పన్నుల పిడుగు
- కొంపముంచుతున్న డ్రెయినేజీ, వాటర్ చార్జీలు
- ఏడు శాతం పెంపు
- దొంగదెబ్బ తీసిన టీడీపీ
- కౌన్సిల్ తీర్మానం ఏమైనట్టు?
విజయవాడ సెంట్రల్ : నమ్మి ఓట్లేసిన జనాన్ని టీడీపీ దొంగదెబ్బ తీసింది. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పెంచిన డ్రెయినేజీ, వాటర్ చార్జీలను తగ్గిస్తామని ఏడాదిగా చెబుతున్న నగరపాలక సంస్థ పాలకుల మాటలు అంతా బూటకమని తేలింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి డ్రెయినేజీ, వాటర్ చార్జీలను మరో ఏడు శాతం మేర పెంచి అధికారులు నోటీసులు ఇస్తున్నారు. సుమారు రూ.3కోట్ల మేర ప్రజలపై పన్నుభారం మోపుతున్నారు. ఉదాహరణకు హనుమాన్‌పేట మచ్చా నర్సయ్య వీధిలోని అసెస్‌మెంట్ నంబర్ 1,07,634లో గత ఏడాది నీటి చార్జీలు ఆరు నెలలకు రూ.438 చెల్లిస్తే ఈ దఫా రూ.458 చెల్లించాల్సిందిగా నోటీసులు ఇచ్చారు.
అలాగే, డ్రెయినేజీ చార్జీని రూ.192 నుంచి రూ.204కు పెంచారు. నగరంలో 1,17,209 కుళాయి కనెక్షన్లు ఉండగా, ఇందులో 8,716 కమర్షియల్ కేటగిరీలో ఉన్నాయి. 67,113 డ్రెయినేజీ కనెక్షన్లకు 10,126 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటిపై ఏడు శాతం చార్జీలను పెంచేశారు. ఈ రెంటికీ కలిపి ప్రస్తుతం రూ.26.43 కోట్లు వసూలవుతుండగా, పెరిగిన ధరల ప్రకారం రూ.29.07 కోట్లకు చేరింది.
మోత మోగించారు
ప్రత్యేక అధికారుల పాలనలో నగరపాలక సంస్థలో పన్నులమోత మోగించారు. 2013 మార్చిలో స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్, కమిషనర్ జి.పండాదాస్‌లు డ్రెయినేజీ, వాటర్ చార్జీలను 400 శాతం పెంచుతూ తీర్మానం చేశారు. ఏటా ఏడుశాతం చొప్పున పెంచేలా అందులో పేర్కొన్నారు. చెత్త, బిల్డింగ్ ఫీజులు, యూజర్ చార్జీలను అనూహ్యంగా పెంచారు. మూడున్నరేళ్ల స్పెషల్ ఆఫీసర్ల పాలనలో రూ.75 కోట్ల మేర ప్రజలపై పన్ను భారాలు పడ్డాయి. తాము అధికారంలోకి వస్తే వీటన్నింటినీ రద్దు చేస్తామని అప్పట్లో టీడీపీ నేతలు ప్రజలకు వాగ్దానం చేశారు. దీన్ని నమ్మి ప్రజలు ఓట్లేసి టీడీపీకి పట్టం కట్టారు.
అధికారంలోకి వచ్చాక ఇలా..
నగరపాలక సంస్థలో టీడీపీ విజయం సాధించింది. స్పెషల్ ఆఫీసర్లు చేసిన తీర్మానం ప్రకారం గత ఏడాది ఏప్రిల్‌లో డ్రెయినేజీ, వాటర్ చార్జీలను ఏడు శాతం పెంచుతూ అధికారులు నోటీసులు ఇచ్చారు. గత ఆగస్టు 6వ తేదీన జరిగిన తొలి కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్షాలతో పాటు పాలకపక్షం కార్పొరేటర్లు పన్ను భారాలపై గళం ఎత్తారు. మాకు తెలియకుండా అధికారులే పన్నులు పెంచేశారంటూ మేయర్ కోనేరు శ్రీధర్ చెప్పారు. డెప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు స్పెషల్ అధికారుల పాలనలో పెంచిన డ్రెయినేజీ, వాటర్ చార్జీలను ఏటా ఏడు శాతం పెంచడానికి వీల్లేదని ప్రతిపాదన పెట్టారు. దీన్ని కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించి ప్రభుత్వానికి పంపింది. పన్నుల తగ్గింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో ఈ ఏడాది మరో ఏడు శాతం పెంచుతూ అధికారులు నోటీసులు ఇచ్చారు.
త్వరలోనే తగ్గిస్తాం..
స్పెషల్ అధికారుల పాలనలో పెంచిన డ్రెయినేజీ, నీటి చార్జీలు తగ్గించాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాశాం. మున్సిపల్ మంత్రి పి.నారాయణతో గతంలో చర్చించాం. త్వరలోనే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుంది. అక్టోబర్ నుంచి నీటి చార్జీలను తగ్గించే అవకాశం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకుంటాం.
- కోనేరు శ్రీధర్, మేయర్
పోరాడతాం..
టీడీపీ పాలకులు పన్ను భారాలతో ప్రజల నడ్డివిరుస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో పన్నులు తగ్గించాలంటూ చేసిన తీర్మానం ఏమైంది. కొత్తగా మరో ఏడుశాతం చార్జీలు పెంచారు. ఇందులో పాలకుల కుట్ర ఉంది. దీనిపై మేం నిలదీస్తాం. ప్రజల పక్షాన పోరాడతాం.
- బండి నాగేంద్ర పుణ్యశీల, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్