special officers
-
ఇక జెడ్పీలు, మండలాల్లో ‘ప్రత్యేక’ పాలన
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్‌లలో ‘ప్రత్యేక’ అధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. జూలై 4తో 32 జిల్లా పరిషత్‌లు, 538 మండల పరిషత్ పాలకమండళ్ల పదవీకాలం ముగియనుంది. టర్మ్ ముగిసేలోగా ఎన్నికలు జరిపే అవకాశం లేకపోవడంతో రోజువారీ కార్యక్రమాల కొనసాగింపునకు వీలుగా స్పెషల్ ఆఫీసర్లను నియమించనున్నారు. మెజారిటీ జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు బీఆర్ఎస్కు చెందినవారే ఉండటంతో ఎన్నికలు జరిగే దాకా పాత పాలక మండళ్లనే కొనసాగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్లను నియమించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సన్నాహాలు చేస్తోంది. జూలై 5 కల్లా కసరత్తు పూర్తిచేసి, పీఆర్, రెవెన్యూ, మున్సిపల్,విద్య, వైద్య, ఆరోగ్య శాఖల నుంచి ఉద్యోగుల హోదాలకు అనుగుణంగా ప్రత్యేక అధికారులుగా అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. గత ఫిబ్రవరి 1తో రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామపంచాయతీల కాలపరిమితి ముగిసింది. మరుసటి రోజు నుంచే పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైంది. ఇవీ సమస్యలు... పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక, మండల, జిల్లాపరిషత్ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా వివిధ కారణాలు, ఆయా అంశాలపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వపరంగా అటు గ్రామపంచాయతీలు, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు అడుగు ముందుకుపడలేదు. ⇒ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన, ఉపకులాల వారీగా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అయితే ఈ వాగ్దానం అమలు చేసేందుకు రాష్ట్ర బీసీ కమిషన్ ద్వారా చర్యలు చేపట్టాల్సి ఉండగా, దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో కసరత్తు మొదలు కాలేదు. ⇒ బీసీ కులగణన ఆధారంగా గ్రామీణ స్థానికసంస్థల్లో స్థానికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలి. ⇒ రాష్ట్రవ్యాప్తంగా కులగణనకు ఎక్కువగా సమయం పట్టే అవకాశం ఉండటంతో కొత్త ఓటర్ల జాబితా (లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వెలువరించిన లిస్ట్) ప్రాతిపదికన పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను నోడల్ ఏజెన్సీలుగా నియమించి..ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలు సేకరించాలని బీసీ కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది. ⇒ బీసీ కమిషన్పరంగా ఓటర్ల జాబితా ఆధారంగా ఖరారు చేసిన రిజర్వేషన్లకు అనుగుణంగా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ విచారణ, రాష్ట్రస్థాయిలో అన్ని రాజకీయపక్షాలతో సమావేశం నిర్వహించి ముందుకు సాగొచ్చనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు సమాచారం. ⇒ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఓటర్ల జాబితా ప్రకారమా లేక క్షేత్రస్థాయిలో చేపట్టే సామాజిక, ఆర్థిక, కుల సర్వే ఆధారంగా ముందుకెళ్లాలా అనే దానిపై ప్రభుత్వపరంగా స్పష్టత కొరవడినట్టు చెబుతున్నారు. ⇒ ఓటర్ల లిస్ట్‌కు అనుగుణంగా అయితే పెద్దగా శ్రమ లేకుండా త్వరగానే క్షేత్రస్థాయిలో ఆయా సామాజికవర్గాల జనాభా వివరాలు తేల్చొచని, సామాజిక, ఆర్థిక కులసర్వే అయితే సమయం ఎక్కువ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ⇒ మరో రెండునెలల్లో (ఆగస్టు నాటికి) ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కమిషన్న్ద్వారానే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేస్తారా లేక కొత్త కమిషన్‌ను నియమించేదాకా ఆగుతారా అనేదానిపై స్పష్టత లేదు. ట్రిపుల్ టెస్ట్..మరో మెలిక సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్ టెస్ట్’పేరిట స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై మార్గదర్శకాలు నిర్దేశించింది. స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుపై బీసీ కమిషన్ ద్వారా విచారణ జరపాలని, ఆయా చోట్ల ఏఏ నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిపై తేల్చాలని స్పష్టం చేసింది. ⇒ మొత్తంగా రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి) 50 శాతానికి మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. ⇒ ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహ¯న్‌రావు ఆధ్వర్యంలో ట్రిపుల్ టెస్ట్ మేరకు క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలిసింది. ⇒ ఓటర్ల జాబితా ప్రకారం కసరత్తు పూర్తిచేసి ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలనే సూచనలు బీసీ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లినట్టు తెలిసింది. అయితే దీనిపై ప్రభుత్వపరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సందిగ్ధత నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ⇒ రిజర్వేషన్లు ఖరారు చేసి, ఆ వివరాలు, ఎన్నికల నిర్వహణకు తేదీలు తెలియజేస్తే 15, 20 రోజుల అంతరంలో గ్రామపంచాయతీ, జిల్లా, మండలపరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. -
బాధ్యతలు పెంచినా.. జీతాలు పెంచలే!
సాక్షి, హైదరాబాద్: బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) పనిచేస్తున్న ప్రత్యేకాధికారులు.. తమ సమస్యలను పట్టించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు అనేక బాధ్యతలు అప్పగించి, వేతనం మాత్రం పెంచలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని అంటున్నారు. ఇటీవల కేజీబీవీ సంఘ నేతలు, ప్రభుత్వ హెచ్ఎంల సంఘం నేతలు దీనిపై సర్కారుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ బడుల ఉపాధ్యాయుల కన్నా ఎక్కువ విధులు నిర్వర్తిస్తున్నా.. వారితో సమాన గౌరవం లభించడం లేదని అందులో వాపోయారు. కేజీబీవీలను అప్‌గ్రేడ్ చేస్తున్నప్పటికీ అందుకు తగినట్టుగా మౌలిక వసతులు కల్పించడం లేదని.. పట్టించుకోకుంటే చదువుల నాణ్యత పడిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గెజిటెడ్ అధికారులు చేయాల్సిన పనులన్నీ ఏళ్ల తరబడి కాంట్రాక్టు కొలువుల్లో ఉన్న తమపై వేయడం న్యాయమేనా అని ప్రశ్నించారు. పెరిగిన విధులు.. పెరగని వేతనం.. బాలికలు మధ్యలోనే చదువు మానేసే పరిస్థితిని మార్చే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో 2010–11లో కేజీబీవీలను ఏర్పాటు చేశారు. హాస్టల్‌తోపాటు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో 450 కేజీబీవీలున్నాయి. తొలుత ఆరు, ఏడు తరగతులే ప్రారంభించి.. తర్వాత టెన్త్ వరకూ, 2018–19లో ఇంటర్మీడియట్ వరకూ అప్‌గ్రేడ్ చేశారు. ప్రతీ కేజీబీవీకి ఒక స్పెషల్ ఆఫీసర్ సహా ముగ్గురిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. వారికి చాలా ఏళ్లుగా నెలకు రూ.32,500 వేతనమే అందుతోంది. ఇంటర్మీ డియట్ వరకు అప్‌గ్రేడ్ చేయడంతో విధులు పెరిగాయి. నెలకు కేవలం రెండే క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. అత్యవసరమై అదనంగా సెలవు పెడితే వేతనంలో కోతపడుతుంది. అనుక్షణం విధుల్లోనే.. స్కూల్, హాస్టల్, ఇంటర్ కాలేజీల నిర్వహణ మొత్తం ప్రత్యేక అధికారి చూసుకోవాలి. కొన్ని జిల్లాల్లో మోడల్ స్కూళ్ల బాధ్యతలను కూడా వీరికే అప్పగించారు. కొత్తగా నిర్మిస్తున్న కేజీబీవీల్లో స్కూల్ ఒకచోట హాస్టల్ మరోచోట ఉంటున్నాయి. దీంతో అన్ని విధులు నిర్వర్తించడం కష్టంగానే ఉందని వారు చెబుతున్నారు. రాత్రి విధులప్పుడు చాలా ఇబ్బందిపడుతున్నామంటున్నారు. ఆ రోజు మధ్యా హ్నం నుంచి మర్నాడు మధ్యాహ్నం వరకూ నిరంతరం డ్యూటీ ఉంటుందని, దీనివల్ల అనారోగ్యం పాలవుతున్నామని వాపోతున్నారు. 2017లో జాబ్‌చార్ట్ ఇచ్చినా అందులో మార్గదర్శకాలు ఇవ్వలేదని.. దీనితో అధికారులు ఇష్టానుసారం బాధ్యతలు అప్పగిస్తున్నారని చెప్తున్నారు. హాస్టల్లో విద్యార్థులను గమనించడం, భోజనం నాణ్యత పరిశీలించడం, కాలేజీలో విద్య నాణ్యత వంటి విధుల్లో ఎక్కడ తేడా వచ్చిన అధికారులు తమనే బలిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమ పరిస్థితిని సానుభూతితో పరిశీలించాలని కోరుతున్నారు. మానసికంగా కుంగిపోతున్నాం కేవలం చిన్న స్కూళ్ల విధుల కోసమంటూ మమ్మల్ని తీసుకుని తర్వాత రెట్టింపు బాధ్యతలు పెట్టారు. ఏళ్లు గడుస్తున్నా వేతనం పెంచలేదు. టీచర్ల కన్నా ఎక్కువ విధులు నిర్వర్తిస్తున్నాం. ఎంతోమంది విద్యార్థినుల ఉన్నతికి తోడ్పడుతున్నాం. మాకు పని ఒత్తిడి తగ్గించి, వేతనం పెంచితే తప్ప మేం సంతృప్తిగా పనిచేయలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం మా గోడు ఆలకిస్తుందని ఆశిస్తున్నాం. – దోపతి శ్రీలత, రాష్ట్ర కేజీబీవీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు వారి పరిస్థితి మెరుగుపర్చాలి.. కేజీబీవీ ప్రత్యేక అధికారుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ విషయాన్ని వివరిస్తూ ప్రభుత్వానికి ఇటీవల వినతిపత్రం ఇచ్చాం. బాలికలకు నాణ్యమైన విద్య అందించాలంటే ముందుగా కేజీబీవీ ఉద్యోగుల పరిస్థితిని మెరుగుపర్చాలి. –పి.రాజాభాను చంద్రప్రకాశ్, ప్రభుత్వ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
TS: ముగిసిన సర్పంచ్ల పదవీకాలం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేటితో సర్పంచ్ల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగునుంది. ఈ మేరకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. సర్పంచ్ల పదవీకాలంలో ముగిసిన నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ. ప్రజాసేవకు కాదు ఐదేళ్ల కాలం తెలంగాణ ప్రజానీకానికి ఇతోధికంగ సేవచేసిన గ్రామ సర్పంచ్‌లు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వారికి కృతజ్ఞతాభివందనాలు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ ధామాలు నెలకొల్పడంలో, దేశానికి ఆదర్శంగా నిలిపిన కృషిలో మీ పాత్ర ఎనలేనిది. మీరు మరింతకాలం ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ. ప్రజాసేవకు కాదు! ఐదేళ్ల కాలం తెలంగాణ ప్రజానీకానికి ఇతోధికంగ సేవచేసిన గ్రామ సర్పంచ్‌లు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వారికి కృతజ్ఞతాభివందనాలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ ధామాలు నెలకొల్పడంలో,… pic.twitter.com/UnepmmXIp3 — KTR (@KTRBRS) February 1, 2024 -
TS: పల్లెల్లో ‘ప్రత్యేక’మే!
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రంలోని పల్లెలు ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల పదవీకాలం వచ్చే నెల (ఫిబ్రవరి) 1న ముగుస్తోంది. దీంతో స్పెషల్ ఆఫీసర్లను నియమించి పంచాయతీల బాధ్యతలను అప్పగించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత సర్పంచ్‌లకే ఇన్చార్జులుగా బాధ్యతలు అప్పగించే అవకాశమున్నా.. పంచాయతీల పాలకమండళ్లలో బీఆర్ఎస్ పార్టీకే ఆధిపత్యం ఉండటంతో అందుకు కాంగ్రెస్ సర్కారు విముఖంగా ఉంది. మండల, గ్రామస్థాయిల్లోని వివిధ శాఖల అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించేందుకు ప్రభుత్వపరంగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖాపరంగా ఇప్పటికే కసరత్తు మొదలైనట్టు సమాచారం. పోలీసుశాఖ మినహా మండల, గ్రామస్థాయిల్లోని పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యా, వైద్య తదితర శాఖల అధికారులను పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా నియమించే అవకాశం ఉంది. ఏ నిర్ణయమూ తీసుకోని సర్కారు.. రాష్ట్రంలో 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తయి, కొత్త పాలకమండళ్లు ఏర్పాటై ఉండాల్సింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ తొలివారం వరకు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగడం.. ఏప్రిల్, మేలలో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముందుకు పడలేదు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ముందస్తు సన్నాహాల్లో నిమగ్నమైనా.. ఎన్నికల తేదీలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన నేపథ్యంలో.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని, ఉపకులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి బీసీ కమిషన్ నుంచి ఆరు నెలల్లో నివేదిక తెప్పించుకుని తదుపరి చర్యలు చేపడతామని తెలిపింది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు గతంలో ‘ట్రిపుల్ టెస్ట్’ పేరిట మార్గదర్శకాలు ఇచ్చింది. స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటు స్వభావంపై బీసీ కమిషన్‌న్‌ద్వారా విచారణ జరపాలని.. ఆయా చోట్ల ఏ నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనేది తేల్చాలని సూచించింది. మొత్తంగా రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి) 50శాతం మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు, మార్పుల కోసం బీసీ కమిషన్ విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సి ఉంది. దాని ఆధారంగానే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను పెంచేందుకు వీలు కానుంది. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూపులు! చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్న్ఆధ్వర్యంలోని రాష్ట్ర బీసీ కమిషన్.. ‘ట్రిపుల్ టెస్ట్’ అంశంలో అనుసరించిన విధానాలపై ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు పూర్తిచేసినట్టు సమాచారం. ప్రభుత్వానికి నివేదిక సమర్పించే విషయంలో కమిషన్‌కు పూర్తి స్పష్టత లేక ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. కొత్త ఓటర్ల జాబితా వచ్చాక.. దాని ఆధారంగా మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను నోడల్ ఏజెన్సీలుగా పెట్టి ఆ వివరాలు సేకరించి ఇవ్వాలని భావిస్తున్నట్టు బీసీ కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఓటర్ల జాబితా ద్వారానా? లేక సామాజిక, ఆర్థిక, కుల సర్వే ఆధారంగా వెళ్లాలా అన్న దానిపై ప్రభుత్వపరంగా ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో సందిగ్థత ఏర్పడినట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికలు ముగిశాక పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఆలోగా బీసీ కమిషన్ నివేదిక ప్రక్రియ పూర్తవుతుందని రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్టు తెలిసింది. మొత్తం 12,751 పంచాయతీలు.. రాష్ట్రంలో ప్రస్తుతం 12,751 గ్రామ పంచాయతీలకు (కొత్తగా ఏర్పాటు చేసినవి కలిపితే మొత్తం 12,772 పంచాయతీలు) సర్పంచ్‌లు ఉన్నారు. వార్డు సభ్యులు సుమారు లక్షా 27వేల మంది వరకు ఉంటారు. తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం.. సర్పంచ్ల పదవీకాలం ముగిసిపోయాక పర్సన్ ఇన్చార్జులుగా నియమించే అవకాశం లేదు. దీనితోపాటు సకాలంలో ఎన్నికలు జరగకపోతే గ్రామ పంచాయతీలకు ‘స్పెషల్ ఆఫీసర్’లను నియమించాల్సి ఉంటుంది. – ఉమ్మడి ఏపీలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో 2011–2013 మధ్య పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కొనసాగాయి. అంతకు ముందు చంద్రబాబు సర్కారు హయాంలోనూ గడువులోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించని కారణంగా, అంతకు ముందున్న సర్పంచ్‌లనే పర్సన్ ఇన్చార్జులుగా కొనసాగించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనలు పంపినా..! రాజ్యాంగం ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల ఐదేళ్ల పదవీకాలం ముగిసేలోపే.. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికలు పూర్తిచేయాలి. ఈ క్రమంలో రాష్ట్రంలో జనవరి లేదా ఫిబ్రవరిలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రభుత్వానికి గతంలోనే ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. కానీ దీనిపై గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. కనీసం ఆరునెలల వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో అప్పటివరకు స్పెషలాఫీసర్ల పాలనలో కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుత సర్పంచ్‌లనే ఇన్చార్జులుగా కొనసాగించాలి ‘‘ప్రస్తుతమున్న సర్పంచ్‌లనే పర్సన్ ఇన్చార్జులుగా కొనసాగించాలి. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాం. గ్రామాల అభివృద్ధిపై మాకు పూర్తి అవగాహన ఉన్నందున ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో, పాలనలో జాప్యం జరగదు. స్పెషలాఫీసర్లకు గ్రామాల్లోని పరిస్థితులపై అవగాహన ఏర్పడేందుకే కొంత సమయం పడుతుంది. అధికారులు స్థానికంగా ఉండరు, ఆఫీస్ టైమ్ బట్టి వచ్చి వెళ్తుంటారు. మేం గ్రామాల్లోనే అందుబాటులో ఉంటాం. ఆరునెలల పాటు ఇన్చార్జులుగా పొడిగించాలి. కోవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు మూడేళ్ల పదవీకాలాన్ని కోల్పోయాం. మాకు చెక్ పవర్ కూడా ఆరు నెలలు ఆలస్యంగా ఇచ్చారు. గతంలో చేసిన పనులకు ఇంకా బిల్లులు రావాల్సి ఉంది. – ఉప్పుల అంజనీప్రసాద్, రాష్ట్ర సర్పంచ్ల సంఘం గౌరవాధ్యక్షుడు స్పెషలాఫీసర్లతో పాలనకు ఇబ్బంది ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుత సర్పంచ్‌లకే పర్సన్ ఇన్చార్జులుగా బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది. గతంలో పనిచేసిన అనుభవం, విధుల నిర్వహణకు పనికొస్తుంది. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి దోహదపడతారు. వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు కాబట్టి సర్పంచ్‌లనే మరో ఆరునెలల పాటు కొనసాగిస్తే గ్రామాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది. పరిపాలన ఇబ్బందులు లేకుండా సజావుగా సాగే అవకాశాలు ఉంటాయి. అదే స్పెషల్ ఆఫీసర్‌గా నియమితులైన వారికి గ్రామంపై పట్టు రావడానికి.. ఆయా సమస్యలు, అంశాలపై అవగాహన ఏర్పడడానికి సమయం పడుతుంది. పాలనకు ఇబ్బంది అవుతుంది. – చింపుల సత్యనారాయణరెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు -
ప్రత్యేక అధికారుల పదవీకాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలకమండళ్లు లేని నగర పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలకు ప్రత్యేక అధికారుల పదవీకాలాన్ని ప్రభుత్వం ఆరు నెలలు పొడిగించింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలకమండళ్ల పదవీకాలం పూర్తి కావడంతో గతంలో 108 పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వారి పదవీకాలం గడువు కూడా ముగిసింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో మరోసారి 108 పట్టణ స్థానిక సంస్థల ప్రత్యేక అధికారుల పదవీకాలాన్ని ఆరు నెలలపాటు పొడిగించాలని నిర్ణయించింది. డిసెంబర్ 31 వరకు గానీ కొత్త పాలకమండళ్లు ఎన్నికయ్యే వరకుగానీ వీటిలో ఏది ముందైతే అంతవరకు ప్రత్యేక అధికారుల పదవీకాలం ఉంటుంది. -
ఏపీకి మహారాష్ట్ర ప్రత్యేక అధికారుల బృందం
సాక్షి, అమరావతి: చిన్నారులు,మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'దిశ' చట్టం గురించి అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక అధికారుల బృందం గురువారం వచ్చింది. దేశవ్యాప్తంగా అందరి మన్నలను పొందుతున్న దిశ చట్టం గురించి తెలుసుకునేందుకు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, డీజీపీ సుబోత్‌కుమార్ జైశ్వాల్, అడిషనల్ చీఫ్ సెక్రటరీతో పాటు మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల బృందం ఏపీకి చేరుకుంది. కాసేపట్లో ఏపీ హోంమంత్రి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, సీఎస్, డీజీపీ, దిశ స్పెషల్ ఆఫీసర్లతో మహారాష్ట్ర బృందం భేటీ కానుంది. (దేశంలోనే తొలిసారిగా..) (మహారాష్ట్రలో దిశ చట్టం!) -
‘కొత్త’.. పంచాయతీ
నేరడిగొండ(బోథ్): పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో ‘కొత్త’ పంచాయతీ మొదైలంది. నిధుల ఫ్రీజింగ్ కారణంగా కార్యదర్శులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అటు సర్పంచుల పదవీ కాలం ముగియడం, ఇటు ప్రత్యేక అధికారులు పట్టించుకోకపోవడం కారణంగా సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం 467 గ్రామ పంచాయతీలు ఉండగా.. కొత్తగా 266 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమించిన విషయం తెలిసిందే. వారికి గ్రామ సమస్యలపై సరైన అవగాహన లేకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కొన్ని గ్రామాల్లో ఏ అధికారి నియమితులయ్యారో ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో సమస్యలను పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తున్నారు. గ్రామాల్లో తీవ్రంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఒత్తిడి తెస్తున్నారు. చేసేదేమీ లేక పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులను వెచ్చించి పనులు చేయించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. మరోవైపు ప్రత్యేక అధికారులు గ్రామాలను సందర్శించడం లేదు. పంచాయతీల పాలనపై అనుభవం లేని వారిని ప్రత్యేక అధికారులుగా నియమించడం విమర్శలకు తావిస్తోంది. ప్రత్యేక అధికారులుగా నియమితులైన వారు తమ మాతృశాఖతోపాటు పాలన భారం కూడా ఒక్కసారిగా మీదపడడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. విభజనతో ఇబ్బందులు పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించి రెండు నెలలు కావస్తోంది. పాత పంచాయతీల నుంచి విడిపోయిన పంచాయతీలకు నిధులు అందడం లేదు. దీంతో ఆయా గ్రామాల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఫలితంగా పంచాయతీలన్నీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామాల్లో మౌలిక వసతుల నిర్వహణ అధ్వానంగా మారింది. పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శులు సమస్యను బట్టి స్పందిస్తున్నారు. తాగునీటి సమస్య, పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. కానీ అవి కూడా పూర్తిస్థాయిలో లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక అధికారులు పట్టించుకోకపోయినా పంచాయతీ కార్యదర్శులకు మాత్రం ఇబ్బందులు తప్పడంలేదు. దీంతో గ్రామాల్లో పనులు చేయించాలని గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తీసుకురావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పారిశుధ్య కార్యక్రమాలు, తాగునీటి సరఫరా, పైపులైన్ నిర్మాణం తదితర పనులకు డబ్బులు ఖర్చు చేసినట్లు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. పంచాయతీలో నిధులున్నా ఫ్రీజింగ్ కారణంగా విడుదల కాకపోవడంతో బయట అప్పులు చేసి ఖర్చు చేస్తున్నామని వాపోతున్నారు. రూ.లక్షకు పైగా ఖర్చు.. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా కోసం తమకు కేటాయించిన గ్రామాలకు ఇప్పటివరకు దాదాపు రూ.లక్షకు పైగా ఖర్చు చేశామని పేరు చెప్పేందుకు ఇష్టపడని పలువురు పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన పనులు బిల్లులు చేసినా ఫ్రీజింగ్ కారణంగా నిధులు అందకుండా పోతున్నాయని వాపోతున్నారు. బయట అప్పులు చేసి పంచాయతీ పనులు చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. -
తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టులో ఎదురుదెబ్బ
-
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
హైదరాబాద్: తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల కొనసాగింపు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ రోజు నుంచి మూడు నెలల వరకు స్పెషల్ ఆఫీసర్లు కొనసాగవచ్చునని వెల్లడించింది. ఆలోపు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించడాన్ని సవాల్ చేస్తూ 500 మంది సర్పంచులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పంచాయతీ కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు సర్పంచ్‌లుగా తమనే కొనసాగించాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. స్పెషల్ ఆఫీసర్ల కొనసాగింపు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. -
పల్లెలకు ప్రత్యేకాధికారులు
డిచ్పల్లి/మోర్తాడ్: గ్రామ పంచాయతీల పాలకవర్గం పదవీ కాలం ఆగస్ట్ ఒకటో తేదీతో ముగియనుంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఆగస్టు 2 నుంచి ప్రతి క్లస్టర్‌కు ఇన్చార్జిగా గెజిటెడ్ ఆఫీసర్‌ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్పంచు ల పదవీకాలాన్ని పొడించాలని రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రభుత్వానికి విన్నవించినా, ప్రత్యేక పాలన వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. నూ తన పంచాయతీరాజ్ చట్టం–2018 సెక్షన్ 136 ప్రకారం ప్రత్యేకాధికారుల నియామకానికి చర్య లు తీసుకోంటోంది. మండల స్థాయిలో గెజిటెడ్ ఆఫీసర్లకు ఒక్కొక్కరికి ఒక్కో క్లస్టర్ ఇన్చార్జి బా ధ్యతలు అప్పగించనున్నారు. సర్పంచ్ల స్థానం లో స్పెషల్ ఆఫీసర్లు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీరాజ్ అధికారులు ప్రత్యేకాధికారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన పంచాయతీలను కలుపుకుని మొత్తం 530 గ్రామ పంచాయతీలున్నాయి. పంచాయతీ కార్యదర్శుల కొరత వల్ల గతంలోనే పాలనా సౌలభ్యం కోసం పంచాతీయలను క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో మూడు, నాలుగు జీపీలు ఉన్నాయి. క్లస్టర్ పంచాయతీ కార్యదర్శి ఆ క్లస్టర్ పరిధిలోని జీపీల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం క్లస్టర్ల వారీగానే పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమంచనున్నారు. గెజిటెడ్ ఆఫీసర్లే ప్రత్యేకాధికారులు.. జుమండల స్థాయి అధికారులైన తహసీల్దార్, ఎం పీడీవో, ఈవోపీఆర్డీ, ఎంఈవో, వెటర్నరీ డాక్టర్, మండల వ్యవసాయాధికారి, ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ, పీఆర్ ఏఈలను గ్రామపంచాయతీ క్లస్టర్లకు స్పెషల్ ఆఫీసర్లుగా నియమించనున్నారు. ఒక్కో మండలంలో క్లస్టర్లు ఎక్కువ ఉండి అధికారులు త క్కువగా ఉంటే ఒక్కో అధికారికి రెండుకు పైగా క్లస్టర్ల బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు, క్లస్టర్ల సంఖ్యను బట్టి అవసరమైతే ఇతర శాఖల అధికారులను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించే అవకాశముంది. సర్పంచ్ స్థానంలో స్పెషల్ ఆఫీసర్.. ప్రస్తుతం గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధులకు సంబంధించి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఉంది. స్పెషల్ ఆఫీసర్ ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్పంచ్ స్థానంలో ప్రత్యేక అధికారి సంతకంతో పాటు చెక్‌లపై కార్యదర్శి సంతకం చేయాల్సి ఉంటుంది. గతంలో జాయింట్ చెక్ పవర్ ఉన్నప్పటికీ గ్రామాల్లో సర్పంచులు చెప్పిందే వేదంగా నడిచేది. సర్పంచులు ఇష్టారీతిన బిల్లులు రాసుకున్నా పంచాయతీ కార్యదర్శులు విధి లేక సంతకాలు చేసే వారు. సర్పంచులతో పాటు కొందరు కార్యదర్శులు దీనిని తమకు అనుకూలంగా మార్చుకు నే వారు. అయితే, ఇకపై గెజిటెడ్ ఆఫీసర్స్ ఇన్‌చార్జీలుగా రావడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. -
శుక్రవారం ఒక్కరోజే 3.24 కోట్లు స్వాధీనం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో పోలింగ్‌కు కొన్ని గంటల ముందు కూడా రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న నగదు భారీగా పట్టుబడింది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో రూ.3.24 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొళకాల్మూరు వద్ద ఓ స్కార్పియో వాహనంలో రూ.2.17 కోట్లను గుర్తించారు. కోలారు సమీపంలో లారీలో సిమెంట్ సంచుల్లో తరలిస్తున్న రూ.70 లక్షల నగదును జప్తు చేశారు. బాగల్కోట్లో రూ.20 లక్షలు, బెంగళూరు శివారు ప్రాంతంలో రూ.17 లక్షల నగదు పట్టుబడింది. దీంతో ఇప్పటి వరకు పోలీసులు, ఎన్నికల ప్రత్యేక బృందాలు రూ.55 కోట్ల నగదు, సుమారు 8 వేల లీటర్ల మద్యం, సుమారు 100 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. -
రేపు కేజీబీవీ ప్రత్యేక అధికారుల రాత పరీక్ష
నల్లగొండ టూటౌన్ : కేజీబీవీ ప్రత్యేక అధికారులు రాతపరీక్ష శుక్రవారం నల్లగొండలోని డైట్ కళాశాలలో ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనున్నట్లు సర్వశిక్ష అభియాన్ పీఓ కిరణ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను నల్లగొండలోని సర్వశిక్ష అభియాన్ జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో పొందాలని కోరారు. తిరస్కరించిన అభ్యర్థుల దరఖాస్తు వివరాలు కార్యాలయం నందు, టట్చnlజ.ఠ్ఛీbట.ఛిౌఝ పొందుపర్చినట్లు పేర్కొన్నారు. -
కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన పొడిగింపు
విజయవాడ: ఐదు కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన పొడిగింపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి, కాకినాడ, గుంటూరు, కర్నూలు, ఒంగోలులో కార్పొరేషన్లలో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటితో పాటుగా ప్రకాశం జిల్లా కందకూరు, కడప జిల్లాలోని రాజంపేట నగర పంచాయతీలో ప్రత్యేకాధికారుల పాలనను ప్రభుత్వం పొడిగించింది. -
పన్నుల పిడుగు
- కొంపముంచుతున్న డ్రెయినేజీ, వాటర్ చార్జీలు - ఏడు శాతం పెంపు - దొంగదెబ్బ తీసిన టీడీపీ - కౌన్సిల్ తీర్మానం ఏమైనట్టు? విజయవాడ సెంట్రల్ : నమ్మి ఓట్లేసిన జనాన్ని టీడీపీ దొంగదెబ్బ తీసింది. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పెంచిన డ్రెయినేజీ, వాటర్ చార్జీలను తగ్గిస్తామని ఏడాదిగా చెబుతున్న నగరపాలక సంస్థ పాలకుల మాటలు అంతా బూటకమని తేలింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి డ్రెయినేజీ, వాటర్ చార్జీలను మరో ఏడు శాతం మేర పెంచి అధికారులు నోటీసులు ఇస్తున్నారు. సుమారు రూ.3కోట్ల మేర ప్రజలపై పన్నుభారం మోపుతున్నారు. ఉదాహరణకు హనుమాన్‌పేట మచ్చా నర్సయ్య వీధిలోని అసెస్మెంట్ నంబర్ 1,07,634లో గత ఏడాది నీటి చార్జీలు ఆరు నెలలకు రూ.438 చెల్లిస్తే ఈ దఫా రూ.458 చెల్లించాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. అలాగే, డ్రెయినేజీ చార్జీని రూ.192 నుంచి రూ.204కు పెంచారు. నగరంలో 1,17,209 కుళాయి కనెక్షన్లు ఉండగా, ఇందులో 8,716 కమర్షియల్ కేటగిరీలో ఉన్నాయి. 67,113 డ్రెయినేజీ కనెక్షన్లకు 10,126 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటిపై ఏడు శాతం చార్జీలను పెంచేశారు. ఈ రెంటికీ కలిపి ప్రస్తుతం రూ.26.43 కోట్లు వసూలవుతుండగా, పెరిగిన ధరల ప్రకారం రూ.29.07 కోట్లకు చేరింది. మోత మోగించారు ప్రత్యేక అధికారుల పాలనలో నగరపాలక సంస్థలో పన్నులమోత మోగించారు. 2013 మార్చిలో స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్, కమిషనర్ జి.పండాదాస్లు డ్రెయినేజీ, వాటర్ చార్జీలను 400 శాతం పెంచుతూ తీర్మానం చేశారు. ఏటా ఏడుశాతం చొప్పున పెంచేలా అందులో పేర్కొన్నారు. చెత్త, బిల్డింగ్ ఫీజులు, యూజర్ చార్జీలను అనూహ్యంగా పెంచారు. మూడున్నరేళ్ల స్పెషల్ ఆఫీసర్ల పాలనలో రూ.75 కోట్ల మేర ప్రజలపై పన్ను భారాలు పడ్డాయి. తాము అధికారంలోకి వస్తే వీటన్నింటినీ రద్దు చేస్తామని అప్పట్లో టీడీపీ నేతలు ప్రజలకు వాగ్దానం చేశారు. దీన్ని నమ్మి ప్రజలు ఓట్లేసి టీడీపీకి పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చాక ఇలా.. నగరపాలక సంస్థలో టీడీపీ విజయం సాధించింది. స్పెషల్ ఆఫీసర్లు చేసిన తీర్మానం ప్రకారం గత ఏడాది ఏప్రిల్‌లో డ్రెయినేజీ, వాటర్ చార్జీలను ఏడు శాతం పెంచుతూ అధికారులు నోటీసులు ఇచ్చారు. గత ఆగస్టు 6వ తేదీన జరిగిన తొలి కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్షాలతో పాటు పాలకపక్షం కార్పొరేటర్లు పన్ను భారాలపై గళం ఎత్తారు. మాకు తెలియకుండా అధికారులే పన్నులు పెంచేశారంటూ మేయర్ కోనేరు శ్రీధర్ చెప్పారు. డెప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు స్పెషల్ అధికారుల పాలనలో పెంచిన డ్రెయినేజీ, వాటర్ చార్జీలను ఏటా ఏడు శాతం పెంచడానికి వీల్లేదని ప్రతిపాదన పెట్టారు. దీన్ని కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించి ప్రభుత్వానికి పంపింది. పన్నుల తగ్గింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో ఈ ఏడాది మరో ఏడు శాతం పెంచుతూ అధికారులు నోటీసులు ఇచ్చారు. త్వరలోనే తగ్గిస్తాం.. స్పెషల్ అధికారుల పాలనలో పెంచిన డ్రెయినేజీ, నీటి చార్జీలు తగ్గించాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాశాం. మున్సిపల్ మంత్రి పి.నారాయణతో గతంలో చర్చించాం. త్వరలోనే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుంది. అక్టోబర్ నుంచి నీటి చార్జీలను తగ్గించే అవకాశం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకుంటాం. - కోనేరు శ్రీధర్, మేయర్ పోరాడతాం.. టీడీపీ పాలకులు పన్ను భారాలతో ప్రజల నడ్డివిరుస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో పన్నులు తగ్గించాలంటూ చేసిన తీర్మానం ఏమైంది. కొత్తగా మరో ఏడుశాతం చార్జీలు పెంచారు. ఇందులో పాలకుల కుట్ర ఉంది. దీనిపై మేం నిలదీస్తాం. ప్రజల పక్షాన పోరాడతాం. - బండి నాగేంద్ర పుణ్యశీల, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ -
పల్లెవికాసాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
జిల్లా కలెక్టర్ శ్రీదేవి మహబూబ్‌నగర్ టౌన్: ప్రతి వారం నిర్వహించే పల్లెవికాసం కార్యక్రమాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి ప్రత్యేకాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు విధిగా పాల్గొని ఏ శాఖకు చెందిన సమస్యలను వారే గుర్తించాలన్నారు. గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాలను సందర్శించేటప్పుడు రెగ్యులర్‌గా అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి వాటిని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పౌష్టికాహారం, ఇతరత్రా వాటిని సక్రమంగా అందిస్తున్నారా లేదా అనేది తనిఖీ చేయాలని చెప్పారు. పీహెచ్సీలలోనే కాన్పులు అయ్యేలా గ్రామీణ ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఉపాధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి వేసవిలో కూలీలు వలసలు వెళ్లకుండా ఉపాధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ చెప్పారు. కూలి చేసేందుకు ముందుకు వచ్చే ప్రతి కూలీకి పని కల్పించాలని సూచించారు. నిబంధనల ప్రకారం రోజుకు రూ.169కూలి వచ్చేలా పనులు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పనిచేసిన వారికి సకాలంలో డబ్బులు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఏజేసీ డాక్టర్ రాజారాం, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా పీడీ సునందరాణి తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని భూ సమీకరణలో ప్రతిష్టంభన!
