సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలన్నీ పచ్చదనంతో పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ రూపొందించి మురుగునీటి కాలువల నిర్వహణ, చెత్త సేకరణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పల్లెల్లో రోడ్ల మీద మురుగునీరు, చెత్త లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. రాష్ట్రంలోని 13 వేలకుపైగా గ్రామ పంచాయతీల్లో మురుగు నీటి పారుదల వ్యవస్ధ సక్రమంగా ఉండేలా, కాలువల్లో మురుగునీరు పొంగి పొర్లకుండా నిర్వహణ చేపట్టాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్) కింద చేపడుతున్న పనులన్నీ అక్టోబరు కల్లా 100 శాతం పూర్తి కావాలని స్పష్టం చేశారు. అక్టోబరు 2 నాటికి ఏ గ్రామం వెళ్లినా సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ పక్కాగా ఉండాలన్నారు.
చెత్త తరలించేందుకు ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ సమకూర్చటాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని దశలవారీగా అన్ని గ్రామాలకు అందజేయాలని సూచించారు. గ్రామీణ రహదారులకు మరమ్మతుల పనులను ఈ నెల మూడో వారంలోగా చేపట్టి వెంటనే టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. పనులు పూర్తి చేసిన అనంతరం నాడు – నేడుతో ఫొటోల ద్వారా ప్రజలకు వ్యత్యాసాన్ని తెలియచేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇళ్ల నుంచి చెత్తను సేకరించే క్లాప్ మిత్రలకు గౌరవ వేతనాలు చెల్లించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. గ్రామీణ రహదారులు, తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పథకం తదితరాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
తాగునీటి కష్టాలు తలెత్తకుండా..
వేసవిలో గ్రామాల్లో ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టి గతంతో పోలిస్తే సమస్యను గణనీయంగా నియంత్రించగలిగినట్లు అధికారులు తెలిపారు. జూలై నెలాఖరు వరకు కార్యాచరణ అమలు చేయాలని సీఎం సూచించారు. ఫ్లోరైడ్ ప్రభావం అధికంగా ఉండే ఉద్దానంతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉప్పునీటి సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాలు, వైఎస్సార్ కడప జిల్లాలో యురేనియం ప్రభావిత ప్రాంతాలు, తరచూ తాగునీటి ఇబ్బందులు తలెత్తే ప్రకాశం, పల్నాడు, చిత్తూరు పశ్చిమ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సరఫరాకు చేపడుతున్న ఏర్పాట్లపై సమావేశంలో సీఎం సమీక్షించారు.
కాలువలతో అనుసంధానం..
గ్రామాల్లో పేదలకు ఉపాధి హామీ పధకం ద్వారా పెద్ద ఎత్తున పనులు కల్పించాలని సీఎం జగన్ సూచించారు. చెరువుల్లో పూడిక తీతతో పాటు కాలువలతో అనుసంధానించేలా పనులు చేపట్టాలన్నారు. ఐదేళ్లలో ప్రతి చెరువును కాలువలు, ఫీడర్ ఛానళ్లతో అనుసంధానించడం ద్వారా నీటిఎద్దడిని అరికట్టవచ్చన్నారు. కడప, అనంతపురం లాంటి ప్రాంతాల్లో కాలువల ద్వారా మంచి నీటి ట్యాంకులను అనుసంధానించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
రూ.3 వేల కోట్లకుపైగా పెండింగ్ బకాయిల చెల్లింపు
గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, విలేజీ క్లినిక్స్ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఏ కారణంతోనూ పనులు ఆగకూడదని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల కాకపోయినప్పటికీ అడ్వాన్స్ రూపంలో నిధులు సర్దుబాటు చేసి బిల్లులు చెల్లింపులన్నీ పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి బిల్లుల అప్‌లోడ్‌తో పాటు చెల్లింపుల్లో ఆలస్యం జరగకూడదని ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన ప్రణాళిక ముందుగానే సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల కోసం అవసరమైతే ఢిల్లీ స్ధాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాం నాటి దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా బకాయి బిల్లులను చెల్లించాల్సి రావడంతో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి చెల్లింపులు జరిపామని తెలిపారు.
రైతుల ఖాతాల్లోకే ‘జలకళ’ డబ్బులు..
వైఎస్సార్ జలకళ పథకం ద్వారా అర్హులైన రైతులకు బోరు, మోటారు, పైపులు అన్నీ ప్రభుత్వమే ఇస్తోందని, విద్యుత్తు సదుపాయం కల్పిచడంతో సహా ఒక్కో బోరుకు కనీసం రూ.4.50 లక్షలు చొప్పున ఖర్చు చేస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు. పథకం ద్వారా రైతుల పొలాల్లో బోరు తవ్వినప్పుడు డ్రిల్లింగ్ డబ్బులను రైతుల ఖాతాకు నేరుగా (డీబీటీ) జమ చేసి లబ్ధిదారుడి నుంచి బోరు యజమానికి చెల్లించేలా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దీనివల్ల లంచాలు లేకుండా పారదర్శకంగా చెల్లింపులు జరుగుతాయన్నారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రైతుల పొలాల్లో 13,245 బోర్లు తవ్వినట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరణకు వీలుగా 2 కోట్ల డస్ట్‌బిన్లను అక్టోబరు నాటికి సిద్ధం చేస్తామని చెప్పారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, స్పెషల్ కమిషనర్ శాంతిప్రియా పాండే, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ రోడ్లకు మరమ్మతులు
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పరిధిలోని గ్రామీణ రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. 9,122 కిలోమీటర్ల పొడవైన 3,246 రోడ్లకు రూ.1,072 కోట్లతో మరమ్మతులకు సంబంధించి తక్షణమే పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. మే 15 – 20వతేదీ నాటికల్లా గ్రామీణ రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభం కావాలని నిర్దేశించారు.
ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ పరిధిలో రహదారులకు సంబంధించి గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడు వాటిని ఎలా బాగు చేశామనే వివరాలను తెలియచేసేలా నాడు–నేడు ద్వారా ఫొటోలతో వ్యత్యాసాన్ని స్పష్టంగా తెలియచేయాలన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, రహదారులకు సంబంధించి చేపట్టిన పనులను వెల్లడించేలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫోటోలను ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment