వాగ్దారిలో పూడికను ట్రాక్టర్‌లో తరలిస్తున్న సిబ్బంది
నేరడిగొండ(బోథ్): పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో ‘కొత్త’ పంచాయతీ మొదైలంది. నిధుల ఫ్రీజింగ్ కారణంగా కార్యదర్శులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అటు సర్పంచుల పదవీ కాలం ముగియడం, ఇటు ప్రత్యేక అధికారులు పట్టించుకోకపోవడం కారణంగా సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం 467 గ్రామ పంచాయతీలు ఉండగా.. కొత్తగా 266 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమించిన విషయం తెలిసిందే. వారికి గ్రామ సమస్యలపై సరైన అవగాహన లేకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
కొన్ని గ్రామాల్లో ఏ అధికారి నియమితులయ్యారో ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో సమస్యలను పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తున్నారు. గ్రామాల్లో తీవ్రంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఒత్తిడి తెస్తున్నారు. చేసేదేమీ లేక పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులను వెచ్చించి పనులు చేయించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. మరోవైపు ప్రత్యేక అధికారులు గ్రామాలను సందర్శించడం లేదు. పంచాయతీల పాలనపై అనుభవం లేని వారిని ప్రత్యేక అధికారులుగా నియమించడం విమర్శలకు తావిస్తోంది. ప్రత్యేక అధికారులుగా నియమితులైన వారు తమ మాతృశాఖతోపాటు పాలన భారం కూడా ఒక్కసారిగా మీదపడడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
విభజనతో ఇబ్బందులు
పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించి రెండు నెలలు కావస్తోంది. పాత పంచాయతీల నుంచి విడిపోయిన పంచాయతీలకు నిధులు అందడం లేదు. దీంతో ఆయా గ్రామాల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఫలితంగా పంచాయతీలన్నీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామాల్లో మౌలిక వసతుల నిర్వహణ అధ్వానంగా మారింది. పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శులు సమస్యను బట్టి స్పందిస్తున్నారు. తాగునీటి సమస్య, పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. కానీ అవి కూడా పూర్తిస్థాయిలో లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో
ప్రత్యేక అధికారులు పట్టించుకోకపోయినా పంచాయతీ కార్యదర్శులకు మాత్రం ఇబ్బందులు తప్పడంలేదు. దీంతో గ్రామాల్లో పనులు చేయించాలని గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తీసుకురావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పారిశుధ్య కార్యక్రమాలు, తాగునీటి సరఫరా, పైపులైన్ నిర్మాణం తదితర పనులకు డబ్బులు ఖర్చు చేసినట్లు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. పంచాయతీలో నిధులున్నా ఫ్రీజింగ్ కారణంగా విడుదల కాకపోవడంతో బయట అప్పులు చేసి ఖర్చు చేస్తున్నామని వాపోతున్నారు.
రూ.లక్షకు పైగా ఖర్చు..
గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా కోసం తమకు కేటాయించిన గ్రామాలకు ఇప్పటివరకు దాదాపు రూ.లక్షకు పైగా ఖర్చు చేశామని పేరు చెప్పేందుకు ఇష్టపడని పలువురు పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన పనులు బిల్లులు చేసినా ఫ్రీజింగ్ కారణంగా నిధులు అందకుండా పోతున్నాయని వాపోతున్నారు. బయట అప్పులు చేసి పంచాయతీ పనులు చేయించాల్సిన పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment