Water charges
-
నీటిచార్జీల హేతుబద్ధీకరణ
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో టీడీపీ ప్రభుత్వం అహేతుకంగా నిర్ణయించిన నీటిచార్జీలను రాష్ట్ర ప్రభుత్వం హేతుబద్ధీకరించింది. ప్రజ లు, వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు అధికభారం లేకుండా నీటిపన్నుల తగ్గింపు ప్రతిపాదనలు ఆమోదించింది. ఈమేరకు పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కుళాయిలకు మీటర్లు ఏర్పాటు చేసి గృహ, (వ్యక్తిగత ఇళ్లు, అపార్టుమెంట్లకు వేర్వేరుగా), వాణిజ్య, పారిశ్రామిక కేట గిరీల కింద నీటిచాచార్జీలను అమాంతంగా పెంచింది. దీన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సమీక్షించింది. పురపాలకశాఖ ప్రతిపాదనల మేరకు రాష్ట్ర పురపాలకశాఖ కమిషనర్/డైరెక్టర్ అధ్యక్షుడిగా ఇంజినీర్ ఇన్ చీఫ్, సూపరింటెం డెంట్ ఇంజినీర్ (పబ్లిక్ హెల్త్) సభ్యులుగా ఉన్న కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. కొత్త నీటిచార్జీలు వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ చార్జీలను ఏటా 5 శాతం పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. సీవరేజీ చార్జీల హేతుబద్ధీకరణ నగరాలు, పట్టణాల్లో కొత్త చార్జీల అమలు రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో సీవరేజీ చార్జీలను హేతుబద్ధీకరిస్తూ పుర పాలకశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11 నగ రాలు, పట్టణాల్లో భూగర్భ మురుగునీటి పారుదలవ్యవస్థ (యూడీఎస్) ఉంది. ఆయా చోట్ల వేర్వేరు రీతుల్లో సీవరేజీ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చార్జీలను హేతుబద్ధీకరిస్తూ ప్రతిపాదనలు రూపొం దించారు. ఈ ప్రతిపాదనల మేరకు నగరాలు, పట్టణాలు సీవరేజీ చార్జీల ను నిర్ణయించాలని పురపాలకశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. -
మంచినీళ్లు.. మరింత ప్రియం!
సాక్షి, చెన్నై: ఇక అనేక విషయాలకు ఉదాహరణగా ‘మంచినీళ్ల ప్రాయం’ అని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. నీళ్లేకదాని వృథా చేస్తే బిల్లు తడిసి మోపడవుతుంది. ప్రతి తాగునీటి కనెక్షన్‌కు డిజిటల్ మీటర్లు అమర్చి వినియోగానికి తగినట్లుగా బిల్లు వసూలు చేసేందుకు తాగునీటి విభాగం సిద్ధం అవుతోంది. చెన్నై తాగునీటి విభాగం ద్వారా 8 లక్షల ఇళ్లకు తాగునీటి కనెక్షన్ ఇచ్చారు. ఒక్కో ఇంటి నుంచి ఆరునెలలకు ఒకసారి చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇళ్లకైతే నెలకు రూ.50, వాణిజ్య సముదాయ ప్రాంతాల్లో ఒక్కో కనెక్షన్‌కు రూ.150, పూర్తిగా వాణిజ్య సదుపాయ కనెక్షన్‌కు రూ.200 లెక్కన వసూలు చేస్తున్నారు. డిజిటల్ మీటర్లు అమరిక.. అలాగే కార్యాలయాల్లో తాగునీరు, మురుగునీరు తొలగింపుకు వేరుగా సొమ్ము వసూలు చేస్తున్నారు. తాగునీటిని వృథా చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో వాణిజ్య సముదాయాల్లో రుసుము మొత్తాన్ని పెంచడం ద్వారా ఈ వృధాను కట్టడి చేయాలని నిర్ణయించారు. నీటి వినియోగాన్ని నిక్కచ్చిగా లెక్కకట్టేందుకు డిజిటల్ మీటర్లను అమర్చనున్నారు. ఈ డిజిటల్ మీటర్ల వినియోగాన్ని ముందుగా వాణిజ్య సముదాయాల్లో ప్రారంభించనున్నారు. తొలిదశలో ఏప్రిల్‌లోగా 12 వేల డిజిటల్ మీటర్లను అమర్చనున్నారు. ఏడాదికి ఏడాది 10వేల కొత్త కనెక్షన్లు పెరుగుతున్నందున కేవలం వాణిజ్య సముదాయాలకు ఎంతశాతం నీరు వినియోగం అవుతోందోనని లెక్కకట్టనున్నారు. వచ్చేనెలాఖరులో టెండర్లు.. కొత్త డిజిటల్ మీటర్ల కొనుగోలుకు వచ్చేనెలాఖరులో టెండర్లు పిలవనున్నారు. తొలి దశ సజావుగా సాగిన పక్షంలో డిజిటల్ మీటర్ల విధానాన్ని అన్ని కనెక్షన్‌కు విస్తరించాలని చేయాలని నిర్ణయించారు. అయితే అన్ని కనెక్షన్లకు డిజిటల్ మీటర్ల అమరికకు కనీసం ఏడాది పడుతుందుని భావిస్తున్నారు. నివాస గృహాల్లో ప్రస్తుతం వెయ్యిలీటర్ల తాగునీటికి రూ.20లు వసూలు చేస్తున్నారు. దశలవారీగా డిజిటల్ విధానాన్ని విస్తరించిన పక్షంలో ఈ మొత్తం నాలుగింతలు పెరిగే అవకాశం ఉంది. నలుగురు సభ్యులున్న కుటుంబానికి సగటున రోజుకు 340 లీటర్ల తాగునీరు అవసరం అవుతుందని అధికారుల లెక్కకట్టారు. అంటే ఒక కుటుంబానికి నెలకు 10వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది. నెలకు 10 వేల లీటర్లు వినియోగిస్తే రూ.200లు చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ మీటర్లతో పలు ప్రయోజనాలు ఈ కొత్త విధానంపై తాగునీటి విభాగానికి చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ, డిజిటల్ మీటర్ల గురించి వినియోగదారులు అందోళన చెందాల్సిన అవసరం లేదు, ఉభయతారకంగా పలు ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. వాణిజ్యసముదాయాల్లో 12 వేల డిజిటల్ మీటర్లను తొలిదశలో అమరుస్తామని, దీని వల్ల ప్రతి నీటి బొట్టు లెక్కలోకి వస్తుందని చెప్పారు. తాగునీటి ఆవశ్యకత, విలువ వినియోగదారులకు తెలియజేయడం, వృదాను అరికట్టడం తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అంతేగాక తాగునీటి విభాగానికి మరిన్ని ఆర్దిక వనరులు సంక్రమించడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందజేయగలమని అన్నారు. అంతేగాక నీటి వినియోగం చేయకుంటే రుసుము వసూలు చేయబోమని, నీటి దొంగతనాలను, లీకేజీని నివారించవచ్చని తెలిపారు. సెలవుల్లో కుటుంబసభ్యులంతా కలిసి ఊళ్లకు వెళ్లేవారు నీటి సరఫరాను నిలిపివేసేందుకు వీలుగా ఒక వాల్వ్‌ను కూడా ఇళ్లలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిజిటల్ మీటరు అమరికకు అయ్యే ఖర్చును ఇంటి యజమాని నుంచి వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. -
నీటి బిల్లు మోత
సాక్షి, న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీలోని ఆప్ సర్కార్ నీటి బిల్లులనూ మోతెక్కించింది. వాటర్ టారిఫ్‌ను 20 శాతం పెంచాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్ధాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 20,000 లీటర్ల పైన ఒక్క లీటర్ అధికంగా వాడుకున్నా మొత్తం వాడిన నీటిపై బిల్లు భారం పడనుంది. ఫిబ్రవరి 1 నుంచి పెరిగిన నీటి చార్జీలు అమల్లోకి రానున్నాయి. భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఢిల్లీ జల్ బోర్డ్ నీటి చార్జీలను పెంచాలని ప్రతిపాదించింది. గత ఏడాది రూ.209 కోట్ల నష్టాలు మూటగట్టుకున్న జల్ బోర్డ్ ప్రస్తుత నష్టాలు రూ.516 కోట్లకు పెరిగాయి. -
నీటి పోటు
కుళాయిలకు మీటర్లు ఏర్పాటు భారీగా పెరగనున్న మంచినీటి చార్జీలు అమృత్ ఎఫెక్ట్ కార్పొరేషన్ అధికారుల కసరత్తు బెజవాడ రాజధానిగా మారిందనో.. లేక ‘అమృత్’ విధించిన ఆంక్షలో కానీ నగరవాసి నెత్తిన పాలకులు నీటి పన్నుల బండ పడేసేందుకు కసరత్తు ప్రారంభించారు. మంచినీటి కుళాయిలకు మీటర్లు బిగించాలన్న మున్సిపల్ మంత్రి పి.నారాయణ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో 400 శాతం పెరిగిన నీటి చార్జీలు తాజా పరిణామాల నేపథ్యంలో తడిసి మోపెడు కానున్నాయి. విజయవాడ సెంట్రల్ : ఈ నెలాఖరుకల్లా కుళాయిలకు నీటి మీటర్లు బిగించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకయ్యే ఖర్చును గృహ యజమానుల నుంచి వాయిదా పద్ధతుల్లో వసూలుచేయాలని నిర్ణయించారు. అమృత్ (అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ ట్రాన్సఫర్మేషన్) ఆంక్షల్లో భాగంగానే నీటి మీటర్లు ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. వృథాను అరికట్టేందుకే మీటర్లు పెడుతున్నట్లు మంత్రి చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరానే లేనప్పుడు నీరు వృథా ఎలా అవుతోందన్న ప్రశ్న ప్రజల నుంచి ఉత్పన్నమవుతోంది. అమృత్ ఆంక్షలు స్మార్ట్ సిటీ కోసం పోటీపడి ర్యాంకింగ్‌లో చతికిలపడ్డ విజయవాడ నగరపాలక సంస్థ అమృత్ పథకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 73.50 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.24.17 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14.50 కోట్లు, నగరపాలక సంస్థ రూ.33.83 కోట్లు, ఉద్యానవన శాఖ రూ. కోటి చొప్పున ఖర్చు భరించాల్సి ఉంటుంది. అమృత్‌లో భాగంగా నగరంలోని ప్రతి ఇంటికి కుళాయిలు ఏర్పాటుచేయడంతో పాటు వాటికి మీటర్లు అమర్చాలనే నిబంధన ఉంది. నగరంలో 1,79,245 గృహాలున్నాయి. కుళాయి కనెక్షన్లు 1,06,979 ఉన్నాయి. ఈ లెక్కన మిగతా గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. నీటి సరఫరాకు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.32.40 కోట్లు ఖర్చు చేస్తుండగా.. పన్నుల రూపంలో రూ.28.16 కోట్లు వసూలవుతోంది. నీటి మీటర్లు అమర్చడంపాటు యూజర్ చార్జీలు వసూలు చేసినట్లయితే దండిగా ఆదాయం రాబట్టవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. డబుల్ గేమ్ విజయవాడ నగర జనాభా 12 లక్షలకు చేరింది. శివారు, కొండ ప్రాంతాలకు పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా కావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో జరిగే నీటి వృథాను దృష్టిలో పెట్టుకొని మీటర్లు ఏర్పాటు చేసినట్లయితే నగరవాసులందరూ ఆ భారాన్ని మోయాల్సివస్తోంది. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో వాటర్ చార్జీలను ఏడు శాతం పెంచుతూ తీర్మానం చేశారు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పెంచిన డ్రెయినేజీ, వాటర్ చార్జీలను ఏటా ఏడు శాతం పెంచడానికి వీల్లేదని డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు 2014లో ప్రతిపాదన పెట్టారు. దీన్ని కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించి ప్రభుత్వానికి పంపింది. రెండేళ్లయినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఫలితంగా ఏటా ఏడు శాతం చొప్పున నీటి చార్జీలు పెరుగుతున్నాయి. ప్రస్తుత చార్జీలపై 10 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. -
పన్నుల పిడుగు
- కొంపముంచుతున్న డ్రెయినేజీ, వాటర్ చార్జీలు - ఏడు శాతం పెంపు - దొంగదెబ్బ తీసిన టీడీపీ - కౌన్సిల్ తీర్మానం ఏమైనట్టు? విజయవాడ సెంట్రల్ : నమ్మి ఓట్లేసిన జనాన్ని టీడీపీ దొంగదెబ్బ తీసింది. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పెంచిన డ్రెయినేజీ, వాటర్ చార్జీలను తగ్గిస్తామని ఏడాదిగా చెబుతున్న నగరపాలక సంస్థ పాలకుల మాటలు అంతా బూటకమని తేలింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి డ్రెయినేజీ, వాటర్ చార్జీలను మరో ఏడు శాతం మేర పెంచి అధికారులు నోటీసులు ఇస్తున్నారు. సుమారు రూ.3కోట్ల మేర ప్రజలపై పన్నుభారం మోపుతున్నారు. ఉదాహరణకు హనుమాన్‌పేట మచ్చా నర్సయ్య వీధిలోని అసెస్మెంట్ నంబర్ 1,07,634లో గత ఏడాది నీటి చార్జీలు ఆరు నెలలకు రూ.438 చెల్లిస్తే ఈ దఫా రూ.458 చెల్లించాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. అలాగే, డ్రెయినేజీ చార్జీని రూ.192 నుంచి రూ.204కు పెంచారు. నగరంలో 1,17,209 కుళాయి కనెక్షన్లు ఉండగా, ఇందులో 8,716 కమర్షియల్ కేటగిరీలో ఉన్నాయి. 67,113 డ్రెయినేజీ కనెక్షన్లకు 10,126 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటిపై ఏడు శాతం చార్జీలను పెంచేశారు. ఈ రెంటికీ కలిపి ప్రస్తుతం రూ.26.43 కోట్లు వసూలవుతుండగా, పెరిగిన ధరల ప్రకారం రూ.29.07 కోట్లకు చేరింది. మోత మోగించారు ప్రత్యేక అధికారుల పాలనలో నగరపాలక సంస్థలో పన్నులమోత మోగించారు. 2013 మార్చిలో స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్, కమిషనర్ జి.పండాదాస్లు డ్రెయినేజీ, వాటర్ చార్జీలను 400 శాతం పెంచుతూ తీర్మానం చేశారు. ఏటా ఏడుశాతం చొప్పున పెంచేలా అందులో పేర్కొన్నారు. చెత్త, బిల్డింగ్ ఫీజులు, యూజర్ చార్జీలను అనూహ్యంగా పెంచారు. మూడున్నరేళ్ల స్పెషల్ ఆఫీసర్ల పాలనలో రూ.75 కోట్ల మేర ప్రజలపై పన్ను భారాలు పడ్డాయి. తాము అధికారంలోకి వస్తే వీటన్నింటినీ రద్దు చేస్తామని అప్పట్లో టీడీపీ నేతలు ప్రజలకు వాగ్దానం చేశారు. దీన్ని నమ్మి ప్రజలు ఓట్లేసి టీడీపీకి పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చాక ఇలా.. నగరపాలక సంస్థలో టీడీపీ విజయం సాధించింది. స్పెషల్ ఆఫీసర్లు చేసిన తీర్మానం ప్రకారం గత ఏడాది ఏప్రిల్‌లో డ్రెయినేజీ, వాటర్ చార్జీలను ఏడు శాతం పెంచుతూ అధికారులు నోటీసులు ఇచ్చారు. గత ఆగస్టు 6వ తేదీన జరిగిన తొలి కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్షాలతో పాటు పాలకపక్షం కార్పొరేటర్లు పన్ను భారాలపై గళం ఎత్తారు. మాకు తెలియకుండా అధికారులే పన్నులు పెంచేశారంటూ మేయర్ కోనేరు శ్రీధర్ చెప్పారు. డెప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు స్పెషల్ అధికారుల పాలనలో పెంచిన డ్రెయినేజీ, వాటర్ చార్జీలను ఏటా ఏడు శాతం పెంచడానికి వీల్లేదని ప్రతిపాదన పెట్టారు. దీన్ని కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించి ప్రభుత్వానికి పంపింది. పన్నుల తగ్గింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో ఈ ఏడాది మరో ఏడు శాతం పెంచుతూ అధికారులు నోటీసులు ఇచ్చారు. త్వరలోనే తగ్గిస్తాం.. స్పెషల్ అధికారుల పాలనలో పెంచిన డ్రెయినేజీ, నీటి చార్జీలు తగ్గించాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాశాం. మున్సిపల్ మంత్రి పి.నారాయణతో గతంలో చర్చించాం. త్వరలోనే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుంది. అక్టోబర్ నుంచి నీటి చార్జీలను తగ్గించే అవకాశం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకుంటాం. - కోనేరు శ్రీధర్, మేయర్ పోరాడతాం.. టీడీపీ పాలకులు పన్ను భారాలతో ప్రజల నడ్డివిరుస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో పన్నులు తగ్గించాలంటూ చేసిన తీర్మానం ఏమైంది. కొత్తగా మరో ఏడుశాతం చార్జీలు పెంచారు. ఇందులో పాలకుల కుట్ర ఉంది. దీనిపై మేం నిలదీస్తాం. ప్రజల పక్షాన పోరాడతాం. - బండి నాగేంద్ర పుణ్యశీల, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ -
పన్ను బాంబు
విలీన గ్రామాలపై ఆస్తిపన్ను భారం మూడు నుంచి ఆరు రెట్లు పెరిగే అవకాశం దాదాపు రూ.20 కోట్ల మేర భారం ఏప్రిల్ 1 నుంచి వసూళ్లకు సన్నాహాలు వరంగల్ అర్బన్ : సంక్రాంతికి నగరపాలక సంస్థ ఆస్తిపన్ను బాంబు పేల్చింది. నగరంలో విలీనమైన 42 గ్రామాల ఆస్తిపన్నును మూడు నుంచి ఆరు రెట్లకు పైగా పెంచుతూ ముసాయిదా విడుదల చేసింది. రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశానుసారం ఈనెల 12న కౌన్సిల్ తీర్మానం చేసి బుధవారం సాయంత్రం వెల్లడించారు. పక్షం రోజులపాటు విలీన గ్రామాల ప్రజల అభ్యంతరాలు, ఆక్షేపణలు స్వీకరిస్తారు. అనంతరం సవరణలు చేసి ఫైనల్ ముసాయిదా వెల్లడించనున్నారు. పెరిగిన పన్నులు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తారుు. ఈ ప్రకటన నగర విలీన గ్రామాల్లోని గృహ, కమర్షియల్ యాజమానులకు పిడుగుపాటు. ఇప్పటికే నీటి