కుళాయిలకు మీటర్లు ఏర్పాటు
భారీగా పెరగనున్న మంచినీటి చార్జీలు అమృత్ ఎఫెక్ట్
కార్పొరేషన్ అధికారుల కసరత్తు
బెజవాడ రాజధానిగా మారిందనో.. లేక ‘అమృత్’ విధించిన ఆంక్షలో కానీ నగరవాసి నెత్తిన పాలకులు నీటి పన్నుల బండ పడేసేందుకు కసరత్తు ప్రారంభించారు. మంచినీటి కుళాయిలకు మీటర్లు బిగించాలన్న మున్సిపల్ మంత్రి పి.నారాయణ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో 400 శాతం పెరిగిన నీటి చార్జీలు తాజా పరిణామాల నేపథ్యంలో తడిసి మోపెడు కానున్నాయి.
విజయవాడ సెంట్రల్ : ఈ నెలాఖరుకల్లా కుళాయిలకు నీటి మీటర్లు బిగించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకయ్యే ఖర్చును గృహ యజమానుల నుంచి వాయిదా పద్ధతుల్లో వసూలుచేయాలని నిర్ణయించారు. అమృత్ (అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ ట్రాన్సఫర్‌మేషన్) ఆంక్షల్లో భాగంగానే నీటి మీటర్లు ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. వృథాను అరికట్టేందుకే మీటర్లు పెడుతున్నట్లు మంత్రి చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరానే లేనప్పుడు నీరు వృథా ఎలా అవుతోందన్న ప్రశ్న ప్రజల నుంచి ఉత్పన్నమవుతోంది.
అమృత్ ఆంక్షలు
స్మార్ట్ సిటీ కోసం పోటీపడి ర్యాంకింగ్‌లో చతికిలపడ్డ విజయవాడ నగరపాలక సంస్థ అమృత్ పథకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 73.50 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.24.17 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14.50 కోట్లు, నగరపాలక సంస్థ రూ.33.83 కోట్లు, ఉద్యానవన శాఖ రూ. కోటి చొప్పున ఖర్చు భరించాల్సి ఉంటుంది. అమృత్‌లో భాగంగా నగరంలోని ప్రతి ఇంటికి కుళాయిలు ఏర్పాటుచేయడంతో పాటు వాటికి మీటర్లు అమర్చాలనే నిబంధన ఉంది. నగరంలో 1,79,245 గృహాలున్నాయి. కుళాయి కనెక్షన్లు 1,06,979 ఉన్నాయి. ఈ లెక్కన మిగతా గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. నీటి సరఫరాకు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.32.40 కోట్లు ఖర్చు చేస్తుండగా.. పన్నుల రూపంలో రూ.28.16 కోట్లు వసూలవుతోంది. నీటి మీటర్లు అమర్చడంపాటు యూజర్ చార్జీలు వసూలు చేసినట్లయితే దండిగా ఆదాయం రాబట్టవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన.
డబుల్ గేమ్
విజయవాడ నగర జనాభా 12 లక్షలకు చేరింది. శివారు, కొండ ప్రాంతాలకు పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా కావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో జరిగే నీటి వృథాను దృష్టిలో పెట్టుకొని మీటర్లు ఏర్పాటు చేసినట్లయితే నగరవాసులందరూ ఆ భారాన్ని మోయాల్సివస్తోంది. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో వాటర్ చార్జీలను ఏడు శాతం పెంచుతూ తీర్మానం చేశారు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పెంచిన డ్రెయినేజీ, వాటర్ చార్జీలను ఏటా ఏడు శాతం పెంచడానికి వీల్లేదని డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు 2014లో ప్రతిపాదన పెట్టారు. దీన్ని కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించి ప్రభుత్వానికి పంపింది. రెండేళ్లయినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఫలితంగా ఏటా ఏడు శాతం చొప్పున నీటి చార్జీలు పెరుగుతున్నాయి. ప్రస్తుత చార్జీలపై 10 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.