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ సమీకరణలో ప్రతిష్టంభన నెలకొంది. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో నేటి నుంచి భూ సమీకరణ చేపట్టనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం రైతుల నుంచి అంగీకార పత్రాల స్వీకరణకు 27 టీమ్‌లను ఏర్పాటు చేశారు. అయితే ప్రత్యేక బృందాలు ఇంకా అన్ని గ్రామాలకు చేరుకోలేదు. ఉత్తర్వులు అందకుండా గ్రామాల్లోకి ఎలా వెళ్లాలని ప్రత్యేక బృందాలు వేచి చూస్తున్నాయి. ఒకవేళ సమస్యలు తలెత్తితే పరిష్కరించడానికి ఎలాంటి తమకు ఎలాంటి అధికారం లేదని అధికారులు చెబుతున్నారు. సి.సి.ఎల్.ఏ ఆదేశాల కోసం అధికారులు వేచి ఉన్నారు. ఇప్పటికి కేవలం అయిదారు బృందాలు మాత్రమే గ్రామాలకు చేరుకున్నాయి. మరోవైపు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే..ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. -
పంచాయతీలకు ‘పన్ను’పోటు
నీలగిరి : ప్రత్యేక అధికారుల చేతుల్లోంచి పెత్తనం పాలకవర్గాల చేతుల్లోకి వచ్చి ఏడాది దాటినా నేటికీ పాలన వ్యవహారాల్లో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. ప్రజల నుంచి వసూలు చేయాల్సిన వివిధ రకాల పన్నుల విషయంలో కార్యదర్శులు, సర్పంచ్‌లు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో 1176 పంచాయతీలు ఉన్నాయి. గతేడాది ఆగస్టు 22వ తేదీ నుంచి గ్రామాల్లో సర్పంచ్లపాలన మొదలైంది. ప్రభుత్వం నుంచి మంజూరవుతున్న 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ) నిధుల వైపు తొంగిచూస్తున్నారే తప్ప, స్థానికంగా ప్రజల నుంచి రావాల్సిన పన్నులు మాత్రం వసూలు చేయడం లేదు. పంచాయతీల రాబడి పెంచేందుకు పనిచేయాల్సిన గ్రామ కార్యదర్శులు వాటి గురించి పట్టించుకోవడమే మానేశారు. దీంతో గ్రామాల్లో తలెత్తుతున్న పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించుకోలేకపోతున్నారు. అదీగాక పంచాయతీల మీదనే ఆధారపడి జీవిస్తున్న కారోబార్లు, స్వీపర్లు, దినసరి కూలీల జీతభత్యాల చెల్లింపులు ఆగిపోయాయి. బకాయిలు భారీగానే.. పన్నుల రూపంలో పంచాయతీలకు ప్రతి ఏడాది రూ.10 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. తైబజార్లు, బందెల దొడ్లు, కిరాణ దుకాణాలు, డబ్బాకొట్లు, నల్లా కనెక్షన్లు, వాహనాల పన్ను, పంచాయతీ ఆస్తుల లీజు, ఇంటి పన్ను వగైరా వంటి మార్గాల ద్వారా పంచాయతీలకు ఆదాయం వచ్చిచేరుతుంది. అయితే ప్రత్యేక అధికారుల పాలన కాలంలోనే పన్నుల బకాయి రూ.7,60,97,288 ఉండగా, కేవలం రూ.2,58,43,424 మాత్రమే వసూలు చేశారు. ఇక సర్పంచ్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పన్నుల రూపేణ ఆదాయం రూ.9,37,33,384 రావాల్సి ఉండగా.. కేవలం 4,34,74,681 రూపాయలు మాత్రమే వసూలు చేశారు. ప్రత్యేక అధికారుల పాలన, సర్పంచ్ల హయాం కలిపి గత ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల రూపంలో పంచాయతీలకు రావాల్సిన ఆదాయం రూ.16,98,30,671 కాగా కేవలం రూ. 6,93,18,105 మాత్రమే వచ్చింది. మొత్తం రావాల్సిన ఆదాయంలో కేవలం 40 శాతం పన్నులే వసూలయ్యాయి. ఈ ఏడాది లెక్కల్లేవ్... పంచాయతీ అధికారుల కొరత కారణంగా పన్నులు రాబట్టలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. పన్నుల రాబడి ప్రతి ఏడాది ఏప్రిల్ నుంచి మరుసటి ఏడాది మార్చి వరకు లెక్కిస్తారు. ఎంత వసూలు కావాల్సింది..? ఎంత మేరకు వసూలు చేశారు..? అనే లెక్కలు మాత్రం ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేయాలి. ఒక్క మిర్యాలగూడకే డివిజనల్ స్థాయి అధికారి ఉన్నారు. భువనగిరి డీఎల్పీఓ ఏసీబీకి పట్టుబడడంతో ఆ పోస్టు ఖాళీగానే ఉంది. నల్లగొండ డీఎల్పీఓ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయ్యారు. ఇవిగాక పంచాయతీ కార్యదర్శులు 568 మందికి గాను 520మంది మాత్రమే ఉన్నారు. మరో 11 పోస్టు లు భర్తీ చేయాల్సి ఉన్నప్పటికి, వాటిని నింపకుండా అధికారులు నానబెడుతున్నారు. రెండు, మూడు గ్రామాలను ఓ క్లస్టర్‌గా ఏర్పాటు చేసి కార్యదర్శులకు, బిల్ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఎంతమేర పన్ను వసూలు చేశామనే లెక్కలు కూడా సేకరించలేనంత దయనీయ స్థితిలో జిల్లా యంత్రాంగం కొట్టుమిట్టాడుతోంది. ఈ విషయమై డీపీఓ విష్ణుమూర్తి ‘సాక్షి’తో మాట్లాడుతూ...జిల్లాలో పంచాయతీల పన్నుల రాబడి చాలా తగ్గిపోయింది. సిబ్బంది కొరత కారణంగానే పన్నులు వసూలు చేయలేకపోతున్నాం. ఈ ఏడాది ఆదాయ లెక్కలు సేకరించకపోవడానికి కూడా అదే కారణం. త్వరలో పన్ను వసూళ్లకు తగిన చర్యలు చేపడతాం. -
‘మన ఊరు’కు ప్రత్యేకాధికారులు
సాక్షి, హైదరాబాద్: ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమం కోసం తెలంగాణలోని పది జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. ఒక్కో ఐఏఎస్ అధికారికి ఒక్కోజిల్లా ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 28తేదీ వరకు ఆయా జిల్లాల్లో పర్యటించాలని ఆదేశించింది. ఈ పర్యటనల్లో భాగంగా వారు ప్రాధాన్యం ఉన్న సమావేశాల్లో పాల్గొనాలని సూచించింది. తమ నివేదికలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లాల వారీగా ప్రత్యేకాధికారులు: హైదరాబాద్‌కు సోమేశ్‌కుమార్, రంగారెడ్డి- బీఆర్ మీనా, మెదక్ - బి.వెంకటేశం, నల్గొండ - అనిల్, మహబూబ్‌నగర్ - జగదీశ్, వరంగల్ - రాహుల్ బొజ్జా, ఖమ్మం- నీరబ్ కుమార్ ప్రసాద్, కరీంనగర్ - పార్థసారథి, నిజామాబాద్ - జనార్థన్‌రెడ్డి, ఆదిలాబాద్ - అశోక్ -
కేజీబీవీ ఎస్ఓల భర్తీలో గందరగోళం!
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: రాజీవ్ విద్యామిష న్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బాగాంధీ బాలిక ల విద్యాలయాల(కేజీబీవీ) ప్రత్యేకాధికారుల పోస్టుల భర్తీ ప్రక్రియ అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న వారిలో కొం దరు ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకూ తమనే కొనసాగించాలంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పటికే ఎంపిైకై నియామకాలను పూర్తి చేసుకుని విధుల్లో జాయిన్ అయిన నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. వాస్తవానికి విద్యాహక్కు చట్టంప్రకారం... ఉపాధ్యాయులు కచ్చితంగా బడిలోనే ఉండాలని ఆర్వీఎం ఎస్పీడీ ఉషారాణి కొన్ని నిబంధనలు అమలు చేశారు. ఇందులో భాగంగా ఫారెన్ సర్వీసు(సంబంధి త ఇతర శాఖల నుంచి పోస్టును తీసుకోవడం), డె ప్యూటేషన్(సర్దుపాటు)పై కేజీబీవీ స్పెషలాఫీసర్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను వెనక్కి పంపేలా చర్య లు తీసుకున్నారు. వారి స్థానాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్ఓ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇటీవల వారికి రాత పరీక్ష నిర్వహించి, నియామాకాలు చేపట్టారు. అడ్డుపడుతున్న పాత ఎస్ఓలు జిల్లాలోని 33 కేజీబీవీలలో 14 రాజీవ్ విద్యామిషన్, 11ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ, మిగిలినవి గిరిజన సం క్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్నాయి. ఎంఈఓలు, రెసిడెన్షియల్ సొసైటీ ప్రిన్సిపాళ్లుగా ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులతో పాటు ఫారిన్ సర్వీసు కింద డి ప్యూటేషన్ కింద పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయు లు కొందరు ప్రస్తుతం ఎస్‌ఓలుగా పని చేస్తున్నారు. ఈ స్థానాల్లో కొత్త ఎస్ ఓలను భర్తీ చేసే ప్రక్రియను ఇటీవల పూర్తి చేశారు. అయితే గజపతినగరం, గరి విడి, మెరకముడిదాం కేజీబీవీలలో సోమ, మంగళ వారం విధుల్లో చేరేందుకు కొత్త ఎస్ఓలు వెళ్లగా వారి కి చేదు అనుభవం ఎదురైంది. తాము కోర్టుకెళ్లాం... 2014 ఏప్రిల్ వరకు కొనసాగేలా ఉత్తర్వులు తెచ్చుకున్నాం... మీరెలా వస్తారంటూ అక్కడున్న పాత ఎస్ఓలు వారిని అడ్డుకున్నారు. దీంతో చేసేదిలేక వారు రాజీవ్ విద్యామిషన్ జిల్లా పీఓను ఆశ్రయించారు. ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన ఎస్పీడీ విద్యా సంవత్సరం మధ్యలో తమను రిలీవ్ చేస్తే ఇబ్బందులు పడతామంటూ కొందరు కోర్టుకెళ్లిన వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల ని ఎస్పీడీ స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫారెన్ సర్వీసుపై ఎస్‌ఓలుగా వచ్చిన ఉపాధ్యాయులకు 2014 ఏప్రిల్ వరకు ఆయా కేజీబీవీల్లో 9, 10 తరగతులు బోధించేలా చర్యలు తీసుకోవాలని తెలి పారు. స్వచ్ఛందంగా రిలీవ్ కావాలనుకునే వారిని రిలీవ్ చేయాలని సూచించారు. ఇది జీర్ణించుకోని కొందరు పాత ఎస్ఓలు ఎలాగైనా కొనసాగాలనే పంథాతో కొత్తవారికి అడ్డు తగులుతున్నారు. పాతవాళ్లను టీచర్లగా కొనసాగిస్తాం కేజీబీవీలకు ఇన్చార్జి ఎస్‌ఓలుగా ఉన్న ఫారెన్ సర్వీ సు మీద వచ్చిన ముగ్గురిని ఆయా విద్యాలయాల్లో 9, 10వ తరగతి ఉపాధ్యాయులుగా కొనసాగిస్తామని రా జీవ్ విద్యామిషన్ పీఓ జి.నాగమణి ‘న్యూస్‌లైన్’కి తె లిపారు.ఎస్ఓలుగానే కొనసాగించాలంటూ కొందరు కోర్టుకెళ్లిన విషయాన్ని ఎస్పీడీకి నివేదించామన్నారు. -
వర్షం ఉంది
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : లెహర్ తుఫాన్ ముప్పు తప్పినా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగానే ఉంది. గురువారం మచిలీపట్నం వద్ద తుఫాన్ తీరం దాటింది. ఆ సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో స్పెషల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన మండలాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు. ట్రాక్టర్లు, లారీలను రెడీగా ఉంచారు. కలెక్టరేట్‌తో పాటు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు అలాగే ఉంచారు. లెహర్ ముప్పు తప్పినట్లు తెలియడంతో జిల్లాకు నియమితులైన స్పెషల్ ఆఫీసర్ ఎంటీ కృష్ణబాబు హైదరాబాద్‌లోనే ఉన్నారు. పై-లీన్ తుఫాన్ కంటే లెహర్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం ముందస్తుగానే రంగంలోకి దిగింది. జిల్లాలోని 11 తీర ప్రాంతాలకు 11 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. వారు బుధవారం నుంచి అక్కడే ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. భారీ వర్షాలు కురిసి రాకపోకలు స్తంభిస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు బియ్యం, కిరోసిన్ సిద్ధంగా ఉంచారు. భారీ వర్షాలతో పాటు గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు రావడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోతే వాటిని యుద్ధప్రాతిపదికన తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లాకు జాతీయ విపత్తుల నివారణ సంస్థ నుంచి ప్రత్యేకంగా బృందాలను రప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని కలెక్టర్ విజయకుమార్ కోరారు. తుఫాన్ తీవ్రత గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో బృందాలను అక్కడకు పంపామని, అత్యవసమైతే ప్రకాశం జిల్లాకు రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు. అన్నిరకాల అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా హెలికాప్టర్‌ను కూడా జిల్లా యంత్రాంగం రెడీగా ఉంచింది. వేటకు సిద్ధమైన మత్స్యకారులు కొన్ని రోజుల నుంచి వేటకు అంతరాయం కలుగుతుండటంతో మత్స్యకారుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వేట తప్పితే మరో జీవనాధారం లేని వారి కుటుంబాలు కొన్ని రోజులు పస్తులతో గడపాల్సిన దుస్థితి నెలకొంది. వరుసపెట్టి ప్రకృతి వైపరీత్యాలు వస్తుండటంతో తల్లడిల్లిన మత్స్యకారులు శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో వేటకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాల్లో 38 మరపడవలు, 2110 యాంత్రీకరణ పడవులు, 2020 నాటు పడవలున్నాయి. సముద్రంలోకి వేటకు వెళ్లడం ద్వారా వచ్చే చేపలతో మత్స్యకారులు తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కొన్ని వారాల నుంచి వారి పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకదాని వెంట మరొకటి తుపాన్లు వస్తుండటంతో ఉపాధి దెబ్బతింది. ఈ నేపథ్యంలో లెహర్ తుఫాన్ వాయుగుండంగా మారి కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చని రాష్ట్ర స్థాయి అధికారులు ప్రకటించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. తుపాన్లు రావడం, సముద్రం అల్లకల్లోలంగా ఉండటం, అలల ఉధృతి పెరిగి పడవలు, వలలు ఎక్కడ కొట్టుకుపోతాయోనని అనేక మంది మత్స్యకారులు వాటిని ఒడ్డుకు దూరంగా పెట్టుకున్నారు. వేటకు వెళ్లవచ్చని ప్రకటన రావడంతో పడవలు, వలలు సిద్ధం చేసుకుంటున్నారు. పెపైచ్చు తుఫాన్ల కారణంగా సముద్రం కొంత కుదుపులకు గురికావడం, ఆ సమయంలో వేటకు వెళితే చేపలు అధికంగా పడనుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు మరింత ఉత్సాహం చూపుతున్నారు.