చార్జీలు, విద్యుత్, వంటగ్యాస్, పెట్రోల్ పెంపుతో అల్లాడుతున్న ప్రజలకు పెంపు నిర్ణయం కుంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక నుంచి నగర పన్ను 2013 మార్చి 16న శివారులోని 42 పంచాయతీలను అప్పటి రాష్ట్ర పంచాయతీ రాజ్ రద్దు చేయగా, రాష్ట్ర పురపాలక శాఖ వరంగల్ నగరంలో విలీనం చేస్తూ వేర్వేరుగా జీవోలు జారీ చేశారుు. ట్రైసిటీ పరిధిలోని 53 డివిజన్లలో 1,10,689 అసెస్మెంట్లు ఉండగా, 42 విలీన గ్రామాల్లో 53,694 అసెస్మెంట్లు ఉన్నాయి. విలీన గ్రామాల నుంచి రూ.4.50 కోట్ల ఆదాయం సమాకూరుతోంది. పన్ను మదింపు తర్వాత రూ.20 కోట్ల మేరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు పంచాయతీలు విధించిన పన్నులనే వసూలు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతధికారులు రాష్ట్రంలోని కొత్త మునిసిపాలిటీలకు, నగర పంచాయతీలతోపాటు నగర పాలక సంస్థల్లో విలీనమైన పంచాయతీల్లో ఆస్తి పన్ను పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. భవనాల నెలసరి అద్దెలపై చదరపు మీటరు ఒక్కొటికి చొప్పన అద్దె విలువను పెంచుతూ ముసాయిదాను తయారు చేశారు. విలీన గ్రామాల్లో 20 శాతం ఇళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలను శాంపిల్‌గా పరిగణలోకి తీసుకొని 2014 అద్దెలను సరాసరిగా తీసుకొని ఆస్తి పన్ను పెంపు ముసాయిదా ప్రకటనను వెల్లడించారు. గతంలో ఏడాదికోక మారు ఆస్తి పన్ను చెల్లించే విధానం అమల్లో ఉంది. రానున్న కాలంలో ఆరు నెలలకోక మారు ఆస్తి పన్నులను చెల్లించాల్సి ఉంటుంది. తట్టెడు మట్టిపోస్తే ఒట్టు.. వరంగల్ నగరపాలక సంస్థను అభివృద్ధి చేస్తాం. పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దుతాం. ఏ సమస్య వచ్చినా మేమే బాధ్యత తీసుకుంటామని హామీలు ఇచ్చి బల్దియా అధికారుల ముఖం చాటేస్తున్నారు. మోకాళ్ల లోతు గుంతలు పడిన రహదారుల్లో తట్టెడు మట్టి పోసిన దాఖలు లేవు. గుక్కెడు మంచినీళ్లు అందిన జాడలేదు. దోమల మోత.. కుక్కల బెడద.. కోతులను పట్టించుకునే నాథుడే లేడు. వీధిలైట్ల పర్యవేక్షణ మరిచారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో విలీన గ్రామాల ప్రజలపై పన్ను పెంపు భారం పెంపుకోసం కసరత్తులు వేగవంతం చేయడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బలవంతంగా విలీనం.. బల్దియాలో గ్రామాలను బలవంతంగా విలీనం చేశారు. ఆపై నిరుపేదలపై పన్ను భారం విధించడం సబబు కాదు. విలీన గ్రామాల్లో ఐదేళ్లపాటు పన్నులు పెంచేది లేదని చెప్పారు. ఇప్పుడు అకస్మాత్తుగా కార్పొరేషన్ తీసుకున్న సరికాదు. విలీన గ్రామాల్లో పన్నులను తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు పునఃపరిశీలించాలి. - సిరంగి సునీల్‌కుమార్, ఎఫ్‌సీఐ కాలనీ(గోపాలపురం) అధ్యక్షుడు పురపాలక శాఖ ఆదేశాల మేరకు.. నగర విలీన గ్రామాల్లో పన్ను పెంపు కోసం డ్రాప్టు ముసాయిదా వెల్లడించాం. రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశాల మేరకు విడుదల చేశాం. పక్షం రోజుల్లోగా ప్రజలు తమ అభ్యంతరాలు రాతపూర్వకంగా అందజేస్తే ఉన్నతధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిశీలిస్తాం. - ఎన్.శంకర్, బల్దియా అడిషనల్ కమిషనర్ -
నీటి మీటర్లు లేకుంటే రెట్టింపు బిల్లులు
సాక్షి, సిటీబ్యూరో: మధ్యతరగతిపై బాదుడుకు జలమండలి మరో అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. గ్రేటర్ పరిధిలో గృహ వినియోగ కుళాయిలకు(డొమెస్టిక్) నీటి మీటర్లు లేని వినియోగదారుల నుంచి రెట్టింపు నీటి చార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం మహానగర పరిధిలోని బడా కుళాయిలకు(బల్క్) మీట రింగ్ పాలసీని అమలు చేస్తుండగా.. త్వరలో డొమెస్టిక్ కేటగిరీలోనూ ఈ విధానాన్ని అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ శ్యామలరావు తెలిపారు. మంగళవారం ఖైరతాబాద్‌లో ని బోర్డు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రేటర్ పరిధిలో మీటర్లు లేని గృహవినియోగ కనెక్షన్లు సుమారు నాలుగు లక్షల వరకు ఉన్నాయి. మీటరింగ్ పాలసీ అమలు చేసిన పక్షంలో వీరందరికీ బాదుడు తథ్యమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అంటే ప్రస్తుతం నెలకు రూ.200 బిల్లు చెల్లిస్తున్న వారు రూ.400 బిల్లు చెల్లించక తప్పని పరిస్థితి రానుంది. బోర్డు పురోగతిపై ఎండీ తెలిపిన విశేషాలివే.. వేసవిలో నో పానీపరేషాన్... గ్రేటర్‌కు మంచినీరందిస్తున్న జలాశయాల్లో నీటి నిల్వలు సంతృప్తికరంగా ఉండడంతో జూలై చివరి నాటి వరకు నగరంలో మంచినీటి కటకట ఉండదని ఎండీ స్పష్టం చేశారు. వేసవిలో నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు 24 గంటల పాటు అదనపు ట్యాంకర్ ట్రి ప్పుల ద్వారా మంచినీరు సరఫరా చేస్తామని తెలిపారు. రికార్డు అదాయం.. మార్చి 31 వరకు జలమండలి రికార్డు రెవెన్యూ ఆదాయం ఆర్జించిందని ఎండీ వెల్లడించారు. మార్చి నెలలో 4.50 లక్షల మంది వినియోగదారులు బిల్లులు చెల్లించడంతోపాటు జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన ఆస్తిపన్ను వాటాలో రూ.53 కోట్లు జలమండలి ఖజానాకు చేరడంతో ఒకే నెలలో రూ.160 కోట్లు రెవెన్యూ ఆదాయం లభించిందన్నారు. గడువు పెంపు లేదు.. నీటి బిల్లు బకాయిల వసూలుకు వన్‌టైమ్ సెటిల్మెంట్, అక్రమ కుళాయిల క్రమబద్ధీకరణ పథకాలకు చివరి గడువు మార్చి 31తో ముగిసినందున ప్రస్తుతానికి గడువు పెంచలేమని స్పష్టంచేశారు. ఎన్నికల అనంతరమే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. జూన్ నాటికి కృష్ణా మూడోదశ... ఈ ఏడాది జూన్ చివరి నాటికి కృష్ణా మూడోదశ పథకం మొదటి దశను పూర్తిచేసి నగరానికి 45 ఎంజీడీల జలాలు తరలిస్తామన్నారు. గోదావరి మంచినీటి పథకం మొదటి దశను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. టెండర్ల ప్రక్రియ పూర్తై మల్కాజ్గిరి మంచినీటి పథకం పనులకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే పనులు మొదలు పెడతామని తెలిపారు.