అదిగో జలం.. ‘భగీరథ’ ఫలం | mission bagiratha first results to be in april 30 says kcr | Sakshi
Sakshi News home page

అదిగో జలం.. ‘భగీరథ’ ఫలం

Published Tue, Jan 12 2016 2:14 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

అదిగో జలం.. ‘భగీరథ’ ఫలం - Sakshi

అదిగో జలం.. ‘భగీరథ’ ఫలం

ఏప్రిల్ 30 నాటికి 10 నియోజకవర్గాల్లో ఇంటింటికీ నల్లా నీరు: సీఎం కేసీఆర్
 
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి మిషన్ భగీరథ తొలి ఫలాలు అందబోతున్నాయి. ప్రతి మనిషికి రోజుకు 100 లీటర్ల నీళ్ల చొప్పున, మొదటి ఫేజ్ కింద 10 నియోజకవర్గాల ప్రజలకు ఇంటింటికీ నల్లా పెట్టి గోదావరి నీళ్లు సరఫరా చేస్తాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. ఏడాది లోపు రాష్ట్రమంతటా‘మిషన్ భగీరథ’ పూర్తి చేస్తామని ప్రకటించారు. సోమవారం మెదక్ జిల్లా దుబ్బాకలో జరిగిన నియోజకవర్గ అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తాను విద్యాభ్యాసం చేసిన దుబ్బాకపై వరాల జల్లు కురిపించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

 ‘భగీరథ’కు నేనే స్విచ్చాన్ చేస్తా..
 మెదక్ జిల్లా గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్, నల్లగొండ జిల్లాలో భువనగిరి, ఆలేరు, వరంగల్ జిల్లాలో జనగామ, పాలకుర్తి, చేర్యాల, కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గాలకు మొదటి దశలోనే నీళ్లు అందిస్తాం. రెండో దశలో రాష్ట్రమంతటికీ నీళ్లు అందుతాయి. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చే అద్భుతమైన కార్యక్రమం మిషన్ భగీరథ. గతంలో నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే పని జేసినా.. ఇప్పుడు దీన్నే రాష్ట్రమంతటా బ్రహ్మాండంగా అమలుజేస్తున్నం. ప్రతి మనిషికి రోజుకు 100 లీటర్ల నీళ్లు వచ్చే పద్ధతిలో ఏప్రిల్ 30 నాటికి పది నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి గోదావరి నీళ్లు వచ్చేటట్టు నేనే వచ్చి స్విచ్ ఆన్ చేస్తా. మిషన్ భగీరథ మిషన్ నల్లా స్విచ్ ఆన్ అయిన తర్వాత ఆడబిడ్డ నీళ్ల కోసం బిందెపట్టుకొని బజార్లో కనపడితే.. ఏ ఊర్లో కనబడితే ఆ ఊరు సర్పంచ్, ఎంపీటీసీ రాజీనామా చేయాలే. ఎక్కువ గ్రామాల్లో ఆడబిడ్డలు నీళ్ల కోసం బిందెలతో బజార్లోకి వచ్చినట్టు కనిపిస్తే ఆ ప్రాంత ఎమ్మెల్యే రాజీనామా చేయాలి. ఇప్పుడే పనులు జరుగుతున్నయి. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోయి పనుల దగ్గర నిలబడి మీకు కావల్సినట్టు చేయించుకోండ్రి. మీరు కూడా చరిత్రలో నిలిచిపోతారు.

 ఆ ప్రాంతాలు బంగారు తునకలు
 చెరువులు మన బతుకుదెరువులు. కాకతీయ, రెడ్డి రాజులు వందల ఏళ్ల కిందటే చెరువులు తవ్వారు. సమైక్య రాష్ట్రంలో మన చెరువుల విధ్వంసం జరిగింది. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు పక్కనే పెద్దగుండవె ళ్లి అనే ఊరిలో 101  చెరువులు ఉండేవి. ఇవాళ ఆ ఊర్లో 34 చెరువులే ఉన్నాయి. ఇలా చెరువుల విధ్వంసం కారణంగా 800 ఫీట్లు, 900 ఫీట్ల లోతుకు బోర్లు వేసుకొని మనం బోర్లా పడుతున్నాం. ఈ పరిస్థితి పోవాలి. మళ్లీ చెరువుల పునఃనిర్మాణం జరగాలే. మిషన్ కాకతీయ పథకం రెండో ఫేజ్ కూడా మొదలైంది. రెండేళ్లలో దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, మెదక్ ప్రాంతాలు బంగారు తునక కాబోతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రెడీ అయిపోయింది. కరువు నుంచి మనం శాశ్వతంగా దూరం కాబోతున్నాం. గోదావరి జలాలతోనే రెండు పంటలు పండించుకునేలా పథకం రూపొందించాం. ఈ గడ్డ మీద పుట్టినందుకు.. ఈ కరువు సీమకు రెండు పంటలకు నీళ్లు ఇవ్వడం కంటే గొప్పది నా జీవితానికి ఇంకేం ఉంటుంది?

