గుర్తుతెలియని దుండగులు మహిళ నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును చోరీ చేశారు.
ఘట్‌కేసర్ (రంగారెడ్డి) : గుర్తుతెలియని దుండగులు మహిళ నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం పిలాయిపల్లి గ్రామానికి చెందిన రాజమణి(65) కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది రెండు రోజుల క్రితం గుర్తుతెలియని విషం తాగింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఘటకేసర్లోని కమ్యూనిటీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటుంది.
కాగా మండలంలోని ఘణాపూర్‌కు చెందిన ఆమె కూతురు మాధవీ ఆదివారం రాత్రి అటెండర్‌గా తల్లి మంచం పక్కన పడుకుంది. మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును పర్సులో దాచింది. అయితే ఉదయం లేచి చూసి సరికే పర్సు కనిపించలేదు. దీంతో పాటు పక్కన మంచం మీద చికిత్స పొందుతున్న యువకుడు కనిపించకుండాపోయాడు. ఆ యువకుడే చోరీ చేసి ఉండివచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.