సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 1.10 లక్షల గిరిజన కుటుంబాలకు ప్రతియేటా రూ.151 కోట్ల మేర అదనపు ‘ఉపాధి’ చేకూర్చేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ఆయా కుటుంబాలన్నింటినీ ఉపాధి హామీ పథకంలో ఏటా 150 రోజుల చొప్పున పనులు పొందే వారి జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెలరోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది.
ఉపాధి హామీ చట్టం ప్రకారం.. సాధారణ కుటుంబాలకు ఏటా గరిష్టంగా వంద రోజుల చొప్పున పనులు కల్పిస్తున్నప్పటికీ, అటవీ భూహక్కు పట్టాదారులకు కుటుంబానికి ఏటా 150 రోజులు పనులు కల్పించే వెసులుబాటు ఉంది. దీంతో.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌ఓఎఫ్‌ఆర్ లబ్దిదారులు మొత్తం 1,82,316 కుటుంబాలు ఉండగా.. నెలరోజుల క్రితం వరకు ఈ సంఖ్య 72,646 కుటుంబాలు మాత్రమే 150 రోజుల పనిదినాలు పొందేందుకు అర్హత ఉన్న జాబితాల్లో పేర్లు నమోదు చేసుకున్నాయి.
నెలరోజులపాటు ప్రత్యేక డ్రైవ్..
ఈ నేపథ్యంలో.. అర్హత ఉన్న మిగిలిన కుటుంబాలను కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. ఆయా గిరిజన గ్రామాల్లో పనిచేసే ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్లే తమ పరిధిలోని ఆయా అర్హులను గుర్తించి, వారి వివరాలను మండల కేంద్రంలో అప్‌డేట్ చేస్తారు.
గత 15 రోజులుగా ఫీల్డ్ అసిస్టెంట్లే ఆయా లబ్ది దారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 54,424 కుటుంబాలను కొత్తగా 150 రోజుల పనిదినాలు పొందేందుకు అర్హుల జాబితాలోకి తీసుకొచ్చారు. ఇంకా 55,246 కుటుంబాలను ఈ పరిధిలోకి తీసుకురావాల్సి ఉందని.. ఈ నెలాఖరుకల్లా అర్హులందరినీ ఈ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వివరించారు.
ఇక ప్రస్తుతం గరిష్టంగా ఏటా వంద రోజుల చొప్పున ఉపాధి హామీ పథకం పనులు పొందుతున్న ఆయా కుటుంబాలు అదనంగా 50 రోజుల ఉపాధి పొందితే ఒక్కో పనిదినానికి గరిష్టంగా రూ.272 చొప్పున రూ.13,600ల వరకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment