నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న సీఐ చిన్నగోవిందు
డాక్టర్ ఇంట్లో చోరీ కేసును హిందూపురం వన్‌టౌన్ పోలీసులు ఛేదించారు. ద్విచక్రవాహనం రిపేరీ చేయించి తీసుకురమ్మని ఆస్పత్రిలో పనిచేసే యువకుడికి డాక్టర్ తాళం చెవి ఇచ్చారు. ఇంటి తాళం చెవిలు కూడా దానికే ఉండటంతో అతడిలో దుర్బుద్ధి పుట్టి దొంగతనానికి పాల్పడ్డాడు. నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి నగదు, బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.
హిందూపురం అర్బన్: చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ చిన్నగోవిందు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన సోమవారం మీడియాకు వెల్లడించారు. పట్టణంలోని ఆర్టీసీబస్టాండ్ సమీపాన డాక్టర్ జి.అనూష నివాసం ఉంటున్నారు. ఈ నెల 24వ తేదీన పార్థ డెంటల్ హాస్పిటల్‌కు బైక్‌పై వెళ్లారు. అక్కడ బైక్ మొరాయించడంతో రిపేరీ చేయించుకుని రావాల్సిందిగా ఆస్పత్రిలో పనిచేసే కె.ఎస్.విశాల్‌కృష్ణను పురమాయించారు. బైక్ కీస్‌కే ఇంటి తాళంచెవిలు కూడా ఉండటం గమనించిన విశాల్ నేరుగా డాక్టర్ ఇంటికి వెళ్లి దర్జాగా తాళాలు తెరిచి.. బీరువాలో ఉన్న నగదు, నగలు చోరీ చేశాడు. అనంతరం రిపేరీ చేయించిన బైక్‌ను ఆస్పత్రిలో డాక్టర్‌కు అప్పగించి.. ఎవరికీ అనుమానం రాకుండా తన పనిలో తాను నిమగ్నమయ్యాడు.
అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు
డ్యూటీ ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చిన డాక్టర్ అనూషకు అప్పటికే తలుపులు తీసి ఉండటం కనిపించాయి. లోనికి వెళ్లి పరిశీలించగా బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బంగారు నగలతోపాటు కొంత నగదు చోరీ అయినట్లు గురించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ చిన్నగోవిందు కేసు నమోదు చేశారు.
నిందితుడిని గుర్తించిందిలా..
25వ తేదీన ఉదయం క్లూస్‌టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. పలువురి నుంచి వేలిముద్రలు తీసుకుని పరీక్షలు చేశారు. చివరకు ఆసుపత్రిలో పనిచేసే విశాల్‌పై అనుమానం రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీ చేసినట్లు విచారణలో ఒప్పుకోవడంతో అతడి వద్ద నుంచి రూ.1.44 లక్షల నగదు, 16 గ్రాముల బరువున్న బంగారు బ్రేస్‌లెట్‌ను రికవరీ చేశారు. కేసును త్వరితగతిన ఛేదించిన ఎస్‌ఐ మక్బుల్, హెడ్‌కానిస్టేబుల్ సునీల్‌నాయక్, పోలీస్‌కానిస్టేబుళ్లు నరేష్, చెన్నకేశవులు బృందాన్ని రివార్డుకు సిఫార్సు చేస్తున్నట్లు సీఐ చిన్నగోవిందు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment