స్త్రీ కన్నీళ్లు వర్సెస్ ఇస్త్రీ పెట్టె!
ఉత్త(మ)పురుష
‘‘సరే నువ్వు కోరినట్టే గోల్డ్ చైన్ ఇప్పిస్తా గానీ ఇక ఆ నల్లా కట్టేయ్. ఎప్పుడూ రెడీగా ఉంటుంది నెత్తి మీద కుళాయి. ఈ కుళాయి ఉందని మీకు మహా బడాయి. అందుకే చిన్న మాట అన్నా సరే... ట్యాప్ విప్పేస్తుంటారు. టాప్ లేపేస్తుంటారు’’ కాస్త చీవాట్లు పెడుతున్న ధోరణిలో అన్నారాయన.
‘‘మీరు బంగారం ఇప్పించకపోయినా పర్లేదు. కానీ వెటకారంగా మాత్రం మాట్లాడకండి. ఇప్పుడు నా కన్నీళ్ల కుళాయి మీ ఎగతాళికే’’ అన్నాను వెక్కుతూ.
ఆత్మాభిమానం మగాళ్ల కంటే ఆడవాళ్లలోనే ఎక్కువగా ఉంటుందని నాకు మా ఆయన మాటల్లో చాలాసార్లు అర్థమైంది. మనం ఏదో గోముగా అడుగుతామా? వెంటనే వాళ్లు ఖండించేస్తారు. మనం కన్నీళ్లు పెట్టుకుంటాం. అడిగింది ఇవ్వనందుకు మనం ఏడుస్తున్నామని వాళ్లనుకుంటారు. కానీ మన కన్నీళ్లు అది దక్కనందుకు కాదు. అనగానే మాట కాదన్నందుకు. కాదనేలా మాట పడినందుకు. ఈ విషయం ఈ మగాళ్లకు ఎందుకు అర్థం కాదు?
అసలు జరిగిన విషయం ఏమిటంటే... ఆ మధ్య బంగారం తులం ముఫ్ఫై రెండు వేల నుంచి అకస్మాత్తుగా ఇరవై ఐదువేలకు పడిపోయింది. ఇదే టైమ్‌లో ఓ యాభై వేలు అప్పు చేసైనా రెండు తులాల గోల్డ్ చైన్ తీసుకుంటే దాదాపు పదిహేను వేలు ఆదా అవుతుంది. భవిష్యత్తులో రేటు పెరిగితే అప్పుడు బంగారం కొనలేకపోయామే అన్న బాధా తప్పుతుంది. ఇది నా ఆలోచన. ఇదే విషయం చెప్పీ చెప్పగానే ఆయన డెలివరీ చేసిన డైలాగ్‌లన్నమాట అవి! మాటకు మాట జవాబిచ్చాను కానీ నాకు తెలియకుండానే దొర్లిపోయాయి కన్నీళ్లు. ఇలా ఏడుపుకు దిగినప్పుడల్లా ఆయన అనే మాట ఒక్కటే. ‘‘దేన్నెనా మీ ఆడాళ్లు ఏడ్చి సాధించగలరోయ్’’ అని.
మా ఏడుపు ఎవరినో సాధించి, ఏదో సాధించుకుందామని కాదనీ, ఆత్మాభిమాన సాధన కోసమేనని ఈ మగాళ్లకు ఎప్పుడర్థమవుతుందో ఏమో?!
ఎక్కడ అప్పు చేశారో, ఎలా సంపాదించారోగానీ... ఓ రెండు తులాల చైన్ చేయించి తెచ్చి, ‘‘నువ్వు కోరినట్టే చైన్ తెచ్చా... నవ్వు లేదు! గోల్డు తెచ్చినా బోల్డు ఆనందమేమీ కనిపించడం లేదేమిటోయ్’’ అన్నారు.
‘‘చెప్పాగా మహానుభావా... నా కోరిక గొలుసుల కోసం కాదు. తళుకుల కోసం కాదు. అయినా... మీరు వేడి బండలా మండిపోతుంటారు. మా కన్నీళ్లు దానిపై పడితే సుయ్‌మంటూ ఆవిరే. మీరేదో కోపంతో కాలిపోతూ కూడా మాకు ఉపకారం చేస్తున్న ఇస్త్రీ పెట్టెలా పోజెడతారు. ముక్కు మీది నుంచి జారే చెమటైనా, కళ్ల నుంచి కారే కన్నీరైనా ఇస్త్రీ మీద పడ్డా సుయ్‌మంటూ ఇగిరిపోవాల్సిందే కదా. లోహపురుషుల దగ్గర ఇక నవ్వెక్కడా, ఆనందమెక్కడా’’ అంటూ దెప్పిపొడిచా.
మొన్న ఒకరోజు ఆయనకు ఛాతీనొప్పి వచ్చింది. ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఆయనకు బాధతో చెమటలు పడితే, నాకు ఆందోళనతో చెమటలు పట్టాయి. ఆయన ఆయాసపడితే నేను ప్రయాసపడ్డా.
అదేదో కార్పొరేట్ ఆసుపత్రి. ఇన్‌పేషెంట్‌గా చేర్చాలంటే ముందుగానే అడ్వాన్సుగా డబ్బు కట్టాలట. ఫస్టొచ్చాక కాసు కళ్లపడేది మళ్లీ ఫస్టుకే. నెల చివర్లో అంత డబ్బంటే ఎలా? అందుకే ఆపదలో ఆయన తెచ్చిన గోల్డు చైనే అక్కరకొచ్చింది.
‘‘నీ గోల్డు చైను ఇన్సూరెన్సు కంపెనీ బాగా పనికొచ్చిందోయ్’’ అంటూ ఓ కాంప్లిమెంటు పడేశారు మా సారూ, శ్రీవారూ. నిజం చెబుతున్నా... ఆయాసం వచ్చినప్పుడు లేదూ... ఆసుపత్రిలో చేర్చినప్పుడు లేదూ... డిశ్చార్జి అయి ఇంటికొచ్చాక నిశ్చింత ధ్వనిస్తూ అన్న ఆ మాటతో అప్పుడొచ్చాయి కన్నీళ్లు.