
యశవంతపుర: కోనసంద్రలో ఈ నెల 10న జరిగిన దివ్య అనే మహిళ హత్య కేసును కెంగేరి పోలీసులు ఛేదించారు. ఇంటిలో అద్దెకు ఉన్న యువతి దివ్యను గొంతు పిసికి చంపేసినట్లు నిర్ధారించారు నిందితురాలిని అరెస్ట్ చేశారు. వివరాలు.. గురుమూర్తి, దివ్య దంపతులకు చెందిన ఇంటిలోని ఒక పోర్షన్‌లో కోలారు జిల్లాకు చెందిన మోనిక (24) అనే యువతి అద్దెకు ఉండేది. ప్రియుడినే భర్తగా చూపి ఇల్లు అద్దెకు తీసుకుంది.
ప్రైవేట్ సంస్థలో డేటా ఎంట్రీ అపరేటర్‌గా పని చేస్తుంది. ప్రియుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. విలాసాలకు అలవాటు పడిన మోనిక తన ప్రియుడికి క్యాంటర్ వాహనం కొనివ్వాలని డబ్బు కోసం ప్రయత్నించింది. ఇంటి యజమాని దివ్య మెడలో ఉన్న బంగారంపై మోనికాకు కన్నుపడింది.
దివ్య భర్త గురుమూర్తి కెంగేరి శివనపాళ్యంలో సెలూన్ నడుపుతుండగా, అత్తమామలు ఉదయం పనులకెళ్లి రాత్రికి వచ్చేవారు. దివ్య తన రెండేళ్ల చిన్నారితో ఇంటిలో ఉండేది. గమనించిన మోనిక.. ఈ నెల 10న ప్రియునితో కలసి దివ్యను గొంతుపిసికి హత్య చేసి ఆమె మెడలోని 36 గ్రాముల బంగారం చైన్ తీసుకొని ఉడాయించారు. పోలీసులు అనుమానంతో మోనికను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం బయట పడింది. ప్రియుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment