జూలై 4తో ముగియనున్న జిల్లా, మండల పరిషత్ పాలక మండళ్ల పదవీకాలం
కులగణన, కొత్తగా ఖరారు కాని ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు
అన్నీ సర్దుకొని స్పష్టత వస్తే .. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు !
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్‌లలో ‘ప్రత్యేక’ అధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. జూలై 4తో 32 జిల్లా పరిషత్‌లు, 538 మండల పరిషత్ పాలకమండళ్ల పదవీకాలం ముగియనుంది. టర్మ్ ముగిసేలోగా ఎన్నికలు జరిపే అవకాశం లేకపోవడంతో రోజువారీ కార్యక్రమాల కొనసాగింపునకు వీలుగా స్పెషల్ ఆఫీసర్లను నియమించనున్నారు. మెజారిటీ జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు బీఆర్‌ఎస్‌కు చెందినవారే ఉండటంతో ఎన్నికలు జరిగే దాకా పాత పాలక మండళ్లనే కొనసాగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేనట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్లను నియమించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సన్నాహాలు చేస్తోంది. జూలై 5 కల్లా కసరత్తు పూర్తిచేసి, పీఆర్, రెవెన్యూ, మున్సిపల్,విద్య, వైద్య, ఆరోగ్య శాఖల నుంచి ఉద్యోగుల హోదాలకు అనుగుణంగా ప్రత్యేక అధికారులుగా అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. గత ఫిబ్రవరి 1తో రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామపంచాయతీల కాలపరిమితి ముగిసింది. మరుసటి రోజు నుంచే పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైంది.
ఇవీ సమస్యలు...
పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక, మండల, జిల్లాపరిషత్ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా వివిధ కారణాలు, ఆయా అంశాలపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వపరంగా అటు గ్రామపంచాయతీలు, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు అడుగు ముందుకుపడలేదు.
⇒ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన, ఉపకులాల వారీగా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అయితే ఈ వాగ్దానం అమలు చేసేందుకు రాష్ట్ర బీసీ కమిషన్ ద్వారా చర్యలు చేపట్టాల్సి ఉండగా, దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో కసరత్తు మొదలు కాలేదు.
⇒ బీసీ కులగణన ఆధారంగా గ్రామీణ స్థానికసంస్థల్లో స్థానికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలి.
⇒ రాష్ట్రవ్యాప్తంగా కులగణనకు ఎక్కువగా సమయం పట్టే అవకాశం ఉండటంతో కొత్త ఓటర్ల జాబితా (లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వెలువరించిన లిస్ట్) ప్రాతిపదికన పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను నోడల్ ఏజెన్సీలుగా నియమించి..ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలు సేకరించాలని బీసీ కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది.
⇒ బీసీ కమిషన్‌పరంగా ఓటర్ల జాబితా ఆధారంగా ఖరారు చేసిన రిజర్వేషన్లకు అనుగుణంగా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ విచారణ, రాష్ట్రస్థాయిలో అన్ని రాజకీయపక్షాలతో సమావేశం నిర్వహించి ముందుకు సాగొచ్చనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు సమాచారం.
⇒ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఓటర్ల జాబితా ప్రకారమా లేక క్షేత్రస్థాయిలో చేపట్టే సామాజిక, ఆర్థిక, కుల సర్వే ఆధారంగా ముందుకెళ్లాలా అనే దానిపై ప్రభుత్వపరంగా స్పష్టత కొరవడినట్టు చెబుతున్నారు.
⇒ ఓటర్ల లిస్ట్‌కు అనుగుణంగా అయితే పెద్దగా శ్రమ లేకుండా త్వరగానే క్షేత్రస్థాయిలో ఆయా సామాజికవర్గాల జనాభా వివరాలు తేల్చొచని, సామాజిక, ఆర్థిక కులసర్వే అయితే సమయం ఎక్కువ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
⇒ మరో రెండునెలల్లో (ఆగస్టు నాటికి) ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కమిషన్‌న్‌ద్వారానే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేస్తారా లేక కొత్త కమిషన్‌ను నియమించేదాకా ఆగుతారా అనేదానిపై స్పష్టత లేదు.
ట్రిపుల్ టెస్ట్..మరో మెలిక
సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్ టెస్ట్’పేరిట స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై మార్గదర్శకాలు నిర్దేశించింది. స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుపై బీసీ కమిషన్ ద్వారా విచారణ జరపాలని, ఆయా చోట్ల ఏఏ నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిపై తేల్చాలని స్పష్టం చేసింది.
⇒ మొత్తంగా రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి) 50 శాతానికి మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది.
⇒ ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహ¯న్‌రావు ఆధ్వర్యంలో ట్రిపుల్ టెస్ట్ మేరకు క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలిసింది.
⇒ ఓటర్ల జాబితా ప్రకారం కసరత్తు పూర్తిచేసి ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలనే సూచనలు బీసీ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లినట్టు తెలిసింది. అయితే దీనిపై ప్రభుత్వపరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సందిగ్ధత నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
⇒ రిజర్వేషన్లు ఖరారు చేసి, ఆ వివరాలు, ఎన్నికల నిర్వహణకు తేదీలు తెలియజేస్తే 15, 20 రోజుల అంతరంలో గ్రామపంచాయతీ, జిల్లా, మండలపరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment