- కేఆర్‌ఎస్‌లో తగ్గుతున్న నీటి మట్టం
- ఆయకట్టు రైతుల్లో కలవరం
- షరతులతో నీటి విడుదల
- దీర్ఘకాలిక పంటలు వేయరాదంటూ ఆదేశాలు
- బెంగళూరుకు ‘లింగనమక్కి’ నుంచి తాగునీరు
- అక్కడ విద్యుదుత్పత్తి తగ్గిస్తే బెంగళూరు సహా ఆరు జిల్లాల్లో తీరనున్న తాగునీటి సమస్య
సాక్షి ప్రతినిధి, బెంగళూరు/ న్యూస్‌లైన్, మండ్య: రాష్ర్టంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించడానికి ఇంకా నెలకు పైగానే సమయం ఉన్నప్పటికీ మండ్య జిల్లాలో కావేరి నదిపై నిర్మించిన కృష్ణరాజ సాగర (కేఆర్‌ఎస్)లో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత ఏడాదితో పోల్చుకుంటే తాగు నీటికి ఆందోళనకర పరిస్థితులు లేనప్పటికీ, వ్యవసాయానికి మాత్రం కట్టుదిట్టమైన షరతులతో విడుదల చేస్తున్నారు.
కేఆర్‌ఎస్ రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు, పుదుచ్చేరిలలో కూడా సాగు నీటి అవసరాలను తీర్చుతోంది. దీనికి తోడు రాష్ట్రంలో బెంగళూరు సహా అనేక పట్టణాలకు తాగు నీరు అందిస్తోంది. జలాశయంలో గరిష్ట నీటి మట్టం 124.80 అడుగులు కాగా ప్రస్తుతం 90 అడుగుల మేరకు ఉంది. జలాశయంలోకి కేవలం 356 క్యూసెక్కులు మాత్రమే ఇన్‌ఫ్లో నమోదవుతోంది. కిందికి 4,716 క్యూసెక్కులు వదులుతున్నారు.
మైసూరు, మండ్య, రామనగర, బెంగళూరు గ్రామీణ జిల్లాలకు కూడా కేఆర్‌ఎస్ తాగు నీటిని అందిస్తోంది. కేరళలోని వైనాడు, మైసూరు జిల్లాలోని హుణసూరు, పిరియా పట్టణ, పరీవాహక ప్రాంతాల్లో వర్షం పడినప్పుడు మాత్రమే నదిలోకి ప్రవాహం ఉంటుంది. అలాంటి వర్షాలకు ఇంకా సమయం ఉన్నందున, జలాశయంలో తరుగుతున్న నీటి మట్టం రైతులను కలవర పరుస్తోంది. ఇప్పటికే వ్యవసాయానికి చాలా తక్కువగా నీటిని ఇస్తున్నారు.
దీర్ఘకాలిక పంటలు వేయకూడదని ఇదివరకే అధికారులు కట్టుదిట్టంగా సూచనలు చేశారు. వేసవి పంటలను ఎట్టి పరిస్థితుల్లోనూ వేయవద్దని ఆదేశించారు. గత ఏడాది జలాశయంలో నీటి మట్టం గత ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా అత్యంత కనిష్టానికి పడిపోయింది. జూన్ 12 నాటికి నీటి మట్టం 62.92 అడుగులకు తగ్గి పోవడంతో జలాశయం లోపల జేసీబీలతో కాలువలు తవ్వి క్రస్ట్ గేట్ల వరకు నీటిని లాక్కొచ్చారు. ఆ అనుభవంతో ఈ ఏడాది నీటి నిర్వహణలో పలు జాగ్రత్తలు తీసుకోవడంతో అలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తలేదు.
మరో ప్రత్యామ్నాయంగా లింగనమక్కి..
బెంగళూరు నగరంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని కేవలం కేఆర్‌ఎస్ కాకుండా మరో ప్రత్యామ్నాయ నీటి వనరులను వెతుక్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. దీనిపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ శివమొగ్గ జిల్లాలోని లింగనమక్కి జలాశయాన్ని సూచించింది. బెంగళూరు జల మండలి మాజీ అధ్యక్షుడు బీఎన్. త్యాగరాజ నేతృత్వంలోని ఈ కమిటీలో పది మంది సభ్యులున్నారు.
1964లో శరావతి నదిపై లింగనమక్కి జలాశయాన్ని నిర్మించారు. 2021-51 కాలానికి ఈ జలాశయం ద్వారా ఏటా 30 టీఎంసీల నీటిని తీసుకోవచ్చని కమిటీ సూచించింది. 1,330 మెగావాట్ల స్థాపక సామర్థ్యంతో అక్కడ జల విద్యుత్కేంద్రం ఉంది. 2021-31 కాలానికి పది టీఎంసీల నీటిని తీసుకోవడానికి రూ.12,500 కోట్లు ఖర్చవుతుందని కమిటీ అంచనా వేసింది.
అక్కడ పాక్షికంగా విద్యుదుత్పత్తిని తగ్గిస్తే బెంగళూరుకే కాకుండా కోలారు, చిక్కబళ్లాపురం, బెంగళూరు గ్రామీణ, రామనగరం, తుమకూరు, చిత్రదుర్గ జిల్లాల తాగు నీటి అవసరాలను కూడా తీర్చవచ్చని పేర్కొంది. ప్రస్తుతం రిజర్వాయరు నిల్వ సామర్థ్యం 151 టీఎంసీలు. విద్యుదుత్పత్తి కోసం మాత్రమే దీనిని నిర్మించారు. కరెంటు కోసం 90 టీఎంసీల నీటిని పరిమితం చేసి మిగిలిన మొత్తాన్ని తాగు నీటి అవసరాలకు వినియోగించుకోవచ్చని సూచించింది.
బెంగళూరు నగర జనాభా 2021 నాటికి 1.42 కోట్లు, 2051 నాటికి 3.45 కోట్లకు చేరుకుంటుందని కమిటీ అంచనా వేసింది. అదే సమయంలో తాగు నీటి డిమాండ్ 36.4 టీఎంసీల నుంచి 88.25 టీఎంసీలకు చేరుకుంటుందని తెలిపింది. ప్రస్తుతం కేఆర్‌ఎస్ నుంచి 18.8 టీఎంసీల నీటిని బెంగళూరు నగర అవసరాలకు వినియోగిస్తున్నారు.