ప్రతి వారం నిర్వహించే పల్లెవికాసం కార్యక్రమాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి ప్రత్యేకాధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ శ్రీదేవి
మహబూబ్‌నగర్ టౌన్: ప్రతి వారం నిర్వహించే పల్లెవికాసం కార్యక్రమాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి ప్రత్యేకాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్‌స నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు విధిగా పాల్గొని ఏ శాఖకు చెందిన సమస్యలను వారే గుర్తించాలన్నారు. గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాలను సందర్శించేటప్పుడు రెగ్యులర్‌గా అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి వాటిని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పౌష్టికాహారం, ఇతరత్రా వాటిని సక్రమంగా అందిస్తున్నారా లేదా అనేది తనిఖీ చేయాలని చెప్పారు. పీహెచ్‌సీలలోనే కాన్పులు అయ్యేలా గ్రామీణ ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు.
ఉపాధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి
వేసవిలో కూలీలు వలసలు వెళ్లకుండా ఉపాధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ చెప్పారు. కూలి చేసేందుకు ముందుకు వచ్చే ప్రతి కూలీకి పని కల్పించాలని సూచించారు. నిబంధనల ప్రకారం రోజుకు రూ.169కూలి వచ్చేలా పనులు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పనిచేసిన వారికి సకాలంలో డబ్బులు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఏజేసీ డాక్టర్ రాజారాం, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా పీడీ సునందరాణి తదితరులు పాల్గొన్నారు.