పన్ను బాంబు
విలీన గ్రామాలపై ఆస్తిపన్ను భారం
మూడు నుంచి ఆరు రెట్లు పెరిగే అవకాశం
దాదాపు రూ.20 కోట్ల మేర భారం
ఏప్రిల్ 1 నుంచి వసూళ్లకు సన్నాహాలు
వరంగల్ అర్బన్ : సంక్రాంతికి నగరపాలక సంస్థ ఆస్తిపన్ను బాంబు పేల్చింది. నగరంలో విలీనమైన 42 గ్రామాల ఆస్తిపన్నును మూడు నుంచి ఆరు రెట్లకు పైగా పెంచుతూ ముసాయిదా విడుదల చేసింది. రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశానుసారం ఈనెల 12న కౌన్సిల్ తీర్మానం చేసి బుధవారం సాయంత్రం వెల్లడించారు. పక్షం రోజులపాటు విలీన గ్రామాల ప్రజల అభ్యంతరాలు, ఆక్షేపణలు స్వీకరిస్తారు. అనంతరం సవరణలు చేసి ఫైనల్ ముసాయిదా వెల్లడించనున్నారు. పెరిగిన పన్నులు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తారుు. ఈ ప్రకటన నగర విలీన గ్రామాల్లోని గృహ, కమర్షియల్ యాజమానులకు పిడుగుపాటు. ఇప్పటికే నీటి చార్జీలు, విద్యుత్, వంటగ్యాస్, పెట్రోల్ పెంపుతో అల్లాడుతున్న ప్రజలకు పెంపు నిర్ణయం కుంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
ఇక నుంచి నగర పన్ను
2013 మార్చి 16న శివారులోని 42 పంచాయతీలను అప్పటి రాష్ట్ర పంచాయతీ రాజ్ రద్దు చేయగా, రాష్ట్ర పురపాలక శాఖ వరంగల్ నగరంలో విలీనం చేస్తూ వేర్వేరుగా జీవోలు జారీ చేశారుు. ట్రైసిటీ పరిధిలోని 53 డివిజన్లలో 1,10,689 అసెస్‌మెంట్లు ఉండగా, 42 విలీన గ్రామాల్లో 53,694 అసెస్‌మెంట్లు ఉన్నాయి. విలీన గ్రామాల నుంచి రూ.4.50 కోట్ల ఆదాయం సమాకూరుతోంది. పన్ను మదింపు తర్వాత రూ.20 కోట్ల మేరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు పంచాయతీలు విధించిన పన్నులనే వసూలు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతధికారులు రాష్ట్రంలోని కొత్త మునిసిపాలిటీలకు, నగర పంచాయతీలతోపాటు నగర పాలక సంస్థల్లో విలీనమైన పంచాయతీల్లో ఆస్తి పన్ను పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. భవనాల నెలసరి అద్దెలపై చదరపు మీటరు ఒక్కొటికి చొప్పన అద్దె విలువను పెంచుతూ ముసాయిదాను తయారు చేశారు. విలీన గ్రామాల్లో 20 శాతం ఇళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలను శాంపిల్‌గా పరిగణలోకి తీసుకొని 2014 అద్దెలను సరాసరిగా తీసుకొని ఆస్తి పన్ను పెంపు ముసాయిదా ప్రకటనను వెల్లడించారు. గతంలో ఏడాదికోక మారు ఆస్తి పన్ను చెల్లించే విధానం అమల్లో ఉంది. రానున్న కాలంలో ఆరు నెలలకోక మారు ఆస్తి పన్నులను చెల్లించాల్సి ఉంటుంది.
తట్టెడు మట్టిపోస్తే ఒట్టు..
వరంగల్ నగరపాలక సంస్థను అభివృద్ధి చేస్తాం. పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దుతాం. ఏ సమస్య వచ్చినా మేమే బాధ్యత తీసుకుంటామని హామీలు ఇచ్చి బల్దియా అధికారుల ముఖం చాటేస్తున్నారు. మోకాళ్ల లోతు గుంతలు పడిన రహదారుల్లో తట్టెడు మట్టి పోసిన దాఖలు లేవు. గుక్కెడు మంచినీళ్లు అందిన జాడలేదు. దోమల మోత.. కుక్కల బెడద.. కోతులను పట్టించుకునే నాథుడే లేడు. వీధిలైట్ల పర్యవేక్షణ మరిచారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో విలీన గ్రామాల ప్రజలపై పన్ను పెంపు భారం పెంపుకోసం కసరత్తులు వేగవంతం చేయడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
బలవంతంగా విలీనం..
బల్దియాలో గ్రామాలను బలవంతంగా విలీనం చేశారు. ఆపై నిరుపేదలపై పన్ను భారం విధించడం సబబు కాదు. విలీన గ్రామాల్లో ఐదేళ్లపాటు పన్నులు పెంచేది లేదని చెప్పారు. ఇప్పుడు అకస్మాత్తుగా కార్పొరేషన్ తీసుకున్న సరికాదు. విలీన గ్రామాల్లో పన్నులను తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు పునఃపరిశీలించాలి.
- సిరంగి సునీల్‌కుమార్, ఎఫ్‌సీఐ కాలనీ(గోపాలపురం) అధ్యక్షుడు
పురపాలక శాఖ ఆదేశాల మేరకు..
నగర విలీన గ్రామాల్లో పన్ను పెంపు కోసం డ్రాప్టు ముసాయిదా వెల్లడించాం. రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశాల మేరకు విడుదల చేశాం. పక్షం రోజుల్లోగా ప్రజలు తమ అభ్యంతరాలు రాతపూర్వకంగా అందజేస్తే ఉన్నతధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిశీలిస్తాం.
- ఎన్.శంకర్, బల్దియా అడిషనల్ కమిషనర్