూ. 12,000 కోట్లు కేటాయించారు. మే 10 నుండి వారం రోజులు 58 లక్షల మంది రైతులకు చెక్కులను పంపిణీ చేస్తారు. పట్టెడన్నం పెట్టే అన్నదాత పురుగుల మందు బారిన పడకుండా, అప్పులు తీరి, ఆదాయం పెరిగి, రైతులు ఆత్మాభిమా నంతో బతకాలన్నదే కేసీఆర్ ఆలోచన. అంపశయ్య మీదున్న అన్నదాతకు ఊపిర్లు ఊది మళ్లీ పొలం మీదకు పంపే మహా ప్రయోగశాలగా తెలంగాణ వేదిక అయింది. దూపగొన్న ప్రతి గొంతును తడిపేందుకు మిషన్ భగీరథ, కుల వృత్తుల పునర్జీవనం కోసం గొర్రెల పథకం, చేపల పెంపకం, గీత, నేత న్నలకు వరాలు అన్నీ కలిసి భవిష్యత్తు బంగారు తెలంగాణ ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తాయని సబ్బండ జాతులు కాంక్షిస్తున్నాయి. (నేడు తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సందర్భంగా) -సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు మొబైల్ : 94403 80141 -
భగీరథ పైపులు బుగ్గిపాలు
రామకృష్ణాపూర్(చెన్నూర్): రామకృష్ణాపూర్లో మంగళవారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మిషన్ భగీరథ పైపులు బూడిదయ్యాయి. పట్టణంలోని బీజోన్ ఆర్కే4 గడ్డ ప్రాంతంలో గల ఆట స్థలంలో మిషన్ భగీరథ పనుల కోసం పైపులు నిల్వ ఉంచారు. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ప్రేంకుమార్ సంఘటన స్థలానికి చేరుకుని చుట్టుపక్కల ప్రజలను అప్రమత్తం చేశారు. మంచిర్యాల, బెల్లంపల్లి ఫైర్ సిబ్బందితో పాటు సింగరేణి రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకునే లోపు పెద్ద ఎత్తున పొగలు కమ్ముతూ మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో సమీపంలోకి వెళ్లడానికి ఫైర్ సిబ్బంది ఇబ్బందిపడ్డారు. నీళ్లు సరిపోక పోవడంతో సమీపంలోని సీఎస్పీకి వెళ్లి ఫైర్ ఇంజన్లలో నీరు నింపుకుని వచ్చారు. అప్పటికే మంటలు మరింత ఉధృతమయ్యాయి. సింగరేణి రెస్క్యూ స్టేషన్ సభ్యులు మంటలు వ్యాప్తి చెందకుండా తక్షణమే నివారించే అక్వైర్డ్ ఫిల్మ్ ఫామ్డ్ ఫోమ్‌ను నీటితో పాటు సమాంతరంగా వినియోగించడంతో కొంతమేరకు మంటలు అదుపులోకి వచ్చాయి. సమీపంలోనే ఉన్న మిగతా పైపులను సర్పంచ్ జాడి శ్రీనివాస్, జెడ్పీటీసీ సుదర్శన్‌గౌడ్, ఓసీ డాట్ కంపెనీ మేనేజర్ సత్యనారాయణ, వార్డు సభ్యులు శశి, సత్యనారాయణ, రాజు, లక్ష్మారెడ్డి తదితరులు స్థానిక యువకులతో కలిసి దూరంగా తరలించారు. ఈ ఘటనతో స్థానికులు హడలిపోయారు. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే సమీపంలోని ఇండ్లకు మంటలు వ్యాపించి పెనుప్రమాదం జరిగి ఉండేదని ఆందోళన చెందారు. ఇంత నిర్లక్ష్యమా..? రూ.కోటికి పైగా విలువ చేసే మిషన్ భగీరథ పైపులను ఎలాంటి భద్రత కల్పించకుండా ఆట స్థలంలో ఉంచడం, వాటిపై నిర్లక్ష్యం కనబర్చడం గమనార్హం. మంటలు చుట్టు పక్కల ప్రాంతంలోని ఇండ్లపైకి వ్యాపించి ఉంటే ఎవర బాధ్యత వహించేవారని స్థానికులు మండిపడ్డారు. ఇప్పటికైనా పైపులను సరైన చోట భద్రపర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిప్పు పెట్టి ఉంటారు : ఎస్ఈ ప్రకాశ్‌రావు సంఘటన స్థలాన్ని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రకాశ్‌రావు ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. ప్రమాదవశాత్తు ఘటన జరిగి ఉంటుందని తాము భావించటం లేదని, ఎవరో నిప్పు పెట్టి ఉంటారనే భావిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. సరైన గోడౌన్లు లేని కారణంగానే పైపులను భద్రతపర్చడం ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. ఈఈ శ్రీనివాస్, డీఈలు విద్యాసాగర్, అబ్రహాం, రమణారావు తదితరులు ఘటనా స్థలిని సందర్శించారు. -
సీఎం సాహసానికి ప్రతీక..‘మిషన్’భగీరథ
