- మొహం చాటేసిన వరుణుడు
- జలాశయాల్లో కనిష్ట స్థాయికి నీటిమట్టం
- జూన్ కోటా నీటి కోసం తమిళనాడు డిమాండ్
- అన్నదాతల్లో ఆందోళన
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో ఈసారి కూడా వరుణుడు మొహం చాటేయడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రముఖ జలాశయాల్లో నీటి మట్టం కనిష్ట స్థాయికి పడిపోయింది. పరిస్థితులు ఇలా ఉంటే పొరుగున ఉన్న తమిళనాడు ప్రభుత్వం మాత్రం తమకు జూన్ కోటా కావేరి నీటిని విడుదల చేయాల్సిందేనని పట్టుపడుతోంది. రాష్ట్రంలో ముంగారు ప్రారంభమై దాదాపు 20 రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకూ అనుకున్న స్థాయిలో వర్షాలు పడలేదు.
భారత వాతావరణ శాఖ కర్ణాటక విభాగం గణాంకాలను అనుసరించి దక్షిణ కన్నడలో ఇప్పటి వరకూ 76.7 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 64.4 మిల్లీ మీటర్ల వర్షం మాత్రం నమోదైంది. అంటే కురవాల్సిన దానికన్నా 12.3 శాతం తక్కువగా వర్షం పడింది. అదేవిధంగా కరావళి ప్రాంతలో 440.5 మి.మీ వర్షం పడాల్సి ఉండగా 32 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఇక ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఇప్పటి వరకూ ఈ ప్రాంతంలో 59.7 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా 36 మి.మీ వర్షం పడింది. అంటే కురవాల్సిన వర్ష పరిమాణంతో పోల్చినప్పుడు ఇది 40 శాతం తక్కువ.
దీంతో వాతావరణ పరిభాష ప్రకారం రాష్ట్రంలోని మూడు వాతావరణ రీజియన్లలో దక్షిణ కర్ణాటక ప్రాంతంలో మాత్రం సాధారణ వర్షపాతం నమోదు కాగా, మిగిలిన రెండు ప్రాంతాల్లోనూ వర్షపుకొరత (డెఫిషియంట్) పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో వర్షాలు సరిగా పడక పోవడంతో ప్రధాన జలాశయాల్లో నీటి పరిమాణం కూడా అడగంటి పోతోంది.
కావేరి నదీ తీరంలోని నాలుగు జలాశయాల్లో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 115 టీఎంసీలు కాగా, వర్షాకాలం ప్రారంభమై దాదాపు 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ కేవలం 18 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నీరు ఆయా ప్రాంతాల తాగునీటి కోసం మాత్రమే సరిపోతోందని అయితే సాగు నీటి కోసం రాష్ట్ర రైతులు పట్టుపడుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలాగా ఉంటే జూన్ కోటా 10 టీఎంసీల కావేరి నీటిని ఇవ్వాల్సిందేనని తమిళనాడు పట్టుపడుతుండటం మూలిగేనక్కపై తాటి పండు పడ్డ చందంగా ఉందని నీటి పారుదల శాఖ అధికారులు వాపోతున్నారు.
కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ఐదు ప్రధాన జలాశయాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. దీంతో పరిస్థితి ఇలాగే కొనసాగి రానున్న రోజుల్లో వరణుడు కరుణించక పోతే దాదాపు మూడేళ్ల నుంచి రాష్ట్రాన్ని పీడిస్తున్న కరువు ఈ సారి కూడా పునరావృతం అవుతుందని నిపుణుతోపాటు సాధారణ ప్రజలు కూడా పేర్కొంటున్నారు.