గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ కోసం ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను (ఐఎస్‌పీ) ప్రోత్సహించాలని, వారికి పన్ను మినహాయింపులు ఇవ్వాలని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ (బీఐఎఫ్) కోరింది. గతేడాదితో పోలిస్తే 20 శాతం గ్రామీణ వినియోగదారులను పెంచుకున్న కంపెనీలకు రివార్డులు ప్రకటించాలని తెలిపింది.
ఈ సందర్భంగా బీఐఎఫ్ ఛైర్‌పర్సన్ అరుణా సౌందరరాజన్ మాట్లాడుతూ..‘దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్ల(రూ.84 లక్షల కోట్లు) మార్కు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27 నాటికి జీడీపీలో 20 శాతం ఈ వ్యవస్థ తోడ్పటును అందించాలని నిర్ణయించారు. కాబట్టి ఈ వ్యవస్థ వృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారికి వేగవంతమైన నెట్‌వర్క్ సౌకర్యాలు కల్పించాలి. ఈ రంగంలో దేశమంతటా స్థిరమైన బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాలను విస్తరించాలి’ అన్నారు.
ఇదీ చదవండి: ‘అలాంటివారిని ఇప్పటి వరకు చూడలేదు’
‘ప్రస్తుతం దేశంలో డిజిటల్ వృద్ధికి సంబంధించి మొబైల్ వ్యవస్థ మొదటి స్థానంలో ఉంది. 95.6% మంది వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారు. వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య 4.3% మాత్రమే. వేగవంతమైన ఇంటర్నెట్‌కు, మొబైల్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థిర బ్రాడ్‌బ్యాండ్ అవసరం. కాబట్టి ఈ వ్యవస్థలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. గ్రామీణ చందాదారులలో గణనీయమైన వృద్ధిని సాధించే ఐఎస్‌పీలకు పన్ను మినహాయింపులు ఇవ్వాలి. బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలను ప్రధాన మంత్రి వై-ఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్ (పీఎం-వాణి) వంటి కార్యక్రమాలతో అనుసంధానించాలి. గ్రామీణ ప్రాంతాల్లో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌కు కూడా ప్రభుత్వం సహకరించాలి’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment