tap
-
కిచెన్‌లో ఉండే ఆ రెండిటితోటే మైక్రోప్లాస్టిక్‌కి చెక్!
మైక్రోప్లాస్టిక్‌లు ప్రస్తుతం ఆహారం, నీరు, గాలిలో ఇలా ప్రతి చోట ఉంటున్నాయి. ప్రస్తుతం ఇదొక పెద్ద సమస్యలా మారింది. వీటిని ఫిల్టర్ చేయడానికి శాస్త్రవేత్తలు పలు విధాల ప్రయత్నిస్తున్నారు. అందుకు సంబంధించి పలు టెక్నిక్లను అభివృద్ధి చేశారు. అయితే తాజగా శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేసిన ఈ ప్రయోగం సమర్థవంతంగా మైక్రో ప్లాస్టిక్‌కు చెక్‌పెట్టింది. ఇక్కడ మైక్రోప్లాస్టిక్‌లు అంటే 5 మిల్లీమీటర్లు(0.2 అంగుళాలు) కంటే చిన్నగా ఉండే ప్లాస్టిక్‌లని అర్థం. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలే సౌందర్య ఉత్పత్తుల్లో కూడా కనిపిస్తాయి. ఇవి పెద్దగా ఉండే ప్లాస్టిక్ వస్తువుల కీణత కారణంగా వచ్చేవే ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు. ఇక యునెస్కో ఓషన్ లిటరసీ పోర్టల్ ప్రకారం ఈ మైక్రో ప్లాస్టిక్ ముక్కలు చాలా వరకు మహాసముద్రాల్లోనే కలిసిపోతాయని పేర్కొంది. వాటిలో సుమారు 50 నుంచి 70 మిలియన్ల వరకు పెద్ద, చిన్న సైజులో ప్లాస్టిక్ కణాలు ఉండొచ్చనేది అంచనా. ఈ ప్లాస్టిక్ రేణువుల్లో చాలా విషపూరిత రసాయనాలు ఉంటాయి. ఆ తర్వాత ఇవే కాలక్రమేణ ఈ నానో ప్లాస్టిక్లుగా విచ్ఛిన్నమవుతాయి. ఇవి చాల చిన్నవి కాబట్టి ప్రేగులు, ఊపిరితిత్తులు గుండా నేరుగా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి మన హృదయం, మెదుడు వంటి అవయవాల్లోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ సముద్రంలో ఉండే ఈ చిన్న కణాలు తాగు నీటిలో కూడా చేరడం వల్లే ఇదంతా జరుగుతుంది. ఇవి శరీరంలోని సహజ హార్మోన్ల విడుదలకు అంతరాయం కలిగించడమే కాకుండా పునరుత్పత్తి లోపాలు, కేన్సర్ ప్రమాదాలను పెంచుతాయి. దీన్ని చెక్ పెట్టేందుకు చైనాలోని గ్వాంగ్జౌ మెడికల్ యూనివర్సిటీ, జినాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వంటగది సామాన్లనే ఉపయోగించింది. వీటితోనే మైక్రో ప్లాస్టిక్‌లకు సంబంధించి దాదాపు 80%పైగా తొలగించింది. కేవలం ఒక కేటిల్ సాధారణ వాటర్ ఫిల్టర్‌ని ఉపయోగించి మైక్రోప్లాస్టిక్‌లను ఈజీగా తొలగించింది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్స్ జర్నల్‌లో వెల్లడించారు. ఆ పరికరాలతో ఝాన్జున్ లీ, ఎడ్డీ జెంగ్ అనే శాస్త్రవేత్తల బృందం ఖనిజాలతో కూడిని నీటి నమునాలను సేకరించారు. వాటిలో నానో, మైక్రో ప్లాస్టిక్‌ల కణాల డోస్‌ని పెంచింది. వాటిని ఐదు నిమిషాల మరిగించింది. ఐతే ప్రతిసారి ఆ నీరు మరుగుతున్నప్పుడూ పైకిలేచే ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాస్టిక్ మొత్తాన్ని బృందం తొలగించే ముందు చల్లబరిచి వేరు చేసేది. ఖనిజాలతో కూడిని ఈ నీటిలో లైమ్‌స్కేల్, కాల్షియం కార్బోనేట్ వంటి పదార్థాలు ఉంటాయి. ఎప్పుడైతే మరిగిస్తామో అప్పుడు టీ, కాఫీ వంటివి కాచినప్పుడూ ఎలా పైకి నల్లటి తెట్టు వస్తుందో అలా తెట్టులాగా తెల్లటి ఒట్టు ఈ మైక్రో ప్లాస్టిక్ కణాలను నీటి నుంచి వేరు చేస్తుంది. తద్వారా ఈజీగా తాగే నీటి నుంచి ప్లాస్టిక్ కణాలను వేరవ్వుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: భారతీయ సంగీతంతో అలరిస్తున్న జర్మన్ సింగర్!) -
టూత్‌పేస్ట్ ట్యూబ్‌తో నీళ్లు పడుతున్న మహిళ.. మెచ్చుకుంటున్న జనం!
కొత్త ఐడియాలను అమలు చేయడంలో భారత్ ముందుంటుందని ఈ వీడియో నిరూపిస్తోంది. చాలామంది తమ టాలెంట్ చూపించి, అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఐడియాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇంటర్నెట్లో ఒక వీడియో అందరినీ అమితంగా అలరిస్తోంది. దీనిని చూసినవారంతా ఆ మహిళ ఐడియాను తెగ మెచ్చుకుంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. నీటి ట్యాప్ విరిగిపోవడంతో ఒక మహిళ దానికి టూత్‌పేస్ట్ ట్యూబ్ కత్తిరించి బిగించింది. దాని మూత తీస్తూ నీటిని పట్టుకుంటోంది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. వీడియో ప్రారంభంలో ఒక మహిళ నీటిని పట్టుకునేందకు ఒక బకెట్ తీసుకురావడం కనిపిస్తుంది. తరువాత అక్కడ విరిగి ఉన్న ట్యాప్ కనిపిస్తుంది. ఆ విధంగా ఉంటే నీటిని పట్టుకోవడం ఇబ్బందికరం అని గ్రహించి, ఆమె ఒక టూట్‌పేస్ట్ కట్ చేసి, ఆ టాప్కు బిగిస్తుంది. తరువాత కావలినంత నీటిని పట్టుకుని, తరువాత దానికి మూత బిగిస్తుంది. ఈ వీడియో జూలై 12న షేర్ అవగా, ఇప్పటి వరకూ దీనికి 120.7కే వ్యూస్ దక్కాయి. 9 సెకెన్లు ఈ వీడియోకు ఇప్పటి వరకూ వెయ్యికి పైగా లైక్స్ దక్కాయి. వీడియో చూసిన నెటిజన్లు రరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. Wow very practical👏 pic.twitter.com/T21h2EedtJ — Tansu YEĞEN (@TansuYegen) July 12, 2023 ఇది కూడా చదవండి: చెత్త డబ్బాలో ‘సెర్చ్’,‘అన్‌లాక్’,‘డౌన్లోడ్’.. ఎందుకిదంతా జరుగుతోంది? -
Viral Video: ట్యాప్ తిప్పి దాహం తీర్చుకున్న పక్షి
-
సేవ్ వాటర్
చేతులు కడగడానికి ట్యాప్ తిప్పుతాం. చేతిలో పట్టేటంతటి ధారతో సంతృప్తి చెందం. పూర్తిగా ఓపెన్ చేస్తాం. ఒక్కసారిగా నీరు ధారాపాతంగా వచ్చి దోసిట్లోకి పడిపోవాలన్నంత ఆత్రం. చేతులు కడుక్కోవడం పూర్తయ్యే సరికి కనీసంగా ఇరవై సెకన్ల సేపు ట్యాప్ రన్నింగ్‌లో ఉంటుంది. అంత సమయంలో సింక్‌లోకి జారిపోయే నీరెంత ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? నాలుగు లీటర్లకు తక్కువ ఉండదు. ఆశ్చర్యంగా ఉన్నా సరే ఇది నిజం. ‘ట్యాప్ పూర్తిగా తిప్పవద్దు. ఎంత కావాలో అంతవరకే ఓపెన్ చేయండి’ అని ఇంట్లో వాళ్లకు చెప్పి చెప్పి విసిగిపోయింది లలితాంబ విశ్వనాథయ్య. అందుకే ఓ చిన్న సాధనంతో నీరు తగినంత మాత్రమే వచ్చేటట్లు ట్యాప్‌కు ఉచ్చు బిగించింది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లే అవుట్ నివాసి లలితాంబ. నీటివృథాను అరికట్టడానికి ఆమె వాటర్ ఏరియేటర్, వాటర్ రిస్ట్రిక్టర్లకు రూపకల్పన చేసింది. వీటిని అమర్చడం ద్వారా నీటి వాడకం మూడవ వంతుకు తగ్గిపోతుంది. సాధారణంగా ఓ కొత్త ఆవిష్కరణ మనిషి జీవనశైలిని ఆధునీకరించడం కోసమే ఉంటుంది. వాటికి మార్కెట్లో మంచి ఆదరణ కూడా లభిస్తుంది. లలితాంబ రూపొందించిన సాధనాలు సామాజిక ప్రయోజనార్థం పని చేస్తాయి. ప్రకృతి పరిరక్షణ, వనరుల సంరక్షణలో కీలకమైన పాత్ర వహిస్తాయి. వాటర్ బాటిల్ లేదు! ‘నీరు అనేది చాలా విస్తృతమైన సబ్జెక్ట్. నదుల సంరక్షణ, పరిశుభ్రతనే ప్రధానంగా చూస్తాం, కానీ పర్యావరణ పరిరక్షణ నుంచి దైనందిన జీవనం వరకు అడుగడుగునా అది కీలకమైన అంశమే’ అంటారు ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి. ‘‘నాకు ఎనభై ఏళ్లు. నా బాల్యంలో స్కూలుకెళ్లేటప్పుడు నీటిసీసా తీసుకెళ్లడం మాకు తెలియదు. దారిలో రోడ్డు పక్కన కనిపించిన నల్లా తిప్పి చేయి పట్టి దాహం తీరే వరకు తాగేవాళ్లం. ఎంతో ఆరోగ్యంగా పెరిగాం. నీటి కాలుష్యం అనే పదమే తెలియదప్పట్లో. మా ఇంట్లో బావి ఉండేది. వర్షాకాలంలో అయితే బకెట్‌కు తాడు కట్టి మూడు– నాలుగు అడుగుల లోతులో ఉన్న నీటిని ముంచుకోవడమే. ఎండాకాలంలో అదే బావిలో నీరు ఇరవై అడుగుల లోతుకి వెళ్లేది. భూగర్భ జలాల కనీస స్థాయులంటే ఇరవై అడుగులే. హైదరాబాద్ చుట్టూ వందల చెరువులు, కుంటలు ఉండేవి. క్రమంగా ఒక్కొక్కటీ మాయమవుతున్నాయి. నీటిచుక్క పాతాళానికి పోయింది. నీటి జాడ కోసం నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ లోతుకు బోర్లు వేస్తున్నారు. నీటిని అవసరానికి మించి వాడడం అంటే సహజ వనరులను వృథా చేయడమే. ఈ మధ్య ప్రభుత్వం జారీ చేసిన 111 జీవో మీద కూడా మేము అభ్యంతరం తెలియచేశాం. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ మంచి నీటి రిజర్వాయర్లు కూడా ఈ జీవో ఫలితంగా హుస్సేన్‌సాగర్ లాగానే మారిపోతాయని హెచ్చరించాం. భావి తరాలకు అందాల్సిన సహజ వనరులను విచక్షణ రహితంగా వాడేసే హక్కు ఎవరికీ ఉండదు. మనదేశంలో జలకాలుష్యనిరోధానికి ‘వాటర్ యాక్ట్ ఆఫ్ 1974’ అనే చట్టం ఉంది. దానిని అమలు చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఏర్పాటైంది. ఎన్ని చట్టాలున్నా సరే... మన దగ్గర నీటి సంరక్షణ విషయంలో సమన్వయలోపంతోనే పనులు జరుగుతున్నాయి. ఫ్యాషన్ ఉత్పత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మార్కెట్లోకి రాగానే కొనేస్తారు. కాని, ఇలాంటి సమాజహితమైన, పర్యావరణ పరిరక్షణ సహితమైన వాటర్ రిస్ట్రిక్టర్లను వాడమని ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తోంది’’ అని ఆవేదనగా అన్నారాయన. ప్రతిజ్ఞ చేద్దాం! నీటి వనరులను పరిరక్షించుకోవడం అనగానే భూగర్భ జలాలు పెరిగి ఎండిపోయిన బావుల్లోకి నీరు చేరడం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి పెద్ద విషయాల మీదనే చర్చ జరుగుతుంటుంది. కానీ... ఇంట్లో మనం వాడే ప్రతి నీటి చుక్కనూ గౌరవించుకోవాలి. ‘ఆహారాన్ని వృథా చేయము’ అని ప్రతిన పూనుతున్నాం. అలాగే నీటిని వృథా చేయను అని కూడా ఎవరికి వాళ్లు మనసులోనే ప్రతిజ్ఞ చేసుకోవాలి. అప్పుడు లీకవుతున్న ట్యాప్‌ను చూసినప్పుడు దానిని కట్టేసేవరకు మనసు ఊరుకోదు. ట్యాప్ లీకవుతుంటే ఒక్కో చుక్కే కదా అని తేలిగ్గా తీసుకోవడం జరగదు. గమనించిన తక్షణమే ట్యాప్ మారుస్తాం. ఒక్కో చుక్క నీరు కారుతున్న ట్యాప్ నుంచి ఇరవై నాలుగ్గంటల్లో ఎనభై లీటర్ల నీరు వృథా అవుతుంది తెలుసా! ఇది నిజం... నమ్మండి! వాటర్ రిస్ట్రిక్టర్ ధర వంద రూపాయలకు మించదు. దీని ద్వారా నీటి వృథాను అరికట్టగలుగుతాం. నిమిషానికి నాలుగు లీటర్ల చొప్పున ఆదా చేయగలుగుతాం. కాలేజ్‌లు, కల్యాణమండపాల వంటి చోట నెలకు సరాసరిన పదిహేను వేల లీటర్ల నీరు ఆదా అవుతుంది. – లలితాంబ, వాటర్ రిస్ట్రిక్టర్ రూపకర్త మహిళలే సంరక్షకులు మహిళలు స్వచ్ఛందంగా స్పందిస్తేనే నీటి సమస్య అదుపులో ఉంటుంది. మన కిచెన్‌లో ట్యాప్ తిప్పగానే నీరు ధారగా ప్రవహిస్తోందంటే... దాని వెనుక కనిపించని శ్రమ ఎంతో ఉంటుంది. నదుల జన్మస్థానాలైన కొండల మీద నుంచి మన ఇంటికి వస్తున్నాయనే విషయాన్ని మర్చిపోకూడదు. కొండ శిఖరం నుంచి మన ఇంటి ట్యాప్‌కు చేరడానికి మధ్య ఎంత మెకానిజం పని చేస్తోందో గమనించాలి. మీ పిల్లల కోసం ఎన్నెన్నో ఆస్తులను కూడబెడుతుంటారు, అంతకంటే విలువైన ఆస్తి నీరు. ఆ నీటిని వృథా చేయకండి. ఎండిన భూమిని కాదు, చల్లని భూమిని భావితరాలకు వారసత్వంగా ఇవ్వండి. – ప్రొ‘‘ కె. పురుషోత్తమ్‌రెడ్డి, పర్యావరణవేత్త – వాకా మంజులారెడ్డి -
నీటి పంపు గొడవ : చితకొట్టుకున్న మహిళలు
ఆగ్రా(యూపీ): నీటి పంపు విషయంలో తలెత్తిన వివాదం ఇద్దరు మహిళలు బహిరంగంగానే కొట్టుకునే స్థాయికి చేరుకుంది. యూపీలోని కాళింది విహార్‌కు చెందిన రమాశర్మ, అమె ఇంటి పొరుగున ఉంటున్న మీరా కుమారికి మధ్య నీటి పంపు విషయమై గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే ఆదివారం ఈ గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. సంపు విషయంలో మరోసారి గొడవ జరగడంతో ఆగ్రహించిన రమాశర్మ, మీరా కుమారిని జుట్టుపట్టుకొని లాక్కుని ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చింది. అనంతరం ఇష్టానుసారంగా కొట్టడం ప్రారంభించింది. కిందపడేసి మరీ, ఆమె మీద కూర్చొని పిడిగుద్దులు గుద్దింది. మీరా కుమారి కూడా రమాశర్మను జట్టుపట్టుకొని ప్రతిఘటించడానికి ప్రయత్నించింనా ఫలితం లేకపోవడంతో కేకలు వేసింది. మీరా అరుపులు విన్న స్థానికులంతా అక్కడకు చేరుకుని ఆమెను కాపాడారు. కాగా ఈ తతంగాన్నాంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయడంతో, ఇప్పుడది వైరల్‌గా మారింది. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాటేసిన కరెంట్ తీగ
కొలిమిగుండ్ల: కొలిమిగుండ్లలో ఓ వివాహితను కరెంట్ తీగ బలి తీసుకుంది. గ్రామానికి చెందిన బరీదు దస్తగర్తి భార్య మహాలక్ష్మి (32) సోమవారం సాయంత్రం ఇంటి ముందు ఉన్న కుళాయి వద్ద నీళ్లు పట్టుకునేందుకు వెళ్లింది. ఆ సమయంలో విద్యుత్ స్తంభం నుంచి తీగ తెగి ఆమెపై పడటంతో విద్యుదాఘాతానికి గురై కేకలు వేసింది. పక్కనే ఉన్న స్థానికులు కర్రలతో తీగను తొలగించి ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తాడిపత్రి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ప్రమాదం జరిగిన స్థలంలో అప్పటి వరకు నలుగురు చిన్నారులు ఆటాడుకున్నారు. తీగ తెగే కొద్ది నిమిషాల ముందే అక్కడి నుంచి చిన్నారులు వెళ్లి పోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దాదాపు 15 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన తీగలను మార్చక పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. -
బాలుడిని మింగిన కుళాయి గుంత
– ఆడుకుంటూ గుంతలో పడిపోయిన బాలుడు - శోకసంద్రంలో కుటంబసభ్యులు బోయ రామాంజనేయు, జయలక్ష్మి దంపతులకు ఒకే ఒక సంతానం. ఆ బిడ్డకు రెండేళ్లు. వాడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.తాము కష్టపడి బిడ్డను బాగా చదివించాలని కలలుగన్నారు. అయితే, విధి చిన్నచూపుచూసిందని కుళాయిగుంత రూపంలో తమ ఆశల దీపాన్ని ఆర్పేస్తుందని వారు ఊహించలేకపోయారు. వివరాల్లోకి వెళితే.. ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని సోగనూరు గ్రామానికి బోయ రామాంజనేయులు పట్టణంలో హమాలీ. భార్య జయలక్ష్మి ఇంటి వద్దే ఉంటుంది. ఈ దంపతులకు వివాహమైన రెండేళ్లకు మొదటి సంతానంగా బాబు పుట్టాడు. వాడికి ధనుంజనేయులు(2)అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. ఎప్పటిలాగే రామంజనేయులు ఉదయం పనికి పోయాడు. తల్లి వద్ద ఉన్న ధనుంజయులు ఆడుకుంటూ రోడ్డు మీదకు వచ్చాడు. పక్కన ఉన్న కుళాయి గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. అందులో నీళ్లు ఉండటంతో మునిగిపోయాడు. కొద్దిసేపటికి కుళాయి నీటి కోసం వచ్చిన మహిళ నీటిలో మునిగి ఉన్న చిన్నారిని చూసి కేకలు వేసింది. వెంటనే చిన్నారి తల్లి, ఇరుగుపొరుగువారు వచ్చి గుంతలో నుంచి బయటకు తీశారు. ప్రాణాలతో ఉన్నాడేమోననే ఆశతో కుటుంబ సభ్యులు స్కూటర్‌పై పట్టణంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు కుళాయి గుంతలో పడి ప్రాణాలు వదలడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుళాయిలకు వాల్ ఏర్పాటు చేయకపోవడంతోనే.. గుంతల్లో ఏర్పాటు చేస్తున్న మంచినీటి కుళాయిలకు వాల్స్ అమర్చడం అధికారులు మరచిపోతున్నారు. దీంతో నీరు వృథాగా పోయి గుంత నిండిపోతుంది. సోగనూరులో జరిగిందీదే. అదే వాల్ ఉండి ఉంటే గుంతలో నీళ్లు ఆగేవి కావు..చిన్నారి ప్రాణాలు పోయేవి కావని గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీనికంతటికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. -
ఇంటి ముంగిటకు ‘భగీరథ’
♦ ఆగస్టు 7న ముహూర్తం ♦ ఆ రోజు నుంచి ‘గజ్వేల్’లో ఇంటింటికీ నీళ్లు ♦ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం ♦ 5 నెలల్లోనే పనులు పూర్తి చేయడం రికార్డు ♦ ఏడో తేదీనే సుదర్శనయాగం మంత్రి హరీశ్‌రావు వెల్లడి గజ్వేల్: ‘మిషన్ భగీరథ’ ద్వారా ఇంటింటికి నల్లా నీటిని అందించే ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 7న గజ్వేల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. అదేరోజు సుదర్శనయాగం చేపడుతారన్నారు. మంగళవారం ఆయన గజ్వేల్ నియోజక వర్గంలో హరితహారంలో పాల్గొన్నారు. అనంతరం గజ్వేల్ మండలం బంగ్ల వెంకటాపూర్‌లోని అటవీశాఖ నర్సరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేవలం ఐదు నెలల కాలంలోనే ‘మిషన్ భగీరథ’ ద్వారా 67,551 నల్లా కనెక్షన్లు ఇవ్వడం జాతీయ రికార్డుగా పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లోగల 243 గ్రామాలకుగాను 231గ్రామాల్లో ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేయగా... 144 గ్రామాల్లో ప్రజలు ప్రస్తుతం నీటిని తాగుతున్నారన్నారు. 78గ్రామాల్లో వందశాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. నియోజకవర్గంలో 150 ఓవర్‌హెడ్ ట్యాంకులకుగాను 120 ట్యాంకుల నిర్మాణం పూర్తయినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవ, అధికారుల కృషి ఫలితంగానే ఈ రికార్డు సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. డిసెంబర్ నాటికి దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోనూ ‘మిషన్ భగీరథ’ ద్వారా పూర్తి స్థాయిలో నల్లా నీటిని అందిస్తామన్నారు. హైదరాబాద్‌తోపాటు గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు మంచినీటిని అందిస్తున్న ఎల్లంపల్లి రిజర్వాయర్ ఇప్పటికే నిండుతోందని చెప్పారు. గతేడాది 9టీఎంసీలు మాత్రమే రిజర్వాయర్‌ను నింపడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఈ రిజర్వాయర్‌లోకి 20టీఎంసీల నీరు రాబోతుందన్నారు. కొద్దిరోజుల్లోనే ఈ జలాశయం పూర్తిగా నిండే అవకాశముందని వెల్లడించారు. ఫలితంగా మంచినీటి సరఫరాకు ఎలాంటి ఢోకా ఉండబోదన్నారు. విలేకరుల సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, వాటర్‌గ్రిడ్ ఎస్ఈ విజయప్రకాశ్, ఈఈ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
నీటి పోటు
కుళాయిలకు మీటర్లు ఏర్పాటు భారీగా పెరగనున్న మంచినీటి చార్జీలు అమృత్ ఎఫెక్ట్ కార్పొరేషన్ అధికారుల కసరత్తు బెజవాడ రాజధానిగా మారిందనో.. లేక ‘అమృత్’ విధించిన ఆంక్షలో కానీ నగరవాసి నెత్తిన పాలకులు నీటి పన్నుల బండ పడేసేందుకు కసరత్తు ప్రారంభించారు. మంచినీటి కుళాయిలకు మీటర్లు బిగించాలన్న మున్సిపల్ మంత్రి పి.నారాయణ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో 400 శాతం పెరిగిన నీటి చార్జీలు తాజా పరిణామాల నేపథ్యంలో తడిసి మోపెడు కానున్నాయి. విజయవాడ సెంట్రల్ : ఈ నెలాఖరుకల్లా కుళాయిలకు నీటి మీటర్లు బిగించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకయ్యే ఖర్చును గృహ యజమానుల నుంచి వాయిదా పద్ధతుల్లో వసూలుచేయాలని నిర్ణయించారు. అమృత్ (అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ ట్రాన్సఫర్మేషన్) ఆంక్షల్లో భాగంగానే నీటి మీటర్లు ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. వృథాను అరికట్టేందుకే మీటర్లు పెడుతున్నట్లు మంత్రి చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరానే లేనప్పుడు నీరు వృథా ఎలా అవుతోందన్న ప్రశ్న ప్రజల నుంచి ఉత్పన్నమవుతోంది. అమృత్ ఆంక్షలు స్మార్ట్ సిటీ కోసం పోటీపడి ర్యాంకింగ్‌లో చతికిలపడ్డ విజయవాడ నగరపాలక సంస్థ అమృత్ పథకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 73.50 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.24.17 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14.50 కోట్లు, నగరపాలక సంస్థ రూ.33.83 కోట్లు, ఉద్యానవన శాఖ రూ. కోటి చొప్పున ఖర్చు భరించాల్సి ఉంటుంది. అమృత్‌లో భాగంగా నగరంలోని ప్రతి ఇంటికి కుళాయిలు ఏర్పాటుచేయడంతో పాటు వాటికి మీటర్లు అమర్చాలనే నిబంధన ఉంది. నగరంలో 1,79,245 గృహాలున్నాయి. కుళాయి కనెక్షన్లు 1,06,979 ఉన్నాయి. ఈ లెక్కన మిగతా గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. నీటి సరఫరాకు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.32.40 కోట్లు ఖర్చు చేస్తుండగా.. పన్నుల రూపంలో రూ.28.16 కోట్లు వసూలవుతోంది. నీటి మీటర్లు అమర్చడంపాటు యూజర్ చార్జీలు వసూలు చేసినట్లయితే దండిగా ఆదాయం రాబట్టవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. డబుల్ గేమ్ విజయవాడ నగర జనాభా 12 లక్షలకు చేరింది. శివారు, కొండ ప్రాంతాలకు పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా కావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో జరిగే నీటి వృథాను దృష్టిలో పెట్టుకొని మీటర్లు ఏర్పాటు చేసినట్లయితే నగరవాసులందరూ ఆ భారాన్ని మోయాల్సివస్తోంది. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో వాటర్ చార్జీలను ఏడు శాతం పెంచుతూ తీర్మానం చేశారు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పెంచిన డ్రెయినేజీ, వాటర్ చార్జీలను ఏటా ఏడు శాతం పెంచడానికి వీల్లేదని డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు 2014లో ప్రతిపాదన పెట్టారు. దీన్ని కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించి ప్రభుత్వానికి పంపింది. రెండేళ్లయినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఫలితంగా ఏటా ఏడు శాతం చొప్పున నీటి చార్జీలు పెరుగుతున్నాయి. ప్రస్తుత చార్జీలపై 10 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. -
క‘న్నీటి’ కుళాయి!
పబ్లిక్ కుళాయిలకు త్వరలో మంగళం వ్యక్తిగత కుళాయి కనెక్షన్ తప్పనిసరి సామాన్యులకు పెను భారం {పజల నెత్తిన రూ.30 కోట్ల భారం {పతి నెలా పన్నుపోటు స్మార్ట్ మంత్రం సంక్షేమాన్ని మాయం చేస్తోంది. ప్రజోపయోగ సేవలకు మంగళం పాడేస్తోంది. విశాఖ మహానగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేస్తామని చెబుతున్న పాలకులు.. అభివృద్ధి మాటేమోగానీ.. ఉన్న సౌకర్యాలను ఊడగొడుతూ సామాన్యుల జీవితాలను దుర్భరం చేస్తున్నారు. వ్యక్తిగత కుళాయిలను తప్పనిసరి చేయాలన్న జీవీఎంసీ ్డనిర్ణయం అటువంటిదే. దీనివల్ల నగరంలోని లక్షలాది కుటుంబాలు తాగునీరు గగనమవుతుంది. సాక్షి, విశాఖపట్నం : వ్యక్తిగత కుళాయిల పేరుతోసామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపేందుకు జీవీఎంసీ(మహావిశాఖ నగరపాలక సంస్థ) రంగం సిద్ధం చేస్తోంది. ఫలితంగా ఇప్పటివరకు ట్యాంకర్లు, పబ్లిక్ కుళాయిలపై ఆధారపడుతున్న సామాన్య ప్రజలు గొంతు తడుపుకోవడానికి కాసులు వెచ్చించక తప్పదు. విలీన మున్సిపాల్టీలు, పంచాయతీలు కలుపుకొని జీవీఎంసీ పరిధిలో 22 లక్షల జనాభా ఉంది. జనాభా లెక్కల ప్రకారం ఐదున్నర లక్షల కుటుంబాలు ఉండగా.. ఆస్తి పన్ను రికార్డుల ప్రకారం 4.22 లక్షల ఇళ్లు ఉన్నాయి. వీటిలో 1.60 లక్షల ఇళ్లకు మాత్రమే వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. 4వేల అపార్ట్మెంట్లకు సెమీ బల్క్ కనెక్షన్లు ఉన్నాయి. నగర పరిధిలో 7,500 పబ్లిక్ కుళాయిలు ఉన్నాయి. వీటిపై ఆధారపడుతున్న కుటుంబాలు 2.50 లక్షల వరకు ఉంటాయని అంచనా. వ్యక్తిగత కనెక్షన్లు తప్పనిసరి చేస్తే వీరంతా కుళాయిలు వేయించుకోవాల్సిందే. సామాన్యులకు ఆర్థిక భారం కుళాయి కనెక్షన్ వేయించుకోవాలంటే ఇన్స్టలేషన్ చార్జీల కింద బీపీఎల్ కుటుంబాలకు రూ. 1200, ఏపీఎల్ కుటుంబాలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. మెటీరియల్ ఖర్చులను పూర్తిగా ఎవరికి వారే భరించాలి. ప్రధాన పైపులైన్‌కు ఇంటికి మధ్య ఉన్న దూరాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు మెటీరియల్ ఖర్చు వస్తుంది. పబ్లిక్ కుళాయి వినియోగించుకుంటున్న కుటుంబాలు లక్షకుపైగా ఉంటే..వారిలో సొంత ఇళ్లు ఉన్న వారు 70వేలకుపైగా ఉంటారని అంచనా. ఇక వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు కలిగిన వారిని మినహాయిస్తే ఆస్తిపన్ను అసెస్మెంట్ ప్రకారం మరో 2 లక్షల ఇళ్ల యజమానులు వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు వేయించుకోవల్సి ఉంటుందని లెక్కలేస్తున్నారు. వీరిలో లక్షన్నరకు పైగా బీపీఎల్ పరిధిలోనే ఉంటారని చెబుతున్నారు. ఈ లెక్కన సరాసరిన 2లక్షలకు పైగా బీపీఎల్ కుటుంబాలు విధిగా వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు వేయించుకోవల్సిన పరి స్థితి ఏర్పడింది. వీరు కనెక్షన్‌కు రూ.1200 చొప్పున చెల్లించడంతో పాటు మరో రూ.వెయ్యికి పైగా మెటీరియల్ చార్జి కింద భరించాలి. అంటే మొత్తం 2లక్షల బీపీఎల్ కుటుంబాలపై ఎంత తక్కువ లెక్కేసుకున్నా రూ.30 కోట్ల మేర భారం పడనుంది. అంతేకాకుండా ప్రతి నెలా రూ.60 చొప్పున కుళాయి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారం ఏటా కోటిన్నర పైమాటే. ఇక ఇన్స్టలేషన్, మెటిరీయల్ చార్జీలు కలిపి ఏపీఎల్ కుటుంబాలపై రూ.10 కోట్ల వరకు భారం పడనుండగా. వీరు ప్రతి నెలా రూ.120 చొప్పున పన్నుల రూపంలో రూ.2కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. శివార ప్రాంతాల పరిస్థితి దారుణం పబ్లిక్ కుళాయి కనెక్షన్లను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో విధిగా ప్రతి ఇంటికి వ్యక్తిగత కుళాయి కనెక్షన్ వేయాలని జీవీఎంసీ భావిస్తోంది. ఇటీవల కేంద్రం మంజూరు చేసిన ‘అవృత్’ నిధులు రూ.130 కోట్లతో మంచినీటి సరఫరా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా జీవీఎంసీలో విలీనమైన శివారు గ్రామాల కు నేటికీనగర మంచినీటి పథకంతో కనెక్టవిటీ లేదు. వాటర్‌ట్యాంక్‌ల ద్వారానే ఆయా గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలైన గాజువాక, ఎండాడ, మధురవాడ, మారికవలస, బోయపాలెం, కొమ్మాది,పెందుర్తి, చినముషిడివాడ, అడవివరం, సింహాచలం దువ్వాడ, లంకెలపాలెం, దేవాడ, అప్పికొండ, అగనంపూడి, ఐటీ సెజ్, 58, 60, 69 వార్డులకు టౌన్ సప్లయి రిజర్వాయర్ నుంచి ట్యాంకర్ల ద్వారా రోజుకు 367 ట్రిప్పులు సరఫరా చేస్తున్నారు. 189 ఆటోల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జీవీఎంసీకి నీటిసరఫరా లారీలు 4 ఉండగా, మరో 50 ట్యాంకర్లను అద్దె ప్రాతిపదికన నడుపుతున్నారు. ఈ గ్రామాలకు ఒకపూట నీరు రావడం కూడా కష్టంగా ఉంది. వేసవిలో అయితే వీరి పాట్లు వర్ణనాతీతం. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఆయా గ్రామాలకు అవృత్ పథకం నిధులతో పూర్తి స్థాయిలో పైపులైన్లు వేయాలని నిర్ణయించారు. వ్యక్తిగత కుళాయిల ఏర్పాటు పూర్తి కాగానే పబ్లిక్ కుళాయిలను తొలగించాలని భావిస్తున్నారు. 2017 నాటికి నగరంలో ఎక్కడా పబ్లిక కుళాయినేది కన్పించని పరిస్థితి ఏర్పడనుంది. -
అదిగో జలం.. ‘భగీరథ’ ఫలం
-
అదిగో జలం.. ‘భగీరథ’ ఫలం
ఏప్రిల్ 30 నాటికి 10 నియోజకవర్గాల్లో ఇంటింటికీ నల్లా నీరు: సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి మిషన్ భగీరథ తొలి ఫలాలు అందబోతున్నాయి. ప్రతి మనిషికి రోజుకు 100 లీటర్ల నీళ్ల చొప్పున, మొదటి ఫేజ్ కింద 10 నియోజకవర్గాల ప్రజలకు ఇంటింటికీ నల్లా పెట్టి గోదావరి నీళ్లు సరఫరా చేస్తాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. ఏడాది లోపు రాష్ట్రమంతటా‘మిషన్ భగీరథ’ పూర్తి చేస్తామని ప్రకటించారు. సోమవారం మెదక్ జిల్లా దుబ్బాకలో జరిగిన నియోజకవర్గ అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తాను విద్యాభ్యాసం చేసిన దుబ్బాకపై వరాల జల్లు కురిపించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ‘భగీరథ’కు నేనే స్విచ్చాన్ చేస్తా.. మెదక్ జిల్లా గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్, నల్లగొండ జిల్లాలో భువనగిరి, ఆలేరు, వరంగల్ జిల్లాలో జనగామ, పాలకుర్తి, చేర్యాల, కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గాలకు మొదటి దశలోనే నీళ్లు అందిస్తాం. రెండో దశలో రాష్ట్రమంతటికీ నీళ్లు అందుతాయి. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చే అద్భుతమైన కార్యక్రమం మిషన్ భగీరథ. గతంలో నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే పని జేసినా.. ఇప్పుడు దీన్నే రాష్ట్రమంతటా బ్రహ్మాండంగా అమలుజేస్తున్నం. ప్రతి మనిషికి రోజుకు 100 లీటర్ల నీళ్లు వచ్చే పద్ధతిలో ఏప్రిల్ 30 నాటికి పది నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి గోదావరి నీళ్లు వచ్చేటట్టు నేనే వచ్చి స్విచ్ ఆన్ చేస్తా. మిషన్ భగీరథ మిషన్ నల్లా స్విచ్ ఆన్ అయిన తర్వాత ఆడబిడ్డ నీళ్ల కోసం బిందెపట్టుకొని బజార్లో కనపడితే.. ఏ ఊర్లో కనబడితే ఆ ఊరు సర్పంచ్, ఎంపీటీసీ రాజీనామా చేయాలే. ఎక్కువ గ్రామాల్లో ఆడబిడ్డలు నీళ్ల కోసం బిందెలతో బజార్లోకి వచ్చినట్టు కనిపిస్తే ఆ ప్రాంత ఎమ్మెల్యే రాజీనామా చేయాలి. ఇప్పుడే పనులు జరుగుతున్నయి. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోయి పనుల దగ్గర నిలబడి మీకు కావల్సినట్టు చేయించుకోండ్రి. మీరు కూడా చరిత్రలో నిలిచిపోతారు. ఆ ప్రాంతాలు బంగారు తునకలు చెరువులు మన బతుకుదెరువులు. కాకతీయ, రెడ్డి రాజులు వందల ఏళ్ల కిందటే చెరువులు తవ్వారు. సమైక్య రాష్ట్రంలో మన చెరువుల విధ్వంసం జరిగింది. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు పక్కనే పెద్దగుండవె ళ్లి అనే ఊరిలో 101 చెరువులు ఉండేవి. ఇవాళ ఆ ఊర్లో 34 చెరువులే ఉన్నాయి. ఇలా చెరువుల విధ్వంసం కారణంగా 800 ఫీట్లు, 900 ఫీట్ల లోతుకు బోర్లు వేసుకొని మనం బోర్లా పడుతున్నాం. ఈ పరిస్థితి పోవాలి. మళ్లీ చెరువుల పునఃనిర్మాణం జరగాలే. మిషన్ కాకతీయ పథకం రెండో ఫేజ్ కూడా మొదలైంది. రెండేళ్లలో దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, మెదక్ ప్రాంతాలు బంగారు తునక కాబోతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రెడీ అయిపోయింది. కరువు నుంచి మనం శాశ్వతంగా దూరం కాబోతున్నాం. గోదావరి జలాలతోనే రెండు పంటలు పండించుకునేలా పథకం రూపొందించాం. ఈ గడ్డ మీద పుట్టినందుకు.. ఈ కరువు సీమకు రెండు పంటలకు నీళ్లు ఇవ్వడం కంటే గొప్పది నా జీవితానికి ఇంకేం ఉంటుంది? మన నిధులు మనకే.. కేసీఆర్ ఇంత డబ్బు ఎక్కడ్నుంచి తెస్తున్నడని కొందరు అంటున్నరు. నేను ఉద్యమ కాలంలోనే చెప్పినా.. మన వనరులు మనం ఖర్చు చేసుకుంటే మన తెలంగాణ అభివృద్ధి చెందుద్ది అని చెప్పిన. ఇవాళ 100 శాతం అదే జరుగుతోంది. చరిత్ర చూస్తే 8 శాతం, 10 శాతం నిధులు కూడా తెలంగాణలో ఖర్చు చేయలే. కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.1.60 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ప్రణాళిక నిధుల కింద రూ.40, 50 కోట్లు కూడా కేటాయించలేదు. ఇప్పుడు మన నిధులు మనమే ఖర్చు చేసుకుంటున్నం. మనం రూ.67 వేల కోట్ల బడ్జెట్ రూపొందించుకున్నాం. సాగునీటికి ఏడాదికి రూ.25 వేల కోట్లు కేటాయించుకుంటున్నాం. మన నీళ్లు, మన నిధులు మనకు దక్కాలని కోరుకున్నాం. మార్చి లేదా ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల నిరంతర కరెంటు అందిస్తాం. 2018 నాటికి 24 గంటల త్రీఫేజ్ కరెంటు అందిస్తాం. కరెంటు బాధలు శాశ్వతంగా పోతాయి. పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్నాం. ఈ ఏడాది 66 వేల ఇళ్లు మాత్రమే తీసుకున్నాం. వచ్చే ఏడాది ప్రతి నియోజకవర్గానికి 1,200 లేదా 1,500 ఇళ్ల చొప్పున తీసుకోవడానికి ప్రణాళిక రూపొం దిస్తున్నాం. నేను చదువుకున్న దుబ్బాక హైస్కూల్‌కు ఇప్పటికే రూ.4.68 కోట్లు కేటాయించాం. జూనియర్ కాలేజీని నా చిన్నప్పట్నుంచీ చూస్తున్నా.. ఎప్పుడు కూలుద్దో ఏమో అన్నట్టుగా ఉంది. స్కూల్‌తో పాటు కాలేజీకి కలిపి రూ.10 కోట్లు కేటాయిస్తున్నా. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించండి. టీచర్లలో ఆ అంకితభావం ఎక్కడ? మా కాలంలో గొప్ప ఉపాధ్యాయులుండేవారు. ఒక సంఘటన చెప్తాను. మా తెలుగు సారు మృత్యుంజయశర్మగారు ఎంత చక్కగా పాఠం చెప్పేవారంటే.. వారు పద్యం చదువుతుంటేనే సగం బోధపడేది. ఒకసారి ‘ఉత్తర గోగ్రహణం’ పాఠ్యాంశం బోధించి.. భాషా, వ్యాకరణ, ఉచ్ఛరణ దోషాలు లేకుండా అప్పగించిన వారికి 200 పేజీల నోట్‌బుక్ ఇస్తానని చెప్పారు. ఐదుసార్లు చదువుకొని మాస్టారుకు అప్పజెప్పాను. తెలుగు సాహిత్య ప్రపంచానికి మా సారు ద్వారం తెరిచారు. (ఈ సందర్భంగా 1967-68లో నేర్చుకున్న ‘ భీష్మద్రోణ కపా...’ అనే పద్యాన్ని చదివి వినిపించారు). అప్పట్నుంచి కొన్ని వేల పుస్తకాలు చదివాను. ఇప్పటి వాళ్లలో ఆ డెడికేషన్ ఎక్కడుంది? హరీశ్ బుల్లెట్ లాంటి మంత్రి మెదక్ జిల్లాకు హరీశ్‌రావు రూపంలో బుల్లెట్ లాంటి మంత్రి ఉండటం ఇక్కడి ప్రజల వరం. ఇరిగేషన్ పనులు అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. మల్లన్న సాగర్ ద్వారా ఈ గడ్డకు నీళ్లు అందుతాయి. ఒక్క పంట కాదు రెండు కార్ల పచ్చటి పంటలు మనం చూడబోతున్నాం. ప్రగతి బాటలు మీరే వేయాలి.. మీకు మీరే కథానాయకులు కావాలి. ఏ ఊరి ప్రజలు ఆ ఊరిలో పిడికిలి బిగించిన రోజునే పనులు కోరుకున్నట్టుగా జరుగుతాయి. అభివృద్ధి పనులపై అత్యంత వేగంగా ఉత్తర్వులు తన నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి, కొత్త ఫైర్ స్టేషన్, దుబ్బాక పట్టణాభివృద్ధి కోసం రూ.2 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాల్సిందిగా అభ్యర్థిస్తూ దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సీఎంకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం నియోజకవర్గ సమీక్షా సమావేశంలో సీఎం ప్రసంగిస్తూ.. దుబ్బాక సీహెచ్‌సీని 100 పడకల ఆసుపత్రిగా స్థాయి పెంచుతామని, కొత్త ఫైర్ స్టేషన్ మంజూరు చేస్తామని, దుబ్బాక పట్టణాభివృద్ధికి రూ.2 కోట్ల నిధులు సరిపోవని ఇంతకంటే ఎక్కువగానే కేటాయిస్తామని చెప్పారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే జారీ చేస్తామన్నారు. సీఎం చెప్పినట్లుగానే ఆయన ప్రసంగం ముగిసే సరికి.. దుబ్బాక సీహెచ్‌సీని 100 పడకల ఆసుపత్రిగా స్థాయి పెంచుతూ, కొత్త ఫైర్ స్టేషన్ మంజూరు చేస్తూ, దుబ్బాక పట్ణణాభివద్ధికి రూ. 2 కోట్ల ప్రత్యేక నిధులతోపాటు దుబ్బాక మేజర్ గ్రామ పంచాయతీ నూతన కార్యాలయ నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వులను కేసీఆర్ అదే వేదికపై జిల్లా మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి అందించారు. స్థానిక ఎమ్మెల్యే సోలిపేట అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబూమోహన్, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ తదితరులు పాల్గొన్నారు. -
'అత్యవసరమైతే తప్ప మొబైల్ వాడకండి'
లక్నో: మీకు అత్యవసరమైతే తప్ప మొబైల్ ఫోన్లు వాడకండీ అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తమ పార్టీ నాయకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం లక్నోలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ములాయం మాట్లాడుతూ.. తాను మొబైల్ ఫోన్‌ను ఎంతో అత్యవసరమైతేనే, వేరే ప్రత్యామ్నాయం లేనప్పుడు మాత్రమే వాడుతానని వెల్లడించారు. మొబైల్లో సంభాషనలను ట్యాపింగ్ చేసి తరువాత వాటితో బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. సాంకేతిక పరిఙ్ఞానాన్ని తప్పుగా వాడే అవకాశం ఉందన్న ఆయన.. మీ సంభాషనలు ట్యాపింగ్‌కు గురికావచ్చు జాగ్రత్తగా ఉండాలని పార్టీ నాయకులకు సూచించారు. గతంలో సస్పెండైన ఐపీఎస్ ఆఫీసర్ అమితాబ్ ఠాకూర్ ఫోన్లో తనను వేధించారని ఆరోపించడంతో ములాయం ఈ వ్యాఖ్యలు చేశారు. -
స్త్రీ కన్నీళ్లు వర్సెస్ ఇస్త్రీ పెట్టె!
ఉత్త(మ)పురుష ‘‘సరే నువ్వు కోరినట్టే గోల్డ్ చైన్ ఇప్పిస్తా గానీ ఇక ఆ నల్లా కట్టేయ్. ఎప్పుడూ రెడీగా ఉంటుంది నెత్తి మీద కుళాయి. ఈ కుళాయి ఉందని మీకు మహా బడాయి. అందుకే చిన్న మాట అన్నా సరే... ట్యాప్ విప్పేస్తుంటారు. టాప్ లేపేస్తుంటారు’’ కాస్త చీవాట్లు పెడుతున్న ధోరణిలో అన్నారాయన. ‘‘మీరు బంగారం ఇప్పించకపోయినా పర్లేదు. కానీ వెటకారంగా మాత్రం మాట్లాడకండి. ఇప్పుడు నా కన్నీళ్ల కుళాయి మీ ఎగతాళికే’’ అన్నాను వెక్కుతూ. ఆత్మాభిమానం మగాళ్ల కంటే ఆడవాళ్లలోనే ఎక్కువగా ఉంటుందని నాకు మా ఆయన మాటల్లో చాలాసార్లు అర్థమైంది. మనం ఏదో గోముగా అడుగుతామా? వెంటనే వాళ్లు ఖండించేస్తారు. మనం కన్నీళ్లు పెట్టుకుంటాం. అడిగింది ఇవ్వనందుకు మనం ఏడుస్తున్నామని వాళ్లనుకుంటారు. కానీ మన కన్నీళ్లు అది దక్కనందుకు కాదు. అనగానే మాట కాదన్నందుకు. కాదనేలా మాట పడినందుకు. ఈ విషయం ఈ మగాళ్లకు ఎందుకు అర్థం కాదు? అసలు జరిగిన విషయం ఏమిటంటే... ఆ మధ్య బంగారం తులం ముఫ్ఫై రెండు వేల నుంచి అకస్మాత్తుగా ఇరవై ఐదువేలకు పడిపోయింది. ఇదే టైమ్‌లో ఓ యాభై వేలు అప్పు చేసైనా రెండు తులాల గోల్డ్ చైన్ తీసుకుంటే దాదాపు పదిహేను వేలు ఆదా అవుతుంది. భవిష్యత్తులో రేటు పెరిగితే అప్పుడు బంగారం కొనలేకపోయామే అన్న బాధా తప్పుతుంది. ఇది నా ఆలోచన. ఇదే విషయం చెప్పీ చెప్పగానే ఆయన డెలివరీ చేసిన డైలాగ్లన్నమాట అవి! మాటకు మాట జవాబిచ్చాను కానీ నాకు తెలియకుండానే దొర్లిపోయాయి కన్నీళ్లు. ఇలా ఏడుపుకు దిగినప్పుడల్లా ఆయన అనే మాట ఒక్కటే. ‘‘దేన్నెనా మీ ఆడాళ్లు ఏడ్చి సాధించగలరోయ్’’ అని. మా ఏడుపు ఎవరినో సాధించి, ఏదో సాధించుకుందామని కాదనీ, ఆత్మాభిమాన సాధన కోసమేనని ఈ మగాళ్లకు ఎప్పుడర్థమవుతుందో ఏమో?! ఎక్కడ అప్పు చేశారో, ఎలా సంపాదించారోగానీ... ఓ రెండు తులాల చైన్ చేయించి తెచ్చి, ‘‘నువ్వు కోరినట్టే చైన్ తెచ్చా... నవ్వు లేదు! గోల్డు తెచ్చినా బోల్డు ఆనందమేమీ కనిపించడం లేదేమిటోయ్’’ అన్నారు. ‘‘చెప్పాగా మహానుభావా... నా కోరిక గొలుసుల కోసం కాదు. తళుకుల కోసం కాదు. అయినా... మీరు వేడి బండలా మండిపోతుంటారు. మా కన్నీళ్లు దానిపై పడితే సుయ్‌మంటూ ఆవిరే. మీరేదో కోపంతో కాలిపోతూ కూడా మాకు ఉపకారం చేస్తున్న ఇస్త్రీ పెట్టెలా పోజెడతారు. ముక్కు మీది నుంచి జారే చెమటైనా, కళ్ల నుంచి కారే కన్నీరైనా ఇస్త్రీ మీద పడ్డా సుయ్‌మంటూ ఇగిరిపోవాల్సిందే కదా. లోహపురుషుల దగ్గర ఇక నవ్వెక్కడా, ఆనందమెక్కడా’’ అంటూ దెప్పిపొడిచా. మొన్న ఒకరోజు ఆయనకు ఛాతీనొప్పి వచ్చింది. ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఆయనకు బాధతో చెమటలు పడితే, నాకు ఆందోళనతో చెమటలు పట్టాయి. ఆయన ఆయాసపడితే నేను ప్రయాసపడ్డా. అదేదో కార్పొరేట్ ఆసుపత్రి. ఇన్‌పేషెంట్‌గా చేర్చాలంటే ముందుగానే అడ్వాన్సుగా డబ్బు కట్టాలట. ఫస్టొచ్చాక కాసు కళ్లపడేది మళ్లీ ఫస్టుకే. నెల చివర్లో అంత డబ్బంటే ఎలా? అందుకే ఆపదలో ఆయన తెచ్చిన గోల్డు చైనే అక్కరకొచ్చింది. ‘‘నీ గోల్డు చైను ఇన్సూరెన్సు కంపెనీ బాగా పనికొచ్చిందోయ్’’ అంటూ ఓ కాంప్లిమెంటు పడేశారు మా సారూ, శ్రీవారూ. నిజం చెబుతున్నా... ఆయాసం వచ్చినప్పుడు లేదూ... ఆసుపత్రిలో చేర్చినప్పుడు లేదూ... డిశ్చార్జి అయి ఇంటికొచ్చాక నిశ్చింత ధ్వనిస్తూ అన్న ఆ మాటతో అప్పుడొచ్చాయి కన్నీళ్లు. -
దాహం...దాహం...
ఈ ఏడాది ఎండల తీవ్రతకు దాహార్తితో మూగజీవాలు అల్లాడిపోతున్నాయనేందుకు ఈ చిత్రమే సాక్ష్యం. గొంతెండిపోయి... నీటికోసం అన్వేషిస్తున్న ఓ ఆవుకు కుళాయి కనపడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. కుళాయిని తిప్పేందుకు విఫలయత్నం చేసింది. దీని అవస్థలు గమనించిన ఓ వ్యక్తి కుళాయి నీటిని వదిలి పక్కకు జరిగాడు. దీంతో మోర ఎత్తి ఇదిగో...ఇలా నాలుక తడుపుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వాటర్ వర్క్స్ సమీపంలో షిర్డీ సాయి ఆలయం వద్ద సోమవారం మధ్యాహ్నం కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరాలో బంధించింది. - వీరభగవాన్ తెలగరెడ్డి, సాక్షి, రాజమండ్రి