సూర్యాపేటరూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసానికి మిషన్ భగీరథ ప్రతీక అని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖా మాత్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గ్రామం వద్ద జరుగుతున్న మిషన్ భగీరథ పనులను కలెక్టర్ కే.సురేంద్రమోహన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 5 నాటికి ట్రయల్‌రన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులు , కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మంచినీటి కోసం తెలంగాణ ఆడపడుచులు రోడ్డు ఎక్కొద్దనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. పథకంగడువు 2018 చివరి వరకు ఉన్నప్పటికీ అనుకున్న దానికి ముందే పనులు శర వేగంగా పూర్తవుతున్నాయన్నారు. ఒక పక్క అధికారులు , మరో పక్కన ప్రజాప్రతినిధులు రేయింబవళ్లు ఏజెన్సీల వెంట పడడంతో పాటు వేసవిలో ప్రజలకు దా హార్తి సమస్య తలెత్తకుండా ఉండేందు కు పడ్డ శ్రమకు తగ్గ ఫలితాలు త్వరలోనే అందబోతున్నాయని తెలిపారు. అందులో భాగంగానే మే 5న సూర్యాపేటకు నాగా ర్జున్‌సాగర్ టెయిల్‌పాండ్ నుంచి అందించనున్న మంచినీటిని సూర్యాపేట సమీ పంలోని ఇమాంపేట నీటిశద్ధి కేం ద్రం వద్ద ట్రయల్‌రన్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా పైప్‌లైన్ వద్ద ఎన్ని గ్యాప్‌లు ఉన్నాయో పరిశీలించి ప్రతి గ్యాప్ వద్ద కచ్చితంగా ఒక టీమ్‌ను ఏర్పాటు చేసే పనులను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని ఆదేశిం చారు. అనంతరం ఉర్లుగొండ గుట్టపై నిర్మిస్తున్న వాటర్ డిస్ట్రిబ్యూటర్ ట్యాంక్‌ను పరిశీలించారు. పర్యటనలో మిషన్ భగీరథ సూపరింటెండెంట్ మధుబాబు, ఈఈ వెంకటేశ్వర్లు, మోహన్‌రెడ్డి, గ్రం థాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనువాస్ గౌడ్, డీఈ నరేష్ పాల్గొన్నారు. -
కమీషన్ల కోసమే ‘మిషన్ భగీరథ’
సదాశివనగర్(ఎల్లారెడ్డి): కమీషన్ల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్‌భగీరథ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని శాసనసభ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. గురువారం మండలంలోని వజ్జపల్లి తండా, యాచారం గ్రామాల్లో జరిగిన పెళ్లి వేడుకలకు ఆయన హాజరై ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లక్షా 54వేల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అట్టి పనులను ఆపేశారన్నారు. ఈ పనులు చేస్తే షబ్బీర్‌కు ఎక్కడ పేరు వస్తదోనని భయపడి పోయారన్నారు. పలుమార్లు ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుపోవడం వల్ల మళ్లీ పనులు ప్రారంభించారన్నారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే గిరిజనులకు సంబంధించిన సాగు భూములను లాక్కుంటారన్నారు. గిరిజనులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్పి, కాంగ్రెస్‌కు పట్టంగట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట కేవలం వజ్జపల్లి తండాలో 40ఇళ్లను ఒకేసారి కట్టించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒకే దఫాలో రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామన్నారు. యాచారం శివారులో నిర్మిస్తున్న ప్రాణహిత చెవెళ్ల కెనాల్ నిర్మాణంలో భాగంగా 40 ఎకరాల సాగు భూమిని రైతులు కోల్పోతున్నారన్నారు. ఆ భూమికి ప్రభుత్వం రైతుకు సమ్మతమైన ఒక ధరను నిర్ణయించి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జీ నల్లమడుగు సురేందర్, నాయకులు సుభాష్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, జమునా రాధోడ్, మండలాధ్యక్షుడు బద్దం శ్రీనివాస్ రెడ్డి, ఎస్టీసెల్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ నాయక్, యాచారం సర్పంచ్ సాజ్య నాయక్, నాయకులు బాల్‌రాజ్, కైలాస్ శ్రీనివాస్, ప్రతాప్‌సింగ్, నాయిని సాయన్న, అడ్డగుల్ల సురేశ్ తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్యను తీర్చండి సారూ... తండాలో గత రెండేళ్లుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తాగునీటి సమస్య లేకుండా చూడాలని గురువారం వజ్జపల్లి తండాకు వచ్చిన షబ్బీర్అలీకి తండాకు చెందిన మహిళలు మొరపెట్టుకున్నారు. తండాకు 3కి.మీ మీటర్ల దూరంలో బోరు వేస్తే నీళ్ల వస్తాయని, అక్కడి నుంచి పైప్‌లైన్ వేయించాలని కోరారు. బోరు వేయాలని తర్వాత పైప్‌లైన్ సంగతి నేను చూసుకుంటానన్నారు. -
జటిలం!
వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాల్సి ఉంది. ఈ ఏడాది మార్చిలోగా అన్ని జనావాసాలకు ‘మిషన్ భగీరథ’ ద్వారా తాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ‘మిషన్ భగీరథ’ పథకం పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం చాలా చోట్ల ప్రారంభం కాలేదు. మిషన్ భగీరథ ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో వేసవిలో తాగునీటి సరఫరా అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో మొదలైన తాగునీటి సమస్యపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్... సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో రెండున్నర వేలకు పైగా జనావాసాలు ఉన్నాయి. వీటిలో 1,700కు పైగా జనావాసాల్లో మాత్రమే సంపూర్ణంగానో, పాక్షికంగానో వివిధ తాగునీటి పథకాల ద్వారా సరఫరా అవుతోంది. గ్రామీణ ప్రాం తాల్లో సీపీడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఎస్, ఎంపీడబ్ల్యూఎస్ తదితర పథకాల కిం ద గ్రామీణ నీటి సరఫరా విభాగం తాగునీటిని అందిస్తోంది. తాగునీటి పథకాలు, బోరు మోటార్లు లేని చోట చేతి పంపులు దాహార్తిని తీరుస్తున్నా యి. ఏటా వేసవిలో భూగర్భ జలా లు అడుగంటుతుండడంతో తాగునీ టి పథకాలు వట్టిపోతున్నాయి. ప్రస్తు తం ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సగటు భూగర్భ జలమట్టం ఉపరితలం నుంచి 16.07 మీటర్లుగా నమోదైంది. వేసవిలో మే నాటికి భూగర్భ జలమట్టం 17 నుంచి 19 మీటర్ల లోతుకు పడిపోయే అవకాశం ఉంది. సింగూరు నుంచి ఈ ఏడాది దిగువకు నీటిని విడుదల చేయడంతో ప్రస్తు తం ప్రాజెక్టులో 13 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీంతో మంజీ ర తీర ప్రాంత గ్రామాలతో పాటు గిరిజన తండాలు, మారుమూల గ్రా మాల్లో తాగునీటి సమస్య తీవ్ర రూ పం దాలుస్తోంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని నారాయణఖేడ్, హత్నూ ర, ఆర్సీపురం, జహీరాబాద్, రాయికోడ్ తదితర మండలాల్లో ఇప్పటికే సగటు భూగర్భ జలమట్టం 19 మీట ర్ల లోతున ఉంది. మెదక్ జిల్లా రామాయంపేట, చిన్నశంకరంపేట, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, ములుగు ప్రాంతాల్లోనూ భూగర్భ జల మట్టం వేగంగా పడిపోతోంది. పూర్తి కాని మిషన్ భగీరథ మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ఇంటింటికీ తాగునీరు అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్ర స్థాయి లో పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. సింగూరు రిజర్వాయర్ వ ద్ద ఇంటేక్వెల్తో పాటు ఫిల్టర్‌బెడ్ ప నులు పూర్తయినా.. గ్రామాల్లో అం తర్గత పైపులైన్ల పనులు జరగడం లేదు. ♦ సంగారెడ్డి జిల్లాలో ‘ఇంట్రా విలేజి’లో భాగంగా మొదటి దశలో రూ. 57.48 కోట్లతో మునిపల్లి, న్యాలకల్, ఝరాసంగం మండలాల్లో పనులు జరుగుతున్నాయి. మిగతా మండలా ల్లో రూ.335.41 అంచనా వ్యయంతో రెండో దశ పనులు ప్రారంభమయ్యా యి. రేట్లు గిట్టుబాటు కావడం లేదనే కారణంగా కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. మిషన్ భగీరథలో కీలకమైన ఓహెచ్ఎస్ఆర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.335.41 కోట్ల అంచనా వ్యయంతో 794 ఓహెచ్ఎస్ఆర్లు మంజూరు కాగా, కేవలం 400 ట్యాంకుల నిర్మాణం జరుగుతోంది. ♦ మెదక్ జిల్లాలో ఇంట్రా విలేజీలో మొదటి దశలో నర్సాపూర్ సెగ్మెంట్ లో రూ.69.61 కోట్లు, గజ్వేల్ సెగ్మెం ట్లో రూ.47.04 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. రెండో దశలో రూ. 178.43 కోట్ల పనులు చేపట్టినట్లు చెబుతున్నా పురోగతి లేదు. ‘ఇంట్రా గ్రిడ్’ కింద 22 మండలాలకు 376 ఓహెచ్ఎస్ఆర్లు మంజూరు కాగా, 241 పనులు పురోగతిలో ఉన్నాయి. ♦ సిద్దిపేట జిల్లాలో 487 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లకు గాను వంద పనులు పురోగతిలో ఉన్నాయి. ఇంట్రాలో భాగంగా 2,574 కిలోమీటర్ల మేర పై పులైను వేయాల్సి ఉండగా, చాలా గ్రా మాల్లో పనులు ప్రారంభం కాలేదు. వేసవి కార్యాచరణ ఏదీ? భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతుండడం, తాగునీటి పథకాలు వట్టి పోతుండడంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఏటా ‘వేసవి కార్యాచర ణ ప్రణాళిక’ సిద్ధం చేస్తోంది. విపత్తు నివారణ నిధి (సీఆర్ఎఫ్) ట్యాంకర్ల ద్వారా రవాణా, బోరు బావులను అద్దెకు తీసుకోవడం ద్వారా తాగునీటి గండం నుంచి జనావాసాలు గట్టెక్కుతున్నాయి. మరోవైపు నాన్ సీఆర్ఎఫ్ నిధి నుంచి చేతి పంపుల మరమ్మతు, బోరు బావుల్లో పూడిక తీత, లోతు చేయడం, బోరు మోటార్ల మరమ్మ తు, పైపులైన్లు పొడగింపు వంటి పను లు వేసవి కార్యాచరణ ప్రణాళికలో పొందు పర్చాల్సి ఉంటుంది. ఈ ఏడా ది మార్చి నాటికి ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని జనావాసాలన్నింటికీ మిష న్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటి సరఫరాకు ప్రభుత్వం ఆదేశించిం ది. ఈ పథకంలో అత్యంత కీలకమైన మెయిన్ ట్రంక్ (ప్రధాన పైపులైను) పనులు మాత్రమే పూర్తి కాగా, ఓహెచ్ఎస్ఆర్, ఇంట్రా (అంతర్గత పైపులైన్) పనులు చాలాచోట్ల అసంపూర్తిగా ఉ న్నాయి. కార్యాచరణ ప్రణాళిలో భాగంగా నీటి ఎద్దడి ఎదురయ్యే జనావాసాలను ముందస్తుగా గుర్తించాల్సి ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాలు, స్థానికంగా అందుబాటులో ఉండే నీటి వనరులు, చేతి పంపుల మరమ్మతు, రవాణాకయ్యే ఖర్చును అంచనా వేయాలి. ఎన్ని జనావాసాలకు రవాణా చేయాల్సి ఉంటుంది. మిషన్ భగీరథ నీరు ఇస్తున్నందున వేసవి కార్యాచరణ అవసరం లేదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. -
మిషన్‌లో వేగం పెంచండి
వికారాబాద్ అర్బన్ : మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్లో మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, రోడ్లు భవనాల శాఖ, నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ రహదారుల వెంబడి పైపులైన్లు వేసేందుకు తవ్విన రోడ్లకు వెంటనే ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే, గుంతలను వెంటనే పూడ్చి వేయాలని చెప్పారు. ఫిబ్రవరి నెలాఖరుకు పైపులైన్లు వేసి పనులు పూర్తి చేయాలని సూచించారు. రోడ్లు తవ్వే సమయంలో ఆర్అండ్బీ అధికారుల సమన్వయంతో పనులు పూర్తి చేయాలన్నారు. ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే తనను సంప్రదించాలన్నారు. జాతీయ రహదారుల వెంట పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఆర్ అండ్‌బీ ఈఈ ప్రతాప్, జాతీయ రహదారి ఈఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఈఈ వెంకటేశ్వర్ రావు, వాటర్ గ్రిడ్ ఈఈ నరేందర్, ఇరిగేషన్ ఈ ఈ చంద్రశేఖర్, ఏఈలు, డీఈలు పాల్గొన్నారు. -
మిషన్లలో ప్రాణాలు హరీ
యంత్రాలు (మిషన్) ఉత్పత్తికే కాదు మానవుల ప్రాణాలు తీయడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. పని ప్రదేశాల్లో సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో కార్మికులకు భద్రతా కరువైంది. కార్మిక శాఖ నిబంధనలు ఉన్నా బేఖాతరు చేస్తూ కార్మికులతో ప్రమాదకర పనులు చేయిస్తున్నారు వ్యాపారులు. దీంతో కార్మికుల ప్రాణాలు గాలిలో దీపాలయ్యాయి.గాలిలో దీపంలా కార్మికుల ప్రాణాలు అసంఘటితరంగ కార్మికులకు రక్షణ శూన్యం తరచు ప్రమాదాల బారిన కష్టజీవులు పట్టించుకోని కార్మిక శాఖ అధికారులు, పోలీసులు మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న వైనం పరిగి : ప్రభుత్వం చేపడుతున్న మిషన్ భగీరథ పనులు కార్మికుల జీవితాలను కాటేస్తున్నాయి. అసంఘటిత కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఒక్క పరిగి మండలంలోనే భగీరథకు సంబంధించి పనుల్లో ఇప్పటివరకు 4 సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు మృతిచెందగా, మరో ఇద్దరు జిల్లావాసులు బలయ్యారు. పని ప్రదేశంలో హక్కులు కానరావు. కార్మికుల రోదనలు అరణ్యరోదనలే. స్టీల్ కంపెనీలు, మిషన్ భగీరథ పనులు, పౌల్ట్రీ ఫాంలు, రోడ్డు నిర్మాణ పనులు, ఇటుక తయారీ బట్టీలు ఇలా పని చేసే చోటేదైనా.. కాంట్రాక్టర్లు, యాజమాన్యాలు కార్మికుల హక్కులు కాలరాస్తూనే ఉన్నాయి కార్మికులు తరచూ మత్యువాత పడుతున్నా.. వారికి ఇవ్వాల్సిన కూలీ డబ్బులు ఇవ్వకున్నా.. పనిప్రదేశంలో వేధింపులకు గురిచేసినా.. పట్టించుకునే వారు లేరు. తరచూ కార్మికుల మృతితో అసంఘటిత కార్మికుల్లో కలకలం రేపుతోంది. కార్మిక అధికారులు, పోలీసులు పని ప్రదేశాల్లో మత్యువాత పడుతున్న అసంఘటిత కార్మికుల్లో అక్కడక్కడ స్థానికులు ఉంటున్నప్పటికీ.. ఎక్కువ శాతం ఉత్తారాది రాష్ట్రాల వారే ఉంటున్నారు. స్థానికంగా పరిచయాలు లేకపోవడంతో.. అధికారులు పట్టించుకోకపోవడంతో పని ప్రదేశంలో ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదాలు చోటుచేసుకుంటే గుట్టుచప్పడు కాకుండా మృతదేహాలను తరలించి యాజమాన్యాలు, కంపెనీలు చేతులు దులుపేసుకుంటున్నాయి. కార్మికులు, వారి కుటుంబాలకు మద్దతుగా నిలవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. పని ప్రదేశంలో కార్మికులు మత్యువాతపడినా.. వైకల్యం పొందినా.. వారికి పనికి తగ్గ వేతనాలు ఇవ్వకపోయినా.. కూలీ డబ్బులు ఎగ్గొట్టినా.. కార్మిక శాఖ పర్యవేక్షణ లేదు. పోలీసులు ప్రమాదాలు జరిగినప్పుడు కేసులు నమోదు చేసేందుకు కూడా వెనకాడుతున్నారు. అధికార యంత్రాంగం కాంట్రాక్టర్లకు, కంపెనీ యాజమాన్యాలకే వంత పాడుతున్నారు. నాలుగు ఘటనలు పని ప్రదేశంలో మృత్యువాత పడడం.. వికలత్వం రావడం తరచు జరుగుతున్నాయి. చాలా కేసులు ఉంటున్నా వీటిల్లో చాలా తక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క మిషన్ భగీరథ పనుల్లోనే ఇటీవల నాలుగు ఘటనలు చోటుచేసుకున్నాయి. గత అక్టోబర్‌లో కాళ్లాపూర్ సమీపంలో మిషన్ భగీరథ పనుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికుడు దిలీప్‌సింగ్ మృతిచెందాడు. తాజాగా గత బుధవారం జాపర్‌పల్లిలో కార్మికుడు జిగార్ అలీ మృతిచెందాడు. వీరిద్దరు రాత్రి సమయంలోనే పనులు చేస్తూ మృతి చెందారు. తొండపల్లి సమీపంలో ఒకరు, సయ్యద్ మల్కాపూర్ సమీపంలో ఒకరు మిషన్ భగీరథ పనుల్లో వినియోగించే క్రేన్ తగలడంతో మృత్యువాత పడ్డారు. పరిగి, పూడూరు మండలాల పరిధిలో ఉన్న స్టీల్ కంపెనీల్లోనూ తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పని ప్రదేశంలో కార్మికులకు రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిపై కార్మిక శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. -
పంచాయతీ వ్యవస్థ పటిష్టం
సాక్షి, హైదరాబాద్: పంచాయతీలను మరింత పటిష్టం చేస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మిషన్ భగీరథ, నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పంచాయతీల ఖర్చు గణనీయంగా తగ్గుతుందన్నారు. బుధవారం సర్పంచుల సమ్మేళనం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 30 జిల్లాల నుంచి 180 మంది సర్పంచ్‌లతోపాటు కమిషనర్ నీతూ ప్రసాద్, సెర్ప్ సీఈవో పౌసమి బసు, అధికారులు రామారావు, వెస్లీ, శేషాద్రి హాజరయ్యారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ, పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, వాటిని మరింత బలోపేతం చేసేదిశగా ముందుకు పోతున్నామన్నారు. పంచాయతీల వ్యయభారాన్ని తగ్గించి ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వమే పెద్ద ఎత్తున చేపడుతుందన్నారు. హైదరాబాద్ మినహా తెలంగాణలోని 30 జిల్లాలను 3 ప్రాంతాలుగా విభజించి, ప్రతి ప్రాంతంలోనూ ఒక సర్పంచ్ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. రీజియన్ 1లో భాగంగా ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, కుమ్రంభీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు సంబంధించిన సర్పంచులతో సమ్మేళనం జరగనుంది. రీజియన్ 2లో జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్, నాగర్ కర్నూలు, నల్గొండ, రంగారెడ్డి,సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల సర్పంచులతోనూ, రీజియన్ 3లో భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్(అర్బన్– రూరల్),యాదాద్రి, జిల్లాల సర్పంచులతోనూ సమ్మేళనాలు జరుగుతాయన్నారు. నాబార్డ్, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాలకింద చేపడుతున్న రోడ్లు, వంతెనల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ అభ్యంతరాలతో ఆగిన పనులకు సంబంధించి త్వరలోనే అటవీ మంత్రి, అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. -
ప్రజలు సహకరిస్తేనే అభివృద్ధి
కలెక్టర్ యోగితా రాణా మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణ పనుల ప్రారంభం ఆర్మూర్అర్బన్ : ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు ప్రజలు సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ యోగితా రాణా అన్నారు. ఆర్మూర్ మండలంలోని కోమన్‌పల్లిలో మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందించే పైపులైను నిర్మాణాన్ని కలెక్టర్ యోగితా రాణా, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో కోమన్‌పల్లి నుంచి పైప్‌లైన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఎస్సారెస్పీ నుంచి గోదావరి జలాలను శుద్ధి చేసి తాగునీటిని ప్రతి ఇంటికి అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో మిషన్ భగీరథకు ప్రభుత్వం రూ. 2,650 కోట్లు వ్యయం చేస్తోందన్నారు. తొలి విడతగా 121 గ్రామాలను ఎంపిక చేసి అందులో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ఉన్న 47 గ్రామాలకు ముందుగా శుద్ధిజలాలను సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎంపిక చేసిన గ్రామాల్లో రూ. 150 కోట్లతో అంతర్గత పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. కోమన్‌పల్లిలో పైప్‌లైన్ నిర్మాణ పనులు పూర్తి చేసి వారం రోజుల్లో ఇంటింటికి తాగునీటి సరఫరా చేస్తామని పేర్కొన్నారు. అలాగే మిగతా గ్రామాల్లో ఈనెల 31 లోగా నీటి సరఫరా చేయనున్నామని చెప్పారు. రూ. 15 లక్షలు మంజూరు చేస్తా : ఎమ్మెల్యే గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, హరితహారంలో మొక్కల నాటాడాన్ని 100 శాతం పూర్తి చేసుకుంటే తన నిధుల నుంచి అదనంగా రూ. 15 లక్షలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోమన్‌పల్లి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఆర్మూర్ పట్టణానికి 100 పడకల ఆస్పత్రిని తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కంటే ముందుగా ఆర్మూర్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ పూర్తి చేసుకోవడానికి ప్రజలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ రమేశ్, ఆర్డీవో యాదిరెడ్డి, మండల ప్రత్యేకాధికారి రామారావ్ నాయక్ పాల్గొన్నారు. -
‘మిషన్ భగీరథ’ను అడ్డుకున్న రైతులు
పంట పొలాలను నష్టం చేస్తున్నారని మండిపాటు చేవెళ్ల: ఇంటింటికీ నల్లాల ద్వారా తాగు నీరు అందించాలనే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ భగీరథ‘ పనులకు అడుగడుగునా అవాంతరాలు ఏర్పడుతున్నాయి. తమకు కనీస సమాచారం లేకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, పరిహారం ఇస్తామన్న భరోసా కల్పించకుండా.. తమ పంట పొలాల నుంచి తాగునీటి పైపులు వేస్తుండడంతో రైతులు పలుచోట్ల అడ్డుకుంటున్నారు. తాజాగా శనివారం చేవెళ్ల మండల రైతులు మిషన్ భగీరథ పనులను అడ్డుకున్నారు. పంట పొలాలనుంచి పైపులు వేయడానికి సంబంధిత రైతుల అనుమతి అక్కర లేదా? అంటూ కాంట్రాక్టర్‌పై, పనులు చేయిస్తున్న సూపర్వైజర్పై మండిపడ్డారు. తమ అనుమతి తీసుకున్న తరువాతే పైపులైను పనులు చేయాలంటూ పనులను అడ్డగించారు. పనులను ఆపే దాకా రైతులు శాంతించ లేదు. పూర్తి వివరాలలోకి వెళితే.. 2018 చివరినాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలనే సదాశయంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, షాబాద్ మండలాలు, రాజేంద్రగనర్‌లోని నాలుగు గ్రామాలకు ప్రభుత్వం రూ.240 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. దీంతో పనులు వేగవంతమయ్యాయి. భారీ నీటి ట్యాంకులు, సంపులు నిర్మించే పనులు, పైపులైను వేసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీంతో రోడ్డు పక్కన సుమారు 50 నుంచి 60 మీటర్ల అవతలి నుంచి పైపులైన్లు వేసే క్రమంలో రైతుల పొలాల్లోకి కూడా పైపులైన్లు వేసేందుకు గుంతలు తీస్తున్నారు. దీనికి ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదు. రైతుల పొలాల నుంచి వేసే పైపులైన్లకు పరిహారం ఇవ్వడంలేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ముంబై-బెంగుళూరు హైవేలో చేవెళ్ల సమీపంలో పైపులైన్లు వేయడానికి గుంతలు తీస్తుండగా చేవెళ్లకు చెందిన రైతులు ఎం.లక్ష్మారెడ్డి, ఏ.విఠల్‌రెడ్డి, కె.అనంతరెడ్డి, ఎం.కమాల్‌రెడ్డి, రాంరెడ్డి, ఎం.జంగారెడ్డి, ఏ.చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు పనులను అడ్డుకున్నారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా గుంతలు ఎలాతీస్తారంటూ మండిపడ్డారు. రైతులు అడ్డుకోవడంతో పనులను మాత్రం తాత్కాలికంగా నిలిపేశారు. నిబంధనల ప్రకారమే పనులు చేస్తున్నాం.. ప్రతి ఇంటికీ మంచినీటిని అందిచాలన్న ప్రభుత్వ ఆశయానికి ప్రజలు, రైతుల సహకారం అందించాలి. కార్యక్రమాన్ని అడ్డుకోవద్దు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పైపులైన్లు వేస్తున్నాం. రైతులు సహకరించాలి. - నరేందర్, మిషన్ భగీరథ డీఈఈ, చేవెళ్ల డివిజన్ -
ఇంటింటికీ తాగునీరందిస్తాం
మంత్రి ఈటల రాజేందర్ ఇబ్రహీంపట్నం : మిషన్ భగీరథ ద్వారా 2017 డిసెంబర్ వరకు ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో మిషన్ భగీరథపై కోరుట్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరువులోనూ స్వచ్ఛమైన తాగునీరందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు వేగవంతం చేస్తున్నారని పేర్కొన్నారు. డబ్బా వద్ద మిషన్ భగీరథ పనులు చేపట్టేందుకు రూ.1300 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ఇది చేతల ప్రభుత్వమని, తాము చేసే పనులతో పదేళ్లపాటు కచ్చితంగా అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తంచేశారు. భవిష్యత్తరాల కోసం హరితహారం కార్యక్రమం చేపట్టామని, వనంతోనే వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై మెుక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలుపెంచి కరువును పారద్రోలాలని కోరారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో హరితహారంలో 40 లక్షల మొక్కలు నాటుతామన్నారు. మిషన్ భగీరథతో కలిగే లాభాలు, పనులు తీరును మిషన్ భగీరథ ఎస్ఈ శ్రీనివాస్‌రావు వివరించారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ఇబ్రహీంపట్నం నుంచి మెట్‌పల్లికి Ðð ళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో శశికుమార్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
అదిగో జలం.. ‘భగీరథ’ ఫలం
-
అదిగో జలం.. ‘భగీరథ’ ఫలం
ఏప్రిల్ 30 నాటికి 10 నియోజకవర్గాల్లో ఇంటింటికీ నల్లా నీరు: సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి మిషన్ భగీరథ తొలి ఫలాలు అందబోతున్నాయి. ప్రతి మనిషికి రోజుకు 100 లీటర్ల నీళ్ల చొప్పున, మొదటి ఫేజ్ కింద 10 నియోజకవర్గాల ప్రజలకు ఇంటింటికీ నల్లా పెట్టి గోదావరి నీళ్లు సరఫరా చేస్తాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. ఏడాది లోపు రాష్ట్రమంతటా‘మిషన్ భగీరథ’ పూర్తి చేస్తామని ప్రకటించారు. సోమవారం మెదక్ జిల్లా దుబ్బాకలో జరిగిన నియోజకవర్గ అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తాను విద్యాభ్యాసం చేసిన దుబ్బాకపై వరాల జల్లు కురిపించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ‘భగీరథ’కు నేనే స్విచ్చాన్ చేస్తా.. మెదక్ జిల్లా గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్, నల్లగొండ జిల్లాలో భువనగిరి, ఆలేరు, వరంగల్ జిల్లాలో జనగామ, పాలకుర్తి, చేర్యాల, కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గాలకు మొదటి దశలోనే నీళ్లు అందిస్తాం. రెండో దశలో రాష్ట్రమంతటికీ నీళ్లు అందుతాయి. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చే అద్భుతమైన కార్యక్రమం మిషన్ భగీరథ. గతంలో నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే పని జేసినా.. ఇప్పుడు దీన్నే రాష్ట్రమంతటా బ్రహ్మాండంగా అమలుజేస్తున్నం. ప్రతి మనిషికి రోజుకు 100 లీటర్ల నీళ్లు వచ్చే పద్ధతిలో ఏప్రిల్ 30 నాటికి పది నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి గోదావరి నీళ్లు వచ్చేటట్టు నేనే వచ్చి స్విచ్ ఆన్ చేస్తా. మిషన్ భగీరథ మిషన్ నల్లా స్విచ్ ఆన్ అయిన తర్వాత ఆడబిడ్డ నీళ్ల కోసం బిందెపట్టుకొని బజార్లో కనపడితే.. ఏ ఊర్లో కనబడితే ఆ ఊరు సర్పంచ్, ఎంపీటీసీ రాజీనామా చేయాలే. ఎక్కువ గ్రామాల్లో ఆడబిడ్డలు నీళ్ల కోసం బిందెలతో బజార్లోకి వచ్చినట్టు కనిపిస్తే ఆ ప్రాంత ఎమ్మెల్యే రాజీనామా చేయాలి. ఇప్పుడే పనులు జరుగుతున్నయి. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోయి పనుల దగ్గర నిలబడి మీకు కావల్సినట్టు చేయించుకోండ్రి. మీరు కూడా చరిత్రలో నిలిచిపోతారు. ఆ ప్రాంతాలు బంగారు తునకలు చెరువులు మన బతుకుదెరువులు. కాకతీయ, రెడ్డి రాజులు వందల ఏళ్ల కిందటే చెరువులు తవ్వారు. సమైక్య రాష్ట్రంలో మన చెరువుల విధ్వంసం జరిగింది. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు పక్కనే పెద్దగుండవె ళ్లి అనే ఊరిలో 101 చెరువులు ఉండేవి. ఇవాళ ఆ ఊర్లో 34 చెరువులే ఉన్నాయి. ఇలా చెరువుల విధ్వంసం కారణంగా 800 ఫీట్లు, 900 ఫీట్ల లోతుకు బోర్లు వేసుకొని మనం బోర్లా పడుతున్నాం. ఈ పరిస్థితి పోవాలి. మళ్లీ చెరువుల పునఃనిర్మాణం జరగాలే. మిషన్ కాకతీయ పథకం రెండో ఫేజ్ కూడా మొదలైంది. రెండేళ్లలో దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, మెదక్ ప్రాంతాలు బంగారు తునక కాబోతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రెడీ అయిపోయింది. కరువు నుంచి మనం శాశ్వతంగా దూరం కాబోతున్నాం. గోదావరి జలాలతోనే రెండు పంటలు పండించుకునేలా పథకం రూపొందించాం. ఈ గడ్డ మీద పుట్టినందుకు.. ఈ కరువు సీమకు రెండు పంటలకు నీళ్లు ఇవ్వడం కంటే గొప్పది నా జీవితానికి ఇంకేం ఉంటుంది? మన నిధులు మనకే.. కేసీఆర్ ఇంత డబ్బు ఎక్కడ్నుంచి తెస్తున్నడని కొందరు అంటున్నరు. నేను ఉద్యమ కాలంలోనే చెప్పినా.. మన వనరులు మనం ఖర్చు చేసుకుంటే మన తెలంగాణ అభివృద్ధి చెందుద్ది అని చెప్పిన. ఇవాళ 100 శాతం అదే జరుగుతోంది. చరిత్ర చూస్తే 8 శాతం, 10 శాతం నిధులు కూడా తెలంగాణలో ఖర్చు చేయలే. కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.1.60 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ప్రణాళిక నిధుల కింద రూ.40, 50 కోట్లు కూడా కేటాయించలేదు. ఇప్పుడు మన నిధులు మనమే ఖర్చు చేసుకుంటున్నం. మనం రూ.67 వేల కోట్ల బడ్జెట్ రూపొందించుకున్నాం. సాగునీటికి ఏడాదికి రూ.25 వేల కోట్లు కేటాయించుకుంటున్నాం. మన నీళ్లు, మన నిధులు మనకు దక్కాలని కోరుకున్నాం. మార్చి లేదా ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల నిరంతర కరెంటు అందిస్తాం. 2018 నాటికి 24 గంటల త్రీఫేజ్ కరెంటు అందిస్తాం. కరెంటు బాధలు శాశ్వతంగా పోతాయి. పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్నాం. ఈ ఏడాది 66 వేల ఇళ్లు మాత్రమే తీసుకున్నాం. వచ్చే ఏడాది ప్రతి నియోజకవర్గానికి 1,200 లేదా 1,500 ఇళ్ల చొప్పున తీసుకోవడానికి ప్రణాళిక రూపొం దిస్తున్నాం. నేను చదువుకున్న దుబ్బాక హైస్కూల్‌కు ఇప్పటికే రూ.4.68 కోట్లు కేటాయించాం. జూనియర్ కాలేజీని నా చిన్నప్పట్నుంచీ చూస్తున్నా.. ఎప్పుడు కూలుద్దో ఏమో అన్నట్టుగా ఉంది. స్కూల్‌తో పాటు కాలేజీకి కలిపి రూ.10 కోట్లు కేటాయిస్తున్నా. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించండి. టీచర్లలో ఆ అంకితభావం ఎక్కడ? మా కాలంలో గొప్ప ఉపాధ్యాయులుండేవారు. ఒక సంఘటన చెప్తాను. మా తెలుగు సారు మృత్యుంజయశర్మగారు ఎంత చక్కగా పాఠం చెప్పేవారంటే.. వారు పద్యం చదువుతుంటేనే సగం బోధపడేది. ఒకసారి ‘ఉత్తర గోగ్రహణం’ పాఠ్యాంశం బోధించి.. భాషా, వ్యాకరణ, ఉచ్ఛరణ దోషాలు లేకుండా అప్పగించిన వారికి 200 పేజీల నోట్‌బుక్ ఇస్తానని చెప్పారు. ఐదుసార్లు చదువుకొని మాస్టారుకు అప్పజెప్పాను. తెలుగు సాహిత్య ప్రపంచానికి మా సారు ద్వారం తెరిచారు. (ఈ సందర్భంగా 1967-68లో నేర్చుకున్న ‘ భీష్మద్రోణ కపా...’ అనే పద్యాన్ని చదివి వినిపించారు). అప్పట్నుంచి కొన్ని వేల పుస్తకాలు చదివాను. ఇప్పటి వాళ్లలో ఆ డెడికేషన్ ఎక్కడుంది? హరీశ్ బుల్లెట్ లాంటి మంత్రి మెదక్ జిల్లాకు హరీశ్‌రావు రూపంలో బుల్లెట్ లాంటి మంత్రి ఉండటం ఇక్కడి ప్రజల వరం. ఇరిగేషన్ పనులు అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. మల్లన్న సాగర్ ద్వారా ఈ గడ్డకు నీళ్లు అందుతాయి. ఒక్క పంట కాదు రెండు కార్ల పచ్చటి పంటలు మనం చూడబోతున్నాం. ప్రగతి బాటలు మీరే వేయాలి.. మీకు మీరే కథానాయకులు కావాలి. ఏ ఊరి ప్రజలు ఆ ఊరిలో పిడికిలి బిగించిన రోజునే పనులు కోరుకున్నట్టుగా జరుగుతాయి. అభివృద్ధి పనులపై అత్యంత వేగంగా ఉత్తర్వులు తన నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి, కొత్త ఫైర్ స్టేషన్, దుబ్బాక పట్టణాభివృద్ధి కోసం రూ.2 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాల్సిందిగా అభ్యర్థిస్తూ దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సీఎంకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం నియోజకవర్గ సమీక్షా సమావేశంలో సీఎం ప్రసంగిస్తూ.. దుబ్బాక సీహెచ్‌సీని 100 పడకల ఆసుపత్రిగా స్థాయి పెంచుతామని, కొత్త ఫైర్ స్టేషన్ మంజూరు చేస్తామని, దుబ్బాక పట్టణాభివృద్ధికి రూ.2 కోట్ల నిధులు సరిపోవని ఇంతకంటే ఎక్కువగానే కేటాయిస్తామని చెప్పారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే జారీ చేస్తామన్నారు. సీఎం చెప్పినట్లుగానే ఆయన ప్రసంగం ముగిసే సరికి.. దుబ్బాక సీహెచ్‌సీని 100 పడకల ఆసుపత్రిగా స్థాయి పెంచుతూ, కొత్త ఫైర్ స్టేషన్ మంజూరు చేస్తూ, దుబ్బాక పట్ణణాభివద్ధికి రూ. 2 కోట్ల ప్రత్యేక నిధులతోపాటు దుబ్బాక మేజర్ గ్రామ పంచాయతీ నూతన కార్యాలయ నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వులను కేసీఆర్ అదే వేదికపై జిల్లా మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి అందించారు. స్థానిక ఎమ్మెల్యే సోలిపేట అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబూమోహన్, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ తదితరులు పాల్గొన్నారు.