 మన నిధులు మనకే..
 కేసీఆర్ ఇంత డబ్బు ఎక్కడ్నుంచి తెస్తున్నడని కొందరు అంటున్నరు. నేను ఉద్యమ కాలంలోనే చెప్పినా.. మన వనరులు మనం ఖర్చు చేసుకుంటే మన తెలంగాణ అభివృద్ధి చెందుద్ది అని చెప్పిన. ఇవాళ 100 శాతం అదే జరుగుతోంది. చరిత్ర చూస్తే 8 శాతం, 10 శాతం నిధులు కూడా తెలంగాణలో ఖర్చు చేయలే. కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.1.60 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ప్రణాళిక నిధుల కింద రూ.40, 50 కోట్లు కూడా కేటాయించలేదు. ఇప్పుడు మన నిధులు మనమే ఖర్చు చేసుకుంటున్నం. మనం రూ.67 వేల కోట్ల బడ్జెట్ రూపొందించుకున్నాం. సాగునీటికి ఏడాదికి రూ.25 వేల కోట్లు కేటాయించుకుంటున్నాం. మన నీళ్లు, మన నిధులు మనకు దక్కాలని కోరుకున్నాం. మార్చి లేదా ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల నిరంతర కరెంటు అందిస్తాం. 2018 నాటికి 24 గంటల త్రీఫేజ్ కరెంటు అందిస్తాం. కరెంటు బాధలు శాశ్వతంగా పోతాయి. పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తున్నాం. ఈ ఏడాది 66 వేల ఇళ్లు మాత్రమే తీసుకున్నాం. వచ్చే ఏడాది ప్రతి నియోజకవర్గానికి 1,200 లేదా 1,500 ఇళ్ల చొప్పున తీసుకోవడానికి ప్రణాళిక రూపొం దిస్తున్నాం. నేను చదువుకున్న దుబ్బాక హైస్కూల్‌కు ఇప్పటికే రూ.4.68 కోట్లు కేటాయించాం. జూనియర్ కాలేజీని నా చిన్నప్పట్నుంచీ చూస్తున్నా.. ఎప్పుడు కూలుద్దో ఏమో అన్నట్టుగా ఉంది. స్కూల్‌తో పాటు కాలేజీకి కలిపి రూ.10 కోట్లు కేటాయిస్తున్నా. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించండి.
 
 
 టీచర్లలో ఆ అంకితభావం ఎక్కడ?
 మా కాలంలో గొప్ప ఉపాధ్యాయులుండేవారు. ఒక సంఘటన చెప్తాను. మా తెలుగు సారు మృత్యుంజయశర్మగారు ఎంత చక్కగా పాఠం చెప్పేవారంటే.. వారు పద్యం చదువుతుంటేనే సగం బోధపడేది. ఒకసారి ‘ఉత్తర గోగ్రహణం’ పాఠ్యాంశం బోధించి.. భాషా, వ్యాకరణ, ఉచ్ఛరణ దోషాలు లేకుండా అప్పగించిన వారికి 200 పేజీల నోట్‌బుక్ ఇస్తానని చెప్పారు. ఐదుసార్లు చదువుకొని మాస్టారుకు అప్పజెప్పాను. తెలుగు సాహిత్య ప్రపంచానికి మా సారు ద్వారం తెరిచారు. (ఈ సందర్భంగా 1967-68లో నేర్చుకున్న ‘ భీష్మద్రోణ కపా...’ అనే పద్యాన్ని చదివి వినిపించారు). అప్పట్నుంచి కొన్ని వేల పుస్తకాలు చదివాను. ఇప్పటి వాళ్లలో ఆ డెడికేషన్ ఎక్కడుంది?
 
 హరీశ్ బుల్లెట్ లాంటి మంత్రి
 మెదక్ జిల్లాకు హరీశ్‌రావు రూపంలో బుల్లెట్ లాంటి మంత్రి ఉండటం ఇక్కడి ప్రజల వరం. ఇరిగేషన్ పనులు అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. మల్లన్న సాగర్ ద్వారా ఈ గడ్డకు నీళ్లు అందుతాయి. ఒక్క పంట కాదు రెండు కార్ల పచ్చటి పంటలు మనం చూడబోతున్నాం. ప్రగతి బాటలు మీరే వేయాలి.. మీకు మీరే కథానాయకులు కావాలి. ఏ ఊరి ప్రజలు ఆ ఊరిలో పిడికిలి బిగించిన రోజునే పనులు కోరుకున్నట్టుగా జరుగుతాయి.
 
 అభివృద్ధి పనులపై అత్యంత వేగంగా ఉత్తర్వులు
 తన నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి, కొత్త ఫైర్ స్టేషన్, దుబ్బాక పట్టణాభివృద్ధి కోసం రూ.2 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాల్సిందిగా అభ్యర్థిస్తూ దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సీఎంకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం నియోజకవర్గ సమీక్షా సమావేశంలో సీఎం ప్రసంగిస్తూ.. దుబ్బాక సీహెచ్‌సీని 100 పడకల ఆసుపత్రిగా స్థాయి పెంచుతామని, కొత్త ఫైర్ స్టేషన్ మంజూరు చేస్తామని, దుబ్బాక పట్టణాభివృద్ధికి రూ.2 కోట్ల నిధులు సరిపోవని ఇంతకంటే ఎక్కువగానే కేటాయిస్తామని చెప్పారు. వీటికి సంబంధించిన  ఉత్తర్వులు వెంటనే జారీ చేస్తామన్నారు. సీఎం చెప్పినట్లుగానే ఆయన ప్రసంగం ముగిసే సరికి.. దుబ్బాక సీహెచ్‌సీని 100 పడకల ఆసుపత్రిగా స్థాయి పెంచుతూ, కొత్త ఫైర్ స్టేషన్ మంజూరు చేస్తూ, దుబ్బాక పట్ణణాభివద్ధికి రూ. 2 కోట్ల ప్రత్యేక నిధులతోపాటు దుబ్బాక మేజర్ గ్రామ పంచాయతీ నూతన కార్యాలయ నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వులను కేసీఆర్ అదే వేదికపై జిల్లా మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి అందించారు. స్థానిక ఎమ్మెల్యే సోలిపేట అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబూమోహన్, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement