పంచాయతీలకు ‘పన్ను’పోటు
నీలగిరి : ప్రత్యేక అధికారుల చేతుల్లోంచి పెత్తనం పాలకవర్గాల చేతుల్లోకి వచ్చి ఏడాది దాటినా నేటికీ పాలన వ్యవహారాల్లో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. ప్రజల నుంచి వసూలు చేయాల్సిన వివిధ రకాల పన్నుల విషయంలో కార్యదర్శులు, సర్పంచ్‌లు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో 1176 పంచాయతీలు ఉన్నాయి. గతేడాది ఆగస్టు 22వ తేదీ నుంచి గ్రామాల్లో సర్పంచ్‌లపాలన మొదలైంది. ప్రభుత్వం నుంచి మంజూరవుతున్న 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్‌ఎఫ్‌సీ) నిధుల వైపు తొంగిచూస్తున్నారే తప్ప, స్థానికంగా ప్రజల నుంచి రావాల్సిన పన్నులు మాత్రం వసూలు చేయడం లేదు. పంచాయతీల రాబడి పెంచేందుకు పనిచేయాల్సిన గ్రామ కార్యదర్శులు వాటి గురించి పట్టించుకోవడమే మానేశారు. దీంతో గ్రామాల్లో తలెత్తుతున్న పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించుకోలేకపోతున్నారు. అదీగాక పంచాయతీల మీదనే ఆధారపడి జీవిస్తున్న కారోబార్లు, స్వీపర్లు, దినసరి కూలీల జీతభత్యాల చెల్లింపులు ఆగిపోయాయి.
బకాయిలు భారీగానే..
పన్నుల రూపంలో పంచాయతీలకు ప్రతి ఏడాది రూ.10 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. తైబజార్లు, బందెల దొడ్లు, కిరాణ దుకాణాలు, డబ్బాకొట్లు, నల్లా కనెక్షన్లు, వాహనాల పన్ను, పంచాయతీ ఆస్తుల లీజు, ఇంటి పన్ను వగైరా వంటి మార్గాల ద్వారా పంచాయతీలకు ఆదాయం వచ్చిచేరుతుంది. అయితే ప్రత్యేక అధికారుల పాలన కాలంలోనే పన్నుల బకాయి రూ.7,60,97,288 ఉండగా, కేవలం రూ.2,58,43,424 మాత్రమే వసూలు చేశారు. ఇక సర్పంచ్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పన్నుల రూపేణ ఆదాయం రూ.9,37,33,384 రావాల్సి ఉండగా.. కేవలం 4,34,74,681 రూపాయలు మాత్రమే వసూలు చేశారు. ప్రత్యేక అధికారుల పాలన, సర్పంచ్‌ల హయాం కలిపి గత ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల రూపంలో పంచాయతీలకు రావాల్సిన ఆదాయం రూ.16,98,30,671 కాగా కేవలం రూ. 6,93,18,105 మాత్రమే వచ్చింది. మొత్తం రావాల్సిన ఆదాయంలో కేవలం 40 శాతం పన్నులే వసూలయ్యాయి.
ఈ ఏడాది లెక్కల్లేవ్...
పంచాయతీ అధికారుల కొరత కారణంగా పన్నులు రాబట్టలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. పన్నుల రాబడి ప్రతి ఏడాది ఏప్రిల్ నుంచి మరుసటి ఏడాది మార్చి వరకు లెక్కిస్తారు. ఎంత వసూలు కావాల్సింది..? ఎంత మేరకు వసూలు చేశారు..? అనే లెక్కలు మాత్రం ఎప్పటికప్పుడు రిజిస్టర్‌లో నమోదు చేయాలి. ఒక్క మిర్యాలగూడకే డివిజనల్ స్థాయి అధికారి ఉన్నారు. భువనగిరి డీఎల్‌పీఓ ఏసీబీకి పట్టుబడడంతో ఆ పోస్టు ఖాళీగానే ఉంది. నల్లగొండ డీఎల్‌పీఓ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయ్యారు. ఇవిగాక పంచాయతీ కార్యదర్శులు 568 మందికి గాను 520మంది మాత్రమే ఉన్నారు. మరో 11 పోస్టు లు భర్తీ చేయాల్సి ఉన్నప్పటికి, వాటిని నింపకుండా అధికారులు నానబెడుతున్నారు. రెండు, మూడు గ్రామాలను ఓ క్లస్టర్‌గా ఏర్పాటు చేసి కార్యదర్శులకు, బిల్ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఎంతమేర పన్ను వసూలు చేశామనే లెక్కలు కూడా సేకరించలేనంత దయనీయ స్థితిలో జిల్లా యంత్రాంగం కొట్టుమిట్టాడుతోంది. ఈ విషయమై డీపీఓ విష్ణుమూర్తి ‘సాక్షి’తో మాట్లాడుతూ...జిల్లాలో పంచాయతీల పన్నుల రాబడి చాలా తగ్గిపోయింది. సిబ్బంది కొరత కారణంగానే పన్నులు వసూలు చేయలేకపోతున్నాం. ఈ ఏడాది ఆదాయ లెక్కలు సేకరించకపోవడానికి కూడా అదే కారణం. త్వరలో పన్ను వసూళ్లకు తగిన చర్యలు చేపడతాం.