మంచినీళ్లు.. మరింత ప్రియం! | digital meters connect to water connections in chennai | Sakshi
Sakshi News home page

మంచినీళ్లు.. మరింత ప్రియం!

Published Sat, Jan 13 2018 9:45 AM | Last Updated on Sat, Jan 13 2018 9:45 AM

digital meters connect to water connections in chennai - Sakshi

సాక్షి, చెన్నై:  ఇక అనేక విషయాలకు ఉదాహరణగా ‘మంచినీళ్ల ప్రాయం’ అని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. నీళ్లేకదాని వృథా చేస్తే బిల్లు తడిసి మోపడవుతుంది. ప్రతి తాగునీటి కనెక్షన్‌కు డిజిటల్‌ మీటర్లు అమర్చి వినియోగానికి తగినట్లుగా బిల్లు వసూలు చేసేందుకు తాగునీటి విభాగం సిద్ధం అవుతోంది. చెన్నై తాగునీటి విభాగం ద్వారా 8 లక్షల ఇళ్లకు తాగునీటి కనెక్షన్‌ ఇచ్చారు. ఒక్కో ఇంటి నుంచి ఆరునెలలకు ఒకసారి చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇళ్లకైతే నెలకు రూ.50, వాణిజ్య సముదాయ ప్రాంతాల్లో ఒక్కో కనెక్షన్‌కు రూ.150, పూర్తిగా వాణిజ్య సదుపాయ కనెక్షన్‌కు రూ.200 లెక్కన వసూలు చేస్తున్నారు. 

డిజిటల్‌ మీటర్లు అమరిక..
అలాగే కార్యాలయాల్లో తాగునీరు, మురుగునీరు తొలగింపుకు వేరుగా సొమ్ము వసూలు చేస్తున్నారు. తాగునీటిని వృథా చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో వాణిజ్య సముదాయాల్లో రుసుము మొత్తాన్ని పెంచడం ద్వారా ఈ వృధాను కట్టడి చేయాలని నిర్ణయించారు. నీటి వినియోగాన్ని నిక్కచ్చిగా లెక్కకట్టేందుకు డిజిటల్‌ మీటర్లను అమర్చనున్నారు. ఈ డిజిటల్‌ మీటర్ల వినియోగాన్ని ముందుగా వాణిజ్య సముదాయాల్లో ప్రారంభించనున్నారు. తొలిదశలో ఏప్రిల్‌లోగా 12 వేల డిజిటల్‌ మీటర్లను అమర్చనున్నారు. ఏడాదికి ఏడాది 10వేల కొత్త కనెక్షన్లు పెరుగుతున్నందున కేవలం వాణిజ్య సముదాయాలకు ఎంతశాతం నీరు వినియోగం అవుతోందోనని లెక్కకట్టనున్నారు. 

వచ్చేనెలాఖరులో టెండర్లు..
కొత్త డిజిటల్‌ మీటర్ల కొనుగోలుకు వచ్చేనెలాఖరులో టెండర్లు పిలవనున్నారు. తొలి దశ సజావుగా సాగిన పక్షంలో డిజిటల్‌ మీటర్ల విధానాన్ని అన్ని కనెక్షన్‌కు విస్తరించాలని చేయాలని నిర్ణయించారు. అయితే అన్ని కనెక్షన్లకు డిజిటల్‌ మీటర్ల అమరికకు కనీసం ఏడాది పడుతుందుని భావిస్తున్నారు. నివాస గృహాల్లో ప్రస్తుతం వెయ్యిలీటర్ల తాగునీటికి రూ.20లు వసూలు చేస్తున్నారు. దశలవారీగా డిజిటల్‌ విధానాన్ని విస్తరించిన పక్షంలో ఈ మొత్తం నాలుగింతలు పెరిగే అవకాశం ఉంది. నలుగురు సభ్యులున్న కుటుంబానికి సగటున రోజుకు 340 లీటర్ల తాగునీరు అవసరం అవుతుందని అధికారుల లెక్కకట్టారు. అంటే ఒక  కుటుంబానికి నెలకు 10వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది. నెలకు 10 వేల లీటర్లు వినియోగిస్తే రూ.200లు చెల్లించాల్సి ఉంటుంది.

డిజిటల్‌ మీటర్లతో పలు ప్రయోజనాలు
ఈ కొత్త విధానంపై తాగునీటి విభాగానికి చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ, డిజిటల్‌ మీటర్ల గురించి వినియోగదారులు అందోళన చెందాల్సిన అవసరం లేదు, ఉభయతారకంగా పలు ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.  వాణిజ్యసముదాయాల్లో 12 వేల డిజిటల్‌ మీటర్‌లను తొలిదశలో అమరుస్తామని, దీని వల్ల ప్రతి నీటి బొట్టు లెక్కలోకి వస్తుందని చెప్పారు. తాగునీటి ఆవశ్యకత, విలువ వినియోగదారులకు తెలియజేయడం, వృదాను అరికట్టడం తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. 

అంతేగాక తాగునీటి విభాగానికి మరిన్ని ఆర్దిక వనరులు సంక్రమించడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందజేయగలమని అన్నారు. అంతేగాక నీటి వినియోగం చేయకుంటే రుసుము వసూలు చేయబోమని, నీటి దొంగతనాలను, లీకేజీని నివారించవచ్చని తెలిపారు. సెలవుల్లో కుటుంబసభ్యులంతా కలిసి ఊళ్లకు వెళ్లేవారు నీటి సరఫరాను నిలిపివేసేందుకు వీలుగా ఒక వాల్వ్‌ను కూడా ఇళ్లలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిజిటల్‌ మీటరు అమరికకు అయ్యే ఖర్చును ఇంటి యజమాని నుంచి వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement