ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : లెహర్ తుఫాన్ ముప్పు తప్పినా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగానే ఉంది. గురువారం మచిలీపట్నం వద్ద తుఫాన్ తీరం దాటింది. ఆ సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో స్పెషల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన మండలాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు. ట్రాక్టర్లు, లారీలను రెడీగా ఉంచారు. కలెక్టరేట్‌తో పాటు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు అలాగే ఉంచారు.
లెహర్ ముప్పు తప్పినట్లు తెలియడంతో జిల్లాకు నియమితులైన స్పెషల్ ఆఫీసర్ ఎంటీ కృష్ణబాబు హైదరాబాద్‌లోనే ఉన్నారు. పై-లీన్ తుఫాన్ కంటే లెహర్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం ముందస్తుగానే రంగంలోకి దిగింది. జిల్లాలోని 11 తీర ప్రాంతాలకు 11 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. వారు బుధవారం నుంచి అక్కడే ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. భారీ వర్షాలు కురిసి రాకపోకలు స్తంభిస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు బియ్యం, కిరోసిన్ సిద్ధంగా ఉంచారు. భారీ వర్షాలతో పాటు గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు రావడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోతే వాటిని యుద్ధప్రాతిపదికన తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు.
జిల్లాకు జాతీయ విపత్తుల నివారణ సంస్థ నుంచి ప్రత్యేకంగా బృందాలను రప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని కలెక్టర్ విజయకుమార్ కోరారు. తుఫాన్ తీవ్రత గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో బృందాలను అక్కడకు పంపామని, అత్యవసమైతే ప్రకాశం జిల్లాకు రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు. అన్నిరకాల అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా హెలికాప్టర్‌ను కూడా జిల్లా యంత్రాంగం రెడీగా ఉంచింది.
వేటకు సిద్ధమైన మత్స్యకారులు
కొన్ని రోజుల నుంచి వేటకు అంతరాయం కలుగుతుండటంతో మత్స్యకారుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వేట తప్పితే మరో జీవనాధారం లేని వారి కుటుంబాలు కొన్ని రోజులు పస్తులతో గడపాల్సిన దుస్థితి నెలకొంది. వరుసపెట్టి ప్రకృతి వైపరీత్యాలు వస్తుండటంతో తల్లడిల్లిన మత్స్యకారులు శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో వేటకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాల్లో 38 మరపడవలు, 2110 యాంత్రీకరణ పడవులు, 2020 నాటు పడవలున్నాయి. సముద్రంలోకి వేటకు వెళ్లడం ద్వారా వచ్చే చేపలతో మత్స్యకారులు తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కొన్ని వారాల నుంచి వారి పరిస్థితి గందరగోళంగా మారింది.
ఒకదాని వెంట మరొకటి తుపాన్లు వస్తుండటంతో ఉపాధి దెబ్బతింది. ఈ నేపథ్యంలో లెహర్ తుఫాన్ వాయుగుండంగా మారి కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చని రాష్ట్ర స్థాయి అధికారులు ప్రకటించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. తుపాన్లు రావడం, సముద్రం అల్లకల్లోలంగా ఉండటం, అలల ఉధృతి పెరిగి పడవలు, వలలు ఎక్కడ కొట్టుకుపోతాయోనని అనేక మంది మత్స్యకారులు వాటిని ఒడ్డుకు దూరంగా పెట్టుకున్నారు. వేటకు వెళ్లవచ్చని ప్రకటన రావడంతో పడవలు, వలలు సిద్ధం చేసుకుంటున్నారు. పెపైచ్చు తుఫాన్ల కారణంగా సముద్రం కొంత కుదుపులకు గురికావడం, ఆ సమయంలో వేటకు వెళితే చేపలు అధికంగా పడనుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు మరింత ఉత్సాహం చూపుతున్నారు.
వర్షం ఉంది
Published Fri, Nov 29 2013 5:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
Advertisement